
మనుషుల్లో ఎవరినైనా మీ వయసెంతా అని అడిగితే ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే మనుషులు మాట్లాడ గలరు. కాని సింహాలకి వయసునెలా లెక్కపెడతారు? వాటికి మనలాగా మాటలూ రావు... బర్త్ సర్టిఫికేట్‌లు కూడా ఉండవు. మరి సినిమాల్లో, జియోగ్రఫీ ఛానళ్లలో ఎనిమిదేళ్ళ మగ సింహం... ఆరేళ్ళ ఆడ సింహం...అని అంత నిక్కచ్చిగా ఎలా చెబుతారు. ఎలాగంటే సింహాల వయస్సును అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పలు శారీరక లక్షణాలను పరిశీలిస్తారు.
ఇవి సింహం వయస్సును నిర్ధారించడంలో సహాయపడతాయి. వాటిలో ప్రధానమైనది దాని ముక్కు రంగు. సింహపు ముక్కు రంగు వయస్సుతోపాటు మారుతుంది. చిన్నపిల్లలకు గులాబీ ముక్కు ఉంటుంది. మూడేళ్ల వయస్సు నుంచి ముక్కుపై చిన్న నలుపు మచ్చలు కనిపించటం ప్రారంభమవుతాయి. ఈ మచ్చలు వృద్ధి చెందుతూ సింహానికి ఎనిమిదేళ్ల వయస్సు వచ్చేనాటికి ముక్కు పూర్తిగా నలుపు రంగులోకి మారుతుంది. అంతే కాకుండా సింహాల దంతాల రంగు, ముఖంపై ముడతలు, శరీర ఆకృతి, ఇతర లక్షణాలను పరిగణలోకి తీసుకుని వయసును లెక్కిస్తారు. బోనస్‌గా ఇంకో విషయం... సింహాల జీవితకాలం అడవులలో 8-12 సంవత్సరాలు, జూలో 18-25 సంవత్సరాలు. ఇప్పటివరకు అత్యధికంగా 25 సంవత్సరాలు బ్రతికిన సింహం పేరు ’జెండా’.
వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు...
‘వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు’ అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. పూర్వకాలం పుణ్యం కోసం దేశంలోని ఎక్కడెక్కడో ఉన్న తీర్థక్షేత్రాలను అన్వేషించి అక్కడికి వెళ్లి తీర్థస్నానం చేసి వస్తూ ఉండేవారు. అలాంటి రోజులలో ఆవిర్భవించిన జాతీయం ఇది. ఓ వ్యక్తి ఒక తీర్థక్షేత్ర మహిమను గురించి విన్నాడట. ఆ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నంత లోనే తన ఎదురుగా ఉన్నది తాను విన్న తీర్థమేనని తెలుసుకొని ఎంతో ఆనందించాడట. ఏ మాత్రం కష్టపడకుండా ఇలా తమకు కావల్సినవి తమ సమీపంలోనే ఉన్నాయని తెలుసుకొన్నప్పుడు లేదా తాము వెతుకున్నవారు తమకు ఎదురైనప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. వెతకపోయిన తీర్థం ఎదురైనట్టు నీకోసం బయలు దేరుతుంటే నీవే ఎదురొచ్చావు సంతోషం’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.