విశాలమైన అటవీ ప్రాంతం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, కోనలు. పర్యావరణం ప్రతిబింబానికి చిహ్నం. అడవి మాటున సంరక్షణ పొందుతున్న పక్షులు, జంతువుల జీవవైవిధ్యానికి నెలవైన ప్రాంతం పెంచలకోన అభయారణ్యం. 909 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన పెంచల నరసింహస్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్)గా గుర్తిస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రకటించింది. ఇక నుంచి ఈ ప్రాంత సంరక్షణపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించనుంది.
నెల్లూరు (బారకాసు): పెంచలకోన అభయారణ్యం.. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రాంతం. అటవీ ప్రాంతాన్ని, జంతువుల సంరక్షణకు అభయారణ్యాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందు కోసం కొంత కాలం క్రితం రాష్ట్ర అటవీశాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర అటవీశాఖ ఆమోదిస్తూ పెంచల నరసింహస్వామి వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని 909 చ.కి.మీ.లను ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్)గా ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర అటవీశాఖ ప్రతిపాదనలతో కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
- జిల్లాలోని రాపూరు మండలంలో పెంచల నరసింహస్వామి (పెంచలకోన) పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ పుణ్యక్షేత్రానికి చుట్టూ ఉండే పెంచలకోన దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రాష్ట్ర అటవీశాఖ సంరక్షణ చర్యలు చేపడుతోంది.
- నెల్లూరు జిల్లా నుంచి అటు వైఎస్సార్ జిల్లా నుంచి వరకు విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం (అభయారణ్యం)గా ప్రభుత్వం గతంలోనే గుర్తించింది.
- ఇక్కడి అటవీ ప్రాంతంలో వివిధ రకాల జంతువులతో పాటు దాదాపు 328 రకాల వృక్ష జాతులు ఉన్నాయి.
- వీటిలో ప్రధానంగా ఎర్రచందనం, టేకుతో పాటు ఔషధ మొక్కలు, వనమూలికలు తదితర అటవీ ఉత్పత్తులు, ఖనిజ సంపద ఉన్నాయి.
- సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం వల్ల ఇక్కడ నీటి లభ్యతతో అనేక రకాల పక్షులు కూడా వస్తుంటాయి.
- వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ తగిన చర్యలు చేపడుతోంది.
- 909 చ.కి.మీ. వైశాల్యంతో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతం వరకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (అభయారణ్యం)గా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
- దీంతో పరిశీలించిన కేంద్రం 909 చ.కి.మీ. సరిహద్దు వరకు సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా (ఎకో సెన్సిటివ్ జోన్) ప్రకటించింది.
- పెంచల నరసింహస్వామి అభయారణ్యంలో చిరుత పులి, పెద్దపులి, ఎలుగు బంట్లు, చుక్క దుప్పులు, అడవి పందులు తదతర 20 రకాల జంతువులు ఉన్నాయి. ఆయా రకాల జంతువులన్నీ దాదాపు వేల సంఖ్యలో ఇక్కడి అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటాయి.
- 909 చ.కి.మీ. మేర ఉన్న పెంచల నరసింహ స్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 60 శాతం వైఎస్సార్ జిల్లాలో ఉండగా మిగిలిన 40 శాతం విస్తీర్ణం నెల్లూరు జిల్లాలోని రెండు రేంజ్ పరిధిలో ఆరు మండలాలు సంగం, పొదలకూరు, అనంతసాగరం, కలువాయి, చేజర్ల, రాపూరు ప్రాంతాల్లో ఉంది.
మూడు విభాగాలుగా అభయారణ్యం
- ఈ అభయారణ్యాన్ని అటవీశాఖాధికారులు రెగ్యులేటెడ్, ప్రొహిబిటెడ్, పరిమిటెడ్ అనే మూడు విభాగాలుగా గుర్తించారు.
- ఇందులో రెగ్యులేటెడ్ విభాగానికి సంబంధించిన అటవీ ప్రాంత స్థలాల్లో ప్రజాప్రయోజనాల అవసరం నిమిత్తం రోడ్లు, నీటి సరఫరా తదితర మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపట్టడం జరుగుతోంది.
- ప్రొహిబిటెడ్ విభాగానికి సంబంధించి అడవులను నరకడం, జంతువులను వేటాడటం వంటివి నిషేధించి వాటిని సంరక్షించే చర్యలు చేపడుతోంది.
- పరిమిటెడ్ విభాగానికి సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా అటవీ ప్రాంతంలో కానీ లేక సమీప ప్రాంతంలో ఏమైనా పరిశ్రమలు ఏర్పాటు నెలకొల్పే ప్రయత్నం చేస్తే అందుకు అటవీశాఖాధికారులు పరిశీలించి తగు చర్యలు చేపట్టడం జరుగుతోంది.
- పెంచల నరసింహస్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంకు ఎకో సెన్సిటివ్‌జోన్ మానటరింగ్ కమిటీ ఉంటుంది.
- ఈ కమిటీలో చైర్మన్‌గా వైఎస్సార్ జిల్లా కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా పర్యావరణం ఎక్స్‌ఫర్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి, ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ, బయోడైవర్సిటీ ప్రతినిధులు ఉండగా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.
- పెంచల నరసింహస్వామి అభయారణ్యాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధి చేయడం కోసం ప్రస్తుతం అటవీశాఖాధికారులు తీసుకుంటున్న చర్యలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర అటవీశాఖ ఈఎస్‌జెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది.
- ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీశాఖాధికారులకు అభయారణ్యాన్ని సంరక్షించేందుకు మరిన్ని అధికారులు ఇచ్చే అవకాశం ఉందని, అయితే కేంద్రం నుంచి రాష్ట్ర అటవీశాఖకు వచ్చిన నోటిఫికేషన్‌లో ఏమేమి నిబంధనలను పొందు పరిచారో తదితర వివరాలు తెలియాల్సి ఉందని ఆ శాఖ అధికారులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment