ప్రత్యేకత చాటుకుంటున్న లంకమల అభయారణ్యం
అరుదైన పక్షుల కిలకిలారావాల సందడి
లంకమల అభయారణ్యం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు ప్రత్యేకత చాటుకోగా.. వివిధ రకాల పక్షులు, జంతువులు.. పలు రకాలైన వృక్షాలు, మొక్కలు, రంగురంగుల పుష్పాలు.. ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగిన వన మూలికలు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. ఇక వానాకాలంలో లంకమల్లేశ్వరుని కోనలో జలపాత హొయలు పర్యాటకులను పరవశింపజేస్తుంది.
సిద్దవటం : అన్నమయ్య జిల్లాలోని లంకమల అభయారణ్యం ఎంతో ప్రత్యేకమైనది.. సుమారు 46,442 .8 హెక్టార్లలో విస్తరించి జీవ వైవిధ్యాన్ని చాటుతోంది. సుమారు 300 పైగా పక్షుజాతులు, వన్య మృగాలకు ఆవాసంగా ఉంది. ఇక పక్షుల జాతుల్లో చాలా అరుదైన పక్షి జాతి నీలి నల్లంచి ఇక్కడి ప్రత్యేకతగా చెప్పక తప్పదు. 1986వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కలివి కోడి కూడా లంకమల అభయారణ్యంలో అప్పట్లో కనిపించడం కూడా విశేషంగా చెప్పు కోవచ్చు. కలివి కోడిని పోలిన పక్షిగా రాతికాలేడు, ఎర్రచిలుక కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి.
లంకమల అభయారణ్యంలో అరుదైన పక్షుల్లో బంగారు రొమ్ము ఆకుపిట్ట, ఎర్రగొంతు ఈకపట్ల పిట్ట, నీల ఈక పట్ల పిట్ట, తోక నల్లంచి, పెద్ద ఆకురాయి, గిజిగాడు పిట్ట, చారల గొంతు వడ్రంగి పిట్ట, వర్ణడేగా, అడవి రామదాసు, బుడమాలి గద్ద, జాలిడేగా, నీటి కాకి, తెరభిముక్కు కొంగ, నల్ల గద్ద, తోకపిగిలి పిట్ట, నల్ల తల వంగ పండు, ఎర్రగువ్వ, కుందేలు సాలువ, పచ్చగువ్వ తదితర పక్షి జాతులు లంకమల అభయారణ్యంలో కిలకిలా రావాలతో సందడి చేస్తున్నాయి.
లంకమలలో పెరిగిన వన్యప్రాణులు
లంకమల అభయారణ్యంలో వన్యప్రాణుల సంతతి క్రమంగా పెరుగుతోందని అధికారులు అంటున్నారు. సహజసిద్దంగా ఉండే పచ్చిక మైదానాల్లో తిరుగుతూ అవి ఆకలిని తీర్చుకుంటున్నాయి. అడవుల్లో ఎక్కువ గా వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో అటవీ అధికారులు కెమెరాలను కూడా అమర్చారు. పలు కెమెరాల్లో అడవి జంతువులు కణితిలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, పొడదుప్పిల చిత్రాలు నిక్షిప్తంగా ఉన్నాయి.
ఒకప్పుడు తక్కువగా ఉండే చిరుత పులుల సంఖ్య ఇప్పుడు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో నీరు లభించక జింకలు, దుప్పులు, ఎలుగు బంట్లు, చిరుత పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. అడవి జంతువుల సంచారంలో గ్రామీణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేవారు. వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు అడవిలోనే పలు ప్రాంతాలలో సాసర్ ఫీట్‌లు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.
అరుదైన వన మూలికలు
లంకమల అభయారణ్యంలో పక్షులు, వన్య మృగాలతో పాటు, వన మూలికలకు ప్రసిద్ధి గాంచింది. నన్నారి షరబత్‌కు ఉపయోగించే సుగంది వేర్లు, సార పప్పు, ఉసిరి, నేరేడు, ఏనుగు కుందేలు చెట్టు, అతిపత్తి చెట్టు, మగలింగచెట్టు, ఇప్ప చెట్టు ఇలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అడవిలో ఎన్నో రకాలు ఉన్నాయి.
అంతే గాకుండా పాలగడ్డలు, మగసిరి గడ్డలు, పాము కాటు విరుగుడుకు వాడే తెల్లీశ్వరి, నల్లీశ్వరి, నాగముష్టి, విషనాభి చెట్టు, ప్రపంచంలో అత్యంత విలువైన ఎర్రచందనం , భూచక్రగడ్డ తోపాటు జిగురు వంటివి లంకమల అభయారణ్యంలో లభించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
కపర్థీశ్వరుని కోన, శ్రీ నిత్యపూజ స్వామి కోన, శ్రీ లంకమలేశ్వర స్వామి ఆలయం, కొండ గోపాలస్వామి ఆలయాలతోపాటు నీటి గుండాలు, గలగలా పారే సెలయేర్లు వంటివి కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment