nehru zoopark
-
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
జూలో జంతువులు సేఫ్
సాక్షి, హైదరాబాద్: అమెరికా న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో నాలుగేళ్ల పెద్దపులి (నాదియా)కి కరోనా వైరస్ సోకడం ప్రపం చవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నాదియాతోపాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికా సింహాల్లోనూ పొడి దగ్గు పెరగడం, ఆకలి మందగించడం వంటి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో అక్కడి జూ అధికారులు అలర్టయి ఆ జూతోపాటు న్యూయార్క్‌లోని మరో మూడు జూలు, ఆక్వేరియంను నిరవధికంగా మూసేశారు. పులుల ఆలనాపాలనా చూసే వారి ద్వారా నాదియాకు కరోనా వచ్చిందని భావించినా అది నిరూపితం కాలేదని... ప్రస్తుతమైతే అన్ని పులులు కోలుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని జూలు, అభయారణ్యాలు, నేషనల్ పార్కులు, జింకల పార్కుల్లోని జంతువులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటూ రాష్ట్రాల అటవీశాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో హై అలర్ట్... రాష్ట్రంలోని జూలు, పులుల అభయారణ్యాలు, జూపార్కులు, నేషనల్ పార్కుల్లోనూ హైఅలర్ట్ జారీ చేశారు. జంతువులను 24 గంటలపాటు సీసీ టీవీల్లో పరిశీలించాలని, వాటి ప్రవర్త న, ఆరోగ్యంలో మార్పులను గమనించి అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూపార్క్‌లో పులులు, ఇతర జంతువుల సంరక్షణకు చేపడుతున్న చర్యలకు సంబంధించి నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ క్షితిజ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివిధ అంశాలు వెల్లడించారు. మార్చి మొదటివారం నుంచే సిబ్బందికి శానిటైజర్లు అందజేయడంతోపాటు ముందుజాగ్రత్త చర్యలను ముమ్మరం చేసినట్లు ఆమె చెప్పారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు క్యూరేటర్ మాటల్లోనే... జంతువులన్నీ ఆరోగ్యంగానే.. జూలోని జంతువులన్నీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. ప్రస్తుతం జూలోని పరిస్థితులన్నీ బాగున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ›జూలోని పులులు, ఇతర జంతువులకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలుంటే వాటి శాంపిళ్లను పరీక్షల కోసం పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. జూలో ప్రత్యేక చర్యలు... జూలో ఎప్పటికప్పుడు చేపట్టే చర్యలతోపాటు ప్రత్యేకంగా సోడియం హైపోక్లోరిన్, యాంటీ వైరల్, ఇతర ద్రావకాలను స్ప్రే చేస్తున్నాం. స్టాండర్డ్ ప్రొటోకాల్ ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి, ప్రతినెలా ఒకసారి వివిధ రూపాల్లో ప్రత్యేక పరిశుభ్రæతా చర్యలు పాటిస్తాం. దీనికి అదనంగా చర్యలు చేపడుతున్నాం. సిబ్బందికి పరీక్షలు... జూలో పనిచేసే సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యానిమల్ హ్యాండ్లర్ల నుంచి జంతువులకు వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. సఫారీల్లోపలే జంతువులు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 15 నుంచి జూకి సందర్శకులను అనుమతించడం లేదు. సఫారీలు నిలిచిపోయాయి. వాటిలోని జంతువులను బయటకు రానివ్వడం లేదు. సఫారీ ప్రాంతాల్లోనే వాటికి ఎండ, గాలి తగిలేలా వదిలేస్తున్నాం. నిత్యం పరిశీలన... డిప్యూటీ, అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ డాక్ట ర్లు, సిబ్బందితో కూడిన బృందాలు ప్రతి రోజూ అన్ని జంతువులను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ఏ జంతువు ప్రవర్తనలోనైనా మార్పును గుర్తిస్తే వాటి శాంపిళ్లను పరీక్షల కోసం పంపిస్తాం. పులులు సహా ఏ జంతువైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేషన్‌లో పెట్టాలని ఆదేశాలున్నాయి. ప్రస్తుతమైతే అన్ని జంతువులను వాటి ఎంక్లోజర్లలోనే ఉంచుతున్నాం. – క్షితిజ -
నెహ్రూ జూ ఎన్‌క్లోజర్‌లోకి జిరాఫీలు
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా నుంచి ఇటీవలే తెచ్చిన రెండు జిరాఫీలు బబ్లీ, బంటీలను కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఇవి జూ పార్క్ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడటంతో సందర్శకులు చూసేందుకు ఎన్‌క్లోజర్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఉన్న ఒక జిరాఫీకి ఈ రెండు తోడవటంతో వాటి సంఖ్య మూడుకు పెరిగింది. మరోవైపు ఇప్పటికే ఉన్న పక్షుల కేంద్రానికి అదనంగా మరో భారీ పక్షుల సందర్శన కేంద్రాన్ని నిర్మించేందుకు అటవీ శాఖ శంకుస్థాపన చేసింది. జంతువుల ఆవాసానికి మెరుగైన వసతులు కల్పించేలా జూను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేయబోయే వాకింగ్ ఎవియరీ (పక్షుల కేంద్రం) కచ్చితంగా అదనపు ఆకర్షణగా మారుతుందని పీసీసీఎఫ్ పీ.కే.ఝా అన్నారు. కార్యక్రమంలో మరో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, అదనపు పీసీసీఎఫ్‌లు మునీంద్ర, శోభ, డోబ్రియల్, సిద్ధానంద్ కుక్రేటీ, ఓఎస్డీ శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, సిబ్బంది పాల్గొన్నారు. -
పులితో సెల్ఫీ
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : జూ బోనులో ఉన్న పులిని వేధింపులకు గురి చేస్తూ ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన యువకుడిని బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ మలక్‌పేట అక్బర్‌బాగ్ ప్రాంతానికి చెందిన అరీబ్ తహ మెహదీ(26) అనే యువకుడు ఈ నెల 6వ తేదీన బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లాడు. అక్కడ అతడు జూ ఉద్యోగి గోవింద్ సాయంతో సందర్శకులకు నిషిద్ధమైన డార్క్ రూంలోకి వెళ్లి బోనులో ఉన్న పులిని కాలు లాగుతూ హింసించాడు. హింసిస్తున్న ఫొటోలు, వీడియో తీసుకొని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ టైటిల్ కూడా ఇచ్చేశాడు. అయితే దీనిని గమనించిన నెహ్రూ జూలాజికల్ అసిస్టెంట్ క్యూరేటర్ మోయినుద్దీన్ బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెహదీని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. యువకుడిపై అక్రమ ప్రవేశం, వన్యప్రాణ రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మెహదీకి సహకరించిన గోవింద్‌ను జూ పార్కు అధికారులు సస్పెండ్ చేశారు. అతనిపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని సైతం త్వరలోనే అరెస్ట్ చేయనున్నారు.