గుట్టపైనే అన్ని సేవలు..! | All services on Yadagiri gutta | Sakshi
Sakshi News home page

గుట్టపైనే అన్ని సేవలు..!

Published Wed, Feb 7 2024 2:10 AM | Last Updated on Wed, Feb 7 2024 2:10 AM

All services on Yadagiri gutta - Sakshi

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టపైనే అన్ని సేవలు పునరుద్ధరించాలని భక్తజనులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ కూడా భక్తుల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో జరిగిన ఆలయ విస్తరణ, అభివృద్ధితో భక్తులు కోరుకునే మహిమాన్విత పవిత్ర సేవలను కొండపైనుంచి కిందికి తరలించారు. దీంతో పుణ్యక్షేత్రంలో ప్రాశస్త్యం లోపిస్తుందని భక్తులు అంటున్నారు. దీనికి తోడు కొండపైన వసతుల లేమి భక్తులకు ఇబ్బందిగా మారింది.  

అన్నీ గుట్ట కిందనే...: కొండపైన ఆలయ విస్తరణ, అభివృద్ధికి ముందు యాదగిరిగుట్టలో భక్తులకు అన్ని వసతులు కొండపైనే ఉండేవి. వేలాది మంది భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అన్ని రకాల సేవలను కొండపైనే పొందేవారు. రాత్రి నిద్ర గుట్టపైనే చేసేవారు. ప్రధానంగా కల్యాణకట్ట(తలనీలాలు సమరి్పంచడం), సత్యనారాయణస్వామి వ్రతాలు, విష్ణుపుష్కరిణి (స్నాన గుండం), రాత్రి నిద్ర చేయడం, అన్నప్రసాద వితరణ సేవలను కొండకిందకు మార్చారు. దీంతో కొండపైన సేవలందకపోవడంతో భక్తి భావం కొరవడిందంటున్నారు.  

డార్మెటరీ హాల్‌ నిర్మాణం: కొండపైన గతంలో బాలాలయం ఉన్నచోట డార్మెటరీ హాల్‌ నిర్మిస్తే రాత్రి నిద్ర చేయవచ్చని భక్తులు కోరుతున్నారు. కొండపైన నిర్మించిన రెండు భవనాల్లో అన్నదానం, సత్యనారాయణస్వామి వ్రతాలు కొనసాగించవచ్చు. కొండపైన మరో చోట కల్యాణ కట్ట ఏర్పాటు చేసి ఎంతో విశి ష్టత కలిగిన విష్ణు పుష్కరిణిలో భక్తుల స్నానాలు చేసేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి క్షేత్రంపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని కోరుతున్నారు. 

భక్తుల వసతులకు ప్రాధాన్యం 
ప్రభుత్వం భక్తుల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. కొండపైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించాం. రూ.20 కోట్లతో డార్మెటరీ భవనం నిర్మించాలని నిర్ణయించాం. కొండపైన వసతులు కల్పిస్తాం. ఆలయ ప్రాశస్త్యం కొనసాగిస్తాం. – బీర్ల అయిలయ్య, ఆలేరు ఎమ్మెల్యే  

తలనీలాల సమర్పణ కొండపైనే ఉండాలి  
యాదాద్రి పునరి్నర్మాణం తర్వాత మొదటిసారిగా దర్శించుకున్నాం. పాతగుడి ఉన్నప్పుడు ఒకసారి వచ్చాం, అప్పుడు తలనీలాలు గుడిపైనే తీసేవారు. ఇప్పుడు మాత్రం తలనీలాలను కొండ కింద తీస్తున్నారు. తలనీలాలు అర్పించి కొండపైకి దర్శనానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది. దేవుని కొండపైన తలనీలాలను ఏర్పాటు చేస్తేనే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ భక్తులకు కావాల్సిన కనీస వసతులు కనబడడం లేదు. బాత్రూమ్‌లు కూడా సరిగ్గా లేవు.  – మేతరి దశరథ, భక్తుడు, నిజామాబాద్‌ 

ప్రాంగణంలో నిద్రిస్తే ప్రశాంతత ఉండేది 
లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తాం. గతంలో దర్శనానికి వచ్చినప్పుడు నారసింహుడి సన్నిధిలో కొండపైన రాత్రి వేళల్లో నిద్రపోయే వాళ్లం. మాకు ఆధ్యాతి్మక భావన కలిగేది. ఇప్పుడు కొత్త గుడి కట్టాక అన్ని వసతులు మార్చేశారు. అసలు కొండపైన నిద్రపోవడానికి అనుమతి లేకుండా పోయింది. కిందనే నిద్రించి పైకి రావడానికి అవస్థలు పడుతున్నాం. అసలే నడవలేని స్థితిలో ఉన్న నాలాంటి వారు కింద బస చేసి, మళ్లీ పైకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి.      – ఎస్‌.బుచ్చమ్మ, భక్తురాలు, హైదరాబాద్‌ 

కొండపైనే పుష్కరిణి ఉండాలి 
గుట్టలో రాత్రి బస చేశాం. ఉదయం ఆలయానికి బస్సులో పోమ్మని చె ప్పారు. బస్సెక్కాక మమ్మల్ని ఆల య బస్టాప్‌ దగ్గర దింపి గుండంకిందనే ఉంటుందని, అక్కడే స్నానం చేయాలని సూచించారు. దీంతో గుండం వద్దకి వెళ్లి స్నా నాలు చేసి అనంతరం కొండపైకి వెళ్లి దర్శనాలు పూర్తిచేసుకున్నాం. పుష్కరిణి కింద ఉండటంతో చాలా అవస్థలు పడ్డాం. గతంలో మాదిరిగా కొండపైనే పుష్కరిణి ఉంటే అక్కడే స్నానం చేసి, దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం దక్కుతుంది.  – సత్యనారాయణ. భక్తుడు, శంషాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement