ప్రపంచ జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తింపు కోసం అటవీశాఖ యత్నాలు
ఈపీటీఆర్‌ఐతో కలసి అధ్యయనం
నేషనల్ వెట్‌ల్యాండ్ అథారిటీకి ప్రాథమిక నివేదిక
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఉన్నతాధికారులు
ఇటీవల ఈ అభయారణ్యాన్నిసందర్శించిన ప్రిన్సిపల్ సెక్రటరీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా డ్యామ్‌కు, సింగూరు ప్రాజెక్టుకు మధ్య ఉన్న జలాశయం, తొమ్మిది చిన్న ద్వీపాలతో కూడి ఉన్న ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది.
మొసళ్లు సహా ఎన్నో రకాల జలచరాలు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులున్న ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్యమున్న చిత్తడి నేలగా గుర్తించారు. ఈ క్రమంలో అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునే అర్హతలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. మంజీరా అభయారణ్యాన్ని జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
సమాచార క్రోడీకరణతో..
మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు సాధించేందుకు అవసరమైన అర్హతలు, ప్రతిపాదనలను శాస్త్రీయంగా సిద్ధం చేసేందుకు అటవీశాఖ ఈపీటీఆర్‌ఐ (ఎని్వరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)తో కలసి అధ్యయనం చేస్తోంది. ఈ అభయారణ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను నేషనల్ వెట్‌ల్యాండ్ బోర్డుకు పంపారు.
దాన్ని పరిశీలించిన బోర్డు మరికొన్ని వివరాలు పంపాలని కోరింది. ఈ మేరకు ఈపీటీఆర్‌ఐ, అటవీశాఖ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాయి. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.వాణిప్రసాద్ సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలసి అభయారణ్యాన్ని సందర్శించారు. మరో రెండు రోజుల్లో ఈపీటీఆర్‌ఐ ఈ అంశంపై వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ప్రతిపాదనలుసిద్ధం అవుతున్నాయి
మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. ఈ గుర్తింపు కోసం అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తు న్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీనికి అవసరమైన సమాచారాన్ని సేకరించి పంపుతున్నాం. ఎంతో జీవ వైవిధ్యం కలిగిన ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం – సి.శ్రీధర్‌రావు, డీఎఫ్‌ఓ, సంగారెడ్డి
అభయారణ్యం ప్రత్యేకతలివీ..
» సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో సదాశివ, పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో సుమారు 20 చదరపు కిలోమీటర్లలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
» ఈ అభయారణ్యంలో 303 రకాల పక్షులు నివాసం ఉంటున్నట్టు అటవీశాఖ గుర్తించింది. అందులో సుమారు 140 రకాల పక్షులు హిమాలయాలను దాటి ఇక్కడికి వలస వస్తాయి. వేసవి, వర్షాకాలం రెండు సీజన్లలోనూ విదేశీ పక్షులు వలస వచ్చి వెళుతుంటాయి. అందులో పెంటెడ్ స్టార్క్, ఫ్లెమింగో, బార్‌హెడెడ్ గూస్ వంటి పక్షులూ ఉన్నాయి. ళీ మొసళ్లు, ఇతర 14 రకాల ఉభయచరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 57 జాతులకు చెందిన చేపలు, 32 రకాల సీతాకోకచిలుకలకు ఈ ప్రాంతం ఆవాసం. ఈ జలాశయంలో తొమ్మిది చిన్న దీవులు ఉన్నాయి.
యునెస్కో గుర్తింపుతో ప్రయోజనాలివీ..
» ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. స్థానికంగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ పర్యాటకులు, పక్షి ప్రేమికులు ఈ ప్రాంతానికి వస్తారు.
» నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఇక్కడ స్టడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తుందని అటవీశాఖ వర్గాలు చెప్తున్నాయి.
» ఈ ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అలాగే యునెస్కో నుంచి నిధులు వస్తాయి.
» వెట్‌ల్యాండ్ అథారిటీ కూడా ఈ ప్రాంత సంరక్షణ కోసం నిధులు కేటాయించనుంది.
Comments
Please login to add a commentAdd a comment