Crocodiles
-
125 మొసళ్లను షాకిచ్చి చంపేశాడు..!
బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్‌కు చెందిన మొసళ్ల పెంపకందారు ప్రజల హితం కోరి ఎవరూ ఊహించని సాహసం చేశారు. ఇటీవల సంభవించిన వరదలతో మొసళ్లను పెంచుతున్న ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతిని, బలహీనపడింది. ఆ గోడ ఏ క్షణాన్నైనా కూలొచ్చని, అదే జరిగితే అందులోని ప్రమాదకర మొసళ్లన్నీ జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని ఆయన ఊహించారు. జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చారు. వారు చెప్పిన సూచనల ప్రకారం 125కు పైగా మొసళ్లను కరెంటుషాకిచ్చి చంపేశారు. జనం కోసం తన సొంతలాభాన్ని త్యాగం చేసిన నత్థపక్ ఖుంకడ్(37)ను అందరూ ‘కోకడైల్ ఎక్స్’గా పిలుచుకుంటారు. లుంఫున్ ప్రాంతంలో 17 ఏళ్లుగా సియామీస్ అనే అరుదైన రకం మొసళ్లను ఈయన పెంచుతున్నారు. వీటిని చర్మాన్ని పరిశ్రమలకు, మాంసాన్ని థాయ్‌ల్యాండ్‌తోపాటు ఇతరదేశాలకు పంపిస్తుంటారు. ఏమైందంటే.. సెప్టెంబర్ 21వ తేదీన థాయ్‌ల్యాండ్ ఉత్తర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. నత్థపక్ ఫాంను కూడా వరద తాకింది. ఆ తీవ్రతకు మొసళ్ల ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతింది. అది పూర్తిగా కూలితే మొసళ్లు సమీపంలోని ఆవాసాల్లోకి, పొలాల్లో ప్రవేశించి, జనాన్ని చంపేస్తాయని నత్థపక్ ఆందోళన చెందారు. మొసళ్లను వేరే చోటుకు తరలించాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కుటుంబసభ్యులతో ఆలోచించిన మీదట..ప్రజలకు హాని కలిగించకుండా తామే వాటిని చంపేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై స్థానిక అధికారుల సలహా మేరకు మర్నాడు మొత్తం 125 మొసళ్లను విద్యుత్ షాకిచ్చి చంపేశారు. ఇందులో అతిపెద్దదైన నాలుగు మీటర్ల పొడవుండే బ్రీడర్ మొసలి ‘అయి హర్న్’కూడా ఉంది. నత్థపక్ నిర్ణయం ధైర్యంతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయమని అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. నత్థపక్ వద్ద ఇంకా అడుగు నుంచి నాలుగుడుగుల వరకు పొడవైన 500 దాకా పిల్ల మొసళ్లున్నాయి. పిల్ల మొసళ్లతో కలిసి ఎన్‌క్లోజర్‌లో గడపటం వంటి మొసళ్లతో చేసే విన్యాసాలతో ఈయన వీడియోలు ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయ్యాయి కూడా. థాయ్‌ల్యాండ్‌లో మొసళ్ల పెంపకం ఆకర్షణీయమైన పరిశ్రమగా భారీ ఎత్తున సాగుతోంది. దేశంలో 1,100 మొసళ్ల పెంపకందారులున్నారు. -
మెక్సికో నగరాల్లో మొసళ్ల సంచారం
మెక్సికో సిటీ: మెక్సికో దేశంలోని తీర ప్రాంత నగరాల్లో ఇటీవల మొసళ్ల సంచారం ఒక్కసారిగా పెరిగింది. సముద్ర తీరాల వెంబడి తక్కువ లోతు నీళ్లలో ఉండే మొసళ్లు ఇటీవలి వరుస తుపాన్లు, వరదలతో జనారణ్యంలోకి వచి్చపడుతున్నాయి. టాంపికో, సియుడాడ్ మడెరో, అల్టమిరా నగరాల్లో తిరుగుతూ ప్రజలను భయకంపితుల్ని చేసిన కనీసం 200 మొసళ్లను పట్టుకుని, వాటి ఆవాసాలకు తీసుకెళ్లి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. నీటి కొరత ఏర్పడినా, వరదలు వచి్చనా అవి ఇలా జనం మధ్యకు వచ్చేస్తుంటాయని, ఇదో సమస్యగా మారిందని అధికారులు అంటున్నారు. మెక్సికోలో మొసళ్లు రక్షిత జీవులు. అందుకే ప్రజలు చంపడానికి బదులుగా బంధించి అధికారులకు సమాచారమిస్తుంటారు. -
చంబల్ నదిలో 900 చిరు మొసళ్ల సందడి
మొసలి... ఈ పేరు వినగానే మనకు దాని రూపం గుర్తుకు వచ్చి, మనసులో భయం కలుగుతుంది. భారీ మొసలి రూపాన్ని పక్కన పెడితే, చిరు మెసలిని చూసినప్పుడు ఎంతో కొంత ముచ్చటేస్తుంది. మరి వందల సంఖ్యలో చిరు మొసళ్లు ఒకేసారి కనిపిస్తే..ఆసియాలోని అతిపెద్ద మొసళ్ల అభయారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా బాహ్‌లో ఉంది. ఇక్కడ ఇప్పుడు వందలకొద్దీ చిరు మొసళ్లు సందడి చేస్తున్నాయి. మహుశాల, నంద్గావాన్, హత్కాంత్ ఘాట్ల మీదుగా సుమారు 900 చిరు మొసళ్లు భారీ మగ మొసళ్లను అనుసరిస్తూ చంబల్ నదికి చేరుకున్నాయి.అటవీ రేంజ్ నుండి వస్తున్న శబ్ధాన్ని విన్న అటవీ శాఖ అధికారుల బృందం చంబల్ నది సమీపానికి చేరుకుంది. అక్కడి దృశ్యాన్ని చూసిన అటవీశాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. మొసళ్లు పిల్లలను కనే ప్రక్రియ దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అంతరించిపోయే స్థితికి చేరుకున్న మొసలి జాతిని 1979 నుండి చంబల్ నదిలో సంరక్షిస్తున్నారు. ఈ నది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల గుండా పాలి (రాజస్థాన్) మీదుగా ప్రవహిస్తుంది.2008లో బాహ్, ఇటావా, భింద్, మోరెనాలలోని చంబల్ నదిలో వందకుపైగా మొసళ్లు మృతి చెందాయి. ఆ సమయంలో మొసళ్ల మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విదేశీ నిపుణులను సంప్రదించాల్సి వచ్చింది. అప్పట్లో లివర్ సిర్రోసిస్ వ్యాధి కారణంగా మొసళ్లు చనిపోయాయని గుర్తించారు. అయితే ఆ తరువాత నుంచి మొసళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తాజా లెక్కల ప్రకారం చంబల్ నదిలో 2,456 మొసళ్లు ఉన్నాయి. -
పరువుహత్య చేసి మొసళ్లకు మేతగా పడేశారు
దేశంలో పరువు హత్యల పరంపరం కొనసాగుతోంది. ప్రేమ, డేటింగ్‌ల పేరుతో తిరిగే జంటలనూ.. చివరకు పెళ్లి చేసుకున్నా కూడా అయినవాళ్లే కనికరించడం లేదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ఘాతుకం ఆలస్యంగా వెలుగులోకి సంచలనంగా మారిందా రాష్ట్రంలో.. ఎంపీ మోరెనా జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించుకున్న జంటను నిర్దాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపిన పెద్దలు.. మొసళ్లు తిరిగే నదిలో మేతగా పడేశారు. పిల్లలు కనిపించకుండా పోయారంటూ యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది. రతన్‌బసాయ్ గ్రామానికి చెందిన శివాని తోమర్, పొరుగు గ్రామం బాలూపూర్‌కు చెందిన రాధేశ్యామ్ తోమర్ పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే అమ్మాయి(18) తరపు కుటుంబ సభ్యులు వాళ్ల బంధాన్ని ఒప్పుకోలేదు. ఈ క్రమంలో జూన్ 3వ తేదీన వాళ్లను కాల్చి చంపేసి.. ఆ మృతదేహాలకు బండరాళ్లు కట్టి మొసళ్లు తిరిగే చంబల్ నదీ ప్రాంతంలో పడేశారు. కొడుకు(21), అతను ప్రేమించిన అమ్మాయి కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తొలుత వాళ్లు ఎక్కడికైనా పారిపోయి ఉంటారని పోలీసులు భావించారు. అయితే.. వాళ్లు వెళ్లిపోవడం ఎవరూ చూడకపోవడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులను పిలిచి గట్టిగా విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. సిబ్బంది సాయంతో ముక్కలైన వాళ్ల మృతదేహాలను వెలికి తీశారు స్థానిక పోలీసులు. చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో 2,000 కంటే ఎక్కువ మొసళ్లు ఉంటాయనేది ఒక అంచనా. ఇదీ చదవండి: ముస్లింలే ఛత్రపతి శివాజీని కొనియాడుతున్నారు! -
72 ఏళ్ల వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు దాడి!
ఓ వృద్ధుడిపై ఒకేసారి 40 మొసళ్లు మూకుమ్మడిగా దాడి చేసి హతమార్చాయి. ఈ షాకింగ్ ఘటన కంబోడియాలో చోటు చేసుకుంది. ఆ వృద్ధుడు తన పోలంలోని ఆవరణలో ఓ ఎన్‌క్లోజర్‌లో ఈ మొసళ్లును పెంచుతున్నాడు. అందులోని ఓ మొసలి గుడ్లు పెట్టింది. ఆ గుడ్ల కోసం ఎన్‌క్లోజర్ నుంచి మొసలి తరలించాలనుకున్నాడు 72 ఏళ్ల వృద్ధుడు. అందుకోసం అతను ఓ కర్రతో బెదిరిస్తూ పక్కకు తొలగిపోయేలా చేద్దామనుకుంటే అది రివర్స్‌లో అతడి కర్రను బలంగా పట్టుకుని ఎన్‌క్లోజర్‌లోకి లాగింది. ఈ హఠాత్పరిణామానికి ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అంతే ఒక్కసారిగా అక్కడే ఉన్న 40 మొసళ్లు అతనిపై మూకుమ్మడి దాడి చేసి తినేశాయి. ఆ ప్రాంతంలో అతడి ఆవశేషాలు మాత్రమే కనిపించాయి. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. కంబోడియాలోని సియెమ్ రీప్ చుట్టూ అనేక మొసళ్లు సంరక్షణ ఎన్క్లోజర్లు ఉన్నాయి. అక్కడివారు ఈ మొసళ్లను వ్యాపారం కోసం పెంచుతుంటారు. అక్కడి వారు వాటితో గుడ్లు, మాంసం, చర్మం తదితరాల వ్యాపారం చేస్తుంటారు. (చదవండి: చైనాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..ఏకంగా 6.5 కోట్ల మందికిపైగా..) -
Viral Video: కొండచిలువ పాలిట క్రొక‘డై’ల్
కొండచిలువలు భారీ ఆకారంతో పొడవుగా ఉండి.. పెద్ద పెద్ద జీవులను సైతం ఇట్టే మింగేస్తాయన్న విషయం తెలిసిందే. ఏ జంతువునైనా పూర్తిగా చుట్టేసి ఊపిరిడాకుండా చేసి చంపేస్తాయి. అయితే అప్పుడప్పుడు ఇదే కొండచిలువకు కొన్నిసార్లు మృత్యుపాశంగా మారుతుంటాయి. మింగిన జంతువులను జీర్ణించుకోలేక, కక్కలేక అవస్థపడి చివరికి అవు ప్రాణాలు విడుస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ‘ఆశ లావు.. పీక సన్నం’ సామెత ఈ 18 అడుగుల బర్మీస్ పైథాన్‌కు అక్షరాలా వర్తిస్తుంది. కొండచిలువ అంటే ఏదో చిన్న జింకలు, కుందేళ్లు లాంటి వాటిని మింగాలి కానీ.. ఏదో 18 అడుగులు ఉన్నాం కదా అని.. ఐదడుగుల పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి జీర్ణించుకునే శక్తి లేక కీర్తిశేషుల జాబితాలో కలిసిపోయింది. దీని కడుపులోంచి చనిపోయిన మొసలిని జియోసైంటిస్ట్ రూసీ మూరే, సైంటిస్టుల బృందం బయటకు తీసింది. ఫ్లోరిడాలో ల్యాబ్‌లో ఈ మొసలిని తీస్తున్న దృశ్యాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు మూరే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: రన్నింగ్ బస్సుకు ఎదురెళ్లి మరీ.. షాకింగ్ వీడియో -
హడలెత్తించిన మొసళ్లు
కడెం(ఖానాపూర్)/ఏటూరునాగారం: వేర్వేరు చోట్ల రెండు మొసళ్లు హడలెత్తించాయి. నిర్మల్ జిల్లా ఎలగడప గ్రామంలోకి శుక్రవారం అర్ధరాత్రి ఓ మొసలి ప్రవేశించి.. గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రామస్తుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది మొసలిని చాకచక్యంగా తాళ్లతో బంధించి తీసుకెళ్లి కడెం ప్రాజెక్టులో వదిలారు. అలాగే, ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద శనివారం జాలర్ల వలకు ఓ మొసలి చిక్కింది. భయాందోళనకు గురైన జాలర్లు వెంటనే దానిని తిరిగి గోదావరి నదిలోకి వదిలేశారు. గోదావరిలోకి మొసళ్లు వచ్చాయని, స్నానాలకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని స్థానికులు హెచ్చరించారు. -
ఏం టైమింగ్.. వెంటాడిన మృత్యువు నుంచి తప్పించుకుంది
వైరల్: ఆయుష్షు గట్టిదైతే.. ఎంతటి ప్రమాదం నుంచి అయినా బయటపడొచ్చు. అయితే దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. మృత్యువు వెంటాడినా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి మృత్యువు ముఖం నుంచి తప్పించుకుంది ఓ సింహం ఇక్కడ. కెన్యా మసాయ్ మరా నేషనల్ రిజర్వ్ పార్క్‌లో మే 23వ తేదీన ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే దాని మీద ఓ సింహం కూడా కనిపించింది. దీంతో పెసీ తన కెమెరాతో షూట్ చేయడం ప్రారంభించాడు. సుమారు నలభైకి పైగా మొసళ్లు.. హిప్పో మృతదేహం చుట్టూ చేరాయి. కాస్త ఉంటే.. పైన ఉన్న సింహం కూడా వాటికి బలి అవుతుందేమో అనుకున్నాడు పెసీ. అయితే ప్రాణ భయంతో హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అదను చూసి నీళ్లలోకి ఒడ్డుకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
Crocodiles: ముచ్చటగా 32.. దత్తత తీసుకుంటారా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జూ పార్కులో ఎన్నెన్నో రకాల వన్యప్రాణులున్నాయి. ఏనుగులు, కోతులు, ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, కనుజులు, జింకలు, వివిధ రకాల పక్షులతో పాటు వివిధ జాతుల పాములు జూకు వెళ్లే సందర్శకులకు నేరుగా ఎన్క్లోజర్లలో కనిపిస్తుంటాయి. అయితే జూలో మొసళ్లు ఎక్కడా అని సందర్శకులు వెతుకుతుంటారు. అసలు జూలో మొసళ్లే లేవని ఇంకొందరు అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. జూలో మొసళ్లు కూడా ఉన్నాయి.. ఒకటి కాదు.. రెండు.. కాదు.. మూడు రకాలకు చెందిన 32 మకరాలున్నాయి. వాటి సంతతిని ఇప్పుడిప్పుడే వృద్ధి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో మూడు ఉప్పు నీటి మొసళ్లు, ఆరు ఘరియల్స్, 23 మగ్గర్ మొసళ్లు(మూడు పెద్దవి, 20 పిల్లలు) ఉన్నాయి. చదవండి: కారూ లేదు.. షెడ్డూ లేదు.. ఓ కథ మాత్రం ఉంది.. కొలను ఒడ్డున పిల్లలతో మగ్గర్ మొసళ్లు జూ పార్కు ఏర్పాటు చేసినప్పటి నుంచి మొసళ్లకు అధికారులు ప్రత్యేక స్థానం కల్పించారు. మొదటి నుంచి మూడు రకాల మొసళ్లను సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. వాటి కోసం పాముల జోన్ వెనుక భాగం, సాగర్ ద్వారం నుంచి కుడివైపులో రెండు కొలనులు, సాగర్ ద్వారంలో ఎడమ వైపు ప్రధాన రహదారి పక్కనే మరో కొలను ఏర్పాటు చేశారు. వీటిలో సాగర్ ద్వారం నుంచి కుడి వైపున ఉప్పునీటి మొసళ్లు(సాల్ట్ క్రోకోడైల్), మగ్గర్ మొసళ్ల కొలనులు ఉన్నాయి. సాగర్ ద్వారం నుంచి ఎడమ వైపు ఘరియల్ మొసళ్లు కొలను నిర్మించారు. ఉప్పునీటి మొసలి ఈ మూడు కొలనుల్లో మొదట్లో ఒక్కో జత చొప్పున ఆయా రకాలకు చెందిన మొసళ్లు విడిచిపెట్టారు. అవి సందర్శకులను అలరించేవి. అవి రానురాను వాటి సంతతి పెంచుకుంటున్నాయి. అయినా ఎప్పుడూ వాటి మూడు రకాల సంఖ్య 10 దా టేది కాదు. ఇప్పుడు మూడు పదులు దాటడం విశేషం. మగ్గర్ జాతి మొసళ్లు రెండు ఆడవి, ఒకటి మగది(పెద్దవి) ఇక్కడ ఉన్నాయి. ఇందులో ఆడ మొసలి గతేడాది మే 20న 20 పిల్లలను పొదిగింది. దీంతో వాటి సంఖ్య ఒక్క సారిగా 3 నుంచి 23కు చేరింది. ఆ 20 పిల్లలు ప్రస్తుతం జనక మొసళ్లతో వాటి కొలనులో హుషారుగా తిరుగుతున్నాయి. తల్లి మొసలితో పాటు ఒడ్డుకు చేరి గట్టుమీద గడుపుతున్నాయి. ఇక్కడ పొదగబడిన పిల్లలన్నీ బతకడం విశేషం. సాధారణంగా పొదగబడిన కొద్ది రోజులకు కొన్ని పిల్లలు నీటిలో తిరుగుతున్న సమయంలో పెద్ద మొసళ్లు ఢీకొనడం, ఒడ్డుకు చేరిన సమయంలో ఏవైనా పక్షులు ఎత్తుకుపోవడంతో ప్రాణాలు కోల్పోతుంటాయి. కానీ ఇవి పొదగబడి సుమారు తొమ్మిది నెలులు గడిచింది. ప్రస్తుతం ఇవి సుమారు 5 నుంచి 8 కిలోల బరువు పెరిగాయి. దీంతో వీటిని పక్షులు ఎత్తుకెళ్లలేవు. సరికదా కొలను లోపల పెద్ద మొసళ్లు ఢీకొన్నప్పుటికీ తట్టుకొనే శక్తి వచ్చిందని యానిమల్ కీపర్లు, జూ అధికారులు అంటున్నారు. పిల్లలన్నీ బతకం అరుదైన విషయంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఘరియల్స్ ఇక్కడ సాగర్ ద్వారం దాటగానే ఎడమ వైపు రోడ్డు పక్కన ఘరియల్స్ కొలను ఉంది. జూ ఏర్పాటు చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత వీటిని వేరే జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ 6 ఘరియల్ జాతికి చెందిన మొసళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఆడవే. ఇవి తరుచూ కొలను నీటి నుంచి ఒడ్డుకు చేరుతుంటాయి. వాటికి సుమారు అర మీటరు పొడవున నోరు ఉంటుంది. ఆ నోటిని పైకి పెట్టి నీటిలో ఈదుతూ చేపలను పట్టుకుని తింటాయి. ఇవి ఒడ్డుకు చేరి ఎక్కువ సేపు గడుపుతూ సందర్శకులను అలరిస్తుంటాయి. ఇదీ మొసళ్ల మెనూ.! ఇక్కడ మొసళ్లకు రోజులో రెండుసార్లు ఆహారం అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో చికెన్, బీఫ్‌ను బోన్స్(దుమ్ములు)తో కలిపి కైమా చేసి వేస్తుంటారు. వీటితోపాటు కొన్ని రోజుల్లో చేప పిల్లలను, పెద్ద చేప ముక్కలు కొలనుల్లో వేస్తున్నారు. ఇవిగాక కొలనులో వాటికి దొరికిన నత్తలు, కీటకాల లార్వా తింటాయి. ఇది లా ఉండగా ఇక్కడ వాటి సంఖ్య పెరుగుతున్న రీతిలోనే వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా భారీగా పెరిగిపోతుంది. అందుకే జూ అధికారులు దాతలు ముందుకొచ్చి వాటిని దత్తత తీసుకోవాలని కోరుతున్నారు. ఉప్పునీటి మొసళ్లు ఇక్కడ ప్రస్తుతం ఉప్పు నీటి మొసళ్లు మూడున్నాయి. ఈ మూడూ ఆడవే. నాలుగేళ్ల కిందట ఇక్కడ ఒక జత ఉప్పునీటి మొసళ్లు ఉండేవి. వాటిలో ఆడ మొసలి గుడ్లు పెట్టి సుమారు 10 పిల్లలను పొదిగింది. ఆ పిల్లల్లో 8 మృతి చెందాయి. దీంతో పాటు ఇక్కడ మగ మొసలి కూడా వృద్ధాప్యంతో రెండేళ్ల కిందట మృతి చెందింది. దీంతో ప్రస్తుతం మూడు ఆడ ఉప్పునీటి మొసళ్లు ఈ కొలనులో సందర్శకులను అలరిస్తున్నాయి. మొసళ్లను దత్తత తీసుకోండి జూలో మొసళ్ల సంఖ్య పెరిగింది. అవి సందర్శకులను అలరిస్తున్నాయి. వాటితో పాటు జూలో అన్ని జాతుల వన్యప్రాణులు సంఖ్య పెరిగింది. అందుకే దాతలు ముందుకు వచ్చి వాటిని దత్తత తీసుకుని ఆహారం అందించాలని కోరుతున్నాం. మొసళ్లను వారం, నెల, ఆరు నెలలు, సంవత్సరం పాటు దత్తత తీసుకోవచ్చు. ఒక్కో మొసలికి వారానికి రూ.525, నెలకు రూ.2,000, ఆరు నెలలకు రూ.12,000, ఏడాదికి రూ.24,000 ఆహారం కోసం ఇచ్చి దత్తత తీసుకోవచ్చు. ఉప్పు నీటి మొసలి, ఘరియల్స్లో ఇక్కడ మగవిలేవు. దీంతో ఆయా రకాల మొసళ్లను ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. – నందనీ సలారియా, జూ క్యూరేటర్ -
ఆదిలాబాద్: రోడ్లపై మొసళ్ల సంచారం.. భయాందోళనలో ప్రజలు
-
రోడ్లపై మొసళ్ల సంచారం.. భయాందోళనలో ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్: నీళ్లలో ఉండాల్సిన మొసళ్లు రోడ్లపైకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం మావాల బైపాస్ రోడ్డుకు సమీపంలో మంగళవారం రాత్రి మొసలి రోడ్డు దాటుతూ కనిపించింది. ఆ సమయంలో జాతీయ రహదారికి దగ్గరలోని దాబా వైపు వెళ్తున్న కొందరు యువకులు గడ్డి పొదల్లో నుంచి మొసలి రోడ్డు దాటుతుండటాన్ని గమనించారు. ఆ సమయంలో మోటార్ బైక్ శబ్ధానికి మొసలి పొదల్లోకి జారుకుంది. అయితే నీళ్లలో ఉండాల్సిన మొసలి రోడ్డుపై సంచరిస్తుడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: (మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం) -
మొసళ్ళని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్న మాలి ప్రాంత ప్రజలు
-
కిన్నెరసానిలో వందలకొద్దీ మకరాలు
పాల్వంచరూరల్: ప్రకృతి అందాల నిలయమైన కిన్నెరసాని జలాశయంలో మొసళ్ల సంతతి అంతకంతకూ పెరుగుతూపోతోంది. రిజర్వాయర్‌లో ఒకవైపు బోటు షికారు జరుగుతుంటే ఇంకోవైపు చేపలు సంచరించినట్లుగానే మొసళ్లుకూడా ఈదుతూ కనిపిస్తుంటాయి. కిన్నెరసాని రిజర్వాయర్‌లో 1984లో నీళ్లు నిలకడగా ఉండే ప్రదేశంలో జీవించగలిగిన మగ్గర్ జాతికి చెందిన 22 ఆడ, 11 మగ మొసళ్లను వేశారు. వీటి సంఖ్య క్రమంగా పెరుగుతూ..దాదాపు ఇప్పుడు 1000వరకు ఉండవచ్చని ఒక అంచనా. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలోని శిలారంలో 70కిపైగా, సంగారెడ్డిజిల్లా మంజీరా నదిలో వంద వరకు మొసళ్లు ఉంటాయి. క్రొకోడైల్ వైల్డ్‌లైఫ్ సంచారీగా మార్చారు. కానీ..కిన్నెరసానిలో వందల సంఖ్యలో మొసళ్లు ఉన్నా..ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిన్నెరసాని కాల్వ సమీపంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు చెందిన పంప్‌హౌజ్ వద్ద మదుగులో మొసళ్లు సంచరిస్తున్నాయి. కిన్నెరసాని కరకట్ట దిగువభాగంలోని చెరువులోనూ ఇవి తిరుగుతున్నాయి. పర్యాటకుల బోటింగ్ షికారు కూడా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. బయటికి వస్తుండడంతో భయం..భయం రిజర్వాయర్‌లో అధికంగా పెరిగిన మొసళ్లు, వాటి సంతతి క్రమంగా ఒడ్డుకు వచ్చి సమీపంలోని చెరువులు, చేల వద్దకు చేరుతున్నాయి. గతంలో పాల్వంచ పట్టణంలోని చింతలచెరువు సమీపంలో నల్లమల్ల వేణు అనే వ్యక్తి ఇంట్లోకి మొసలి వెళ్లగా పట్టుకున్నారు. యానంబైల్ గ్రామ సమీపంలోని చెరువు వద్ద మగితే రత్తమ్మ అనే మహిళపై దాడి చేసింది. ఒడ్డుకు వచ్చి చెట్ల పొదల్లో గుడ్లు పెడుతుంటాయి. అటుగా వెళ్లేవారిపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ మకరం పిల్లలు దొరికినా ఇక్కడి జలాశయంలోనే వదిలేస్తుండడంతో వీటి సంఖ్య ఇంకా పెరిగిపోతోంది. ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి నీటిని వదిలేప్పుడు పరీవాక ప్రాంతాల్లో మొసళ్లు సంచరిస్తున్నాయి. రంగాపురం, నాగారం. సూరారం, పాండురంగాపురం ప్రాంతాల్లో అనేకమార్లు వీటిని పట్టుకుని తిరిగి జలాల్లో వదిలేశారు. -
టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు!
బ్రెసీలియా: కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు. బ్రెజిల్లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఆయన.. ఫైజర్ ఇచ్చిన కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ఏ సైడ్ ఎఫెక్ట్స్‌కు బాధ్యత వహించదని ఉందని, అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సూపర్ హ్యూమన్‌గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా, మొగవాళ్ల గొంతులు మారినా, ఫైజర్ పట్టించుకోదని గుర్తు చేశారు. సోమవారం బైడెన్‌కు వాక్సిన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్‌కు సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇస్తారని అధికారులు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, నమ్మ కం కలిగించేందుకు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఇప్పటికే బైడెన్ చెప్పారు. శుక్రవారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్‌కు, హౌస్ స్పీకర్ నాన్సీపెలోసికి తొలిడోసు ఇచ్చారు. తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని పెన్స్ చెప్పారు. -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే అంతేనట!
కరోనావైరస్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలతో మొదటినుంచీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చంటూ సరికొత్త వివాదానికి తెర తీసారు. అంతేకాదు ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ కోవిడ్ వ్యాక్సిన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా ఆమోదం తెలిపిన ఫైజర్ టీకాపై ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. (టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు) ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అంతానికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బోల్సనారో వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఫైజర్ టీకా తయారీ కంపెనీలపై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ టీకా తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ, మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే, అది మీ సమస్య అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హూమన్‌గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా, పురుషులు వేరేవిధంగా మాట్లాడినా ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా ఇప్పటికే తన శరీరంలో యాంటిబాడీస్ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు. (వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్) కాగా బ్రెజిల్లో ఇప్పటి వరకు 7.1 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందారు. గతంలో కరోనా వైరస్, లాక్‌డౌన్‌పై విభిన్నంగా స్పందించిన బ్రిజిల్ అధ్యక్షుడు కరోనా సాధారణ ఫ్లూమాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించి వివాదంలో నిలిచారు. ఆ తరువాత ఆయన కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
వడోదరలో ఎక్కడ చూసినా మొసళ్లే
-
ఎక్కడ చూసినా మొసళ్లే.. బిక్కుబిక్కుమంటూ జనం!
వడోదర : ఎండాకాలం పోయింది. వర్షాలు కురుస్తున్నాయి. చల్లగా ఉంటుందిలే అనుకుంటే గుజరాత్‌లోని వడోదర నగర వాసులకు ‘కొత్త’ కష్టాలు మొదలయ్యాయి. బుధవారం నుంచి భారీ వర్షాలు కురవడంతో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. అంతేనా.. శనివారం కాస్త వర్షాలు తగ్గి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ఊపిరిపీల్చుకుంటున్న నగరవాసులకు మొసళ్ల రూపంలో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. వరదలతోపాటే నగరంలోకి కొట్టుకొచ్చిన మొసళ్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తుండటంతో వారు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడి నుంచి మొసలి వచ్చి దాడి చేస్తుందేమోనని భయపడి ఇళ్లలోనుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇలా మొసళ్లతో పడుతున్న బాధలను వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు వడోదర నుంచి ఏ పోస్టు వచ్చినా మొసళ్లతో పడుతున్న బాధల గురించే ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మొసళ్లు అక్కడి రోడ్లపై ఏ రేంజ్లో స్వైరవిహారం చేస్తున్నాయో.. మొన్న నీళ్లలోంచి మొసలి హఠాత్తుగా వచ్చి వీధి కుక్కపై దాడి చేయబోయిన వీడియో వైరల్ కాకముందే తాజాగా నడిరోడ్డుపై మొసలి కనిపించడం, దాన్ని రెస్క్యూ టీం చాకచక్యంగా బంధించే వీడియో వైరల్ అవుతోంది. రెస్క్యూ సిబ్బంది గత మూడు రోజులుగా మొసళ్లను బంధించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఒక దాన్ని బంధించి సురక్షిత ప్రదేశంలో విడవగానే మరొకచోట నుంచి ఫోన్ వస్తోందని రెస్క్యూ సిబ్బంది ఒకరు వెల్లడించారు. నగరంలో నుంచి వరద నీరు పూర్తిగా వెళ్లేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఆస్ట్రేలియా వీధుల్లోకి మొసళ్లు!
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలాకాయాల్సిన సైన్యం ఆస్ట్రేలియాలోని రోడ్ల మీద మొసళ్ల వేటలో పడింది. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఆస్ట్రేలియాని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరద నీటితో పాటు కొట్టుకొస్తోన్న మొసళ్లు అక్కడి ప్రజలకు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ఏ గుంటలో ఏనీరుందో అని కాకుండా, ఏ నీళ్లల్లో ఏ మొసలి ఉందోనని హడలిపోతున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సరిహద్దు భద్రతాదళాలైన సైనిక పటాలాలన్నీ మొసళ్లవేటలో పడ్డాయి. గత ఎనిమిది రోజులుగా ఆస్ట్రేలియాలో కురుస్తోన్న ఈ వర్షాలు గత శతాబ్ద కాలంలో ఎరుగమని ప్రజలు విస్తుపోతున్నారు. దీనికి తోడు మొసళ్ల బీభత్సం భయభ్రాంతులకు గురిచేస్తోంది. పాఠశాలలు, విమానాశ్రయాలు మూసివేసారు. వీధుల్లోకి రావద్దన్న సైన్యం ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. ఇంకా 72 గంటల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో వీధుల్లోనుంచి మొసళ్లు ఇళ్లల్లోకి చేరితే పరిస్థితేమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
ఏకంగా 300 మొసళ్లను చంపేశారు
-
ఐదు పిల్లలు పెట్టిన మొసలి
పాల్వంచరూరల్ : కిన్నెరసాని రిజర్వాయర్‌లో మొసళ్ల సంతతి పెరుగుతోంది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని రిజర్వాయర్‌లో అద్దాలమేడ సమీపంలో ఓ ఆడ మొసలి గుడ్లు చేసి పొదిగి ఆదివారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరాలో బంధించింది. -
మొసళ్లెన్నో..
అటవీ శాఖాధికారులు ఇటీవల జంతువుల గణన నిర్వహించారు. ప్రతీ నాలుగేళ్లకోసారి పులుల సర్వే నిర్వహిస్తున్నారు. కానీ అభయారణ్యంలో ఉన్న రిజర్వాయర్‌లోని మొసళ్లను మాత్రం లెక్కించడంలేదు. ప్రస్తుతం ఎన్ని వేలు ఉన్నాయో కూడా తెలియదు. తరచుగా నీటిపై తేలియాడుతూ, మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యంలోని రిజర్వాయర్‌లో 1984 సంవత్సరంలో మగ్గర్ జాతికి చెందిన 22 ఆడ, 11 మగ మొసళ్లను(మొత్తం 33) అటవీ శాఖాధికారులు వదిలారు. అప్పుడవి నాలుగు మీటర్ల పొడవు, 200 కేజీల బరువు ఉన్నాయి. మగ్గర్ జాతికి చెందిన మొసళ్లు చేపలు, నత్తలు, కప్పలు, వివిధ మలిన ఆహారం తీసుకుంటాయి. ప్రతీ సంవత్సరం ఒక్కో మొసలి 10 నుంచి 40 గుడ్లు పెడుతుంది. మే, జూన్ నెలల్లోనే గుడ్లు పెట్టి, 60 నుంచి 90 రోజుల వరకు పొదిగి సంతానోత్పత్తి చేస్తాయి. కిన్నెరసాని అనువైనది మొసళ్లు దేశంలో అంతరించిపోతున్నాయని మగ్గర్ జాతికి చెందిన సముద్రపు మొసళ్లను పాల్వంచలోని కిన్నెరసానితోపాటు మంజీరాలో వన్యప్రాణి అభయారణ్య సంరక్షణ అధికారులు వదిలారు. కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగుల లోతుతో నీటినిల్వ సామర్థ్యం కలిగి ఉంది. జలచరాలు ఉండేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రిజర్వాయర్‌లో ద్వీపాలు ఉండటం, రాళ్లు, చెట్లతో అనువుగా ఉండటమే కాకుండా బురద ప్రాంతాలు, పొదళ్లు ఉన్నాయి. మొసళ్లకు ఆహారం కూడా సమృద్ధిగా దొరికేందుకు వీలుగా ఉంది. దీంతో 1984లో మొసళ్లను ఈ రిజర్వాయర్‌లో వదిలారు. ఉష్ణోగ్రత సైతం వేసవిలో కనిష్టం 15 డిగ్రీల నుంచి గరిష్టం 45 డిగ్రీల వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 760 మి.మీల నుంచి గరిష్ట వర్షపాతం 1130 మి.మీల వరకు ఉంటుంది. దీంతో మొసళ్లు పెరగడానికి కిన్నెరసాని రిజర్వాయర్‌ను అనువైనదిగా గుర్తించారు. లెక్కించేదిలా... జంతువుల గణన మాదిరిగానే అధికారులు జలచరాలను లెక్కించకపోవడంతో కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఎన్ని మొసళ్లు ఉన్నాయి, ఎన్ని బయటకు వెళ్లాయో అంతుచిక్కడంలేదు. మొసళ్ల గణనను జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రాత్రివేళల్లో అత్యాధునిక బైనాక్యులర్లు, నీటి కెమేరాలను వినియోగించి చేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో లెక్కిస్తారు. మొసళ్లు నడిచే మార్గంలో వాటి అడుగులు, గుర్తులు, గుళికలు, గుడ్డు కవచాలు తదితర వాటి ఆధారంగా గణన చేస్తారు. వేసవిలోనే బయటకు వస్తాయి.. 20 సంవత్సరాల క్రితం డెహ్రాడూన్ నుంచి బీఎన్.చౌదరి అనే అధికారి రిజర్వాయర్‌లోని మొసళ్ల సంఖ్యను లెక్కించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అనంతరం వీటిని లెక్కించే చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాటి సంఖ్య ఎంత అనేది తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల పాలేరు నుంచి కూడా మూడు మొసళ్లను తీసుకువచ్చి కిన్నెరసానిలో వదిలారు. గతంలోనూ ఇలా మొసళ్లను బయటి ప్రాంతం నుంచి తీసుకువచ్చి వదిలిన సందర్భాలున్నాయి. వేసవిలోనే ఎక్కువగా బయటకు కన్పించేవిధంగా మొసళ్ల సంచారం ఉంటుంది. ప్రస్తుతం ఎన్ని ఉండొచ్చు? కిన్నెరసానిలో 1984లో 33 మొసళ్లను వదలగా, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో మొసలి ఏడాదికి 10 నుంచి 40 గుడ్లు పెడుతుండగా, వాటిల్లో కనీసం 20 గుడ్లు అయినా బతికే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ఏడాదికి 440 పిల్లల చొప్పున 34 ఏళ్ల కాలంలో సుమారు 14,960 మొసళ్లు ఈ రిజర్వాయర్‌లో ఆవాసం పొందుతున్నట్లు అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. కాల్వల ద్వారా మైదాన ప్రాంతాలకు.. కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న నీరు కాల్వ ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు నిత్యం సరఫరా అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ కాల్వ ద్వారానే మొసళ్లు బయటకు వెళ్లి మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. వాటిని గుర్తించి పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కిన్నెరసాని కాల్వ సమీపంలోని కొత్తగూడెం మున్సిపల్ పంప్‌హౌస్ వద్ద ఓ మడుగులో రెండు మొసళ్లు బయటనే సంచరిస్తున్నాయి. రెండేళ్లుగా అక్కడే గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. పొంచి ఉన్న ప్రమాదం కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న మొసళ్ల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్‌లో బోటు షికారు నిర్వహిస్తుండగా, సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో చేపలు పడుతూ ఉంటారు. మొండికట్ట, కిన్నెరసాని, యానంబైలు ప్రాంతాలకు చెందినవారు తెప్పలు వేసుకుని రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో మొసళ్లు కాల్వల ద్వారా సమీప గ్రామాల్లోకి సైతం వెళ్తున్నాయి. అయితే అసలు ఈ మొసళ్ల గణన అనేది ఎవరి పరిధిలోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. రిజర్వాయర్ నిర్వహణ జెన్కోది కాగా రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతమంతా వన్యమృగాల సంరక్షణ శాఖ కిందకు వస్తుంది. దీంతో అసలు మొసళ్ల బాధ్యత ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది. మాకు సంబంధం లేదు కిన్నెరసాని రిజర్వాయర్‌లోని జలచరాల గణనతో మాకు సంబంధం లేదు. నీటి వినియోగం, పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. మిగతావి వైల్డ్‌లైఫ్ శాఖే చూసుకుంటుంది. –ఎస్ఎన్ మూర్తి, సీఈ, కేటీపీఎస్(5,6దశలు) -
పాలేరు జలాశయంలో మొసళ్లు
-
పాలేరు జలాశయంలో మొసళ్లు
సాక్షి, పాలేరు: ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో మొసళ్లు కనిపించడంతో కలకలం రేగింది. జలాశయంలో వద్ద మత్స్య శాఖ ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్‌లో జాలర్లకు నాలుగు మొసలి పిల్లలు చిక్కాయి. వీటిలో రెండిని చంపి మరో రెండింటిని బయటకు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని జాలర్లు, మత్స్యశాఖాధికారులకు తెలియజేశారు. ఉడుం పిల్లలనుకుని రెండింటిని చంపినట్లు జాలర్లు తెలిపారు. పాలేరు జలాశయంలో మొసళ్లు కనిపించడంతో జాలర్లతో పాటు ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మంత్రాలకు చింతకాయలు రాలుతాయట!
వినడానికి వింతగా అనిపించొచ్చు.. కానీ ఇది నిజంగానే జరిగిందట. మంత్రాలకు చింతకాయల సంగతి అటుంచండి.. అంతకన్నా ఎక్కువే జరిగిందని ఇండోనేసియాలోని బెరా వాసులు చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా ఓ వీడియో కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ మంగళవారం సైరిఫుద్దీన్(41) అనే వ్యక్తి లెంపేక్ నదిలో స్నానానికి దిగాడు. ఇక్కడి వాసులకు ఓ నమ్మకం ఉంది. ఈ నదిలో ఎవరూ నగ్నంగా స్నానం చేయరు. అలా చేస్తే.. ఇందులోని మొసళ్లు దాడి చేసి చంపేస్తాయని వారు చెబుతారు. ఆ రోజు సైరిఫుద్దీన్ నగ్నంగా నదిలోకి దిగాడు. అంతే.. అనూహ్యంగా ఓ మొసలి అతడిపై దాడి చేసి.. నదిలోకి లాక్కెళ్లిపోయింది. అక్కడున్న సైరిఫుద్దీన్ స్నేహితులు, గ్రామస్తులు ఎంత గాలించినా.. అతడి మృతదేహం దొరకలేదు. చివరికి పోలీసులూ రంగంలోకి దిగారు. వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆఖరి ప్రయత్నంగా గ్రామస్తులు స్థానిక మంత్రగాడిని ఆశ్రయించారు. అతడు మొసళ్లను మంత్రించడంలో స్పెషలిస్టట. బుధవారం ఉదయం అతడు ఓ మంత్రం చదవడం.. ఆశ్చర్యకరంగా కొంతసేపటికి ఓ మూడు మొసళ్లు.. సైరిఫుద్దీన్ మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడం జరిగిపోయాయి. అవి వాటిని మిగతావాటి దాడి నుంచి రక్షిస్తూ.. తెస్తున్నట్లు కనిపించిందని స్థానిక పోలీసు అధికారి ఫైసల్ హమీద్ తెలిపారు. ఇది తనకు చాలా విచిత్రంగా కనిపించిందన్నారు. ఏదైతేనేం.. బాడీ దొరికింది.. కేసు క్లోజ్ అంటూ ఆయన వెళ్లిపోయారు. ప్రస్తుతం గ్రామస్తులంతా సైరిఫుద్దీన్ను చంపిన మొసలిని వెతికే పనిలో ఉన్నారట. -
వరదలకు ఇళ్లలోకి వస్తున్న మొసళ్లు
-
బార్డర్లో భారీ ఎత్తున మొసళ్ల పట్టివేత
భారీ ఎత్తున మొసళ్లను చంపి అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని చైనా పోలీసులు పట్టుకున్నారు. చైనా, వియత్నం బార్డర్లో సాధారాణ తనిఖీల్లో భాగంగా యాంక్సీ పోలీసులు దక్షణ చైనాలోని ఫాంగ్ చెంగాగ్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన వెలుగు చూసింది. తనిఖీల్లో భాగంగా ఓ ట్రక్‌లో లోడ్ అయిన సంఖ్యకు, డ్రైవర్ చూపించిన పేపర్లోని సంఖ్యకు పొంతన లేక పోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మొత్తం 16 బాక్స్‌లలో ఐస్ బాక్స్‌లు పెట్టి మొసళ్లను ఈ ట్రక్‌లో తరలిస్తున్నారు. 70 మొసళ్లతోపాటూ మరో 88 మొసళ్ల తొకలను కత్తిరించి ఇందులో తీసుకు వెళుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మొసళ్ల చర్మానికి మంచి గిరాకీ ఉండటంతో స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా వన్యప్రాణులను హతమార్చి రవాణా చేస్తున్నారు. -
పశువుల కాపర్లను చంపేసిన మొసళ్లు
మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. పశువులను మేపేందుకు వెళ్లిన ఇద్దరు పశువుల కాపర్లను మొసళ్లు చంపేశాయి. పుల్కల్ మండలం గొగులూరు గ్రామానికి చెందిన కొంతమంది పశువుల కాపరులు మంజీరా పరివాహక ప్రాంతంలో పశువులను మేపడానికి వెళ్లారు. వాళ్లలో శివకుమార్ అనే వ్యక్తి.. కాళ్లు కడుక్కోడానికి నీళ్లలోకి దిగగా, వెంటనే మొసళ్లు అతడిపై దాడిచేసి, లోపలకు లాక్కెళ్లిపోయాయి. శివకుమార్‌ను రక్షించేందుకు రామస్వామి అనే మరో కాపరి చిన్న తెప్పతో లోనికి వెళ్లి.. గాలించడం మొదలుపెట్టాడు. అయితే కాసేపటికి అతడిపై కూడా మొసలి దాడిచేసి లాక్కెళ్లిపోయింది. ఇప్పటివరకు మొసళ్లు ఈ ప్రాంతంలో పశువుల మీద దాడి చేసిన ఘటనలు ఉన్నాయి గానీ, మనుషులను ఏమీ చేయలేదు. తొలిసారి మనుషుల మీదే దాడిచేసి చంపేయడం ఇక్కడ కలకలం సృష్టించింది. ఇంకా ఆ మృతదేహాలను బయటకు తీసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. -
'ఆ మొసళ్లు కొట్టుకుపోలేదు..'
చెన్నై వరద నీటిలో మొసళ్లు కొట్టుకుపోయినట్టు వచ్చిన వార్తలను మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ తోసిపుచ్చింది. 'మొసళ్లు తప్పించుకోలేదు. ఆ వార్తలను దయచేసి నమ్మకండి. అన్ని మొసళ్లు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం మా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు' అని ఆ సంస్థ ట్వీట్ చేసింది. భద్రతకే తాము తొలి ప్రాధాన్యమిస్తామని, ఇందుకోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలియజేసింది. క్రొకడైల్ ఫామ్ చుట్టూ భారీ గోడ నిర్మించామని పేర్కొంది. చెన్నై జై పార్క్ నుంచి 40 మొసళ్లు వరద నీటిలో కొట్టుకుపోయినట్టు వార్తలు రావడంతో మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. కాగా చెన్నై జూ పార్క్‌లోకి తొలిసారి వరద నీరు రావడంతో పాటు పార్క్ ప్రహారీ గోడ దెబ్బతింది. అయితే జూ పార్క్‌లో జంతువులన్నీ క్షేమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల చెన్నైలో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి పాములు, చేపలు, కప్పలు వస్తున్నాయి. ఓ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో చేపలు, కప్పలు ఈత కొడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. -
ఆస్తుల స్తంభనతో పదివేల మొసళ్ల ఆకలి కేకలు
సాన్ మాన్యుయెల్: హోండురస్ లోని ఓ ఫార్మ్ లో ఉన్న 10వేలకుపైగా మొసళ్లు ఆకలితో అలమటిస్తున్నాయి. హోండురస్ వ్యాపార దిగ్గజం ఆస్తులను అమెరికా స్తంభింపజేయడంతో.. ఆయనకు చెందిన ఆ ఫార్మ్ లోని మొసళ్ల సంరక్షణ చూసుకునేవారు కరువయ్యారు. దీంతో రోజుకొక మొసలి ఆకలితో ప్రాణాలు విడుస్తున్నది. సాన్ మాన్యుయెల్ నగరంలోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొకొడ్రిలస్ కాంటినెంటల్ లో మొసళ్లతోపాటు, ఏడు సింహాలు కూడా ఉన్నాయి. గత రెండువారాలుగా వీటిని ఆహారం అందించేవారు లేకపోవడంతో మొసళ్లు, సింహాలు చనిపోయాయని, మొత్తం 40కిపైగా జంతువులు మృత్యువాత పడ్డాయని ఈ ఫార్మ్‌హౌస్ కు వాచ్‌మేన్ గా ఉంటున్న ఓ వ్యక్తి తెలిపాడు. మధ్య అమెరికాలోని హోండురస్ దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్త రోసెన్థల్ కుటుంబానికి చెందిన ఫార్మ్‌హౌస్ ఇది. బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్, పర్యాటకం, స్టాక్ ఎక్స్చేంజ్, వ్యవసాయం వంటి రంగాల్లో రోసెన్థల్ కుటుంబం భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే ఇటీవల మనీ లాండరింగ్, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నదంటూ ఈ కుటుంబ ఆస్తులను అమెరికా స్తంభించింది. అమెరికాలో వ్యాపారాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. దాంతో రోసెన్థల్ నేతృత్వంలోని బాంకో కాంటినెంటల్ దారుణంగా దెబ్బతిన్నది. దాని అధిపతి యాంకెల్ రోసెన్థల్ అరెస్టు అయ్యారు. ఈ పరిణామంతో రోసెన్థల్ కుటుంబం ఆధ్వర్యంలోని కొకొడ్రిలస్ కాంటినెంటల్ ఫార్మ్‌హౌస్ పై తీవ్ర ప్రభావం పండింది. దీని గురించి రోసెన్థల్ కుటుంబం పట్టించుకోవడం మానివేయడం, జంతువులకు ఆహారం కోసం నిధులు లేకపోవడంతో ఇక్కడున్న మొసళ్లు, సింహాలు, ఇతర జంతువులు ఆకలితో అలమటించే చనిపోయేదశకు చేరుకుంటున్నాయి. -
మొసళ్లను సంహరించాలంటున్న ఆస్ట్రేలియన్లు
మెల్బోర్న్: దక్షిణ ఆస్ట్రేలియాలో నానాటికీ పెరుగుతోన్న మొసళ్ల సంఖ్యపై ఆ దేశ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన మూడు దశాబ్దాలలో మూడింతలు అయిన మొసళ్లు ప్రమాదకరంగా ఉన్నాయని, మానవుల మరణానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మొసళ్ల ఏరివేతకు సమయం ఆసన్నమైందని, ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్‌ను కోరారు. అయితే, దీనిపై ఆ సంస్థ స్థానిక మేనేజర్ ల్యూక్ బెంట్లే సమయోచితంగా స్పందించారు. మొసళ్ల ఏరివేత సమీప భవిష్యత్‌లో సాధ్యమయ్యేది కాదని ప్రజలు ఆందోళనలు విరమించుకోవాలని కోరారు. ప్రజలు చేపలు పట్టే, సేదదీరే ప్రాంతాల్లో దూకుడుగా ప్రవర్తించే మొసళ్లను ఇన్నాళ్లుగా కాల్చివేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని బెంట్లే అన్నారు. ఒక్కసారిగా మొసళ్ల ఏరివేత అసాధ్యమని, ఒకవేళ ఆ ప్రాంతంలోని మొసళ్లను మట్టుబెట్టినా.. అక్కడికి వేరే ప్రాంత మొసళ్లు రావనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన అన్నారు. దీనికి బదులుగా ప్రమాదకర ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం, పర్యాటకుల భద్రత దృష్ట్యా టూరింగ్ కంపెనీలకు సూచనలు చేయడం లాంటివి చేస్తామని చెప్పారు. అయితే, దక్షిణ ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో మొసలి ప్రమాదాలు తక్కువే.