మంగళవారం రాత్రి విద్యుత్ వెలుగుల్లో యాదాద్రి ఆలయం
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం స్వస్తివాచనంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచారాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు మార్చి 3 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధానాలయాన్ని పూల మాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించడంతో బంగారు వర్ణంలో శోభాయమానంగా ఆకట్టుకుంటోంది.
0గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధన, ఉపాచారాల అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం నిర్వహించారు. విష్వక్సేనుడు సమస్త సేవా నాయకులకు అధిపతి. అంటే.. సర్వసైనాధ్యక్షుడు కావడంతో ఈయనను ఈ ఉత్సవాలకు ఉద్యుక్తున్ని చేయడమే ఈ పూజ ప్రత్యేకత. అలాగే ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి మంత్రోచ్ఛారణల మధ్య వాటికి ప్రత్యేక పూజలు చేశారు.
రక్షాబంధనం
ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్షను తీసుకోవడమే రక్షాబంధనం. గర్భాలయంలో స్వామివారి వద్ద కంకణాలకు పూజ చేసి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం అర్చకులు.. చైర్మన్ బి.నర్సింహమూర్తి, దేవస్థానం ఈఓ గీతారెడ్డిలకు రక్షాబంధనం చేశారు.
అంకురార్పణ సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పోచంపల్లి పట్టు ధోవతి, కండువా, చీర సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు అగ్ని పరీక్ష, ధ్వజారోహణం, రాత్రి 7.30 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, హవనము జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment