Lakshminarasimhaswamy
-
గుట్టపైనే అన్ని సేవలు..!
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపైనే అన్ని సేవలు పునరుద్ధరించాలని భక్తజనులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా భక్తుల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఆలయ విస్తరణ, అభివృద్ధితో భక్తులు కోరుకునే మహిమాన్విత పవిత్ర సేవలను కొండపైనుంచి కిందికి తరలించారు. దీంతో పుణ్యక్షేత్రంలో ప్రాశస్త్యం లోపిస్తుందని భక్తులు అంటున్నారు. దీనికి తోడు కొండపైన వసతుల లేమి భక్తులకు ఇబ్బందిగా మారింది. అన్నీ గుట్ట కిందనే...: కొండపైన ఆలయ విస్తరణ, అభివృద్ధికి ముందు యాదగిరిగుట్టలో భక్తులకు అన్ని వసతులు కొండపైనే ఉండేవి. వేలాది మంది భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని రకాల సేవలను కొండపైనే పొందేవారు. రాత్రి నిద్ర గుట్టపైనే చేసేవారు. ప్రధానంగా కల్యాణకట్ట(తలనీలాలు సమరి్పంచడం), సత్యనారాయణస్వామి వ్రతాలు, విష్ణుపుష్కరిణి (స్నాన గుండం), రాత్రి నిద్ర చేయడం, అన్నప్రసాద వితరణ సేవలను కొండకిందకు మార్చారు. దీంతో కొండపైన సేవలందకపోవడంతో భక్తి భావం కొరవడిందంటున్నారు. డార్మెటరీ హాల్ నిర్మాణం: కొండపైన గతంలో బాలాలయం ఉన్నచోట డార్మెటరీ హాల్ నిర్మిస్తే రాత్రి నిద్ర చేయవచ్చని భక్తులు కోరుతున్నారు. కొండపైన నిర్మించిన రెండు భవనాల్లో అన్నదానం, సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగించవచ్చు. కొండపైన మరో చోట కల్యాణ కట్ట ఏర్పాటు చేసి ఎంతో విశి ష్టత కలిగిన విష్ణు పుష్కరిణిలో భక్తుల స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి క్షేత్రంపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు. భక్తుల వసతులకు ప్రాధాన్యం ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కొండపైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించాం. రూ.20 కోట్లతో డార్మెటరీ భవనం నిర్మించాలని నిర్ణయించాం. కొండపైన వసతులు కల్పిస్తాం. ఆలయ ప్రాశస్త్యం కొనసాగిస్తాం. – బీర్ల అయిలయ్య, ఆలేరు ఎమ్మెల్యే తలనీలాల సమర్పణ కొండపైనే ఉండాలి యాదాద్రి పునరి్నర్మాణం తర్వాత మొదటిసారిగా దర్శించుకున్నాం. పాతగుడి ఉన్నప్పుడు ఒకసారి వచ్చాం, అప్పుడు తలనీలాలు గుడిపైనే తీసేవారు. ఇప్పుడు మాత్రం తలనీలాలను కొండ కింద తీస్తున్నారు. తలనీలాలు అర్పించి కొండపైకి దర్శనానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. దేవుని కొండపైన తలనీలాలను ఏర్పాటు చేస్తేనే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ భక్తులకు కావాల్సిన కనీస వసతులు కనబడడం లేదు. బాత్రూమ్లు కూడా సరిగ్గా లేవు. – మేతరి దశరథ, భక్తుడు, నిజామాబాద్ ప్రాంగణంలో నిద్రిస్తే ప్రశాంతత ఉండేది లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాం. గతంలో దర్శనానికి వచ్చినప్పుడు నారసింహుడి సన్నిధిలో కొండపైన రాత్రి వేళల్లో నిద్రపోయే వాళ్లం. మాకు ఆధ్యాతి్మక భావన కలిగేది. ఇప్పుడు కొత్త గుడి కట్టాక అన్ని వసతులు మార్చేశారు. అసలు కొండపైన నిద్రపోవడానికి అనుమతి లేకుండా పోయింది. కిందనే నిద్రించి పైకి రావడానికి అవస్థలు పడుతున్నాం. అసలే నడవలేని స్థితిలో ఉన్న నాలాంటి వారు కింద బస చేసి, మళ్లీ పైకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. – ఎస్.బుచ్చమ్మ, భక్తురాలు, హైదరాబాద్ కొండపైనే పుష్కరిణి ఉండాలి గుట్టలో రాత్రి బస చేశాం. ఉదయం ఆలయానికి బస్సులో పోమ్మని చె ప్పారు. బస్సెక్కాక మమ్మల్ని ఆల య బస్టాప్ దగ్గర దింపి గుండంకిందనే ఉంటుందని, అక్కడే స్నానం చేయాలని సూచించారు. దీంతో గుండం వద్దకి వెళ్లి స్నా నాలు చేసి అనంతరం కొండపైకి వెళ్లి దర్శనాలు పూర్తిచేసుకున్నాం. పుష్కరిణి కింద ఉండటంతో చాలా అవస్థలు పడ్డాం. గతంలో మాదిరిగా కొండపైనే పుష్కరిణి ఉంటే అక్కడే స్నానం చేసి, దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం దక్కుతుంది. – సత్యనారాయణ. భక్తుడు, శంషాబాద్ -
శ్రీస్వామి వారి ఆదాయం 14, వ్యయం 11
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభూలు కొలువైన ప్రధానాలయంలో భక్ష్యా లు తయారు చేసి, షడ్రుచులతో సిద్ధం చేసిన పచ్చడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి, అమ్మవార్లకు నివేదించారు. సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి మాఢ వీధుల్లో సేవోత్సవం జరిపించారు. తూర్పు రాజగోపురం ముందు అధిష్టించి ఆచార్యులు పంచాగ పఠనం చేశారు. యాదాద్రి నృసింహస్వామిది తులా రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది మేషరాశి కాగా ఆదాయం 5, వ్యయం 5, ఆండాళ్ అమ్మవారిది సింహ రాశి కాగా ఆదాయం 14 వ్యయం 2 ఉన్నట్లు ఆచార్యులు వివరించారు. శ్రీశోభకృత్లో భక్తులతో పాటు ప్రజలంతా ఆనందంగా ఉంటారని ఆచార్యులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని, వడగళ్లు సైతం పడతాయని తెలిపారు. రైతాంగానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కలసి వచ్చే అంశం అని అన్నారు. వేసవిలో ఎండలు దంచి కొడతాయన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి వైరస్ ప్రజలకు సోకదని తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, పండితులు, పురోహితులు పాల్గొన్నారు. -
మార్చి 4న యాదాద్రికి అఖండ జ్యోతి
యాదగిరిగుట్ట/భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్చి 4న స్వామివారి అఖండజ్యోతి యాదగిరిగుట్టకు రానున్నట్లు అఖండ జ్యోతి యాత్ర చైర్మన్ ఎం.ఎస్.నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి అఖండజ్యోతి ఉత్సవ విగ్రహాలు హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో గణేశ్ అనే కళాకారుడు తయారు చేస్తున్నారని చెప్పారు. ఈనెల 28న సాయంత్రం అఖండ జ్యోతి పూజ జరుగుతుందని, అదే రోజు రాత్రి బర్కత్‌పురాలోని యాదగిరి భవన్‌కు యాత్ర చేరుకుంటుందని వెల్లడించారు. మార్చి 1న ఉదయం 10 గంటలకు బర్కత్‌పురా చౌరస్తాలోని యాదగిరి భవన్ నుంచి అఖండజ్యోతి యాత్ర ప్రారంభమై అదే రోజు రాత్రి ఉప్పల్ చౌరస్తాకు చేరుకుంటుందని తెలిపారు. 2న ఉప్పల్ నుంచి బయల్దేరి రాత్రి ఘట్కేసర్ కేఎల్ఆర్ గార్డెన్‌కు, 3న ఉదయం ఘట్కేసర్ నుంచి బయల్దేరి రాత్రి భువనగిరిలోని నల్లగొండ క్రాస్‌రోడ్‌కు వస్తుందన్నారు. అక్కడ రాత్రి బస చేసి 4న ఉదయం భువనగిరి నుంచి బయల్దేరి రాత్రి యాదగిరిగుట్ట చేరుకుంటుందని వివరించారు. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అధికారులకు అఖండ జ్యోతిని అప్పగిస్తామని పేర్కొన్నారు. -
బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం ద్వారా అంకుర్పారణ జరిగింది. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారాకనాథాచార్యులు అధ్వర్యంలో వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహా మంగళహారతి, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనారసింహుడిని ప్రత్యేక పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.శాంతిహోమం, ప్రాకారోత్సవ కార్యక్రమాలు వేదపండితుల సమక్షంలో నిర్వహించారు. ఈఓ రమేష్‌బాబు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎస్ఆర్ కన్‌స్ర్టక్షన్స్ అధినేత ఆమిలినేని సురేంద్ర సహకారంతో ఆలయం చుట్టూ మట్టితో చదును చేయించామన్నారు.