బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని పదవికి ఉన్నట్టుండి రాజీనామా చేసిన షేక్ హసీనా.. దేశం విడిచి పారిపోయి వచ్చి భారత్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి లండన్ వెళ్లి అక్కడే ఆశ్రయం పొందాలని భావించిన ఆమెకు.. అక్కడి నుంచి అనుమతి రాకపోవడంతో.. ఇక్కడే చిక్కుకుపోయారు.
ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం.. భారత ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా మరోసారి షేక్ హసీనా అప్పగింతపై స్పందించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల సలహాదారు ఎండీ తౌహిద్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. హసీనాను స్వదేశానికి తిరిగి రప్పించడానికి యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏమైనా చేస్తుందని పేర్కొన్నారు.
హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత్‌ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. షేక్ హసీనాను భారత్ తమ దేశానికి అప్పగిస్తుందా, లేదా ఆయన ప్రశ్నించారు. ఆమెను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని పేర్కొన్నారు.
తమ న్యాయ వ్యవస్థ కోరుకుంటే ఖచ్చితంగా ఆమెను తిరిగి బంగ్లాకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ మేరకు భారత్‌తో తమకు వివిధ ఒప్పందం, చట్టపరమైన ప్రక్రియలు ఉన్నాయని, దీనిపై ఊహాగానాలు చేయకపోవడమే మంచిదని అన్నారు.
అయితే హసీనా అసలు భారత్‌లో ఎక్కడ ఉన్నారనే విషయం తాత్కాలిక ప్రభుత్వానికి తెలుసా అనే మీడియా ప్రశ్నించగా.. తౌహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ విషయం గురించి భారత్‌ను అడగండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా హసీనాతోపాటు ఆమె బంధువుల దౌత్య పాస్‌పోర్ట్‌లను బంగ్లాదేశ్ రద్దు చేసింది. ఈ క్రమంలో షేక్ హసీనా ఇకపై భారత్‌లో ఉండగలదా? లేక ఆమెను బంగ్లాకు అప్పగించనుందా అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా హసీనా ప్రభుత్వం చేపట్టిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆగష్టు 5న ఆమె దేశం వదిలి పారిపోయి, భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment