గువహటి: దేశంలోఒకవైపు కరోనా ఉధృతి కొనసాగుతుండగానే ప్రాణాంతక ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్ఎఫ్) అసోంను వణికిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వ్యాధి విజృంభణను అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల పందులను చంపేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం బుధవారం (నిన్న) ఆదేశించారు. అంతేకాదు వాటి యజమానులకు తగిన విధంగా పరిహారం చెల్లించాలని అధికారులను కోరారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరాను నిలిపివేశారు.
పశుసంవర్ధక, పశువైద్య శాఖ సీనియర్ సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ఇప్పటివరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిపుణుల అభిప్రాయం మేరకు బాధిత జిల్లాల్లో వరాహాలను వధించాలనే నిర్ణయం తీసుకున్నారు. దసరా ఉత్సవాలకు ముందే ఈ పని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగు త్వరితగతిన శానిటైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పశుసంవర్ధక, పశువైద్య విభాగాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఫాంలలో సర్వే నిర్వహించాలని, ఆరోగ్యకరమైన జంతువులకు ఈ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్తలు వహించాలని అధికారులు సీఎం అదేశించారు.
ప్రభుత్వ ఆదేశాలతో14 జిల్లాల్లోని 30 బాధిత కేంద్రాల్లో కిలోమీటర్ పరిధిలో వరాహాలను సంహరించేందుకు నిర్ణయించామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. అలాగే సంబంధిత పరిహారాన్నిఆయా యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మొదటి విడత నిధిని కేంద్రం విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కాగా 2019 జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో వీటి సంఖ్య 21 లక్షలుగా ఉంది. ఇటీవలి కాలంలో ఈ సంఖ్య సుమారు 30 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ వ్యాధి వ్యాపించింది. 2019 ఏప్రిల్‌లో చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్‌లోని ఒక గ్రామంలో (అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు) ఏఎస్ఎఫ్ ను గుర్తించగా, 1921లో కెన్యా, ఇథియోపియాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉనికి తొలిసారి బైట పడింది.
Comments
Please login to add a commentAdd a comment