Honduras
-
హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమరా
తెగూసిగల్పా(హోండూరస్): సెంట్రల్ అమెరికా దేశమైన హోండూరస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార నేషనల్ పార్టీ ఓటమిని అంగీకరించింది. ప్రతిపక్ష లిబర్టీ అండ్ రీఫౌండేషన్ పార్టీని విజయం వరించింది. నూతన అధ్యక్షురాలిగా ప్రతిపక్ష అభ్యర్థి షియోమరా క్యాస్ట్రో ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. హోండూరస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. మంగళవారం వరకూ 52 శాతం ఓట్లే లెక్కించారు. ఇందులో షియోమరా 53 శాతం ఓట్లు సాధించగా, అధికార పార్టీ అభ్యర్థి నాజ్రీ అస్ఫురాకు 34 శాతం ఓట్లే వచ్చాయి. అధికార పార్టీ తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేసింది. -
Tokyo Olympics: జాతి వివక్ష కామెంట్లు.. గ్రౌండ్ వీడిన ప్లేయర్స్
టోక్యో ఒలింపిక్స్ ముగింట ‘జాతి’ వివక్ష వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు ఆటగాడు జోర్డాన్ టోరునారిను ఉద్దేశించి ప్రత్యర్థి ఆటగాళ్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ అమెరికా జట్టు హోండురస్‌తో శనివారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. జపాన్ వాకయామా స్టేడియంలో ఇరు జట్లు తలపడగా.. ఆట మధ్యలో జోర్డాన్‌ను ఉద్దేశించి హోండురస్ ఆటగాళ్లు వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని జర్మన్ ఫుట్‌బాల్ అసోషియేషన్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆటగాళ్లను విమర్శించినప్పుడు ఆటను కొనసాగించడం కరెక్ట్ కాదని, అందుకే మైదానం వీడినట్లు హెడ్‌కోచ్ స్టెఫాన్ కుంట్జ్ ఒక ప్రకటనలో చేసిన పనిని సమర్థించుకున్నారు. ℹ️ The game has ended 5 minutes early with the score at 1-1. The Germany players left the pitch after Jordan Torunarigha was racially abused.#WirfuerD #Tokyo2020 pic.twitter.com/D85Q63Ynr9 — Germany (@DFB_Team_EN) July 17, 2021 ఆట ముగియడానికి ఐదు నిమిషాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అప్పటికే స్కోర్ 1-1తో సమంగా ఉంది. అయితే గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య చిన్నగొడవ వల్లే అలా జరిగిందని హోండరస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటనను పలు దేశాల ఫుట్‌బాల్ ఫెడరేషన్లు ఖండిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కమిటీ ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే నైజీరియా సంతతికి చెందిన టోరునారిగా ఇలాంటి వివక్షకు గురికావడం ఇదే తొలిసారి కాదు. కిందటి ఏడాది ఓ మ్యాచ్ సందర్భంగా చాకె ఫ్యాన్స్ ‘మంకీ’ నినాదాలతో గ్రౌండ్‌ను హోరెత్తించారు. -
హొండురస్ జైల్లో 18 మంది ఖైదీల మృతి
టెగుసిగల్ప: సెంట్రల్ అమెరికాలోని హొండురస్ దేశ జైల్లో ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 18 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. ఆ దేశంలోని ఉత్తరభాగంలో నగరమైన టెలాలోని జైల్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో 17 మంది జైల్లోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఖైదీల మధ్య గొడవ ఎందుకు జరిగిందో తమకు తెలియరాలేదని చెప్పారు. ఇటీవల ఇదే జైల్లో అయిదు మందిని మరో ఖైదీ కాల్చి చంపడంతో దేశంలోని జైళ్లను అన్నింటినీ ఆర్మీ అదుపులోకి తీసుకోవాలంటూ ఆ దేశాధ్యక్షుడు జువాన్ ఓర్లాండో హెర్నాండెజ్ ఆదేశాలు జారీ చేశారు. జైలు ఆర్మీ అదుపులోకి రాలేదని జైలు అధికారి డిగ్నా చెప్పారు. -
సముద్రంలో పడవ బోల్తా.. 26 మంది మృతి
హోండురస్ : సముద్రంలో పీతల వేటకు వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడిన ఘటనలో 26 మృతి చెందారు. ఈ ఘటన కరీబియన్ తీరంలోని హోండురస్ దేశంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి 47 మంది సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సముద్ర పీతల వేటపై అక్కడి ప్రభుత్వం సీజనల్ బ్యాన్ ఎత్తివేయడంతో జాలర్లు వేటకు బయలుదేరారు. 70 టన్నుల బరువుగల పెద్ద పడవలో వారు పీతల వేటకు తీరజలాల్లో ప్రవేశించారు. అయితే ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. పడవ కెప్టెన్ ప్రమాదపు సిగ్నల్ పంపినప్పటికీ.. కొద్ది సేపటికే అతను చనిపోయాడు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఘటనపై భద్రతా దళాల అధికార ప్రతినిధి జోస్ మెజా మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అక్కడికి దగ్గర్లోని ప్యూర్టో లెంపిరా ప్రాంతానికి చేర్చామని తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డవారిని అక్కడికే తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదం జరిగేందుకు ముందే అదే ప్రదేశంలో మరో బోటు మునిగిపోయిందని తెలిపారు. అయితే ఆ ఘటనలో ఎవరు చనిపోలేదని.. పడవలోని 40 సురక్షితంగా తీరానికి చేర్చామని వెల్లడించారు. -
నకముర హ్యాట్రిక్
గువాహటి: ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో జపాన్‌కు ఘనమైన ఆరంభం లభించింది. స్ట్రయికర్ కీటో నకముర హ్యాట్రిక్ గోల్స్ (22, 30, 43వ నిమిషాల్లో)తో చెలరేగడంతో ఆదివారం గ్రూప్ ‘ఇ’ విభాగంలో హోండురస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6–1తో విజయం సాధించింది. జపాన్ అటాకింగ్ గేమ్‌ను ఎదుర్కోవడంలో హోండురస్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభం నుంచే చెలరేగిన జపాన్ ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులకు దిగడంతో స్వల్ప వ్యవధిలోనే గోల్స్ నమోదయ్యాయి. కుబో (45వ ని.), మియాషిరో (51వ ని.), సుజుకీ (90వ ని.) తలా ఓ గోల్ అందించారు. హోండురస్ నుంచి పలాకియోస్(36) ఏకైక గోల్చేశాడు. గ్రూప్ ‘ఇ’ ఇతర మ్యా చ్ల్లో ఫ్రాన్స్ 7–1 తేడాతో న్యూ కాలెడోనియాను.. గ్రూప్ ‘ఎఫ్’లో ఇంగ్లండ్ 4–0తో చిలీని ఓడించగా ఇరాక్, మెక్సికో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. -
ఆస్తుల స్తంభనతో పదివేల మొసళ్ల ఆకలి కేకలు
సాన్ మాన్యుయెల్: హోండురస్ లోని ఓ ఫార్మ్ లో ఉన్న 10వేలకుపైగా మొసళ్లు ఆకలితో అలమటిస్తున్నాయి. హోండురస్ వ్యాపార దిగ్గజం ఆస్తులను అమెరికా స్తంభింపజేయడంతో.. ఆయనకు చెందిన ఆ ఫార్మ్ లోని మొసళ్ల సంరక్షణ చూసుకునేవారు కరువయ్యారు. దీంతో రోజుకొక మొసలి ఆకలితో ప్రాణాలు విడుస్తున్నది. సాన్ మాన్యుయెల్ నగరంలోని 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొకొడ్రిలస్ కాంటినెంటల్ లో మొసళ్లతోపాటు, ఏడు సింహాలు కూడా ఉన్నాయి. గత రెండువారాలుగా వీటిని ఆహారం అందించేవారు లేకపోవడంతో మొసళ్లు, సింహాలు చనిపోయాయని, మొత్తం 40కిపైగా జంతువులు మృత్యువాత పడ్డాయని ఈ ఫార్మ్‌హౌస్ కు వాచ్‌మేన్ గా ఉంటున్న ఓ వ్యక్తి తెలిపాడు. మధ్య అమెరికాలోని హోండురస్ దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్త రోసెన్థల్ కుటుంబానికి చెందిన ఫార్మ్‌హౌస్ ఇది. బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్, పర్యాటకం, స్టాక్ ఎక్స్చేంజ్, వ్యవసాయం వంటి రంగాల్లో రోసెన్థల్ కుటుంబం భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే ఇటీవల మనీ లాండరింగ్, డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నదంటూ ఈ కుటుంబ ఆస్తులను అమెరికా స్తంభించింది. అమెరికాలో వ్యాపారాలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది. దాంతో రోసెన్థల్ నేతృత్వంలోని బాంకో కాంటినెంటల్ దారుణంగా దెబ్బతిన్నది. దాని అధిపతి యాంకెల్ రోసెన్థల్ అరెస్టు అయ్యారు. ఈ పరిణామంతో రోసెన్థల్ కుటుంబం ఆధ్వర్యంలోని కొకొడ్రిలస్ కాంటినెంటల్ ఫార్మ్‌హౌస్ పై తీవ్ర ప్రభావం పండింది. దీని గురించి రోసెన్థల్ కుటుంబం పట్టించుకోవడం మానివేయడం, జంతువులకు ఆహారం కోసం నిధులు లేకపోవడంతో ఇక్కడున్న మొసళ్లు, సింహాలు, ఇతర జంతువులు ఆకలితో అలమటించే చనిపోయేదశకు చేరుకుంటున్నాయి.