Wildlife area
-
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్‌లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్‌లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘పులి’ దారికి అడ్డురాం!
► వన్యప్రాణి ప్రాంతంలో రూ.444 కోట్లతో ఎకో బ్రిడ్జీలు నిర్మిస్తాం ► ప్రాణహిత కాల్వలపై జాతీయ వన్యప్రాణి బోర్డుకు అధికారుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత ప్రాజెక్టు పనుల్లో భాగంగా వన్యప్రాణి ప్రాంతంలో పులుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కవ్వాల్ వన్యప్రాణి అటవీ ప్రాంతంలో పులులు సంచరించే మార్గాలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా ఎకో–బ్రిడ్జీలు నిర్మి స్తామని ప్రతిపాదించింది. ఇందుకు ఏకంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రూ.444 కోట్లు వెచ్చిం చేందుకు సిద్ధంగా ఉన్నామని జాతీయ వన్యప్రాణి బోర్డుకు తెలిపింది. ప్రాణహిత ప్రాజెక్టుకు మొత్తంగా రూ.6,465 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. 8,709.5 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అంచనా వేయగా.. అందులో రిజర్వ్ అటవీ భూమి 2,840.01 ఎకరాల మేర ఉంది. ఆ అటవీ భూమిలో 1,155 ఎకరాలు (622 హెక్టార్లు) టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది. దీంతో పర్యావరణ అటవీ అనుమతులతో పాటు వన్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసయ్యాయి. శని వారం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, వన్యప్రాణి బోర్డు చైర్మన్ ముందు రాష్ట్ర అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా పులులు, చిరుతలు సంచారం చేసే టైగర్ రిజర్వ్‌లో అన్ని రకాల సంరక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.444.94 కోట్లతో ఎకో బ్రిడ్జీలు నిర్మిస్తామని, వాటిపై ఎలాంటి కాంక్రీటు నిర్మాణం కనిపించకుండా చెట్లు, పూల మొక్కలు పెంచుతామన్నారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపాదనలను విన్న బోర్డు చైర్మన్... ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను వచ్చే నెలకు వాయిదా వేశారు.