11న బంగారు గరుడవాహన సేవ
రాపూరు : పెంచలకోనలో స్వయంభువుగా వెలిసిన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీన చిలుకద్వాదశిని పురస్కరించుకోని లక్ష్మీనరసింహస్వామిని బంగారు గరుడ వాహనంపై ఊరేగించనున్నటు ఆలయ ఈఓ రవీంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చిలుక ద్వాదశి సందర్భంగా స్వామివారికి నిత్యకొలువుల అనంతరం శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిక్ష్మీదేవిని, చెంచులక్ష్మి దేవతల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై ఉంచి వివిధ రకాల పుష్పలు, ఆభరణాలతో అలంకరించి మేళతాళాలు మంగళవాయిద్యాలతో స్వామివారి ఉద్యానవనంలోకి తీసుకెళ్తారని తెలిపారు. అక్కడ స్వామి అమ్మవార్లకు పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చందనం, పసుపు, కుంకుమ, కొబ్బరినీరు, తులసీమాల, వివిధ పళ్లరసాలతో, 108 కలిశాల జలాలతో అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒంటిగంటకు కార్తీకవన భోజనాలు, సాయంత్రం ఆరు గంటలకు బంగారు గరుడవాహనంపై స్వామివారు కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు.