Penchalakona
-
పెంచలకోన అభయారణ్యానికి ఈఎస్‌జెడ్ గుర్తింపు
విశాలమైన అటవీ ప్రాంతం. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, కోనలు. పర్యావరణం ప్రతిబింబానికి చిహ్నం. అడవి మాటున సంరక్షణ పొందుతున్న పక్షులు, జంతువుల జీవవైవిధ్యానికి నెలవైన ప్రాంతం పెంచలకోన అభయారణ్యం. 909 చ.కి.మీ. పరిధిలో విస్తరించిన పెంచల నరసింహస్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని అత్యంత సున్నితమైన పర్యావరణ ప్రాంతం (ఎకో సెన్సిటివ్ జోన్)గా గుర్తిస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ప్రకటించింది. ఇక నుంచి ఈ ప్రాంత సంరక్షణపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించనుంది. నెల్లూరు (బారకాసు): పెంచలకోన అభయారణ్యం.. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రాంతం. అటవీ ప్రాంతాన్ని, జంతువుల సంరక్షణకు అభయారణ్యాన్ని మరింత పటిష్ట పరిచేందుకు కేంద్ర అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందు కోసం కొంత కాలం క్రితం రాష్ట్ర అటవీశాఖ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర అటవీశాఖ ఆమోదిస్తూ పెంచల నరసింహస్వామి వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలోని 909 చ.కి.మీ.లను ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్)గా ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్ర అటవీశాఖ ప్రతిపాదనలతో కేంద్రం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జిల్లాలోని రాపూరు మండలంలో పెంచల నరసింహస్వామి (పెంచలకోన) పుణ్యక్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ పుణ్యక్షేత్రానికి చుట్టూ ఉండే పెంచలకోన దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రాష్ట్ర అటవీశాఖ సంరక్షణ చర్యలు చేపడుతోంది. నెల్లూరు జిల్లా నుంచి అటు వైఎస్సార్ జిల్లా నుంచి వరకు విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతాన్ని వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం (అభయారణ్యం)గా ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో వివిధ రకాల జంతువులతో పాటు దాదాపు 328 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎర్రచందనం, టేకుతో పాటు ఔషధ మొక్కలు, వనమూలికలు తదితర అటవీ ఉత్పత్తులు, ఖనిజ సంపద ఉన్నాయి. సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం వల్ల ఇక్కడ నీటి లభ్యతతో అనేక రకాల పక్షులు కూడా వస్తుంటాయి. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ తగిన చర్యలు చేపడుతోంది. 909 చ.కి.మీ. వైశాల్యంతో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతం వరకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం (అభయారణ్యం)గా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టం చేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో పరిశీలించిన కేంద్రం 909 చ.కి.మీ. సరిహద్దు వరకు సున్నితమైన పర్యావరణ ప్రాంతంగా (ఎకో సెన్సిటివ్ జోన్) ప్రకటించింది. పెంచల నరసింహస్వామి అభయారణ్యంలో చిరుత పులి, పెద్దపులి, ఎలుగు బంట్లు, చుక్క దుప్పులు, అడవి పందులు తదతర 20 రకాల జంతువులు ఉన్నాయి. ఆయా రకాల జంతువులన్నీ దాదాపు వేల సంఖ్యలో ఇక్కడి అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. 909 చ.కి.మీ. మేర ఉన్న పెంచల నరసింహ స్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 60 శాతం వైఎస్సార్ జిల్లాలో ఉండగా మిగిలిన 40 శాతం విస్తీర్ణం నెల్లూరు జిల్లాలోని రెండు రేంజ్ పరిధిలో ఆరు మండలాలు సంగం, పొదలకూరు, అనంతసాగరం, కలువాయి, చేజర్ల, రాపూరు ప్రాంతాల్లో ఉంది. మూడు విభాగాలుగా అభయారణ్యం ఈ అభయారణ్యాన్ని అటవీశాఖాధికారులు రెగ్యులేటెడ్, ప్రొహిబిటెడ్, పరిమిటెడ్ అనే మూడు విభాగాలుగా గుర్తించారు. ఇందులో రెగ్యులేటెడ్ విభాగానికి సంబంధించిన అటవీ ప్రాంత స్థలాల్లో ప్రజాప్రయోజనాల అవసరం నిమిత్తం రోడ్లు, నీటి సరఫరా తదితర మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపట్టడం జరుగుతోంది. ప్రొహిబిటెడ్ విభాగానికి సంబంధించి అడవులను నరకడం, జంతువులను వేటాడటం వంటివి నిషేధించి వాటిని సంరక్షించే చర్యలు చేపడుతోంది. పరిమిటెడ్ విభాగానికి సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా అటవీ ప్రాంతంలో కానీ లేక సమీప ప్రాంతంలో ఏమైనా పరిశ్రమలు ఏర్పాటు నెలకొల్పే ప్రయత్నం చేస్తే అందుకు అటవీశాఖాధికారులు పరిశీలించి తగు చర్యలు చేపట్టడం జరుగుతోంది. పెంచల నరసింహస్వామి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంకు ఎకో సెన్సిటివ్‌జోన్ మానటరింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో చైర్మన్‌గా వైఎస్సార్ జిల్లా కలెక్టర్ ఉంటారు. సభ్యులుగా పర్యావరణం ఎక్స్‌ఫర్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి, ప్రొద్దుటూరు డీఎఫ్ఓ, బయోడైవర్సిటీ ప్రతినిధులు ఉండగా డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. పెంచల నరసింహస్వామి అభయారణ్యాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధి చేయడం కోసం ప్రస్తుతం అటవీశాఖాధికారులు తీసుకుంటున్న చర్యలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర అటవీశాఖ ఈఎస్‌జెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీశాఖాధికారులకు అభయారణ్యాన్ని సంరక్షించేందుకు మరిన్ని అధికారులు ఇచ్చే అవకాశం ఉందని, అయితే కేంద్రం నుంచి రాష్ట్ర అటవీశాఖకు వచ్చిన నోటిఫికేషన్లో ఏమేమి నిబంధనలను పొందు పరిచారో తదితర వివరాలు తెలియాల్సి ఉందని ఆ శాఖ అధికారులంటున్నారు. -
11న బంగారు గరుడవాహన సేవ
రాపూరు : పెంచలకోనలో స్వయంభువుగా వెలిసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీన చిలుకద్వాదశిని పురస్కరించుకోని లక్ష్మీనరసింహస్వామిని బంగారు గరుడ వాహనంపై ఊరేగించనున్నటు ఆలయ ఈఓ రవీంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిలుక ద్వాదశి సందర్భంగా స్వామివారికి నిత్యకొలువుల అనంతరం శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిక్ష్మీదేవిని, చెంచులక్ష్మి దేవతల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై ఉంచి వివిధ రకాల పుష్పలు, ఆభరణాలతో అలంకరించి మేళతాళాలు మంగళవాయిద్యాలతో స్వామివారి ఉద్యానవనంలోకి తీసుకెళ్తారని తెలిపారు. అక్కడ స్వామి అమ్మవార్లకు పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చందనం, పసుపు, కుంకుమ, కొబ్బరినీరు, తులసీమాల, వివిధ పళ్లరసాలతో, 108 కలిశాల జలాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒంటిగంటకు కార్తీకవన భోజనాలు, సాయంత్రం ఆరు గంటలకు బంగారు గరుడవాహనంపై స్వామివారు కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. -
పెంచలకోనలో ఉచిత వైఫై సేవలు
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో క్షేత్ర వివరాలను తెలిపే వెబ్సైట్, ఉచిత వైఫై సేవలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వెబ్సైట్ ద్వారా కోనలో జరిగే నిత్య కార్యక్రమాలు తెలుసుకోవచ్చునని వివరించారు. వెబ్‌సైట్‌ను మారెళ్ల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సంపత్ రూపొందించినట్లు తెలిపారు. అలాగే పెంచలకోనలో సెల్ సిగ్నల్స్ అందక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. రూ.3లక్షల విలువ చేసే వైఫై హాట్‌స్పాట్‌ను హైదరాబాదుకు చెందిన సంస్థ ఉచితంగా అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నానాజీ, గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, ఈఓ శ్రీరామమూర్తి, ధర్మకర్తలు సోమయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు పెంచలయ్యస్వామి మాట్లాడారు. పవిత్రోత్సవాలు మూడు రోజల పాటు జరుగుతాయని చెప్పారు. స్వామివారికి ప్రత్యేకంగా పట్టుతో తయారు చెసిన పవిత్ర మాలలకు వివిధ పూజలు నిర్వహించి స్వామి వారి మీద ఉంచి అభిషేకం చేస్తారని వివరించారు. మంగళవారం రాత్రి స్వామి వారి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల నుంచి పుట్టమట్టిని తీసుకొచ్చి అందులో నవధాన్యాలను కలిపి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవస్థాన అధ్యక్షుడు నానాజీ, పాలకవర్గ సభ్యులు సోమయ్య, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితుడు రామానుజాచార్యుల స్వామి, అర్చకులు చందుస్వామి, శశిస్వామి, నాగరాజస్వామి, ఉభయకర్త అమరా శ్రీరాములుశెట్టి, తదితరులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైనపెంచలకోనలో శ్రీవారి కల్యాణాన్ని శనివారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. 11 గంటలకు నిత్య కల్యాణమండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి కల్యాణం జరిపారు. మధ్యాహ్న అన్నదానం చేశారు. సాయంత్రం 6గంటలకు ఉత్సవవిగ్రహాలను తిరుచ్చిపై సహస్రదీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి ఊంజల్‌సేవ నిర్వహించారు. -
పెంచలకోనలో శాస్త్రోక్తంగా వరుణయాగం
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరుణ యాగాన్ని ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి పుష్కరిణిలో అర్చకులు వరుణ జపం నిర్వహించారు. అనంతరం స్వామివారి ముఖమండపంలో వర్షాలు కురిసేందుకు వరుణయాగం నిర్వహించారు. అనంతరం స్వామి వారి అంత్రాలయంలో మూలమూర్తికి 108 కలశాల్లోని జలాలు, సుగంధ ద్రవ్యాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, రామయ్యస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురవాలని, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరుణయాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయపాలకవర్గ అధ్యక్షుడు తానంకి నానాజీ, పాలకవర్గసభ్యులు సోమయ్య, జ్యోతమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ఊంజల్‌సేవ
రాపూరు: పెంచలకోనలో కొలువైన పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి శనివారం రాత్రి ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి సుప్రభాతసేవ, 6 గంటలకు అభిషేకం, 7 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. ఉదయం 11గంటలకు నిత్య కల్యాణ మండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి,చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై సహస్రదీపాలంకరణ మండపంలో కొలువుదీర్చి ఊంజల్‌సేవ నిర్వహించారు. -
పెంచలకోన భూములపై ’’తమ్ముళ్ల’ కన్ను!
–రూ.3 లక్షలు విలువ చేసే కలప అక్రమంగా నరికివేత –చోద్యం చూస్తున్న దేవస్థానం అధికారులు చేజర్ల: పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మినరసింహ స్వామి భూములపై తమ్ముళ్లు కన్ను వేశారు. అక్రమంగా కలప నరికివేసి తరలిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే: మండలంలోని మైపాటివారి కండ్రికలో పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామికి 7.72 ఎకరాల భూమి ఉంది. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ భూమిలో ఉన్న కలపపై కన్నేశాడు. సర్వే నెం.137/2లో 3.72 ఎకరాలు, సర్వే నెం.89/2లో 3.17 ఎకరాల భూమిలో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే 60 టన్నుల కలప అక్రమంగా నరికి సొమ్ము చేసుకున్నాడు. అయితే 2016–19 సంవత్సరానికి లీజుకు పాట పాడిన కౌలుదారుడు 26వ తేదీ అధికారులతో అక్కడికి వెళ్లగా అవాక్కయ్యారు. పొలంలో ఉన్న విలువైన వేప, తెల్లతుమ్మ, చింత, కుంకుడు, కర్రతుమ్మ తదితర జాతులకు చెందిన కలప అక్రమంగా నరికివేశారు. వాటిని పరిశీలించిన అధికారులు ఐదు రోజులు కావస్తున్నా పెంచలకోన అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఈ ఘటనపై విచారణ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇకనైనా అధికారులు స్పందించి రాజకీయాలకు అతీతంగా దేవుడి భూములు కాపాడాలని, తక్షణమే కలప నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం –శనగవరం శ్రీరామమూర్తి, పెంచలకోన ఆలయ ఈఓ మైపాటివారికండ్రికలో దేవాలయ భూములను కలప నరికి వేత ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -
గురుపూజోత్సవం
రాపూరు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆదివారం గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణ మండపంలో సరస్వతీదేవి జన్మనక్షత్రం రోజైన ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన పండితులను, గురువులను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నానాజీ, దేవాదాయశాఖ అధికారులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా గురువులను పూజించి, సన్మానించిన ఘనత పెంచలకోన దేవస్థానానిదేనని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. అంతకుముందు కోనకు వచ్చిన పండితులు, గురువులు వేదపారాయణం చేశారు. అనంతరం చతుర్వేద పండితులు వంగల రామ్మూర్తి ఘనాపాఠి, మల్లికార్జున అవధాని, సత్యనారాయణాచార్యులు, నారాయణాచార్యులు, సంపత్‌కుమార్, అనంత వేంకట దీక్షితులు, శ్రీనివాసాచార్యులు, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనాపాఠి, చంద్రశేఖర అవధాని, రామకృష్ణశర్మ అవధాని, చైతన్యశర్మ అవధాని, చంద్రశేఖర అవధాని, అన్నపూర్ణయ్య ఘనాపాఠి, రాజేశ్వరశాస్త్రి, సీతారామయ్య, పెంచలయ్య, కృష్ణమూర్తి అవధాని, కంతేటి త్రినాథ్ అవధాని, నరసింహరావులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, దేవాదాయ ధర్మాదాయ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రారెడ్డి, ఈవో శ్రీరామమూర్తి, పాలకవర్గసభ్యులు సోమయ్య, గోపాల్, హిందూ ధర్మపరిషత్ కోఆర్టినేటర్ సునీల్, అమరా శ్రీరాములశ్రేష్టి పాల్గొన్నారు. -
'కూర్చోండి.. లేకుంటే బయటకు వెళ్లండి'
నెల్లూరు: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యురాలు పెంచలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పెంచలమ్మను సమావేశం హాలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తొలగించేందుకు టీడీపీ సభ్యులు యత్నించడంతో నిబంధనలు ఉల్లంఘించొద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఆరుగురు వైఎస్ఆర్ సీపీ జడ్పీటీసీ సభ్యులు టీడీపీ వరుసలోకి వెళ్లారు. ఆయా పార్టీ సభ్యులు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలని కలెక్టర్ సూచించారు. వారు పట్టించుకోకపోవడంతో బయటకు వెళ్లిపోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో నలుగురు వైఎస్ఆర్ సీపీ సభ్యులను పోలీసులు బయటకు పంపారు. అయితే ఇద్దరు మాత్రం లోపలే ఉన్నారు. సీక్రెట్ ఓటింగ్ జరిపించాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం రేగింది. టీడీపీ సభ్యుల డిమాండ్ ను కలెక్టర్ తిరస్కరించారు.