ఆస్తుల స్తంభనతో పదివేల మొసళ్ల ఆకలి కేకలు
సాన్ మాన్యుయెల్: హోండురస్ లోని ఓ ఫార్మ్ లో ఉన్న 10వేలకుపైగా మొసళ్లు ఆకలితో అలమటిస్తున్నాయి. హోండురస్ వ్యాపార దిగ్గజం ఆస్తులను అమెరికా స్తంభింపజేయడంతో.. ఆయనకు చెందిన ఆ ఫార్మ్ లోని మొసళ్ల సంరక్షణ చూసుకునేవారు కరువయ్యారు. దీంతో రోజుకొక మొసలి ఆకలితో ప్రాణాలు విడుస్తున్నది. సాన్ మాన్యుయెల్ నగరంలోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొకొడ్రిలస్ కాంటినెంటల్ లో మొసళ్లతోపాటు, ఏడు సింహాలు కూడా ఉన్నాయి. గత రెండువారాలుగా వీటిని ఆహారం అందించేవారు లేకపోవడంతో మొసళ్లు, సింహాలు చనిపోయాయని, మొత్తం 40కిపైగా జంతువులు మృత్యువాత పడ్డాయని ఈ ఫార్మ్హౌస్ కు వాచ్మేన్ గా ఉంటున్న ఓ వ్యక్తి తెలిపాడు.
మధ్య అమెరికాలోని హోండురస్ దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్త రోసెన్థల్ కుటుంబానికి చెందిన ఫార్మ్హౌస్ ఇది. బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్, పర్యాటకం, స్టాక్ ఎక్స్చేంజ్, వ్యవసాయం వంటి రంగాల్లో రోసెన్థల్ కుటుంబం భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే ఇటీవల మనీ లాండరింగ్, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నదంటూ ఈ కుటుంబ ఆస్తులను అమెరికా స్తంభించింది. అమెరికాలో వ్యాపారాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. దాంతో రోసెన్థల్ నేతృత్వంలోని బాంకో కాంటినెంటల్ దారుణంగా దెబ్బతిన్నది. దాని అధిపతి యాంకెల్ రోసెన్థల్ అరెస్టు అయ్యారు. ఈ పరిణామంతో రోసెన్థల్ కుటుంబం ఆధ్వర్యంలోని కొకొడ్రిలస్ కాంటినెంటల్ ఫార్మ్హౌస్ పై తీవ్ర ప్రభావం పండింది. దీని గురించి రోసెన్థల్ కుటుంబం పట్టించుకోవడం మానివేయడం, జంతువులకు ఆహారం కోసం నిధులు లేకపోవడంతో ఇక్కడున్న మొసళ్లు, సింహాలు, ఇతర జంతువులు ఆకలితో అలమటించే చనిపోయేదశకు చేరుకుంటున్నాయి.