మొసళ్లను సంహరించాలంటున్న ఆస్ట్రేలియన్లు
మెల్‌బోర్న్: దక్షిణ ఆస్ట్రేలియాలో నానాటికీ పెరుగుతోన్న మొసళ్ల సంఖ్యపై ఆ దేశ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన మూడు దశాబ్దాలలో మూడింతలు అయిన మొసళ్లు ప్రమాదకరంగా ఉన్నాయని, మానవుల మరణానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మొసళ్ల ఏరివేతకు సమయం ఆసన్నమైందని, ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్‌ను కోరారు. అయితే, దీనిపై ఆ సంస్థ స్థానిక మేనేజర్ ల్యూక్ బెంట్లే సమయోచితంగా స్పందించారు. మొసళ్ల ఏరివేత సమీప భవిష్యత్‌లో సాధ్యమయ్యేది కాదని ప్రజలు ఆందోళనలు విరమించుకోవాలని కోరారు.
ప్రజలు చేపలు పట్టే, సేదదీరే ప్రాంతాల్లో దూకుడుగా ప్రవర్తించే మొసళ్లను ఇన్నాళ్లుగా కాల్చివేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని బెంట్లే అన్నారు. ఒక్కసారిగా మొసళ్ల ఏరివేత అసాధ్యమని, ఒకవేళ ఆ ప్రాంతంలోని మొసళ్లను మట్టుబెట్టినా.. అక్కడికి వేరే ప్రాంత మొసళ్లు రావనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన అన్నారు. దీనికి బదులుగా ప్రమాదకర ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం, పర్యాటకుల భద్రత దృష్ట్యా టూరింగ్ కంపెనీలకు సూచనలు చేయడం లాంటివి చేస్తామని చెప్పారు. అయితే, దక్షిణ ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో మొసలి ప్రమాదాలు తక్కువే.