యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభూలు కొలువైన ప్రధానాలయంలో భక్ష్యా లు తయారు చేసి, షడ్రుచులతో సిద్ధం చేసిన పచ్చడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి, అమ్మవార్లకు నివేదించారు.
సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి మాఢ వీధుల్లో సేవోత్సవం జరిపించారు. తూర్పు రాజగోపురం ముందు అధిష్టించి ఆచార్యులు పంచాగ పఠనం చేశారు. యాదాద్రి నృసింహస్వామిది తులా రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది మేషరాశి కాగా ఆదాయం 5, వ్యయం 5, ఆండాళ్ అమ్మవారిది సింహ రాశి కాగా ఆదాయం 14 వ్యయం 2 ఉన్నట్లు ఆచార్యులు వివరించారు.
శ్రీశోభకృత్‌లో భక్తులతో పాటు ప్రజలంతా ఆనందంగా ఉంటారని ఆచార్యులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని, వడగళ్లు సైతం పడతాయని తెలిపారు. రైతాంగానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కలసి వచ్చే అంశం అని అన్నారు. వేసవిలో ఎండలు దంచి కొడతాయన్నారు.
ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి వైరస్ ప్రజలకు సోకదని తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, పండితులు, పురోహితులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment