తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం | Clashes Between Two TDP Youth Groups In Annamaya District, More Details Inside | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల స్వైర విహారం

Published Tue, Dec 31 2024 5:36 AM | Last Updated on Tue, Dec 31 2024 9:10 AM

TDP youth groups Clashes between in Annamaya District

బాషాయూత్, కొత్తపేట యూత్‌ వర్గీయుల మధ్య ఘర్షణ

కిడ్నాప్‌లు.. కత్తులతో దాడులు.. టాటూ దుకాణానికి నిప్పు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత

రాయచోటి: తెలుగు తమ్ముళ్లలోని రెండు యువజన గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది.  కత్తులతో వీరంగం, హాకీ స్టిక్స్‌తో దాడులు.. కిడ్నాప్‌లు.. టాటో షాపుకు నిప్పుపెట్టేందుకు దారితీసింది. దీంతో అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలివీ.. రాయచోటిలో గత కొద్దిరోజులుగా టీడీపీకి చెందిన పట్టణస్థాయి నాయకులు కొందరు వర్గాలుగా ఏర్పడి కత్తులు, రాడ్లు, కట్టెలతో దాడులు, ప్రతి­దాడులకు తెగబడుతున్నారు. దీంతో పట్టణంలో ఎప్పుడేం  జరుగుతుందో అన్న భయం ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం తెలుగు తమ్ముళ్లకు చెందిన బాషా వర్గం, కొత్తపేట తెలుగు యువత వర్గీయుల మధ్య దాడులు కొనసాగాయి. ఈ దాడుల్లో బాషా వర్గీయులు కొత్తపేట వర్గీయులకు చెందిన కృష్ణకుమార్‌ (19) అనే యువకుడిని కిడ్నాప్‌ చేసి చితకబాదారు. దీంతో ఆగ్రహించిన కొత్తపేట వర్గం ప్రతిదాడులకు తెగబడింది.

ఈ సమయంలో దాడులు చేసుకోవడం మంచిది కాదని కొత్తపేట వర్గీయులకు మద్దతుగా పాతరాయచోటికి చెందిన అభి వెళ్లడంతో అతని టాటూ దుకాణానికి బాషా వర్గీయులు నిప్పంటించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్థమైంది. ఇదే సమయంలో కొత్తపేట యువకులు బాషా వర్గీయులను వెంబడించే సమయంలో వారిలో ఒకరి తలకు బలమైన గాయమైంది. అలాగే, కొత్తపేట బ్యాచ్‌కు చెందిన విజయ్‌ ఎడమ చేతికి కత్తి గాయాలైనట్లు సమాచారం. 

మరోవైపు.. సోమవారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోడానికి రాయచోటి అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. అక్కడ ఇరువర్గాలు బలప్రదర్శనకు దిగడంతో ఎస్‌ఐ నరసింహారెడ్డి లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. అనంతరం.. ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారంగా ఎస్‌ఐ నరసింహారెడ్డి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గతంలో బాషా వర్గానికి చెందిన యువకులు కత్తులు, రాడ్లతో వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్లపైన దాడి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement