వరదలతో బలహీనపడిన ఎన్‌క్లోజర్
అది ధ్వంసమైతే అవి జనావాసాల్లో ప్రవేశిస్తాయని భయం..
అందుకే పెంచుతున్న మొసళ్లను చంపేయాలని నిర్ణయం
థాయ్‌ల్యాండ్‌లో మొసళ్ల పెంపకందారు ముందుచూపు
బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్‌కు చెందిన మొసళ్ల పెంపకందారు ప్రజల హితం కోరి ఎవరూ ఊహించని సాహసం చేశారు. ఇటీవల సంభవించిన వరదలతో మొసళ్లను పెంచుతున్న ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతిని, బలహీనపడింది. ఆ గోడ ఏ క్షణాన్నైనా కూలొచ్చని, అదే జరిగితే అందులోని ప్రమాదకర మొసళ్లన్నీ జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని ఆయన ఊహించారు. జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చారు. వారు చెప్పిన సూచనల ప్రకారం 125కు పైగా మొసళ్లను కరెంటుషాకిచ్చి చంపేశారు.
జనం కోసం తన సొంతలాభాన్ని త్యాగం చేసిన నత్థపక్ ఖుంకడ్(37)ను అందరూ ‘కోకడైల్ ఎక్స్’గా పిలుచుకుంటారు. లుంఫున్ ప్రాంతంలో 17 ఏళ్లుగా సియామీస్ అనే అరుదైన రకం మొసళ్లను ఈయన పెంచుతున్నారు. వీటిని చర్మాన్ని పరిశ్రమలకు, మాంసాన్ని థాయ్‌ల్యాండ్‌తోపాటు ఇతరదేశాలకు పంపిస్తుంటారు. ఏమైందంటే.. సెప్టెంబర్ 21వ తేదీన థాయ్‌ల్యాండ్ ఉత్తర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. నత్థపక్ ఫాంను కూడా వరద తాకింది. ఆ తీవ్రతకు మొసళ్ల ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతింది. అది పూర్తిగా కూలితే మొసళ్లు సమీపంలోని ఆవాసాల్లోకి, పొలాల్లో ప్రవేశించి, జనాన్ని చంపేస్తాయని నత్థపక్ ఆందోళన చెందారు.
మొసళ్లను వేరే చోటుకు తరలించాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కుటుంబసభ్యులతో ఆలోచించిన మీదట..ప్రజలకు హాని కలిగించకుండా తామే వాటిని చంపేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై స్థానిక అధికారుల సలహా మేరకు మర్నాడు మొత్తం 125 మొసళ్లను విద్యుత్ షాకిచ్చి చంపేశారు. ఇందులో అతిపెద్దదైన నాలుగు మీటర్ల పొడవుండే బ్రీడర్ మొసలి ‘అయి హర్న్’కూడా ఉంది. నత్థపక్ నిర్ణయం ధైర్యంతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయమని అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. నత్థపక్ వద్ద ఇంకా అడుగు నుంచి నాలుగుడుగుల వరకు పొడవైన 500 దాకా పిల్ల మొసళ్లున్నాయి. పిల్ల మొసళ్లతో కలిసి ఎన్‌క్లోజర్‌లో గడపటం వంటి మొసళ్లతో చేసే విన్యాసాలతో ఈయన వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయ్యాయి కూడా. థాయ్‌ల్యాండ్‌లో మొసళ్ల పెంపకం ఆకర్షణీయమైన పరిశ్రమగా భారీ ఎత్తున సాగుతోంది. దేశంలో 1,100 మొసళ్ల పెంపకందారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment