మెరిసేదంతా మేలిమి అని ప్రజానీకాన్ని నమ్మిస్తే ఓట్ల వర్షం కురవొచ్చు. ఒకటికి రెండుసార్లు ఆ చిట్కా పనిచేసి అధికారం వచ్చినా రావొచ్చు. కానీ ఎల్లకాలం అదే మంత్రం ఫలించదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ నాలుగో దఫా నెగ్గేందుకు పడుతున్న అవస్థలను గమనిస్తే అర్థమవుతుంది. ఆదివారం బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జరగబోతు న్నాయి. ఆ ఎన్నికలు సవ్యంగా సాగుతాయనీ, ప్రజలంతా తన పక్షమేననీ హసీనా ఇప్పటికీ నమ్మ బలుకుతున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకోవటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం బతికేవుందని చాటాలంటూ పౌరులకు ఆమె విన్నపాలు చేస్తున్నారు. అటు విపక్షం హసీనా నయవంచనను బట్టబయలు చేయాలని ప్రజలను కోరింది.
ఈ ఎన్నికలను బహిష్కరించి, శని ఆదివారాల్లో దేశవ్యాప్త హర్తాళ్ పాటించాలని పిలుపునిచ్చింది. బంగ్లాలో అటు ఎన్నికల తంతు, ఇటు బహిష్కరణ పిలుపు రెండూ సాధారణ ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. 2014 ఎన్నికలను విపక్ష బంగ్లా నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) బహిష్కరించింది. తదనంతర ఎన్నికల్లో పోటీలో దిగి, చివరి నిమిషంలో ఆ పార్టీ ముఖం చాటేసింది. 2014లో 39 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 2019 నాటికి అది ఒక్కసారిగా 80 శాతానికి ఎగబాకింది.
గత ఎన్నికల్లో అవామీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 300 స్థానాల్లో ఏకంగా 96 శాతం స్థానాలు... అంటే 288 రాగా, బీఎన్‌పీ కూటమికి ఏడంటే ఏడే వచ్చాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికార పక్షంపైరిగ్గింగ్ ఆరోపణలు రివాజు. అయితే గత ఎన్నికలకూ, ఇప్పటికీ తేడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పట్లో హసీనా గెలుపుపై ఎవరికీ సంశయాలు లేవు. మెజారిటీ విషయంలోనే భిన్న స్వరాలు వినిపించాయి. ఈసారి అలాకాదు. ఏం చేసైనా నెగ్గి తీరాలన్న సంకల్పంతో అన్ని రకాల మాయోపాయాలకూ సిద్ధపడుతున్నారని విపక్షంతోపాటు పౌరసమాజ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
యాభై రెండేళ్ల క్రితం హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో పాకిస్తాన్ పాలకులపై పోరాడి బంగ్లా విముక్తి సాధించింది. ఆ వెంటనే ముజిబుర్ రెహమాన్‌ను కూలదోసి సైన్యం అధికా రాన్ని ఆక్రమించింది. ఆయన్ను దారుణంగా కాల్చిచంపింది. వెంటవెంటనే జరిగిన మార్పుల్లో జన రల్ జియావుర్ రెహమాన్ అధికారం చేజిక్కించుకుని అనంతర కాలంలో దేశాధ్యక్షుడయ్యారు. బీఎన్‌పీ ఆయన నేతృత్వంలోని పార్టీయే. మరో సైనిక పాలకుడు హెచ్‌ఎం ఎర్షాద్ సైతం జాతీయ పార్టీని ఏర్పాటుచేశారు. మొత్తానికి మూడు సైనిక తిరుగుబాట్లు, దాదాపు 20 వరకూ విఫల తిరుగు బాట్లతో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
సైనిక పాలకులు ఎన్నికలు లేకుండా చేసి, పౌరుల ఓటుహక్కుకు ఎగనామం పెడితే... ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీలు దొంగ ఓట్లతో, హింసతో దాన్ని మరింత నీరుగార్చాయి. తనకు మెజారిటీ ప్రజల మద్దతున్నదని చెప్పే హసీనా తొలి, మలి దఫాలకు మించి మూడోసారి పూర్తి స్థాయి నియంతగా మారారని, అసమ్మతి స్వరాలను అణిచేశారని ఆమె వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో ఇరుక్కుని 22,000 మంది విపక్ష నేతలు, కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు. అధిక ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని ఉద్యమించినవారిని హసీనా సర్కారు శత్రువులుగా చూస్తోంది.
హసీనా తొలిసారి అధికారంలోకొచ్చిన రోజులతో పోలిస్తే ఇప్పుడు కరెంటు కోతలు లేవు. దేశం పచ్చగా కనబడుతోంది. అడిగిందే తడవుగా విదేశీ మదుపుదారులు ఉదారంగా అప్పులిచ్చారు. ఆర్థిక రంగం పుంజుకోవటంతో నగరాలు మెరిసిపోతున్నాయి. ఆకాశాన్నంటే భవంతులు, ఎక్స్‌ప్రెస్ వేలు, వంతెనలు, భారీ దుకాణ సముదాయాలు, దిగుమతి చేసుకున్న వినియోగ వస్తువులు విస్మయ పరుస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఇదంతా తిరబడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. అందాల పరదాల మాటున పాతరేసినవన్నీ పైపైకి తోసుకొచ్చి నిలదీస్తున్నాయి. బ్యాంకులు వేల కోట్లలో ఇచ్చిన అప్పులన్నీ పారు బాకీలుగా మారి బావురుమన్నాయి. ఖజానాలో కరెన్సీ మాయమై, ద్రవ్యో ల్బణం ఆకాశాన్నంటి దేశ ఆర్థిక వ్యవస్థ బిత్తరచూపులు చూసింది.
విదేశీ పెట్టుబడులతో మొదలు పెట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం సరైన పర్యవేక్షణ కొరవడి నత్తనడకన సాగింది. వ్యయం అనేక రెట్లు పెరిగింది. పల్లెటూళ్లు తెల్లముఖం వేశాయి. ఉపాధి కరువై గ్రామీణులు నగరా లకు, పట్టణాలకు వలసలు కట్టారు. కరెంట్ అకౌంట్ సంక్షోభం పీల్చి పిప్పి చేస్తుండగా ఒకనాడు పైపై మెరుగులు చూసి ఎగబడి పొగిడిన అంతర్జాతీయ మీడియా వరస కుంభకోణాల వైనాన్ని వెల్లడిస్తున్నకొద్దీ దేశంలో అశాంతి ప్రబలింది. ఉద్యమాలు వెల్లువెత్తాయి. వాటి అణచివేత తప్ప హసీనా దగ్గర మరే ప్రత్యామ్నాయం లేకపోవటం విషాదాల్లోకెల్లా విషాదం.
దేశాన్ని దక్షిణాసియాలోనే ‘ఎకనామిక్ టైగర్’గా రూపొందించానని ఒకనాడు సగర్వంగా చాటు కున్న హసీనా సంక్షోభంపై సరైన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన లపై ఇంటా బయటా ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనల బాధ్యులకు తమ దేశంలో ప్రవేశం ఉండబోదని అమెరికా ప్రకటించింది. వైఫల్యాలకు పాలక విపక్షాలు రెండూ బాధ్యత వహించాలని ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇతర నేతలతో పోలిస్తే హసీనాయే ఉన్నంతలో మెరుగని మెజారిటీ పౌరులు విశ్వసిస్తుండటం విశేషం. ఏకపక్షంగా సాగే తాజా ఎన్నికల తంతులో విజయం మాటెలావున్నా హసీనాకు మున్ముందు గడ్డు పరిస్థితులు తప్పవు. ఆమె విఫల నేతగా మిగులుతారా, తప్పులు దిద్దుకుని దేశాన్ని గట్టెక్కిస్తారా అన్నది చూడాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment