రిజర్వాయర్‌లో నీటిపై తేలియాడుతున్న మొసలి
అటవీ శాఖాధికారులు ఇటీవల జంతువుల గణన నిర్వహించారు. ప్రతీ నాలుగేళ్లకోసారి పులుల సర్వే నిర్వహిస్తున్నారు. కానీ అభయారణ్యంలో ఉన్న రిజర్వాయర్‌లోని మొసళ్లను మాత్రం లెక్కించడంలేదు. ప్రస్తుతం ఎన్ని వేలు ఉన్నాయో కూడా తెలియదు. తరచుగా నీటిపై తేలియాడుతూ, మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యంలోని రిజర్వాయర్‌లో 1984 సంవత్సరంలో మగ్గర్ జాతికి చెందిన 22 ఆడ, 11 మగ మొసళ్లను(మొత్తం 33) అటవీ శాఖాధికారులు వదిలారు. అప్పుడవి నాలుగు మీటర్ల పొడవు, 200 కేజీల బరువు ఉన్నాయి. మగ్గర్ జాతికి చెందిన మొసళ్లు చేపలు, నత్తలు, కప్పలు, వివిధ మలిన ఆహారం తీసుకుంటాయి. ప్రతీ సంవత్సరం ఒక్కో మొసలి 10 నుంచి 40 గుడ్లు పెడుతుంది. మే, జూన్ నెలల్లోనే గుడ్లు పెట్టి, 60 నుంచి 90 రోజుల వరకు పొదిగి సంతానోత్పత్తి చేస్తాయి.
కిన్నెరసాని అనువైనది
మొసళ్లు దేశంలో అంతరించిపోతున్నాయని మగ్గర్ జాతికి చెందిన సముద్రపు మొసళ్లను పాల్వంచలోని కిన్నెరసానితోపాటు మంజీరాలో వన్యప్రాణి అభయారణ్య సంరక్షణ అధికారులు వదిలారు. కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగుల లోతుతో నీటినిల్వ సామర్థ్యం కలిగి ఉంది. జలచరాలు ఉండేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రిజర్వాయర్‌లో ద్వీపాలు ఉండటం, రాళ్లు, చెట్లతో అనువుగా ఉండటమే కాకుండా బురద ప్రాంతాలు, పొదళ్లు ఉన్నాయి. మొసళ్లకు ఆహారం కూడా సమృద్ధిగా దొరికేందుకు వీలుగా ఉంది. దీంతో 1984లో మొసళ్లను ఈ రిజర్వాయర్‌లో వదిలారు. ఉష్ణోగ్రత సైతం వేసవిలో కనిష్టం 15 డిగ్రీల నుంచి గరిష్టం 45 డిగ్రీల వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 760 మి.మీల నుంచి గరిష్ట వర్షపాతం 1130 మి.మీల వరకు ఉంటుంది. దీంతో మొసళ్లు పెరగడానికి కిన్నెరసాని రిజర్వాయర్‌ను అనువైనదిగా గుర్తించారు.
లెక్కించేదిలా...
జంతువుల గణన మాదిరిగానే అధికారులు జలచరాలను లెక్కించకపోవడంతో కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఎన్ని మొసళ్లు ఉన్నాయి, ఎన్ని బయటకు వెళ్లాయో అంతుచిక్కడంలేదు. మొసళ్ల గణనను జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రాత్రివేళల్లో అత్యాధునిక బైనాక్యులర్లు, నీటి కెమేరాలను వినియోగించి చేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో లెక్కిస్తారు. మొసళ్లు నడిచే మార్గంలో వాటి అడుగులు, గుర్తులు, గుళికలు, గుడ్డు కవచాలు తదితర వాటి ఆధారంగా గణన చేస్తారు.
వేసవిలోనే బయటకు వస్తాయి..
20 సంవత్సరాల క్రితం డెహ్రాడూన్ నుంచి బీఎన్.చౌదరి అనే అధికారి రిజర్వాయర్‌లోని మొసళ్ల సంఖ్యను లెక్కించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అనంతరం వీటిని లెక్కించే చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాటి సంఖ్య ఎంత అనేది తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల పాలేరు నుంచి కూడా మూడు మొసళ్లను తీసుకువచ్చి కిన్నెరసానిలో వదిలారు. గతంలోనూ ఇలా మొసళ్లను బయటి ప్రాంతం నుంచి తీసుకువచ్చి వదిలిన సందర్భాలున్నాయి. వేసవిలోనే ఎక్కువగా బయటకు కన్పించేవిధంగా మొసళ్ల సంచారం ఉంటుంది.
ప్రస్తుతం ఎన్ని ఉండొచ్చు?
కిన్నెరసానిలో 1984లో 33 మొసళ్లను వదలగా, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో మొసలి ఏడాదికి 10 నుంచి 40 గుడ్లు పెడుతుండగా, వాటిల్లో కనీసం 20 గుడ్లు అయినా బతికే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ఏడాదికి 440 పిల్లల చొప్పున 34 ఏళ్ల కాలంలో సుమారు 14,960 మొసళ్లు ఈ రిజర్వాయర్‌లో ఆవాసం పొందుతున్నట్లు అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది.
కాల్వల ద్వారా మైదాన ప్రాంతాలకు..
కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న నీరు కాల్వ ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు నిత్యం సరఫరా అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ కాల్వ ద్వారానే మొసళ్లు బయటకు వెళ్లి మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. వాటిని గుర్తించి పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కిన్నెరసాని కాల్వ సమీపంలోని కొత్తగూడెం మున్సిపల్ పంప్‌హౌస్ వద్ద ఓ మడుగులో రెండు మొసళ్లు బయటనే సంచరిస్తున్నాయి. రెండేళ్లుగా అక్కడే గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.
పొంచి ఉన్న ప్రమాదం
కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న మొసళ్ల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్‌లో బోటు షికారు నిర్వహిస్తుండగా, సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో చేపలు పడుతూ ఉంటారు. మొండికట్ట, కిన్నెరసాని, యానంబైలు ప్రాంతాలకు చెందినవారు తెప్పలు వేసుకుని రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో మొసళ్లు కాల్వల ద్వారా సమీప గ్రామాల్లోకి సైతం వెళ్తున్నాయి. అయితే అసలు ఈ మొసళ్ల గణన అనేది ఎవరి పరిధిలోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. రిజర్వాయర్ నిర్వహణ జెన్కోది కాగా రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతమంతా వన్యమృగాల సంరక్షణ శాఖ కిందకు వస్తుంది. దీంతో అసలు మొసళ్ల బాధ్యత ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది.
మాకు సంబంధం లేదు
కిన్నెరసాని రిజర్వాయర్‌లోని జలచరాల గణనతో మాకు సంబంధం లేదు. నీటి వినియోగం, పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. మిగతావి వైల్డ్‌లైఫ్ శాఖే చూసుకుంటుంది.
–ఎస్‌ఎన్ మూర్తి, సీఈ, కేటీపీఎస్(5,6దశలు)
Comments
Please login to add a commentAdd a comment