Cull
-
అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభణ
గువహటి: దేశంలోఒకవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండగానే ప్రాణాంతక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) అసోంను వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యాధి విజృంభణను అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం బుధవారం (నిన్న) ఆదేశించారు. అంతేకాదు వాటి యజమానులకు తగిన విధంగా పరిహారం చెల్లించాలని అధికారులను కోరారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరాను నిలిపివేశారు. పశుసంవర్ధక, పశువైద్య శాఖ సీనియర్ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఇప్పటివరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిపుణుల అభిప్రాయం మేరకు బాధిత జిల్లాల్లో వరాహాలను వధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవాలకు ముందే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగు త్వరితగతిన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పశుసంవర్ధక, పశువైద్య విభాగాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఫాంలలో సర్వే నిర్వహించాలని, ఆరోగ్యకరమైన జంతువులకు ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో14 జిల్లాల్లోని 30 బాధిత కేంద్రాల్లో కిలోమీటర్ పరిధిలో వరాహాలను సంహరించేందుకు నిర్ణయించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. అలాగే సంబంధిత పరిహారాన్నిఆయా యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత నిధిని కేంద్రం విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా 2019 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో వీటి సంఖ్య 21 లక్షలుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య సుమారు 30 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ వ్యాధి వ్యాపించింది. 2019 ఏప్రిల్‌లో చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో (అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు) ఏఎస్ఎఫ్ ను గుర్తించగా, 1921లో కెన్యా, ఇథియోపియాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉనికి తొలిసారి బైట పడింది. -
కంగారూలను చంపేస్తున్నారు!
మెల్బోర్న్: ఆస్ట్రేలియా దేశంలో సందర్శనీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ, వాటితో పాటు ఒక్కటి చూడకపోతే ఆ టూర్లో ఏదో వెలితిగా ఫీలయ్యే వారు చాలా మంది ఉన్నారు. ఆ ఒక్కటే 'కంగారు'. ఆస్ట్రేలియా ఖండంలో మాత్రమే కనిపించే ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి ఆ దేశ ప్రభుత్వం పూనుకుంది. ఇంత అందంగా కనిపించి.. ఒక్క ఉదుటున కొన్ని మీటర్ల దూరం దూకగల ఈ ప్రాణుల సంఖ్య అక్కడి వాతావరణానికి హాని కలుగజేస్తోందట. అందుకే దేశరాజధాని పరిధిలోని నేషనల్ పార్కుల్లో ఉండే 1,991కంగారూలను చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటా భారీగా పెరుగుతున్న కంగారుల సంఖ్య వల్ల ఆస్ట్రేలియాలోని వృక్ష సంపద బాగా దెబ్బతింటోంది. కొన్ని ప్రదేశాల్లో అయితే అసలు చెట్లే కనిపించకుండా పోతుండటంతో అక్కడి ప్రభుత్వం గత రెండేళ్లుగా నష్టనివారణా చర్యల కింద కంగరూలను చంపేస్తోంది. అయితే ప్రతిసారీ ఈ జంతువులను చంపకుండా గర్భం దాల్చకుండా ఉండే పద్దతులపై పరిశోధనలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో మొత్తం 4000 కంగారూలను ప్రభుత్వం చంపించింది. -
మొసళ్లను సంహరించాలంటున్న ఆస్ట్రేలియన్లు
మెల్బోర్న్: దక్షిణ ఆస్ట్రేలియాలో నానాటికీ పెరుగుతోన్న మొసళ్ల సంఖ్యపై ఆ దేశ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడచిన మూడు దశాబ్దాలలో మూడింతలు అయిన మొసళ్లు ప్రమాదకరంగా ఉన్నాయని, మానవుల మరణానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో మొసళ్ల ఏరివేతకు సమయం ఆసన్నమైందని, ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ పార్క్స్ అండ్ వైల్డ్‌లైఫ్‌ను కోరారు. అయితే, దీనిపై ఆ సంస్థ స్థానిక మేనేజర్ ల్యూక్ బెంట్లే సమయోచితంగా స్పందించారు. మొసళ్ల ఏరివేత సమీప భవిష్యత్‌లో సాధ్యమయ్యేది కాదని ప్రజలు ఆందోళనలు విరమించుకోవాలని కోరారు. ప్రజలు చేపలు పట్టే, సేదదీరే ప్రాంతాల్లో దూకుడుగా ప్రవర్తించే మొసళ్లను ఇన్నాళ్లుగా కాల్చివేస్తూ వస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని అవలంబిస్తామని బెంట్లే అన్నారు. ఒక్కసారిగా మొసళ్ల ఏరివేత అసాధ్యమని, ఒకవేళ ఆ ప్రాంతంలోని మొసళ్లను మట్టుబెట్టినా.. అక్కడికి వేరే ప్రాంత మొసళ్లు రావనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని ఆయన అన్నారు. దీనికి బదులుగా ప్రమాదకర ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడం, పర్యాటకుల భద్రత దృష్ట్యా టూరింగ్ కంపెనీలకు సూచనలు చేయడం లాంటివి చేస్తామని చెప్పారు. అయితే, దక్షిణ ఆస్ట్రేలియాలోని ఉత్తర ప్రాంతంలో మొసలి ప్రమాదాలు తక్కువే.