ప్రాణాలతో బయటపడ్డ ఎనిమిదేళ్ల బాలుడు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు.
పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు.
ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది.
నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు.
ప్రశంసల వర్షం..
జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment