Manjeera reservoir
-
‘యునెస్కో’ రూట్లో మంజీరా అభయారణ్యం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునేందుకు రాష్ట్ర అటవీశాఖ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా డ్యామ్‌కు, సింగూరు ప్రాజెక్టుకు మధ్య ఉన్న జలాశయం, తొమ్మిది చిన్న ద్వీపాలతో కూడి ఉన్న ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. మొసళ్లు సహా ఎన్నో రకాల జలచరాలు, వన్యప్రాణులు, వివిధ జాతుల పక్షులున్న ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్యమున్న చిత్తడి నేలగా గుర్తించారు. ఈ క్రమంలో అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు దక్కించుకునే అర్హతలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తించింది. మంజీరా అభయారణ్యాన్ని జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సమాచార క్రోడీకరణతో.. మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు సాధించేందుకు అవసరమైన అర్హతలు, ప్రతిపాదనలను శాస్త్రీయంగా సిద్ధం చేసేందుకు అటవీశాఖ ఈపీటీఆర్ఐ (ఎని్వరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో కలసి అధ్యయనం చేస్తోంది. ఈ అభయారణ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక అంశాలతో కూడిన ప్రాథమిక నివేదికను నేషనల్ వెట్‌ల్యాండ్ బోర్డుకు పంపారు. దాన్ని పరిశీలించిన బోర్డు మరికొన్ని వివరాలు పంపాలని కోరింది. ఈ మేరకు ఈపీటీఆర్ఐ, అటవీశాఖ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నాయి. అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎ.వాణిప్రసాద్ సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలసి అభయారణ్యాన్ని సందర్శించారు. మరో రెండు రోజుల్లో ఈపీటీఆర్ఐ ఈ అంశంపై వర్క్‌షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదనలుసిద్ధం అవుతున్నాయి మంజీరా అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. ఈ గుర్తింపు కోసం అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తు న్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీనికి అవసరమైన సమాచారాన్ని సేకరించి పంపుతున్నాం. ఎంతో జీవ వైవిధ్యం కలిగిన ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం – సి.శ్రీధర్‌రావు, డీఎఫ్ఓ, సంగారెడ్డి అభయారణ్యం ప్రత్యేకతలివీ.. » సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో సదాశివ, పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో సుమారు 20 చదరపు కిలోమీటర్లలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. » ఈ అభయారణ్యంలో 303 రకాల పక్షులు నివాసం ఉంటున్నట్టు అటవీశాఖ గుర్తించింది. అందులో సుమారు 140 రకాల పక్షులు హిమాలయాలను దాటి ఇక్కడికి వలస వస్తాయి. వేసవి, వర్షాకాలం రెండు సీజన్లలోనూ విదేశీ పక్షులు వలస వచ్చి వెళుతుంటాయి. అందులో పెంటెడ్ స్టార్క్, ఫ్లెమింగో, బార్‌హెడెడ్ గూస్ వంటి పక్షులూ ఉన్నాయి. ళీ మొసళ్లు, ఇతర 14 రకాల ఉభయచరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 57 జాతులకు చెందిన చేపలు, 32 రకాల సీతాకోకచిలుకలకు ఈ ప్రాంతం ఆవాసం. ఈ జలాశయంలో తొమ్మిది చిన్న దీవులు ఉన్నాయి. యునెస్కో గుర్తింపుతో ప్రయోజనాలివీ.. » ఈ అభయారణ్యానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. స్థానికంగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అంతర్జాతీయ పర్యాటకులు, పక్షి ప్రేమికులు ఈ ప్రాంతానికి వస్తారు. » నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఇక్కడ స్టడీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తుందని అటవీశాఖ వర్గాలు చెప్తున్నాయి. » ఈ ప్రాంతంలో జీవవైవిధ్యాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. అలాగే యునెస్కో నుంచి నిధులు వస్తాయి. » వెట్‌ల్యాండ్ అథారిటీ కూడా ఈ ప్రాంత సంరక్షణ కోసం నిధులు కేటాయించనుంది. -
మంజీరాకు నీళ్లు తేకపోతే ఉద్యమిస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: మంజీరా డ్యామ్‌కు నీళ్లు తేకుంటే ప్రజా ఉద్యమం చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు, ఆయన సతీమణి నిర్మల, కుమార్తె జయారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి నీళ్ల సమస్యపై అనేకసార్లు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గత మూడేళ్లుగా నీళ్లులేక మంజీరా డ్యామ్ బోసిపోయిందని పేర్కొన్నారు. దేశంలో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా పాలిస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌దేనన్నారు. నీళ్లు లేకున్నా ఎంపీ, రెండు మున్సిపల్ చైర్మన్ పదవులను ప్రజలు టీఆర్ఎస్కే కట్టబెట్టారని పేర్కొన్నారు. కనీస విలువలు లేని వ్యక్తులు కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. వచ్చే నెల 4న తెలంగాణ కాంగ్రెస్ బృందంతో మంజీరా డ్యామ్ పర్యటన చేపడతామని తెలిపారు. -
సింగూరు సిన్నబోయింది..
♦ ప్రాజెక్టు ఎండిపోవడంతో ముంచుకొచ్చిన ముప్పు ♦ తాగడానికి అనువైన నికర జలాలు 0.9 టీఎంసీలే ♦ మెతుకుసీమలోని 511 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ♦ మంజీరలో అందని నీళ్లు.. పరిశ్రమలకూ బందే.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టు ఎండిపోవడంతో మెదక్ జిల్లాలోని 500 గ్రామాలు తాగునీటికి తిప్పలు పడుతున్నాయి. దీనికితోడు జంటనగరాలకు తాగునీటిని అందించే మంజీర రిజర్వాయర్‌లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో కేవలం 1.45 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో 0.9 టీఎంసీలు మాత్రమే తాగడానికి అనుకూలం. మిగిలినదంతా బురదే. మెదక్ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లోని 511 గ్రామాలకు తాగునీటిని అందించే ఇన్‌టెక్ వెల్స్కు దూరంగా నీళ్లు వెళ్లిపోవడంతో ఆయా గ్రామాల వారు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. కొండాపూర్, జహీరాబాద్, రేగోడ్, తూప్రాన్, వర్గల్ మండలాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సంగారెడ్డి, సదాశివపేట, గజ్వేల్, దుబ్బాక మండలాలకు మూడు, నాలుగు రోజులకోసారి నీరు వదులుతున్నారు. ఇందులో కూడా రోజువారీగా సరఫరా చేయాల్సిన సగటు జలాల్లో కేవలం 30 శాతమే వదులుతున్నారు. దీంతో మంచి నీటికోసం జనం అవస్థలు పడుతున్నారు. డ్యామ్‌లో నీటి నిల్వలు లేకపోవడంతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉన్న నీటిని విద్యుత్ మోటార్ల ద్వారా తోడి హైదరాబాద్‌కు పంపిణీ చేస్తున్నారు. ఇలాగే నిరంతరాయంగా నీటిని తోడేస్తే కేవలం 10 రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోతుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగూరు నుంచి నీటిని తోడటం తక్షణమే నిలిపి వేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరినట్టు తెలిసింది. జంటనగరాల ప్రజల తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి జలాలను తరలించాలని హరీశ్ సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి మెట్రో వాటర్ వర్క్సు బోర్డు ఎండీకి ఫోన్ చేసి సింగూరు నుంచి నీళ్లు తోడటం నిలిపివేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వట్టిపోయిన మంజీరా నది గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రోజుకు 120 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్స్ పర్డే)నీటిని, దుబ్బాక, సంగారెడ్డి, గజ్వేల్, మెదక్ పటాన్చెరు,నియోజక వర్గాల దాహాన్ని తీర్చేందుకు, పరిశ్రమల అవసరాల కోసం మరో 50 ఎంజీడీ నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి నిత్యం విడుదల చేస్తున్నారు. నీటిని సరఫరా చేసే క్రమంలో మరో కనీసం 10 ఎంజీడీల జలం వృథా అవుతుందని అంచనా. ఈ లెక్కన చూస్తే రోజుకు 180ఎంజీడీ నీటిని సింగూరు నుంచి తోడేస్తున్నారు. 30 రోజులకు ఒక టీఎంసీలను తాగు అవసరాల కోసం వాడుకుంటున్నారు. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం కూడా పూర్తిగా అడుగంటి పోయింది. తాజా లెక్కల ప్రకారం సింగూరు ప్రాజెక్టులో 1.45 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీనిలో 0.05 టీఎంసీ నీళ్లు బురదగా ఉంటాయి. దీంతో నికరంగా కనిపించే ది 0.9 టీఎంసీల నీళ్లు మాత్రమే. అయితే ఈ జలాలు కేవలం 15 నుంచి 20 రోజుల వరకు మాత్రమే సరిపోతాయి. సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీరా రిజర్వాయర్ సైతం డెడ్‌స్టోరేజీ కంటే కిందిస్థాయికి చేరుకుంది. ప్రాజెక్టులో ఎఫ్ఆర్ఎల్ 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రస్తుతమైతే కేవలం 0.5 టీఎంసీల జలం మాత్రమే ప్రాజెక్టులో ఉన్నాయి. దీంతో ఇక్కడి నుంచి జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేసే పరిస్థితి కానరావటంలేదు. బోర్లు అద్దెకు తీసుకోండి : హరీశ్‌రావు నీటి సమస్యను తీర్చేందుకు రైతుల వద్ద నుంచి వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ బోర్లకు పైపులైన్లు బిగించి నేరుగా నీటి ట్యాంకర్లలోకి నీళ్లు ఎక్కించి పంపిణీ చేయాలని సూచించారు. బోర్లు అద్దెకు దొరకని చోట వెంటనే బోర్లు వేయించాలని, అవకాశం ఉన్న చోట వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకర్ల కిరాయి పెంచుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు పంపాలని సూచించారు. మరో 6 నెలల్లో వాటర్ గ్రిడ్ జలాలు కొన్ని ప్రాంతాలకు అందుతాయన్నారు.