Sanctuary
-
లంకమల.. జీవ వైవిధ్యంతో కళకళ
లంకమల అభయారణ్యం జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఏపుగా పెరిగిన ఎర్రచందనం చెట్లు ప్రత్యేకత చాటుకోగా.. వివిధ రకాల పక్షులు, జంతువులు.. పలు రకాలైన వృక్షాలు, మొక్కలు, రంగురంగుల పుష్పాలు.. ముఖ్యంగా ఔషధ గుణాలు కలిగిన వన మూలికలు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. ఇక వానాకాలంలో లంకమల్లేశ్వరుని కోనలో జలపాత హొయలు పర్యాటకులను పరవశింపజేస్తుంది. సిద్దవటం : అన్నమయ్య జిల్లాలోని లంకమల అభయారణ్యం ఎంతో ప్రత్యేకమైనది.. సుమారు 46,442 .8 హెక్టార్లలో విస్తరించి జీవ వైవిధ్యాన్ని చాటుతోంది. సుమారు 300 పైగా పక్షుజాతులు, వన్య మృగాలకు ఆవాసంగా ఉంది. ఇక పక్షుల జాతుల్లో చాలా అరుదైన పక్షి జాతి నీలి నల్లంచి ఇక్కడి ప్రత్యేకతగా చెప్పక తప్పదు. 1986వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన కలివి కోడి కూడా లంకమల అభయారణ్యంలో అప్పట్లో కనిపించడం కూడా విశేషంగా చెప్పు కోవచ్చు. కలివి కోడిని పోలిన పక్షిగా రాతికాలేడు, ఎర్రచిలుక కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. లంకమల అభయారణ్యంలో అరుదైన పక్షుల్లో బంగారు రొమ్ము ఆకుపిట్ట, ఎర్రగొంతు ఈకపట్ల పిట్ట, నీల ఈక పట్ల పిట్ట, తోక నల్లంచి, పెద్ద ఆకురాయి, గిజిగాడు పిట్ట, చారల గొంతు వడ్రంగి పిట్ట, వర్ణడేగా, అడవి రామదాసు, బుడమాలి గద్ద, జాలిడేగా, నీటి కాకి, తెరభిముక్కు కొంగ, నల్ల గద్ద, తోకపిగిలి పిట్ట, నల్ల తల వంగ పండు, ఎర్రగువ్వ, కుందేలు సాలువ, పచ్చగువ్వ తదితర పక్షి జాతులు లంకమల అభయారణ్యంలో కిలకిలా రావాలతో సందడి చేస్తున్నాయి. లంకమలలో పెరిగిన వన్యప్రాణులు లంకమల అభయారణ్యంలో వన్యప్రాణుల సంతతి క్రమంగా పెరుగుతోందని అధికారులు అంటున్నారు. సహజసిద్దంగా ఉండే పచ్చిక మైదానాల్లో తిరుగుతూ అవి ఆకలిని తీర్చుకుంటున్నాయి. అడవుల్లో ఎక్కువ గా వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో అటవీ అధికారులు కెమెరాలను కూడా అమర్చారు. పలు కెమెరాల్లో అడవి జంతువులు కణితిలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, పొడదుప్పిల చిత్రాలు నిక్షిప్తంగా ఉన్నాయి. ఒకప్పుడు తక్కువగా ఉండే చిరుత పులుల సంఖ్య ఇప్పుడు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాల్లో నీరు లభించక జింకలు, దుప్పులు, ఎలుగు బంట్లు, చిరుత పులులు సమీప గ్రామాల్లోకి వచ్చి దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. అడవి జంతువుల సంచారంలో గ్రామీణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేవారు. వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు అడవిలోనే పలు ప్రాంతాలలో సాసర్ ఫీట్లు, నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.అరుదైన వన మూలికలు లంకమల అభయారణ్యంలో పక్షులు, వన్య మృగాలతో పాటు, వన మూలికలకు ప్రసిద్ధి గాంచింది. నన్నారి షరబత్కు ఉపయోగించే సుగంది వేర్లు, సార పప్పు, ఉసిరి, నేరేడు, ఏనుగు కుందేలు చెట్టు, అతిపత్తి చెట్టు, మగలింగచెట్టు, ఇప్ప చెట్టు ఇలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఇక్కడి అడవిలో ఎన్నో రకాలు ఉన్నాయి. అంతే గాకుండా పాలగడ్డలు, మగసిరి గడ్డలు, పాము కాటు విరుగుడుకు వాడే తెల్లీశ్వరి, నల్లీశ్వరి, నాగముష్టి, విషనాభి చెట్టు, ప్రపంచంలో అత్యంత విలువైన ఎర్రచందనం , భూచక్రగడ్డ తోపాటు జిగురు వంటివి లంకమల అభయారణ్యంలో లభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. కపర్థీశ్వరుని కోన, శ్రీ నిత్యపూజ స్వామి కోన, శ్రీ లంకమలేశ్వర స్వామి ఆలయం, కొండ గోపాలస్వామి ఆలయాలతోపాటు నీటి గుండాలు, గలగలా పారే సెలయేర్లు వంటివి కూడా ఈ అరణ్యంలో ఉన్నాయి. -
‘యునెస్కో’ రూట్లో మంజీరా అభయారణ్యం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా డ్యామ్‌కు, సింగూరు ప్రాజెక్టుకు మధ్య ఉన్న జలాశయం, తొమ్మిది చిన్న ద్వీపాలతో కూడి ఉన్న ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. మొసళ్లు సహా ఎన్నో రకాల జలచరాలు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులున్న ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్యమున్న చిత్తడి నేలగా గుర్తించారు. ఈ క్రమంలో అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునే అర్హతలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. మంజీరా అభయారణ్యాన్ని జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సమాచార క్రోడీకరణతో.. మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు సాధించేందుకు అవసరమైన అర్హతలు, ప్రతిపాదనలను శాస్త్రీయంగా సిద్ధం చేసేందుకు అటవీశాఖ ఈపీటీఆర్ఐ (ఎని్వరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో కలసి అధ్యయనం చేస్తోంది. ఈ అభయారణ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను నేషనల్ వెట్‌ల్యాండ్ బోర్డుకు పంపారు. దాన్ని పరిశీలించిన బోర్డు మరికొన్ని వివరాలు పంపాలని కోరింది. ఈ మేరకు ఈపీటీఆర్ఐ, అటవీశాఖ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాయి. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.వాణిప్రసాద్ సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలసి అభయారణ్యాన్ని సందర్శించారు. మరో రెండు రోజుల్లో ఈపీటీఆర్ఐ ఈ అంశంపై వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదనలుసిద్ధం అవుతున్నాయి మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. ఈ గుర్తింపు కోసం అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తు న్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీనికి అవసరమైన సమాచారాన్ని సేకరించి పంపుతున్నాం. ఎంతో జీవ వైవిధ్యం కలిగిన ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం – సి.శ్రీధర్‌రావు, డీఎఫ్ఓ, సంగారెడ్డి అభయారణ్యం ప్రత్యేకతలివీ.. » సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో సదాశివ, పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో సుమారు 20 చదరపు కిలోమీటర్లలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. » ఈ అభయారణ్యంలో 303 రకాల పక్షులు నివాసం ఉంటున్నట్టు అటవీశాఖ గుర్తించింది. అందులో సుమారు 140 రకాల పక్షులు హిమాలయాలను దాటి ఇక్కడికి వలస వస్తాయి. వేసవి, వర్షాకాలం రెండు సీజన్లలోనూ విదేశీ పక్షులు వలస వచ్చి వెళుతుంటాయి. అందులో పెంటెడ్ స్టార్క్, ఫ్లెమింగో, బార్‌హెడెడ్ గూస్ వంటి పక్షులూ ఉన్నాయి. ళీ మొసళ్లు, ఇతర 14 రకాల ఉభయచరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 57 జాతులకు చెందిన చేపలు, 32 రకాల సీతాకోకచిలుకలకు ఈ ప్రాంతం ఆవాసం. ఈ జలాశయంలో తొమ్మిది చిన్న దీవులు ఉన్నాయి. యునెస్కో గుర్తింపుతో ప్రయోజనాలివీ.. » ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. స్థానికంగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ పర్యాటకులు, పక్షి ప్రేమికులు ఈ ప్రాంతానికి వస్తారు. » నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఇక్కడ స్టడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తుందని అటవీశాఖ వర్గాలు చెప్తున్నాయి. » ఈ ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అలాగే యునెస్కో నుంచి నిధులు వస్తాయి. » వెట్‌ల్యాండ్ అథారిటీ కూడా ఈ ప్రాంత సంరక్షణ కోసం నిధులు కేటాయించనుంది. -
గజరాజులతో గస్తీ
పెద్దదోర్నాల: నల్లమల అడవుల పరిరక్షణకు ఏపీ అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అమూల్యమైన వృక్షసంపద అక్రమ రవాణాను అరికట్టేందుకు.. అరుదైన వన్యప్రాణులను సంరక్షించి వేసవిలో అగ్నికీలల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే బేస్ క్యాంప్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్, యాంటీ పోచింగ్ బృందాలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు అభయారణ్యాల్లో ఇకపై గజరాజులతో గస్తీ చేపట్టాలని అటవీ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రెండు అభయారణ్యాల పరిధిలో..మన రాష్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో 3,727.82 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న అడవిని కేంద్ర ప్రభుత్వం 1983లో అభయారణ్యంగా ప్రకటించింది. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం శిఖరం వరకు రాజీవ్‌గాంధీ అభయారణ్యం.. మార్కాపురం, గిద్దలూరు, ఆత్మకూరు, నంద్యాల డివిజన్ల పరిధిలో గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం విస్తరించి ఉన్నాయి. వీటిలో పులులతోపాటు చిరుత, ఎలుగుబంటి, జింకలు, దుప్పులు, హైనా, నెమళ్లతోపాటు 70 రకాల క్షీరదాలు, సరీసృపాలు, ఎన్నోరకాల వృక్షాలు, ఔషధ మొక్కలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఇవన్నీ మారుమూల లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలను సందర్శించి వాటిని సంరక్షించే బాధ్యత కత్తిమీద సాములా మారింది.మూలమూలల్నీ జల్లెడ పట్టేలా..మారుమూల ప్రాంతాల్లో సైతం వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షించేందుకు వీలుగా అటవీ శాఖ ఉన్నతాధికారులు సుశిక్షితులైన సిబ్బంది నేతృత్వంలో ఏనుగులతో గస్తీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. మారుమూల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించేందుకు తమకు శిక్షణ పొందిన 9 ఏనుగులు అవసరమవుతాయని గుర్తించారు. తమకు అవసరమైన 9 ఏనుగులను ఇవ్వాల్సిందిగా ఏపీ అటవీ శాఖ అధికారులు కర్ణాటక అటవీ శాఖకు లేఖ రాశారు.దీనిపై స్పందించిన కర్ణాటక అటవీ శాఖ అధికారులు శిక్షణ పొందిన ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు ఏనుగులను కట్టడి చేసేందుకు మావటిలను తయారు చేసేందుకు అటవీశాఖ తమ సిబ్బందిని కర్ణాటక రాష్ట్రానికి పంపనుంది. రాష్ట్రానికి చెందిన సిబ్బంది అక్కడికి వెళ్లి గజరాజుల ఆహారపు అలవాట్లు, వాటి కదలికలు, వాటి ఇతర అలవాట్లను క్షుణ్ణంగా పరిశీలించి శిక్షణ పొందనున్నారు.6 ఏనుగులను రాజీవ్‌గాంధీ వన్యప్రాణుల అభయారణ్యానికి, మరో మూడు ఏనుగులను గుండ్లబ్రహ్మేశ్వరం అడవులకు పంపేలా చర్యలు చేపట్టన్నారు. ఏనుగుల్ని తీసుకొస్తే పెద్ద పులులు ఎక్కువగా సంచరించే లోతట్టు ప్రాంతాలైన నెక్కంటి, రేగుమానుపెంట, తూము గుండాలు, ఆలాటం తదితర ప్రాంతాల్లో సైతం ధైర్యంగా పెట్రోలింగ్ చేపట్టవచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఏనుగులతో గస్తీ నిర్వహించేలా చర్యలు అభయారణ్యంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. నడక మార్గంలో సిబ్బంది కొంతమేర వరకు మాత్రమే వెళ్లగలరు. అదే ఏనుగులతో అయితే సుదూర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించవచ్చు. పులులు సంచరించే ప్రదేశాల్లో సైతం భయం లేకుండా పెట్రోలింగ్ నిర్వహించవచ్చు. మనం చేసిన విజ్ఞప్తికి కర్ణాటక అటవీ శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఏనుగుల్ని నల్లమలకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. – విశ్వేశ్వరరావు, ఫారెస్ట్ రేంజి అధికారి, పెద్దదోర్నాల -
అదేపనిగా అసత్యాల ‘ఎత్తిపోతలు’
సాక్షి, అమరావతి: పల్నాడు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోంది. ఆరు దశాబ్దాలకు పైగా ఆశగానే మిగిలిన వరికపూడిశెల ప్రాజెక్టుకు రూట్ క్లియర్ అయ్యింది. సాగు, తాగు నీటి ఎద్దడి తీరుతుందని ప్రజలంతా సంతోషిస్తున్నారు. కానీ, పెత్తందారుల పైత్యాన్ని ప్రదర్శించే ‘ఈనాడు’కు ఇది మింగుడు పడటంలేదు. అందుకే ‘వరికపూడిశెల’పై అసత్యాల ఎత్తిపోతలు మొదలెట్టింది. ఐదేళ్లూ అధికారం అనుభవించి ప్రాజెక్టును కాగితాలకే పరిమితం చేసిన చంద్రబాబును పల్లెత్తి మాట అనలేదు. ప్రజలకు నీటి కష్టం ఉందని చెప్పేందుకూ మనసు రాలేదు. ఇప్పుడు వరికపూడిశెల కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంటే వక్రీకరణల డైవర్షన్ మొదలెట్టింది. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు! వాస్తవానికి ప్రజలను మోసగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఆ మోసాన్ని గొప్పగా చిత్రీకరించడంలో రామోజీరావు పెన్ను తిరిగిన వ్యక్తి. ఈ దొంగల ద్వయం ఎన్నికల ముందు హడావుడి చేసి ఓట్లు ఎత్తిపోసుకోవాలనే కుట్రతోనే ఆనాడు అంటే.. 2019 ఫిబ్రవరి 6న వరికపూడిశెల ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం ఇస్తున్నట్టు నాటకం ఆడారు. అసలు వరికపుడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు రిజర్వ్ ఫారెస్టులో పైప్ లైన్ పనులు చేయాలని అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలీదా? అందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలి కదా! ఇవి లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారన్నది అసలు ప్రశ్న. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి నాయకులకు ఉంటే ఇవన్నీ ఆలోచించేవారు. చంద్రబాబు మాత్రం ఓట్ల కోసమే ప్రజలను దగా చేశారు. గత ఎన్నికల నోటిఫికేషన్‌కు సరిగ్గా నెల ముందు పరిపాలనా ఆమోదం ఇస్తూ టెండర్లు పిలిచినట్టు పెద్ద షో చేశారు. దీని ఆధారంగానే ‘ఈనాడు’ ప్రాజెక్టు అంతా బాబు హయాంలోనే రూపుదిద్దుకున్నట్టు మంగళవారం వక్రభాష్యం పలికింది. వాస్తవానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వరికపూడిశెల ఎత్తిపోతలకు అంకురార్పణ చేశారు. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం పులుల అభయారణ్యంలో ఉండటంతో కేంద్రం అనుమతులు తప్పనిసరి అయ్యాయి. చిత్తశుద్ధి ఎక్కడ బాబు! రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారం అనుభవించిన చంద్రబాబు... ఈ ఎత్తిపోతలకు అత్యంత కీలకమైన వన్యప్రాణి, పర్యావరణ అనుమతులు కూడా సాధించకపోవడం ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఇచ్చి న మాట ప్రకారం పల్నాడు వాసుల వరికపూడిశెల కలను సాకారం చేస్తున్నారు. పలు దఫాలు కేంద్రంతో చర్చించి అటవీ, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి తీసుకునే భూమికి బదులు వేరొక చోట భూమిని సమకూర్చి ప్రాజెక్టుకు ఆటంకం లేకుండా చేశారు. -
పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి
సాక్షి, ఏలూరు: అరుదైన జాతికి చెందని బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల్లో ముఖ్యమైనది. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలోని కొండ గుహల్లో సందడి చేస్తున్నాయి. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టి లోడస్ అరీస్. సాధారణంగా ఇవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు.. లేత పసుపు రంగులో 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, వాటి సందు మధ్య ఉండే తేమ ప్రాంతాలంటే బంగారు బల్లులకు మహా ఇష్టం. 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి ఇవి ఒకేసారి సుమారు 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయ. ఇవి గుడ్లను విచిత్రంగా కిందకి వేలాడే విధంగా పెడతాయి. ఈ గుడ్లను పాములు, క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాతుల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పాపికొండలు అభయారణ్య గోదావరి పరీవాహక రాతి ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీ శాఖ అంచనా వేశారు. బంగారు బల్లుల్లోనూ రెండు జాతులుగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. వాటిలో ఒకటి కాలొడాక్టి లోడస్ అరీస్. ఇవి సాధారణ బల్లుల కంటే పెద్దగా అరుస్తూ వింత శబ్దం చేస్తాయని చెబుతున్నారు. పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల సంచారం ఉంది పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల జాడ ఉంది. రెండేళ్ల క్రితం నేను, విశాఖపట్నానికి చెందిన శాస్త్రవేత్త కలిసి పోలవరం మండలం సిరివాక గ్రామంలోని గోదావరి సమీపంలో గల రాతి ప్రదేశాల్లో అధిక సంఖ్యలో బంగారు బల్లులు పెట్టిన గుడ్లు గుర్తించాం. 250కి పైగా బంగారు బల్లులు ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. – దావీదురాజు నాయుడు, ఇన్చార్జి ఫారెస్ట్ అధికారి, పోలవరం ఫొటోలు తీశా పాపికొండలు అభయారణ్యంలో అరుదైన పక్షులను, జంతువులను ఫొటోలు తీశాను. బంగారు బల్లి కూడా నా కెమెరాకు చిక్కింది. అభయారణ్యం రాతి ప్రాంతాల్లో ఈ బల్లుల సంచారం ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. – కె.బాలాజీ, ఫొటోగ్రాఫర్, రాజమండ్రి చదవండి: పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’ -
బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ పొందాలనుకుంటున్నారా..? చలో పోచారం..
ఎటుచూసినా భవనాలు... రోడ్లు.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాయుకాలుష్యం... ఉరుకుల పరుగుల జీవనం.. ఇదీ నేటి కాంక్రీట్ జంగిల్లా మారిన పట్టణ, నగరవాసుల దయనీయ పరిస్థితి. దీన్నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఎటుచూసినా పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు... అక్కడక్కడా కనిపిస్తూ కనువిందు చేసే వన్యప్రాణులు, స్వచ్ఛమైన పిల్లగాలులు, ప్రకృతి సోయగాల నడుమ సూర్యోదయ, అస్తమయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. చలో నర్సాపూర్, పోచారం. సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ఒడిలో నగరవాసులు కాసేపు సేదతీరేందుకు వీలుగా మెదక్ అటవీ శాఖ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) సంయుక్తంగా ‘కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం’నేచర్ క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నర్సాపూర్ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, జీప్ సఫారీ, ట్రెక్కింగ్ తదితరాలతో రెండు పగళ్లు, ఒక రాత్రి కలిపి మొత్తం 36 గంటలపాటు అడవిలో గడుపుతూ మధుర అనుభూతులను సొంతం చేసుకొనేలా ప్యాకేజీని సిద్ధం చేశాయి. పర్యాటకులు అడవుల్లోని చెట్లు, జంతువుల రకాలు, పర్యావరణ వ్యవస్థలు, స్థానిక ఆహారపు అలవాట్లు, గిరిజనుల సాంస్కృతిక జీవనం, వ్యవసాయ పద్ధతుల వంటి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడాన్ని ఇందులో అంతర్భాగం చేశాయి. స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గిరాకీ కలి్పంచడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నాయి. నేచర్ క్యాంప్ టూర్ ఇలా.. ♦ ఉదయం 6 గంటలకు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు నుంచి ప్రారంభం ♦ ఈ పార్కులో ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్ఫ్లై వాక్, వెట్‌ల్యాండ్ విజిట్ ♦ వాచ్‌టవర్ వద్ద అల్పాహారం. అక్కడే ఈ టూర్‌కు సంబంధించిన ఇంటరాక్షన్ ♦ నర్సాపూర్ పార్క్‌కు ఎదురుగానున్న అటవీప్రాంతం సందర్శన, అక్కడ నుంచి నర్సాపూర్ పట్టణానికి పయనం. ♦ మెదక్ పట్టణానికి ప్రయాణ మార్గమధ్యంలో ఫారెస్ట్, ప్రైవేట్ నర్సరీల విజిట్. మెదక్ చర్చి సందర్శన, ఆ తర్వాత సమీపంలోనే లంచ్ ♦ అక్కడి నుంచి పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి.. ♦ స్థానిక పర్యావరణ వ్యవస్థలపై అవగాహన పెంచుకునేందుకు సిద్ధం చేసిన ఎని్వరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఈఈసీ) విజిట్ ♦ వైల్డ్‌లైఫ్ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్ బిల్డింగ్స్ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ. ♦ ఈఈసీ సెంటర్ వద్ద సమావేశం. అక్కడే స్థానిక వంటకాలు, రుచులతో బార్బిక్యూ డిన్నర్, హోమ్‌స్టే లేదా టెంట్లలో రాత్రి నిద్ర. ♦ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పోచారం లేక్ వద్ద సూర్యోదయ వీక్షణ ♦ అల్పాహారం తర్వాత పోచారం వైల్డ్‌లైఫ్ ♦ శాంక్చురీలో బర్డ్ వాచింగ్, బట్టర్ఫ్లై వాక్ ♦ ఉదయం 11 గంటలకు దంతేపల్లి లేదా మరోచోట గిరిజన గ్రామ సందర్శన ♦ మధ్యాహ్నం దంతేపల్లిలో ‘ఫామ్ లంచ్’ ♦ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ ప్రత్యేకతలివే... హైదరాబాద్‌కు 115 కి.మీ. దూరంలోని పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించింది. ఇది పోచారం లేక్ వెంట విస్తరించి ఉండటం విశేషం. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తుంటాయి. పలు రకాల అరుదైన పక్షులకు సైతం ఇది కేంద్రంగా ఉంది. ఫారెస్ట్ ప్లస్ 2.0 అంటే... కేంద్ర అటవీ, పర్యావరణశాఖల సహకారంతో యూఎస్ఏఐడీ సంస్థ ప్రకృతిసిద్ధ పరిష్కారాల అభివృద్ధి ద్వారా అడవులపై ఆధారపడిన స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు కమ్యూనిటీల పరంగా బలోపేతం కావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి ఫారెస్ట్ ప్లస్ 2.0గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా తిరువనంతపురం (కేరళ), గయ (బిహార్), మెదక్ (తెలంగాణ)లో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నేచర్ క్యాంపులకు శ్రీకారం చుట్టింది. కనీసం 20 మంది.. సొంత వాహనాల్లో వస్తేనే.. పర్యాటకులకు ప్రత్యక్షంగా ప్రకృతిని, వైల్డ్ లైఫ్‌ను అనుభవంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం. ప్రజలకు అడవులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ క్యాంప్‌లకు ప్రాధాన్యతనిచ్చాం. నేచర్ క్యాంప్‌ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. కనీసం 20 మందితో కూడిన పర్యాటక బృందం ఈ క్యాంప్‌కు రావాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లోనే వారు మొత్తం టూర్లో పాల్గొనాల్సి ఉంటుంది. పిల్లలకు (పదేళ్లు పైబడిన వారే) రూ. 1,500, పెద్దలకు రూ. 2 వేలు చొప్పున చార్జీగా ఖరారు చేశాం. ఆహారం, ఎంట్రీ ఫీజు, సఫారీ తదితరాలన్నీ ఈ ప్యాకేజీలో ఉంటాయి. – జి. సాయిలు, రీజినల్ డైరెక్టర్, ఫారెస్ట్–ప్లస్ 2.0 చదవండి: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట -
రోళ్లపాడులో తోడేళ్లు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ‘ఇండియన్ ఊల్ఫ్’గా చెప్పుకునే తోడేళ్ల జనాభా దేశవ్యాప్తంగా మూడు వేల వరకు ఉండొచ్చని అటవీ శాఖ అంచనా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిదిలోని రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోనూ తోడేళ్లు ఒకప్పుడు గణనీయంగానే ఉండేవి. కొన్నేళ్ల క్రితం వీటి ఉనికి ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది. అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో అభయారణ్యంలో ఒక అధికారికి తోడేలు కనిపించగా.. అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తరువాత వాటి ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించగా.. రెండు తోడేళ్ల కుటుంబాలు ఇక్కడి అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తోడేళ్లు సంఘ జీవనానికి పెట్టింది పేరు. ఇవి ప్రత్యేకమైన గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ‘ప్యాక్’ అంటారు. ఒక ప్యాక్‌లో 8 వరకు తోడేళ్లు ఉంటాయి. దేశంలో 10 తోడేళ్ల అభయారణ్యాలు అంతరించిపోతున్న తోడేళ్లను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 10 అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో కైలాదేవి అభయారణ్యం, కుంబాల్ ఘర్ అభయారణ్యం, తోడ్ ఘర్ రోలి అభయారణ్యం, మౌంట్ ఆబు అభయారణ్యం, గుజరాత్‌లోని బ్లాక్ బక్ అభయారణ్యం, కఛ్ బస్టర్డ్ అభయారణ్యం, నారాయణ్ సరోవర్ అభయారణ్యం, శూల్ పాణేశ్వర్ అభయారణ్యం, కర్ణాటకలోని రాణి బెన్నూర్ బ్లాక్ బక్ అభయారణ్యం, మహారాష్ట్రలోని రెహే కురి బ్లాక్ బక్ అభయారణ్యాలలో తోడేళ్లను సంరక్షిస్తున్నారు. బట్టమేక పక్షుల అభయారణ్యంలో.. ఏపీలో తోడేళ్ల సంరక్షణకు ప్రత్యేకించి అభయారణ్యాలు ఏర్పాటు చేయనప్పటికీ బట్టమేక పక్షుల సంరక్షణకు ఏర్పాటు చేసిన రోళ్లపాడు అభయారణ్యంలో కృష్ణజింకలతో కలసి తోడేళ్లు సహవాసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తోడేళ్లు తన సహజ జాతి మాంసాహార జంతువులైన హైనాలు, నక్కల తరహాలో వేరే జంతువులు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తినే జీవులు కావు. ఇవి తమ ఆహారాన్ని స్వయంగా వేటాడి సంపాదించుకుంటాయి. తమకు అందుబాటులో ఉండే కృష్ణ జింకలు, సమీప గ్రామాల్లో ఉండే మేకలు, గొర్రెలను ఇవి వేటాడుతుంటాయి. తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం రోళ్లపాడు బట్టమేక పక్షుల అభయారణ్యంలో తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం. ఒకప్పుడు ఈ అభయారణ్యం పరిధిలో విస్తారంగా కనిపించిన ఇండియన్ ఊల్ఫ్ తదనంతరం అదృశ్యమైంది. అనూహ్యంగా ఇటీవల మాకు తోడేళ్లు కనిపించడం సంతోషదాయకం. రెండు ప్యాక్‌ల తోడేళ్లు రోళ్లపాడులో ఉండవచ్చని అంచనా. – అలాన్ చోంగ్ టెరాన్, డీడీ, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు -
ఆ అడవికి అమ్మలు వీరు
‘ఇది ఒక నోవా పడవ’ అని 3 ఎకరాల స్థలంలో శాంక్చురీ స్థాపిస్తున్నప్పుడు వాళ్లు అనుకున్నారు. కాకుండా అది వృక్షజాలానికి నోవా పడవ. పశ్చిమ కనుమల్లోని రెయిన్ ఫారెస్ట్‌ల క్షీణతవల్ల అంతరించిపోతున్న అరుదైన మొక్కలను చెట్లను కాపాడి దాచి పెట్టడమే ఈ నోవా పడవ లక్ష్యం. ఇవాళ కేరళలోని వేనాడు ప్రాంతంలో ‘గురుకుల బొటానికల్ శాంక్చరీ’ పేరుతో దాదాపు 50 ఎకరాల వరకూ విస్తరించిన ఈ అభయారణ్యం పూర్తిగా స్త్రీల నిర్వహణ, రక్షణలో ఉంది. 27 మంది స్త్రీలు ఇక్కడ పని చేస్తారు. ప్రకృతిని శ్వాసింప చేస్తున్నారు. 1980లలో కేరళలోని వేనాడు ప్రాంతంలోని నది నీళ్లల్లో మొదటిసారిగా కొట్టుకుని వచ్చిన ప్లాస్టిక్ కవర్‌ను చూసి ‘నాగరికత ఇక్కడి దాకా వచ్చేసింది’ అన్నాడతను. అతని పేరు ఓల్ఫ్‌గాంగ్ టియర్‌కాఫ్. జర్మన్ పౌరుడు. బొటానిస్ట్. కేరళలోని నారాయణ గురు బోధనల గురించి విని జర్మనీ వదిలి కేరళ వచ్చేశాడు. 1980లో భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు. 2014లో మరణించాడు. కాని ఈ మధ్య కాలం అంతా అతడు చేసింది స్త్రీలకు ఒక అభయారణ్యం అప్పజెప్పడమే. ఉత్తర వేనాడులోని అలాత్తిల్ అనే గ్రామం దగ్గర 1981లో ఐదు ఎకరాల ‘గురుకుల బొటానికల్ శాంక్చురీ’ పేరుతో అభయారణ్యాన్ని మొదలుపెడుతూ దానిని ‘నోవా పడవ’ అని పిలిచాడతడు. (జలప్రళయానికి ముందు ప్రవక్త నోవా అన్ని జాతుల జంటలను ఒక నావలో చేర్చాడు. దానినే నోవా పడవ అంటారు) అక్కడ పని చేసే స్త్రీలను పిలిచి ‘పశ్చిమ కనుమల్లోని వర్షపాత అడవుల్లో చాలా అరుదైన వృక్షజాతులు నాగరికుల ఆక్రమణ వల్ల అంతరించిపోతున్నాయి. వాటిని మనం ఈ అడవిలో దాచిపెట్టి కాపాడుకోవాలి’ అన్నాడు. అడవిని పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కాపాడతారని అతని నమ్మకం. దాపునే ఉన్న పెరియా అనే ఊరి నుంచి లీలా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ఆ అడవికి మొదటి రక్షకురాలు. ఆ తర్వాత సుప్రభ శేషన్ అనే పర్యావరణ ప్రేమికురాలు చాలా కాలంగా దానికి డైరెక్టర్‌గా పని చేస్తోంది. గత నలభై ఏళ్లుగా స్త్రీలే ఈ అడవిని కాపాడుతూ ప్రస్తుతం 63 ఎకరాల అభయారణ్యం చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీల సంఖ్య 27. ఐసియు వార్డ్ ‘ఇది అభయారణ్యం కాదు. ఒక ఆస్పత్రి అనుకోండి. కొన ఊపిరితో ఉన్న వృక్షజాలాన్ని కాపాడే ఆస్పత్రి’ అంటుంది సుప్రభ శేషన్. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆమె బాల్యంలోనే పర్యావరణ రంగంలో పని చేయాలని నిశ్చయించుకుంది. లండన్‌లో డిగ్రీ చేసిన తర్వాత ఈ అభయారణ్యం గురించి విని మరో ఆలోచన లేకుండా ఇక్కడికొచ్చి 1991 నుంచి పని చేస్తోంది. ‘కలిసి శ్వాసిద్దాం’ అనేది మా నినాదం అంటుందామె. మనుషులు కార్బన్ డై ఆక్సైడ్‌ని విసర్జిస్తారు. చెట్లు అవి పీల్చుకుంటాయి. అవి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మనం పీలుస్తాం. దీనిని ‘కలిసి శ్వాసించడం’ అనాలి. అవి లేకపోతే మనం మనం లేకపోతే అవి లేవు. ఇద్దరం మనగలగాలి ఈ భూమ్మీద అంటుందామె. అడవులంటే ఏవో చెట్లు కాదు... క్రిములు కీటకాలు పక్షులు నీళ్లు జలచరాలు జంతువులు నాచు తేమ... ఇవన్నీ అడవిలో భాగం... అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారితం. టీ ఎస్టేట్ల కోసమో... పొగాకు పంట కోసమో... మరో ఆవాసం కోసమో అడవుల్ని నరుక్కుంటూ పోతే అవన్నీ నశించిపోతాయి... ఆ తర్వాత మనుషులు కూడా’అంటుంది సుప్రభ. పశ్చిమ కనుమల్లోని అంతరించిపోతున్న చిన్న, పెద్ద మొక్కలు, చెట్లు వీటిని సేకరించి ఈ అభయారణ్యానికి తీసుకు వస్తారు. వాటిని మొదట ఐసియు వార్డ్‌లో పెడతారు. అంటే అవి బతికి బట్టకట్టాలన్న మాట. ఆ తర్వాత వాటిని జనరల్ వార్డ్‌లోకి తీసుకొస్తారు. అంటే బయటకు. ఆ తర్వాత వాటిని డిశ్చార్జ్ చేస్తారు. అంటే అడవిలో నాటుతారు. ఇక అక్కణ్ణుంచి అవి పెరుగుతాయి. ఈ పని అంతా స్త్రీల అజమాయిషీలో జరుగుతుంది. కాందిశీకులకు ఆశ్రయం ఏ నేలా లేనివారు కాందిశీకులు అవుతారు. అడవిని కోల్పోయిన చెట్లు కూడా కాందిశీకులు అవుతాయి. అలాంటి కాందిశీకులను చేరదీసి ఈ అడవిలో పెంచటం కూడా గురుకుల బొటానికల్ శాంక్చురీ పని. ‘మనుషులు తాము మాత్రమే బతకడానికి పని చేస్తున్నాం అని అనుకుంటారు. కాని చెట్లు, అడవులు కూడా తమ ప్రాణాలు నిలుపుకోవడానికి, ప్రకృతిని శుభ్రపరచడానికి విపరీతంగా పని చేస్తాయి. వాటి పని మనకు కనపడదు’ అంటుంది లీల. ఆమె ఆ శాంక్చురీ వ్యవస్థాపకుడి భార్య. నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్న ఆమెకు ఏ మొక్క, ఏ చెట్టు ఎంత ముఖ్యమైనదో కచ్చితంగా తెలుసు. ‘అడవి ఉంటే పక్షుల ఆర్కెస్ట్రా ప్రతి ఉదయం వినొచ్చు. అడవి ఉంటే రంగు రంగుల సీతాకోక చిలుకల నృత్యం చూడొచ్చు’ అంటుందామె. ‘మనిషి మాత్రమే డబ్బిచ్చి ఆహారం కొనుక్కుంటాడు. ఇక ఏ జీవీ ఏ జంతువూ ఏ జలచరమూ ఏ కీటకమూ డబ్బిచ్చి తమ ఆహారం కొనుక్కోదు. ప్రకృతితో మనిషి విడిపోవడం వల్ల ఆహారం కొనుక్కునే అవసరం ఏర్పడింది. ప్రకృతితో పాటు ఉంటే అదే ఆహారం ఇస్తుంది’ అంటుందామె. ‘నిర్ణయించుకోండి... ఈ భూమి ఫ్యాక్టరీలతో నిండాలా... అడవులతో నిండాలా’ అని నిలదీస్తుంది. కలిసి మెలిసి జీవనం బిడ్డలకు జన్మనివ్వడం తెలిసిన ఈ స్త్రీలు ఇక్కడ మొక్కలను పసిబిడ్డల వలే కాచుకోవడం చూడొచ్చు. వీరందరు కలిసి మెలిసి వొండుకుంటారు. కలిసి మెలిసి భోజనం చేస్తారు. కొందరు అక్కడే ఉన్నా కొందరు బయట ఊళ్లో ఉన్నా ఆ అడవి మాత్రం అచ్చం వారిదే. ఇలాగే స్త్రీలకు అడవి కోసం భూమిని అప్పజెప్తే మరిన్ని నోవా పడవలు సిద్ధం అవుతాయని తప్పక ఆశించవచ్చు. మనమూ వెళ్లొచ్చు కేరళలోని ఈ ‘గురుకుల బొటానికల్ శాంక్చురీ’తో పాటు కర్ణాటక, తమిళనాడుల్లో కొన్ని ప్రయివేటు అభయారణ్యాలు ఉన్నాయి. వీరంతా అంతర్గత అనుసంధానంలో ఉంటారు. వీరు తమ అభయారణ్యాల్లో మూడు నుంచి ఆరు నెలలు ఉంచుకొని ‘ఎకొలాజికల్ నర్చరెన్స్’ పేరుతో ప్రకృతిలో పరస్పరాధారిత జీవ వికాసాన్ని అర్థం చేయిస్తారు. అడవులను ఎలా కాపాడుకోవాలో చెబుతారు. ఈ అప్రెంటిస్‌షిప్ కోసం చేరి గురుకుల బొటానికల్ శాంక్చురీలో పని చేసే యువత ఎందరో ఉన్నారు. ‘ఇది కాకుండా డే టూర్లు, వీక్లీ టూర్లు కూడా మా దగ్గర ఉన్నాయి’ అంటుంది సుప్రభ శేషన్. -
Ongole Cattle: పౌరుషాల గిత్తకు ఊపిరి!
నడకలో రాజసం.. పోటీల్లో పౌరుషం.. రూపంలో భారీ కాయం.. ఇదే ఒంగోలు గిత్త తేజసం. ప్రకాశం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి పశువుల అభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటు చేసిన చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రం లక్ష్యం దిశగా అడుగులేస్తోంది. మూడేళ్ల ముందు వరకు నిర్వీర్యమైన ఈ క్షేత్రం క్రమేపీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మేలైన పశువుల ఉత్పత్తిని పెంచి, సంరక్షించే దిశగా అడుగులేస్తోంది. ఇందు కోసం సెమన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. నేరుగా పిండాలను (యాంబ్రియో) ఉత్పత్తి చేసేలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. పశు ఉత్పత్తి క్షేత్రంలో అన్ని మౌలిక వసతులు సమకూరుతున్నాయి. నాగులుప్పలపాడు: చదలవాడలో 198 ఎకరాల్లో మూడు దశాబ్దాల క్రితం ఒంగోలు జాతి పశుఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చీమకుర్తికి గ్రానైట్ పరిశ్రమ వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి క్షేత్రం ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయ భూములను కొనుగోలు చేసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి పేరుకు క్షేత్రం నడిచినా.., పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం నుంచి సహకారం లభించడం, అధికారులు అంకితభావంతో పనిచేస్తుండడంతో ఆ ఫలాలు కనిపిస్తున్నాయి. రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు: క్షేత్రంలో గడచిన రెండు మూడేళ్లలో సుమారు రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పశువుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రూ.2 కోట్లతో 4 నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలన అవసరాల కోసం రూ.70 లక్షలతో నూతన పరిపాలన భవనం నిర్మించారు. వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు క్షేత్రం మొత్తం రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంతే కాకుండా గోచార్ పథకంలో క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు కేటాయించారని, వీటిని త్వరలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన పశువుల ఉత్పత్తి: క్షేత్రంలో 292 పశువులుండగా, వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టి ఆవులు 24, మిగిలినవి మూడేళ్లలోపు లేగదూడలున్నాయి. గతంలో ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో జాతి ఆవులే అయినా..నాణ్యత తక్కువగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా వస్తున్న లేగదూడలు ఒకింత ఆరోగ్యంగా పెరుగుతుండడంతో క్రమేపీ ఆవుల్లో నాణ్యత పెరుగుతోంది. నాణ్యత తక్కువ ఉన్న పశువులు వేలం ద్వారా విక్రయిస్తుండడంతో మరింత నాణ్యమైన పశువులను క్షేత్రంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల నుంచి వచ్చే కోడెదూడలను ఆరు నెలల వరకు పెంచి రైతుల కోసం వేలం వేసి ఇస్తారు. గ్రాసం కొరతను అధిగమించి... మూడేళ్ల క్రితం క్షేత్రానికి గ్రాసం కొరత తీవ్రంగా ఉండేది. దాదాపు 200 ఎకరాల నాణ్యమైన భూమి ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోలేకపోయేవారు. ప్రస్తుతం ఆ కొరతను క్షేత్రం అధిగమించింది. బహువార్షిక గ్రాసాలు ఏడాది పొడవునా క్షేత్రంలో సాగు చేస్తున్నారు. దీనికి తోడు మాగుడు గడ్డి నిల్వకు ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి ముందుగానే నిల్వ ఉంచుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 1600 టన్నుల సైలేజ్ గడ్డిని అందించింది. దీంతో క్షేత్రం గ్రాసం కొరతను అధిగమించింది. సమకూరిన వసతులు: నిన్నమొన్నటి వరకు మౌలిక వసతులు లేక కునారిల్లిన క్షేత్రంలో ఇప్పుడు భవనాల సమస్య తీరింది. పాలన భవనం కొత్త హంగులతో ఆహ్లాదంగా సిద్ధమైంది. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా గతంలో ఉన్న డ్రైవర్ క్వార్టర్లను అభివృద్ధి చేసి సిబ్బందికి అందుబాటులో ఉంచారు. క్షేత్రంలో అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం పూర్తయ్యింది. ఇక మేలైన ఆవుల నుంచి అండాల సేకరణ కోసం గుజరాత్ నుంచి ప్రత్యేకంగా మిషన్‌ను కూడా తీసుకొచ్చారు. సేకరించిన అండాలను నిల్వ చేసేందుకు ల్యాబ్‌ను అభివృద్ధి చేశారు. పశువుల బరువును కూడా ప్రతి వారం తీసుకొని రికార్డులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ లాం ఫాం నుంచి తీసుకొచ్చిన సెమన్‌ను రైతుల కోసం అందుబాటులో ఉంచగా, భవిష్యత్‌లో నేరుగా పిండాలను (యాబ్రియో) కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవుపాలు పాలు, గోమూత్రంను నామమాత్రపు రుసుంతో రైతుల అవసరాల కోసం అందిస్తున్నారు. ఇంకా మిగిలిన సమస్యలివే... ఆవుల నాణ్యతను పెంచినప్పటికీ, కనీసం ఒక జత ఒంగోలు గిత్తలను ప్రదర్శన కోసమైన పెంచాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఎద్దు ఒక్కటి కూడా లేదు. భవిష్యత్‌లో దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. క్షేత్రంలో భూగర్భ జలంలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటోంది. దీన్ని అధిగమించేందుకు క్షేత్రంలోనే రెండు చెరువుల ద్వారా పశువులకు తాగునీరు అందిస్తున్నారు. అయితే ఆవులు బయటకు వెళ్లకపోతే ఫ్లోరైడ్ నీటితోనే వాటి దాహం తీర్చాల్సి వస్తోంది. దీంతో పశువుల నాణ్యతపై ప్రభావం పడుతోంది. త్వరలో ఉన్నతమైన ఫాంను చూస్తాం ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే పశుక్షేత్రంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికి తోడు సిబ్బంది పనితీరుతో పశువుల నాణ్యత కూడా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పశువుల నాణ్యత పరిశీలన కోసం ఇప్పటికే ప్రతి పశువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటికి సంబంధిత రికార్డులు తయారు చేస్తున్నాం. ఇలాగే త్వరలో మన ఖ్యాతిని పెంచే ఒంగోలు జాతి సంపదతో కూడిన అత్యున్నతమైన ఫాంను తయారు చేయడానికి కృషి చేస్తున్నాం. – బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, పశుక్షేత్రం -
పెంచలకోన అభయారణ్యానికి ఈఎస్‌జెడ్ గుర్తింపు
విశాలమైన అటవీ ప్రాంతం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, కోనలు. పర్యావరణం ప్రతిబింబానికి చిహ్నం. అడవి మాటున సంరక్షణ పొందుతున్న పక్షులు, జంతువుల జీవవైవిధ్యానికి నెలవైన ప్రాంతం పెంచలకోన అభయారణ్యం. 909 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన పెంచల నరసింహస్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్)గా గుర్తిస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రకటించింది. ఇక నుంచి ఈ ప్రాంత సంరక్షణపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించనుంది. నెల్లూరు (బారకాసు): పెంచలకోన అభయారణ్యం.. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రాంతం. అటవీ ప్రాంతాన్ని, జంతువుల సంరక్షణకు అభయారణ్యాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందు కోసం కొంత కాలం క్రితం రాష్ట్ర అటవీశాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర అటవీశాఖ ఆమోదిస్తూ పెంచల నరసింహస్వామి వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని 909 చ.కి.మీ.లను ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్)గా ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర అటవీశాఖ ప్రతిపాదనలతో కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జిల్లాలోని రాపూరు మండలంలో పెంచల నరసింహస్వామి (పెంచలకోన) పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ పుణ్యక్షేత్రానికి చుట్టూ ఉండే పెంచలకోన దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రాష్ట్ర అటవీశాఖ సంరక్షణ చర్యలు చేపడుతోంది. నెల్లూరు జిల్లా నుంచి అటు వైఎస్సార్ జిల్లా నుంచి వరకు విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం (అభయారణ్యం)గా ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో వివిధ రకాల జంతువులతో పాటు దాదాపు 328 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎర్రచందనం, టేకుతో పాటు ఔషధ మొక్కలు, వనమూలికలు తదితర అటవీ ఉత్పత్తులు, ఖనిజ సంపద ఉన్నాయి. సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం వల్ల ఇక్కడ నీటి లభ్యతతో అనేక రకాల పక్షులు కూడా వస్తుంటాయి. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ తగిన చర్యలు చేపడుతోంది. 909 చ.కి.మీ. వైశాల్యంతో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతం వరకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (అభయారణ్యం)గా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో పరిశీలించిన కేంద్రం 909 చ.కి.మీ. సరిహద్దు వరకు సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా (ఎకో సెన్సిటివ్ జోన్) ప్రకటించింది. పెంచల నరసింహస్వామి అభయారణ్యంలో చిరుత పులి, పెద్దపులి, ఎలుగు బంట్లు, చుక్క దుప్పులు, అడవి పందులు తదతర 20 రకాల జంతువులు ఉన్నాయి. ఆయా రకాల జంతువులన్నీ దాదాపు వేల సంఖ్యలో ఇక్కడి అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. 909 చ.కి.మీ. మేర ఉన్న పెంచల నరసింహ స్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 60 శాతం వైఎస్సార్ జిల్లాలో ఉండగా మిగిలిన 40 శాతం విస్తీర్ణం నెల్లూరు జిల్లాలోని రెండు రేంజ్ పరిధిలో ఆరు మండలాలు సంగం, పొదలకూరు, అనంతసాగరం, కలువాయి, చేజర్ల, రాపూరు ప్రాంతాల్లో ఉంది. మూడు విభాగాలుగా అభయారణ్యం ఈ అభయారణ్యాన్ని అటవీశాఖాధికారులు రెగ్యులేటెడ్, ప్రొహిబిటెడ్, పరిమిటెడ్ అనే మూడు విభాగాలుగా గుర్తించారు. ఇందులో రెగ్యులేటెడ్ విభాగానికి సంబంధించిన అటవీ ప్రాంత స్థలాల్లో ప్రజాప్రయోజనాల అవసరం నిమిత్తం రోడ్లు, నీటి సరఫరా తదితర మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపట్టడం జరుగుతోంది. ప్రొహిబిటెడ్ విభాగానికి సంబంధించి అడవులను నరకడం, జంతువులను వేటాడటం వంటివి నిషేధించి వాటిని సంరక్షించే చర్యలు చేపడుతోంది. పరిమిటెడ్ విభాగానికి సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా అటవీ ప్రాంతంలో కానీ లేక సమీప ప్రాంతంలో ఏమైనా పరిశ్రమలు ఏర్పాటు నెలకొల్పే ప్రయత్నం చేస్తే అందుకు అటవీశాఖాధికారులు పరిశీలించి తగు చర్యలు చేపట్టడం జరుగుతోంది. పెంచల నరసింహస్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంకు ఎకో సెన్సిటివ్‌జోన్ మానటరింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో చైర్మన్‌గా వైఎస్సార్ జిల్లా కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా పర్యావరణం ఎక్స్‌ఫర్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ, బయోడైవర్సిటీ ప్రతినిధులు ఉండగా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. పెంచల నరసింహస్వామి అభయారణ్యాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధి చేయడం కోసం ప్రస్తుతం అటవీశాఖాధికారులు తీసుకుంటున్న చర్యలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర అటవీశాఖ ఈఎస్‌జెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీశాఖాధికారులకు అభయారణ్యాన్ని సంరక్షించేందుకు మరిన్ని అధికారులు ఇచ్చే అవకాశం ఉందని, అయితే కేంద్రం నుంచి రాష్ట్ర అటవీశాఖకు వచ్చిన నోటిఫికేషన్లో ఏమేమి నిబంధనలను పొందు పరిచారో తదితర వివరాలు తెలియాల్సి ఉందని ఆ శాఖ అధికారులంటున్నారు. -
రెండేళ్ల తర్వాత మళ్లీ కనిపించింది
ముంబై : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం పర్యాటకులను కనువిందు చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని తడోబా అభయారణ్యాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత కనిపించడంతో పర్యాటకులు తమ చరవాణిలో చిరుతను బందించేందుకు పోటీపడ్డారు. ఇక్కడ వివిధ రకాల జంతువులు, మృగాలు ఉన్నప్పటికీ.. అత్యంత అరుదుగా కనిపించే నల్ల చిరుత సంచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం తడోబా అభయారణ్యంలో కనిపించిన నల్ల చిరుత.. ఇవాళ మళ్లీ తడోబా అభయారణ్యంలో దర్శనమిచ్చింది. -
కానరాని పక్షులు కిలకిలలు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరులో నేడు కిలకిల రావాలు వినిపించటం లేదు.. విహంగాల విలవిలలు తప్ప. నీరు, ఆహారం కొరత.. కాలుష్యం బెడద.. వేటగాళ్ల తూటాల వల్ల ఇక్కడకు వచ్చిన విదేశీ పక్షులు మృత్యువాతపడుతున్నాయి. ఫలితంగా కొల్లేరు రానురాను జీవ కళ కోల్పోతోంది.. మనిషిలో పెరిగిన స్వార్థానికి అవి ‘కిల్’ అవుతున్నాయి.. కొల్లేరు అభయారణ్యం పరిరక్షణను గత ప్రభుత్వం గాలికొదిలేయడంతో.. పక్షుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. –ఆకివీడు సాక్షి, పశ్చిమగోదావరి : ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు ప్రముఖమైంది. దీనిని పరిరక్షించేందుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామ్సార్ ఒప్పందం కూడా చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 11వ శతాబ్ద ప్రాంతంలో ఒక పట్టణం. 17వ శతాబ్దం వరకూ ఇక్కడ మనుషులు సంచరించారు. అయితే తెలుగు రాజుల కాలంలో కొల్లేరు పట్టణం దగ్ధమైపోయినట్లు చరిత్ర చెబుతోంది. తదనతంరం పెద్దగొయ్యిగా ఏర్పడి, గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే అదనపు నీరు, వరదల నీటితో ఈ ప్రాంతం ముంపునకు గురైంది. సముద్రమట్టానికి 10 అడుగుల ఎత్తు వరకూ సుమారు 314 చ.మైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఒక సరస్సుగా గుర్తించి, కొల్లేరు సరస్సుగా నామకరణం చేశారు. ఇలా 18వ శతాబ్దం ప్రారంభంలో కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. సరస్సులో వివిధ రకాల చేపలు, కలువ కాయలు(కలేబికాయలు), నాచు కాయలు ఇలా ఎన్నో రకాల మొక్కలు నీటిలోంచి పుట్టుకువచ్చి కాయలు కాస్తుండేవి. ఆ కాయల్ని తినేందుకు విదేశాల నుంచి 200 రకాలకు పైగా పక్షులు వలస వచ్చేవి. వీటితో పాటు స్థానిక పక్షులు లక్షలాదిగా కొల్లేరులో జీవించేవి. అయితే రానురాను పక్షులు ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు కానరావడం లేదు. ఔ అమలు కాని చట్టాలు కొల్లేరు అభయారణ్య పరిరక్షణకు గత ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఆచరణకు నోచుకోలేదు. కొల్లేరుతో పాటు ఐదో కాంటూర్‌ను పరిరక్షించడానికి నిత్యం పహరా కాయాల్సిన యంత్రాంగమే చోధ్యం చూస్తోంది. ఫలితంగా ఒకనాడు కొల్లేరులో తిరుగుతున్న తిమింగాల్ని సైతం లెక్కచేయకుండా బాంబులతో పేల్చేసిన చెరువుల స్థానంలో నేడు పుట్టగొడుగుల్లా కొత్త చెరువులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అడపాదడపా దాడుల పేరుతో ఎంపిక చేసుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి, కాసులు దండుకోవడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆటపాకలోని రక్షిత పక్షుల కేంద్రంలో కూడా పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వందలాది విదేశీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. సాక్షాత్తూ అటవీశాఖ అధికారుల కళ్లముందే ఈ దారుణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పక్షుల కేంద్రంలో యంత్రాలతో అభివృద్ది పనులు చేయకూడదనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. పక్షులు సంచరించే ప్రాంతాల్లో విచ్చల విడిగా చేపలు, రొయ్యల చెరువులు పుట్టుకొస్తుండటంతో మేత, యాంటి బయోటిక్స్ విని యోగం విచ్చలవిడిగా జరుగుతూ పక్షుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. కిక్కిస దగ్ధంతో మాడిపోతున్న పక్షులు ఏటా వేసవిలో కొల్లేరులోని వందలాది ఎకరాల్లో కిక్కిస దగ్ధమవుతోంది. కిక్కిస మంటల్లో వేలాది పక్షులు, పక్షి గుడ్లు మాడి మసైపోతున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొల్లేరు కుచించుకుపోతోంది. సరస్సు మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అంతరించే స్థాయికి పక్షులు చేరుకున్నాయి. కొల్లేరు కిలకిల రావాలు వినాలంటే, సరస్సు మనుగడ కాపాడాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు సరస్సుపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. నెరలు తీసి బీడుగా.. కొల్లేరు సరస్సులో జలాలు కనుమరుగవుతున్నాయి. కొల్లేరు ప్రాంతం నెరలు తీసి బీడు బారుతోంది. వివిధ రకాల ఫ్యాక్టరీలకు చెందిన రసాయన వ్యర్థాలతో కూడిన నీరు కొల్లేరులో చేరుతోంది. దీంతో పక్షులు చనిపోతున్నాయి. వాటి కళేబరాలు పచ్చిక పొదల్లో పడి కుళ్లి కృశించిపోతున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వాటిలో ప్రసిద్ధిగాంచిన విదేశీ పెలికాన్ పక్షులూ ఉన్నాయి. మొక్కుబడిగా చెక్‌పోస్టులు కొల్లేరు అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మొక్కుబడిగా ఉన్నాయి. అభయారణ్య పరిధిలో కృష్ణా జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 చెక్ పోస్టులున్నాయి. చేపల మేత, మందులు, వాహనాల రాకపోకల నిషేధంతో పాటు, కొల్లేరు పక్షుల్ని రక్షించాల్సిన బాధ్యత చెక్‌పోస్టు అధికారులు, సిబ్బందిపై ఉంది. వీరు సరిగా పట్టించుకోనందున అభయారణ్యంలోకి వెళ్లకూడనివన్నీ వెళ్లిపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటపాకలోని పక్షి ఆవాస కేంద్రం వద్ద ఆధునికీకరణ పనులతో చెల్లాచెదురైన పెలికాన్, ఇతర పక్షులు మూగజీవాలపై ‘వేటు’ కొల్లేరు మూగ జీవాలపై వేటగాళ్ల దాడి అధికమైంది. పక్షి కనిపిస్తే చాలు, దానిని చంపి, తినేసే వరకూ నిద్రపోని వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పక్షుల వేట సాగిపోతోంది. కొల్లేరులో పరజ, కొంగ, గూడు కొంగ, నత్తకొట్టుడు, కొండింగాయ, పెలికాన్ పక్షులతో పాటు దొరికిన పక్షిని చంపి తినేస్తున్నారు. వేటాడిని పక్షుల్ని రహస్యంగా ఏలూరు, ఆకివీడు, భీమడోలు, గణపవరం, భీమవరం, కాళ్ల, పాలకొల్లు, నిడమర్రు, ఉంగుటూరు, కృష్ణా జిల్లా కైకలూరు, కలిదిండి, మండలవల్లి, గుడివాడ, ముదినేపల్లి తదితర మండలాలకు రహస్యంగా తీసుకువెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రహస్యంగా వేట సాగిస్తున్నారు పక్షులను వేటాడకూడదనే నిషేధం ఉన్నప్పటికీ పక్షుల్ని వేటాడి రహస్యంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకూ అమ్ముతున్నారు. –గాతల ఇమానియేలు, జువ్వలపాలెం తరిగిపోతున్న పక్షి జాతి కొల్లేరు కాలుష్యానికి గురైంది. మరోపక్క అడపాదడపా వేటాడుతున్నారు. దీంతో చాలా రకాల పక్షులు చనిపోయాయి. ప్రస్తుతం ఉన్న పక్షులకు నీరు, ఆహారం కొరత ఏర్పడింది. దీంతో అవి బలహీనమైపోయాయి. ఆవాస కేంద్రాలు కూడా లేక పక్షులు అంతరించిపోతున్నాయి. పక్షుల ఆవాస కేంద్రాలకు ప్రభుత్వం పది వేల ఎకరాలు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –బలే గణేష్, శృంగవరప్పాడు, కృష్ణా జిల్లా, కొల్లేరు -
శరణార్థుల ‘సంరక్షణ నగరాలు’!
వాషింగ్టన్/ఫోనిక్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం అక్రమ వలసదారులకు సానుకూలంగా ఉండేలా కనిపిస్తోంది. వలసదారులను సంరక్షణ నగరాలకు (శాంక్చురీ సిటీస్) పంపే యోచనను ట్రంప్ తీవ్రంగా చేస్తున్నారు. ఈ సంరక్షణ నగరాలకు ప్రజలను పంపడం ద్వారా వారు అమెరికాలోనే ఉండేందుకు అవకాశం కలగనుంది. తమపై నమోదైన వలస కేసులకు సంబంధించి మరింత ఎక్కువగా న్యాయ సహాయం పొందే అవకాశం కూడా అక్రమ వలసదారులకు కలుగుతుంది. షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో న్యాయ నిపుణులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఈ సంరక్షణ నగరాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండనుండటం అక్రమ వలసదారులకు ప్రతికూలాంశం. అదే సందర్భంలో ఇతర నగరాల్లోని అక్రమ వలసదారులతో పోలిస్తే సంరక్షణ నగరాల్లో నివసించే అక్రమ వలసదారులు అరెస్టయ్యే అవకాశాలు 20 శాతం తక్కువ. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ న్యాయవాది జార్జ్ గాస్కన్ మాట్లాడుతూ సంరక్షణ నగరాల్లోని అక్రమ వలసదారులు నేరాలకు పాల్పడేందుకు అవకాశం తక్కువనీ, అయితే ఇది రాజకీయ ప్రేరేపణతో తీసుకున్న, ప్రజల జీవితాలతో ఆడుకునే నిర్ణయమని అన్నారు. మెక్సికో సరిహద్దు నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తుండటం ట్రంప్‌ను తీవ్రంగా కలవరపెడుతుండటం తెలిసిందే. అక్రమవలసదారులను సంరక్షణ నగరాలకు తరలించాలన్న ప్రతిపాదన పాతదే. ఇప్పటికే రెండుసార్లు ట్రంప్ యంత్రాంగం దీనిని తిరస్కరించింది. అయితే ట్రంప్ శుక్రవారం ఓ ట్వీట్ చేస్తూ ఈ ప్రతిపాదన ఇంకా తమ పరిశీలనలో ఉందని వెల్లడించడం గమనార్హం. మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మాట్లాడుతూ అక్రమ వలసదారుల విషయంలో తమ ముందు ఉన్న అనేక మార్గాల్లో ఈ సంరక్షణ నగరాలు ఒకటి మాత్రమే పేర్కొన్నారు. ఏమిటీ సంరక్షణ నగరాలు? సంరక్షణ నగరాలకు ప్రత్యేకంగా నిర్వచనమేదీ లేదు. ఒక్కమాటలో స్థూలంగా చెప్పాలంటే కొన్ని అంశాల్లో, ప్రత్యేకించి అక్రమ వలసల విషయాల్లో స్థానిక పోలీసులు అమెరికా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించలేరు. దీనిపై పరిమితులుంటాయి. అక్రమవలసదారులను నిర్బంధించాలని అమెరికా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోరినా దాదాపు 200 పట్టణాలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అంటే అవి సంరక్షణ పట్టణాల కిందకు వచ్చినట్లే. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిలస్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. -
పిల్లులంటే ఇష్టమా?.. అయితే ఈ వార్త చదవాల్సిందే!
వీలైతే ప్రేమించండి... మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రేమించడానికి మనుషులే అవసరం లేదు. కొందరు జంతువుల్ని కూడా ప్రేమిస్తారు. జంతు ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఇలా ఎంతో మంది ఉన్నారు. అయితే జంతు ప్రేమికులకు ఓ శుభవార్త.. అందులోనూ పిల్లులను ఇష్టపడే వ్యక్తులకు మరింత పనికొచ్చే వార్త. జోన్ బోవెల్ 2010 నుంచి పిల్లుల్ని పెంచుతూ ఉంది. డెన్మార్క్‌కు చెందిన ఈమె ఓ యాభై పిల్లుల్ని పెంచుతూ తన ఇంటినే సాంక్చుయరీలా మార్చేసింది. అయితే తన ఆరోగ్యరిత్యా వేరేచోటుకు మారాల్సివచ్చింది. అయితే తను లేకపోతే సాంక్చుయరీ ఏమైపోతుందో అని బాధపడుతూ.. ఆ పిల్లుల్ని చూసుకోవడానికి ఓ మనిషి కావాలంటూ.. ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘ఎవరికైనా పిల్లులంటే ఇష్టముంటే, జంతు ప్రేమికులైతే.. మమల్ని సంపద్రించండి. ఇది సరదా కోసం చేసింది కాదు. మా సాంక్చుయరీని రక్షిస్తూ.. ఇక్కడ ఉండే పిల్లుల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి గానూ ఉండడానికి ఇళ్లు, జీతం ఇస్తామం’టూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అయితే దీనికి గాను కొన్ని నిబంధనలు కూడా పెట్టింది. వయసు 45 ఏళ్లకు పైబడి ఉంటే బాగుంటుందని, మొదటి ఆరు నెలలు వాలంటీర్‌గా పనిచేయాలని తెలిపారు. ఆసక్తి గలవారు joanbowell@yahoo.com ఈ అడ్రస్‌కు అప్లికేషన్‌తో పాటు ఫోటోను జతచేసి పంపాలని పేర్కొన్నారు. వచ్చిన అప్లికేషన్స్‌లో నచ్చిన వాటిని తీసుకుని ఆగస్టు చివరికల్లా స్కైప్‌లో కాల్ చేసి మాట్లాడతామని తెలిపారు. -
మొసళ్లెన్నో..
అటవీ శాఖాధికారులు ఇటీవల జంతువుల గణన నిర్వహించారు. ప్రతీ నాలుగేళ్లకోసారి పులుల సర్వే నిర్వహిస్తున్నారు. కానీ అభయారణ్యంలో ఉన్న రిజర్వాయర్‌లోని మొసళ్లను మాత్రం లెక్కించడంలేదు. ప్రస్తుతం ఎన్ని వేలు ఉన్నాయో కూడా తెలియదు. తరచుగా నీటిపై తేలియాడుతూ, మైదాన ప్రాంతాల్లో సంచరిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కిన్నెరసాని అభయారణ్యంలోని రిజర్వాయర్‌లో 1984 సంవత్సరంలో మగ్గర్ జాతికి చెందిన 22 ఆడ, 11 మగ మొసళ్లను(మొత్తం 33) అటవీ శాఖాధికారులు వదిలారు. అప్పుడవి నాలుగు మీటర్ల పొడవు, 200 కేజీల బరువు ఉన్నాయి. మగ్గర్ జాతికి చెందిన మొసళ్లు చేపలు, నత్తలు, కప్పలు, వివిధ మలిన ఆహారం తీసుకుంటాయి. ప్రతీ సంవత్సరం ఒక్కో మొసలి 10 నుంచి 40 గుడ్లు పెడుతుంది. మే, జూన్ నెలల్లోనే గుడ్లు పెట్టి, 60 నుంచి 90 రోజుల వరకు పొదిగి సంతానోత్పత్తి చేస్తాయి. కిన్నెరసాని అనువైనది మొసళ్లు దేశంలో అంతరించిపోతున్నాయని మగ్గర్ జాతికి చెందిన సముద్రపు మొసళ్లను పాల్వంచలోని కిన్నెరసానితోపాటు మంజీరాలో వన్యప్రాణి అభయారణ్య సంరక్షణ అధికారులు వదిలారు. కిన్నెరసాని రిజర్వాయర్ 407 అడుగుల లోతుతో నీటినిల్వ సామర్థ్యం కలిగి ఉంది. జలచరాలు ఉండేందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ రిజర్వాయర్‌లో ద్వీపాలు ఉండటం, రాళ్లు, చెట్లతో అనువుగా ఉండటమే కాకుండా బురద ప్రాంతాలు, పొదళ్లు ఉన్నాయి. మొసళ్లకు ఆహారం కూడా సమృద్ధిగా దొరికేందుకు వీలుగా ఉంది. దీంతో 1984లో మొసళ్లను ఈ రిజర్వాయర్‌లో వదిలారు. ఉష్ణోగ్రత సైతం వేసవిలో కనిష్టం 15 డిగ్రీల నుంచి గరిష్టం 45 డిగ్రీల వరకు ఉంటుంది. నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 760 మి.మీల నుంచి గరిష్ట వర్షపాతం 1130 మి.మీల వరకు ఉంటుంది. దీంతో మొసళ్లు పెరగడానికి కిన్నెరసాని రిజర్వాయర్‌ను అనువైనదిగా గుర్తించారు. లెక్కించేదిలా... జంతువుల గణన మాదిరిగానే అధికారులు జలచరాలను లెక్కించకపోవడంతో కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఎన్ని మొసళ్లు ఉన్నాయి, ఎన్ని బయటకు వెళ్లాయో అంతుచిక్కడంలేదు. మొసళ్ల గణనను జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రాత్రివేళల్లో అత్యాధునిక బైనాక్యులర్లు, నీటి కెమేరాలను వినియోగించి చేయాల్సి ఉంటుంది. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో లెక్కిస్తారు. మొసళ్లు నడిచే మార్గంలో వాటి అడుగులు, గుర్తులు, గుళికలు, గుడ్డు కవచాలు తదితర వాటి ఆధారంగా గణన చేస్తారు. వేసవిలోనే బయటకు వస్తాయి.. 20 సంవత్సరాల క్రితం డెహ్రాడూన్ నుంచి బీఎన్.చౌదరి అనే అధికారి రిజర్వాయర్‌లోని మొసళ్ల సంఖ్యను లెక్కించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అనంతరం వీటిని లెక్కించే చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వాటి సంఖ్య ఎంత అనేది తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల పాలేరు నుంచి కూడా మూడు మొసళ్లను తీసుకువచ్చి కిన్నెరసానిలో వదిలారు. గతంలోనూ ఇలా మొసళ్లను బయటి ప్రాంతం నుంచి తీసుకువచ్చి వదిలిన సందర్భాలున్నాయి. వేసవిలోనే ఎక్కువగా బయటకు కన్పించేవిధంగా మొసళ్ల సంచారం ఉంటుంది. ప్రస్తుతం ఎన్ని ఉండొచ్చు? కిన్నెరసానిలో 1984లో 33 మొసళ్లను వదలగా, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో మొసలి ఏడాదికి 10 నుంచి 40 గుడ్లు పెడుతుండగా, వాటిల్లో కనీసం 20 గుడ్లు అయినా బతికే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన ఏడాదికి 440 పిల్లల చొప్పున 34 ఏళ్ల కాలంలో సుమారు 14,960 మొసళ్లు ఈ రిజర్వాయర్‌లో ఆవాసం పొందుతున్నట్లు అనధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. కాల్వల ద్వారా మైదాన ప్రాంతాలకు.. కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న నీరు కాల్వ ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలకు నిత్యం సరఫరా అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ కాల్వ ద్వారానే మొసళ్లు బయటకు వెళ్లి మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. వాటిని గుర్తించి పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కిన్నెరసాని కాల్వ సమీపంలోని కొత్తగూడెం మున్సిపల్ పంప్‌హౌస్ వద్ద ఓ మడుగులో రెండు మొసళ్లు బయటనే సంచరిస్తున్నాయి. రెండేళ్లుగా అక్కడే గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తున్నాయి. అయినా ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. పొంచి ఉన్న ప్రమాదం కిన్నెరసాని రిజర్వాయర్‌లో ఉన్న మొసళ్ల ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్‌లో బోటు షికారు నిర్వహిస్తుండగా, సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఈ రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో చేపలు పడుతూ ఉంటారు. మొండికట్ట, కిన్నెరసాని, యానంబైలు ప్రాంతాలకు చెందినవారు తెప్పలు వేసుకుని రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో మొసళ్లు కాల్వల ద్వారా సమీప గ్రామాల్లోకి సైతం వెళ్తున్నాయి. అయితే అసలు ఈ మొసళ్ల గణన అనేది ఎవరి పరిధిలోకి వస్తుందనేది ప్రశ్నార్థకంగా ఉంది. రిజర్వాయర్ నిర్వహణ జెన్కోది కాగా రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతమంతా వన్యమృగాల సంరక్షణ శాఖ కిందకు వస్తుంది. దీంతో అసలు మొసళ్ల బాధ్యత ఎవరిదనేది ప్రశ్నార్థకంగా మారింది. మాకు సంబంధం లేదు కిన్నెరసాని రిజర్వాయర్‌లోని జలచరాల గణనతో మాకు సంబంధం లేదు. నీటి వినియోగం, పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. మిగతావి వైల్డ్‌లైఫ్ శాఖే చూసుకుంటుంది. –ఎస్ఎన్ మూర్తి, సీఈ, కేటీపీఎస్(5,6దశలు) -
అభయారణ్యంలో 64 నీటితొట్ల ఏర్పాటు
పాల్వంచరూరల్: వేసవిలో అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీటి సౌకర్యం కోసం రూ.2.24లక్షల వ్యయంతో నీటి తోట్లను ఏర్పాటు చేసినట్లు ఎఫ్డీఓ ఎం.నాగభూషణం తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిన్నెరసాని అభయారణ్యంలోని యానంబైల్, చాతకొండ, అళ్లపల్లి, కరగూడెం రేంజ్ పరిధిలోని 74 బీట్లలో నీటి సౌకర్యంలేని ప్రాంతాలను గుర్తించి 64 నీటి తోట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఒక్కో నీటితొట్టికి రూ.3500ను ఖర్చు చేసినట్లు వివరించారు. వాటిని ఒక ఫీట్‌ఎత్తులో నిర్మించి ఎప్పటికీ తొట్లలో నీరు ఉండే లా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. అళ్లపల్లి ఏరియాలో సోలార్ పంప్‌సెట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.4లక్షల వ్య యంతో అటవీలో నిప్పు అంటుకోకుండా ముందస్తుగా ఫైర్‌లైన్స్ ఏర్పా టు చేసినట్లు చెప్పారు. 54 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫైర్‌లైన్స్ ఉంటాయన్నారు. ఎవరైనా అటవీలో నిప్పు పెడితే వారిపై చట్ట రీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీగుండా ప్రయాణించే వారు.. గొర్రెలు, మేకలు, పశువుల కాపర్లు అగ్గిపెట్ట లేదా లైటర్‌తో తిరుగొద్దన్నారు. -
ఆంక్షలు తొలిగేనా?
ఆదిలాబాద్ , ఉట్నూర్(ఖానాపూర్) : కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం గుండా భారీ వాహనాల రాకపోకల పునరుద్ధరణపై ప్రభుత్వం వేసిన కమిటీ ఏడు నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన నిర్వహించిన వన్యప్రాణుల మండలి సమీక్షలో ఎమ్మెల్యేలు రాథోడ్, గువ్వల బాల్‌రాజ్, అటవీశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో కవ్వాల్ టైగ ర్ జోన్ అటవీప్రాంతంగుండా భారీ వాహనాల రాకపోకల పునరుద్ధరణపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సూచించారు. అయితే ఏడు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు కానరాకపోవడంతో వాహనాల రాకపోకల ఆంక్షలపై అయోమయం నెలకొంది. వన్యప్రాణుల రక్షణ కోసం చర్యలు.. 1965 సంవత్సరంలో కవ్వాల్ అభయారణ్యం ప్రారంభం కాగా వన్యప్రాణి చట్టం కింద 1999లో కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2012లో 42వ పులుల సంరక్షణ (టైగర్‌జోన్)కేంద్రంగా ఏర్పాటు చేసింది. దీని పరిధిలోకి 892.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంను కోర్ ఏరియాగా, 1123.212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంను బఫర్ ఏరియాగా ప్రకటించింది. కవ్వాల్ అభయారణ్యం మధ్యలో నుంచి ఆదిలాబాద్, నిర్మల్ పట్టణ ప్రాంతాల నుంచి వేర్వేరుగా మంచిర్యాల వరకు ప్రధాన రహదారి ఉండటంతో గతంలో వాహనాల రాకపోకలు రాత్రీపగలు సాగేవి. అయితే వాహనాల రాకపోకలతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని గుర్తించిన అధికారులు రాకపోకలపై ఆంక్షలు విదించాలని నిర్ణయించారు. ఈ మేరకు 30 జూన్ 2007లో జారీ చేసిన జీవో నం.3221/2(2)07 ప్రకారం రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలను నిషేధించారు. ఇందుకోసం అభయారణ్యంలో మూడు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కడం మండలం పాండ్వాపూర్ వద్ద ఒకటి, ఉట్నూరు మండలం కొత్తగూడం వద్ద మరొకటి, జన్నారం మండలం తాళ్లపేట (ప్రస్తుతం ఈ చెక్ పోస్టును తపాళాపూర్లో ఏర్పాటు చేశారు) వద్ద మూడో వన్యప్రాణి (వైల్డ్ లైఫ్) విభాగం చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాత్రి వేళ బస్సులు, అంబులెన్స్‌లు, పాలు వంటి అత్యవసర వాహనాలు మినహా మిగతావి రాత్రి వేళలో నిలిపివేయాలని అప్పటి కలెక్టర్ అహ్మద్‌నదీం ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం మరిన్ని నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో జీవో నం. 34357/2007 ప్రకారం 27 జూలై 2013 నుంచి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల పట్టణ ప్రాంతాల మధ్య భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ నిర్ణ యంతో తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ రహదారిని ఆనుకుని దుకాణాలు నిర్వహించేవారు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. ఏడు నెలలు గడుస్తున్నా.. భారీ వాహనాల నిషేధం అమలుపై రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అధ్యక్షతన ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఆ శాఖ అధికారులతో వన్యప్రాణుల మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో అటవీప్రాంతం నుంచి భారీ వాహనాల రాకపోకల పునరుద్ధరణపై చర్చించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి త్వరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ నివేదిక అధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అప్పట్లో ప్రకటించారు. అయితే ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. దీంతో ప్రధాన రహదారి వెంట వ్యాపారాలు నిర్వహించుకునే వారు నివేదక కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరిస్తే తమ వ్యాపారాలు మెరుగై ఉపాధి లభిస్తుందని వారు అంటున్నారు. వారంలో నివేదిక వచ్చే అవకాశం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం రహదారి గుండా భారీ వాహనాల పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలు పరిశీలించి నివేదిక అందించేందుకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసింది. ఆ నివేదిక వారం, పది రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. – ప్రభాకర్, డీఎఫ్‌వో, మంచిర్యాల జిల్లా -
పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
అభయారణ్యం సమీపంలో పులి మరణంతో ప్రభుత్వం అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పులుల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభయారణ్యం సమీపంలోని చింతలపల్లి బీట్ చెన్నూరు రేంజ్‌లోని కంపార్ట్మెంట్ నంబర్ 51లో కరెంట్ ఫెన్సింగ్ బారిన పడి పులి చనిపోరుున విషయం తెలిసిందే. ఈ ఘటనపై వివిధ పత్రికల్లో వార్తలు, కథనాలు వచ్చిన నేపథ్యంలో సోమవారం అటవీశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, పీసీసీఎఫ్ పీకే ఝా తదితర అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వైల్డ్‌లైఫ్ క్రై మ్ రికార్డ్ బ్యూరోకు, సంబంధిత సంస్థలకు నివేదికలను పంపినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కిందిస్థారుు అధికారులను ఉన్నతాధికారులు ఆదేశిం చారు. అడవిపందుల బారి నుంచి తమ పం టలను కాపాడుకునేందుకు గిరిజన రైతులు ఏర్పాటు చేసుకున్న కరెంట్ ఫెన్సింగ్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అటవీశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అం దింది. జంతువుల వేట, వాటి అక్రమ స్మగ్లింగ్, విలువైన శరీరభాగాల కోసం ఈ విద్యుత్ కంచెను ఏర్పాటు చేయలేదని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. నలుగురు రైతుల రిమాండ్ విద్యుత్ షాక్‌కు గురై పులి మరణించడంతో భయపడిన రైతులు దానిని పూడ్చివేసి ఉంటారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇం దుకు కారణమైన ఆత్రం ఎర్రయ్య, ఆత్రం లస్మయ్య, ఆత్రం రాజన్న అనే రైతులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పులి శంకర్‌ను ఆదిలాబాద్‌లోని జువెనెల్ హోంకు తరలిస్తున్నట్లు తెలిపారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉం డేందుకు ‘ఏనిమల్ ట్రాకర్స్’సంఖ్యను గణనీ యంగా పెంచుకోవాలని ప్రభుత్వం యోచి స్తోంది. ఆ ప్రాంతంలో పులి సంచరిస్తున్న దృశ్యాలు దాదాపు నెలన్నర క్రితమే కెమెరాల్లో రికార్డు అరుునా, దాని సంరక్షణకు సంబంధి త అధికారులు చర్యలు తీసుకోలేదు. దీని పైనా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. -
కలివికోడీ...కనిపించవే..!
ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. అందులోనూ అంతరించిపోతున్న జాతుల్లో ఇదీ ఒకటి. ఈ పిట్ట 30 ఏళ్ల క్రితం ఒక్కసారి తళుక్కుమంది. అప్పటినుంచి ఇప్పటివరకు చూస్తామంటే కనిపించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోట్లు కుమ్మరిస్తున్నా జాడ కూడా దొరకలేదు. రాత్రిపూట మాత్రమే తిరగాడే ఈ పిట్ట ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు శోధిస్తున్నారు. ఆ పిట్టే కలివికోడి. ఇది 1948లో బ్రిటీషు సైన్యాధిపతి చూశారు. తర్వాత 1986లో వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలంలోని కొండూరు బీటులో ముచ్చెమ్మకుంటలో కనిపించింది. అప్పటినుంచి ఇప్పటివరకు జాడలేదు. ప్రపంచంలో ఎక్కడా లేని కలివికోడి లంకమల అటవీప్రాంతంలో కనిపించిన నేపథ్యంలో ఇక్కడే కలివికోడి జాతికి చెందిన పక్షులుంటాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. 30 ఏళ్లుగా నిరీక్షణ.. 1986లో ఒక్కసారి మాత్రమే కనిపించిన కలివికోడి జాడ కోసం అటవీ అధికారులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇప్పటికి స్థానిక అధికారులు వెతుకులాట కొనసాగిస్తునే ఉన్నారు. ఆరుగురు ప్రత్యేక ప్రొటెక్షన్ సిబ్బందితోపాటు సుమారు 144 కెమెరాలను త్వరలోనే అమర్చేందుకు అటవీశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. నెలకు కెమెరా బ్యాటరీలకు, సిబ్బంది జీతాలకుగాను దాదాపు రూ.45 వేలు ఖర్చు వస్తోంది. లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉన్న వేలాది హెక్టార్లలో ఈ కెమెరాలను అమర్చనున్నారు. పరిశోధనల్లో కనిపించని ఫలితం ఎనిమిదేళ్ల క్రితం ముంబయికి చెందిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి చెందిన సభ్యులు ఇక్కడ పరిశోధనలు చేశారు. ఉదయాన్నే అడవిలోకి బయలుదేరడం, సాయంత్రానికి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటూ కొంతమంది సభ్యుల బృందం నాలుగేళ్లపాటు కలివికోడి ఆనవాళ్ల కోసం పరిశోధనలు చేశారు. అడవిని గాలించినా...అంతా శోధించినా జాడ కనిపించలేదు. నాలుగేళ్లపాటు లంకమల అభయారణ్యంలో జల్లెడ పట్టిన పరిశోధన బృందం ఉసూరుమంటూ వెనుదిరిగింది. కొండూరులో ఉన్న పరిశోధన కేంద్రం ప్రస్తుతం మూతపడింది. భారీగా ఖర్చు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలివికోడి ఆచూకీ కోసం రూ.50 కోట్లకు పైగా ఖర్చుచేశాయి. అట్లూరు మండలంలోని కొండూరు, ఎస్.వెంకటాపురం, గుజ్జలవారిపల్లె, తంబళ్లగొంది, ఎర్రబల్లి, బద్వేలు మండలంలోని రాజుపాలెం, తిప్పనపల్లె తదితర గ్రామాల్లోని సుమారు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసి కలివికోడి సంరక్షణ అభయారణ్యంలో కలిపింది. అందుకోసం రైతుల భూములకు పరిహారంగా రూ.28 కోట్లు చెల్లించారు. ఇతర అన్ని అవసరాలకు మరో రూ.22 కోట్లకు పైగా ఖర్చుచేశారు. సిద్దవటం-బద్వేలు రోడ్డును ఇప్పుడు కూడా అభయారణ్యం పరిధిలో ఇబ్బంది కలుగుతుందని రాత్రిపూట వాహనాలను నిలిపివేస్తున్నారు. అనేకరకాల చిత్ర విచిత్రమైన జంతువులు అడవిలో అమర్చిన కెమెరాల్లో కనిపిస్తున్నా...కలివికోడి మాత్రం కనిపించకపోవడం అధికారులను కలవరపెడుతోంది. కనిపిస్తుందని ఆశ ఉంది: మహమ్మద్ దివాన్ మైదిన్, కడప అటవీశాఖాధికారి లంకమల్లేశ్వర అభయారణ్యంలో నిధుల కొరతతో కెమెరాలు దాదాపు ఎనిమిది నెలలుగా అమర్చలేదు. రీవ్యాలిడేషన్ నిధులు ఉండటంతో ప్రస్తుతం 144 కెమెరాలను అడవిలో పెట్టేందుకు సిద్ధమయ్యాం. త్వరలోనే వాటిని అక్కడక్కడ బిగించి కలివికోడి కోసం శోధిస్తాం. ఇప్పటివరకు ఎక్కడా కనిపించలేదు. కనిపిస్తుందన్న ఆశ మాత్రం ఉంది. -
పంచ అందాలు
అభయారణ్యం.. ఆహ్లాదకరం పర్యాటకులకు భలే వినోదం మెదక్:పచ్చని అభయారణ్యం చూపరులను కట్టిపడేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తోంది. మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో గల అభయారణ్యం 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. దానిచుట్టూ కంచెను వేసి అందులో జింకలతోపాటు రకరకాల జంతువులను పెంచుతున్నారు. ఇది పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. గడిచిన రెండు సంవత్సరాల్లో కరువు కాటకాలతో అభయారణ్యంలోని చెట్లన్నీ ఎండిపోయి కళతప్పింది. కానీ ఈ యేడు ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురుస్తుండటంతో చెట్లన్నీ పచ్చగా చిగురించాయి. దీనికి తోడు అభయారణ్యం గెస్ట్ హౌస్ ప్రాంతంలో చెట్లు మరింత అందాన్ని ఇస్తున్నాయి. పర్యాటకుల కోసం అధికారులు బెంచీలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు, అందులో రకరకాల ఆటవస్తువులు అమర్చారు. ప్రతి వారాంతపు సెలవుల్లో రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, తదితర దూరప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు వస్తుంటారు. పచ్చనిచెట్ల మధ్య హాయిగా సేద తీరుతుంటారు. -
అనాథ కుక్కలకు అదో శరణాలయం..!
ప్రకృతి సంపదతో పర్యాటకుల్ని పులకరింపజేసే కోస్లారికా ప్రాంతం.. రకరకాల వన్యప్రాణులకు, వృక్షాలకే కాక అనాథ శునకాలకూ ఆశ్రయమిచ్చే శరణాలయం అని మీకు తెలుసా? జంతు ప్రేమికులు, పెంపుడు జంతువుల కోసం ఎదురు చూసే వారికి వందలకొద్దీ శునకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న ఆ శునకాలు.. వాటిని చేరదీసి ఆశ్రయం ఇచ్చి... పెంచుకునే వారికోసం ఎదురు చూస్తున్నాయి. టెర్రటోరియో డి జెగ్వేట్స్ వీధికుక్కలు హాయిగా జీవించగలిగే ఓ ప్రైవేట్ అభయారణ్యం. సుమారు 900 శునకాలు అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హాయిగా జీవిస్తున్నాయి. జంతు ప్రేమికులు.. ఓ కొత్త నేస్తం కోసం ఎదురు చూసేవారికి కోస్టారికాలోని ఆ ఆశ్రమం అందుబాటులో ఉంది. మరోవైపు పర్యటకులు ఒకేచోట రకరకాల శునకాలను వీక్షించి ఆనందించే అవకాశం ఆ సంస్థ కల్పిస్తోంది. 'వాలంటీర్ రన్' కార్యక్రమంతో కోస్టారికాలోని ఆ విశాలమైన అటవీ ప్రాంతంలో వందలకొద్దీ శునకాలకు ఆహారం, స్నానపానాలు, వసతి సౌకర్యాలు కూడ కల్పిస్తున్నారు. తిండీ తిప్పలూ లేక, బక్క చిక్కి, అనేక వ్యాధులు సోకి వీధుల్లో అనాథలుగా తిరుగుతున్న కుక్కలను చూసిన తర్వాత వాటికో శరణాలయం స్థాపించాలన్న ఆలోచన తనకు వచ్చిందని స్థాపకురాలు ల్యా బ్యాటిల్ చెప్తారు. తాను వెళ్ళే మార్గంలో ప్రతిరోజూ వీధికుక్కలను చూసేదాన్నని, నిస్సహాయంగా ఉన్న వాటిలో కొన్నింటిని చూస్తే వాటికీ ఎంతో జీవితం ఉందని, అది హాయిగా జీవించేందుకు తగ్గ సహాయం అందించడం తప్పనిసరి అనిపించేదని, అదే కర్తవ్యంగా భావించి... అటువంటి అనాథ శునకాలను తెచ్చి ఆరోగ్యసేవలు అందించి, శుభ్రపరచి మంచి కుటుంబాలు తయారయ్యేట్లుగా చేస్తున్నానని ఆమె చెప్తున్నారు. అలాగే వాటికి మంచి లక్షణాలను అలవరచి ఇష్టపడి పెంచుకునే వారికోసం అందుబాటులో ఉంచుతున్నామని ల్యా చెప్తున్నారు. అయితే అదృష్టంకొద్దీ తాను ఆశ్రయం కల్పించిన శునకాల్లో ఎక్కువ శాతం అభిమానంగా, ఆదరణీయంగా ఉండటంతోపాటు... తాను చెప్పినట్లుగా విని, తన సేవలు అందుకుంటున్నాయని, కొన్ని తనను తిరస్కరించి వెళ్ళిపోతున్నాయని ల్యా అంటున్నారు. పెంచుకునేందుకు వచ్చేవారికి ప్రతి కుక్క వివరాలు షెల్టర్ బిల్ బోర్డులో చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే సుదూర ప్రాంతాలనుంచీ సైతం ఇక్కడకు వచ్చి ఈ శునకాలను పెంచుకునేందుకు అనేక మంది స్వీకరిస్తున్నట్లు ల్యా బ్యాటిల్ తెలిపారు. -
నల్లమల చుట్టూ భారీ కందకం
విలువైన ఎర్రచందనం వృక్ష సంపద ఉన్న నల్లమల అభయారణ్యం చుట్టూ భారీ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సి.కె.మిశ్రా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మిశ్రా... అరుదైన ఎర్రచందనం వృక్ష సంపదనును కాపాడటంలో భాగంగా ఈ కందకం తీస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలను కలుపుతూ మొత్తం 1,200 కిలో మీటర్ల పొడవున ఇది ఉంటుందన్నారు. 3 మీటర్ల లోతున, 3 మీటర్ల వెడల్పులో ఈ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల అక్రమ రవాణాను అరికట్టవచ్చని, అడవిలో నుంచి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. భూగర్భ జలాలు కూడా పెరగటానికి ఎంతగానో దోహద పడుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 900 ఊట కుంటల నిర్మాణం, 250 చెక్ డ్యాంలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
శ్రీశైలంలో చిరుత సంచారం
శ్రీశైలమహాక్షేత్రానికి 5 కి.మీ దూరంలోని ముఖద్వారం వద్ద చిరుతపులి కలకలం రేపింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. శ్రీశైలం ప్రాజక్టు కాలనీ నుంచి శ్రీశైలానికి వస్తుండగా.. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ముఖద్వారం సమీపంలో చిరుత ఘాట్ రోడ్డు దాటుతూ కనిపించిందని తెలిపారు. తాము భయపడి టూ వీలర్ ఆపేశామని తెలిపారు. వెంటనే దేవస్థానం, అటవీ అధికారులకు సమాచారం అందించామని వివరించారు. కాగా ఇటీవలే క్షేత్రపరిధిలోని మేకల బండ చెంచుగూడెం సమీపంలో పెంపుడు మేకలపై చిరుతలు దాడి చేసి గాయపరిచిన విషయం తెల్సిందే. సున్నిపెంట నుంచి శ్రీశైలం క్షేత్రానికి టూ వీలర్‌పై వచ్చే వారు, వెళ్లేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని దేవస్థానం మైకుల ద్వారా ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. కాగా అటవీ అధికారుల కృషితో నల్లమల అభయారణ్యంలో జంతువుల సంతతి పెరిగింది. వీటితో పాటు.. చిరుతల సంఖ్య కూడా పెరిగినట్లు సమాచారం. -
‘గుట్ట’ చుట్టూ అభయారణ్యం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ అభయారణ్యం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి కేంద్రంగా చుట్టూ ఉన్న 5 గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాల్లో ఈ అభయారణ్యం నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందులో అభయారణ్యంతోపాటు భక్తులకు విశ్రాంతి గృహాలు, ఆద్యాత్మిక కేంద్రాలు, కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. యాదగిరి గుట్ట మండలం యాదగిరిపల్లి, గిండ్లపల్లి, సైదాపూర్, దాతర్పల్లి గ్రామాలతోపాటు భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుంచి అభయారణ్యం కోసం భూములు సేకరించేందుకు స్థానిక రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు భువనగిరి ఆర్డీఓ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో గుట్టను అభివృద్ధి చేసేందుకు ‘యాదగిరి గుట్ట పట్టణాభివృద్ధి సంస్థ (ఉడా)’ను ఏర్పాటుచేసే యోచనలో ప్రభుత్వం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అభివృద్ధికి నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిట్లుగానే యాదగిరిగుట్ట అభివృద్ధికి సైతం ఓ సంస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని సీఎం కార్యాలయం నుంచి పురపాలకశాఖకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. గతనెల 17న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని స్వయంగా సందర్శించిన కేసీఆర్ రెండు మూడేళ్లలో గుట్ట చుట్టూ ఉన్న 2 వేల ఎకరాల్లో టెంపుల్ సిటీని నిర్మిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతలను కొత్తగా ఏర్పాటయ్యే ‘ఉడా’కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. -
అభయారణ్యంలో అడ్డగోలు ఆక్రమణలు!
కైకలూరు, న్యూస్‌లైన్ : కొల్లేరు అభయారణ్యంలో అడ్డగోలు ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. అడ్డుకోవాల్సిన అటవీ అధికారులు మామూళ్ల మత్తులో నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కైకలూరు, మండవల్లి మండలాల పరిధిలో 17,449 ఎకరాలను 1999లో కొల్లేరు అభయారణ్యంగా గుర్తించి జీవో 120 జారీ చేశారు. 2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్ సమయంలో పై రెండు మండలాల్లో 15776 ఎకరాల్లో వెలసిన చేపల చెరువులను ధ్వంసం చేశారు. ఇందులో 55 సొసైటీల ఆధీనంలో ఉన్న 2476 ఎకరాల చెరువులున్నాయి. సుప్రీంకోర్డు సాధికారిత కమిటీ అదేశాల ప్రకారం 1976లో జీవో నెంబరు 18 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కేటాయించిన సొసైటీలను పూర్తిగా ప్రభుత్వం రద్దు చేసింది. వీటిలో ఎటువంటి సాగు చేయకూడదని కఠిన నిబంధనలు విధించింది. అయితే అక్రమంగా సాగుచేయడమే కాకుండా చెరువుల విస్తీర్ణాన్ని సైతం పెంచేశారు. కైకలూరు మండలంలో శృంగవరప్పాడులో గంగరాజు ఫిషర్మెన్ సొసైటీ, ఆరుమీటర్ల సొసైటీ, పంజా గాంధీ సొసైటీ, పందిరిపల్లిగూడెంలో పాతపెడ, ముక్కుపెడ, గేజివల సొసైటీలతో పాటు లక్ష్మీపురం, గోకర్ణపురం సొసైటీలలో సాగు జరుగుతుంది. గోకర్ణపురం వెంకటరమణ సొసైటీ వాస్తవంగా 36 ఎకరాలు ఉండగా దానిని 58 ఎకరాల విస్తీర్ణానికి పెంచారు. అదే విధంగా మండవల్లి మండలం నందిగామలంక, పులపర్రు వంటి గ్రామాల సొసైటీ చెరువులలో సాగు జరుగుతుంది. రేపు వేలం పాటకు ముహూర్తం..... పందిరిపల్లిగూడె ంలో లాంచీల రేవు సమీపంలో శ్రీ వెంకట రమా ఫిషర్మెన్ కో - ఆపరేటీవ్ సొసైటీ పేరుతో ఉన్న 60 ఎకరాల చేపల చెరువు(ఒంటి తాడిచెట్టు చెరువు)ను కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేశారు. అనంతరం గట్లు నిర్మించుకుని అక్రమంగా సాగు చేస్తున్నారు. ఇటీవల కాలం వరకు ఏడాదికి రూ. 12 లక్షలు పాట జరగ్గా ఆదివారం నాటి పాటలో రూ. 15 లక్షలకు పైగా వస్తుందని భావిస్తున్నారు. మూడు రోజులుగా గ్రామంలో మైకు ద్వారా సెప్టెంబరు 1 సాయంత్రం 5 గంటలకు బడిసాల వద్ద పాటలు జరుగుతాయని సొసైటీ పెద్దలు బహిరంగంగా ప్రకటిస్తున్నా....అటవీఅధికారులు మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ సొసైటీలో మొత్తం 80 మంది సభ్యులున్నారు. అసలు చేసేదే అక్రమమైనప్పటికీ పంపకాల్లో సభ్యుల్లోనూ విభేదాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, ఇతర గ్రామాల్లో నివసిస్తున్న వారికి సొసైటీ పంపకాల్లో అవకాశం ఉండదు. ఈ విషయంలో సొసైటీ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి. నిరుద్యోగులుగా ఉన్న 8 మంది యువకులకు సొసైటీలో అవకాశం కల్పించాలని కోరితే నిరాకరించడంతో వివాదం మొదలయ్యింది. న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడానికి వారు సిద్ధపడుతున్నారు. గ్రామంలో టముకు వేయిస్తాం..... వేలం పాటలు నిర్వహించకూడదంటూ కొల్లేటి గ్రామాల్లో టముకు వేయాలని ఇప్పటికే సిబ్బందిని ఆదేశించమని అటవీశాఖ రేంజర్ రత్నకుమార్ చెప్పారు. కొల్లేరు అభయారణ్యంలో అక్రమ సాగు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పందిరిపల్లిగూడెంలో శనివారం సిబ్బంది ద్వారా టముకు వేయిస్తామని తెలిపారు.