
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా నుంచి ఇటీవలే తెచ్చిన రెండు జిరాఫీలు బబ్లీ, బంటీలను కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఇవి జూ పార్క్ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడటంతో సందర్శకులు చూసేందుకు ఎన్‌క్లోజర్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఉన్న ఒక జిరాఫీకి ఈ రెండు తోడవటంతో వాటి సంఖ్య మూడుకు పెరిగింది. మరోవైపు ఇప్పటికే ఉన్న పక్షుల కేంద్రానికి అదనంగా మరో భారీ పక్షుల సందర్శన కేంద్రాన్ని నిర్మించేందుకు అటవీ శాఖ శంకుస్థాపన చేసింది.
జంతువుల ఆవాసానికి మెరుగైన వసతులు కల్పించేలా జూను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేయబోయే వాకింగ్ ఎవియరీ (పక్షుల కేంద్రం) కచ్చితంగా అదనపు ఆకర్షణగా మారుతుందని పీసీసీఎఫ్ పీ.కే.ఝా అన్నారు. కార్యక్రమంలో మరో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, అదనపు పీసీసీఎఫ్‌లు మునీంద్ర, శోభ, డోబ్రియల్, సిద్ధానంద్ కుక్రేటీ, ఓఎస్డీ శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, సిబ్బంది పాల్గొన్నారు.