పెంచలకోన భూములపై ’’తమ్ముళ్ల’ కన్ను!
–రూ.3 లక్షలు విలువ చేసే కలప అక్రమంగా నరికివేత
–చోద్యం చూస్తున్న దేవస్థానం అధికారులు
చేజర్ల:
పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మినరసింహ స్వామి భూములపై తమ్ముళ్లు కన్ను వేశారు. అక్రమంగా కలప నరికివేసి తరలిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే:
మండలంలోని మైపాటివారి కండ్రికలో పెంచలకోన శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామికి 7.72 ఎకరాల భూమి ఉంది. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఈ భూమిలో ఉన్న కలపపై కన్నేశాడు. సర్వే నెం.137/2లో 3.72 ఎకరాలు, సర్వే నెం.89/2లో 3.17 ఎకరాల భూమిలో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే 60 టన్నుల కలప అక్రమంగా నరికి సొమ్ము చేసుకున్నాడు. అయితే 2016–19 సంవత్సరానికి లీజుకు పాట పాడిన కౌలుదారుడు 26వ తేదీ అధికారులతో అక్కడికి వెళ్లగా అవాక్కయ్యారు. పొలంలో ఉన్న విలువైన వేప, తెల్లతుమ్మ, చింత, కుంకుడు, కర్రతుమ్మ తదితర జాతులకు చెందిన కలప అక్రమంగా నరికివేశారు. వాటిని పరిశీలించిన అధికారులు ఐదు రోజులు కావస్తున్నా పెంచలకోన అధికారులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై ఈ ఘటనపై విచారణ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇకనైనా అధికారులు స్పందించి రాజకీయాలకు అతీతంగా దేవుడి భూములు కాపాడాలని, తక్షణమే కలప నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం –శనగవరం శ్రీరామమూర్తి, పెంచలకోన ఆలయ ఈఓ
మైపాటివారికండ్రికలో దేవాలయ భూములను కలప నరికి వేత ఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.