పవిత్రోత్సవాలకు అంకురార్పణ
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు పెంచలయ్యస్వామి మాట్లాడారు. పవిత్రోత్సవాలు మూడు రోజల పాటు జరుగుతాయని చెప్పారు. స్వామివారికి ప్రత్యేకంగా పట్టుతో తయారు చెసిన పవిత్ర మాలలకు వివిధ పూజలు నిర్వహించి స్వామి వారి మీద ఉంచి అభిషేకం చేస్తారని వివరించారు. మంగళవారం రాత్రి స్వామి వారి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల నుంచి పుట్టమట్టిని తీసుకొచ్చి అందులో నవధాన్యాలను కలిపి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవస్థాన అధ్యక్షుడు నానాజీ, పాలకవర్గ సభ్యులు సోమయ్య, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితుడు రామానుజాచార్యుల స్వామి, అర్చకులు చందుస్వామి, శశిస్వామి, నాగరాజస్వామి, ఉభయకర్త అమరా శ్రీరాములుశెట్టి, తదితరులు పాల్గొన్నారు.