![TDP MLA involved in smuggling jamail tree](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/45455.jpg.webp?itok=Am8u3VP-)
జామాయిల్ కర్రను కాజేస్తున్న వైనం
అనుచరులను పెట్టి అక్రమ రవాణా చేయిస్తున్న ఎమ్మెల్యే
పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, సీఐడీ
అక్రమ సంపాదనలో వాటాకు లోకేశ్ అనుచరుడు పేచీ
పట్టించుకోని ఎమ్మెల్యే అనుచరులు
తహసీల్దార్‌కు, ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదులు
స్పందన లేకపోవడంతో నేరుగా రంగ ప్రవేశం
కర్ర రవాణా లారీకి అడ్డంగా కారు పెట్టి మంత్రాంగం
కారు అద్దాలు పగులకొట్టిన ఎమ్మెల్యే వర్గీయులు
ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు పుష్పాను మించిపోయారు. అగ్రిగోల్డ్ ఆస్తులు తమ్ముళ్లకు అక్షయపాత్రగా మారాయి. అనాదీనంగా పడి ఉన్న ఆ సంస్థ భూముల్లోని రూ.కోట్ల విలువైన జామాయిల్ కర్రను కొల్లగొట్టేస్తున్నారు. సీఐడీ పర్యవేక్షణలో ఉన్న ఈ భూముల్లోని సంపదను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. మంత్రి లోకేశ్ అనుచరుడు అక్రమ సంపాదనలో వాటా ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంలో తగ్గేదే లేదంటూ.. ప్రజాప్రతినిధి వర్గం తెగేసి చెప్పడంతో తమ్ముళ్ల మధ్య చిచ్చు రేగింది.
సాక్షి నెల్లూరు: ప్రభుత్వ అదీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో సంపద దోచుకునేందుకు తమ్ముళ్లు పుష్పా సినిమా తరహాలో వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు పచ్చనేతల మధ్య చిచ్చు రేపాయి. వరికుంటపాడు మండలం భాస్కరపురం రెవెన్యూ పరిధిలో అగ్రిగోల్డ్ సంస్థ భూములు ఉన్నాయి. ఆ భూముల్లోని విలువైన జామాయిల్ కర్రను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన అనుచరులను పెట్టి అక్రమంగా నరికి స్వాహా చేస్తున్నారు. పది రోజులుగా జరుగుతున్న ఈ దందాపై ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. పుష్పా తరహాలో రాత్రి పగలు తేడా లేకుండా జామాయిల్ కర్ర అక్రమ రవాణా జరుగుతున్నా.. రెవెన్యూ, పోలీ స్, సీఐడీ అధికార యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ అధినాయకత్వం కూడా పట్టీపట్టనట్లు ఉండిపోయింది.
వాటా కోసం లోకేశ్ అనుచరుడు రచ్చ
అగ్రిగోల్డ్ సంపదను కాపాడి బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని కంచే చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధి తమ అనుచరుల ద్వారా ‘కర్ర’ స్కామ్‌కు పాల్పడుతున్నారు. రూ.కోట్లు విలువ చేసే కలప సంపదలో తన వాటా సంగతి ఏమిటంటూ మంత్రి లోకేశ్ అనుచురుడు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బి.వెంగళరావు (ఇతని సొంతూరు దుత్తలూరు మండలం ఏరుకొల్లు) పేచీ పెట్టి.. రచ్చ చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం కర్ర నరికే ప్రాంతం కనియంపాడు వెళ్లి మకాం పెట్టారు.
ఈ విషయం తెలుసున్న ఎమ్మెల్యే అనుచరుడు మండలానికి చెందిన ఓ టీడీపీ నేతను రంగంలోకి దింపి, సమస్య లేకుండా రాజీ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లోకేశ్ అనుచరుడు సోమవారం నేరుగా అక్రమంగా జామాయిల్ కర్ర నరికే కనియంపాడు భూముల్లోకి మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్లారు. అక్కడ లోడ్ చేసి బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న లారీ ముందు దారికి అడ్డంగా కారు పెట్టాడు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లి తిరిగి వచ్చే లోపు ఎమ్మెల్యే అనుచరులు కారు అద్దాలు «ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దోపిడీని ప్రశ్నించేదెవరు?
ప్రజల సొత్తును అక్రమార్కులు దోచేస్తుంటే వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, పోలీసులు, సీఐడీ, రెవెన్యూ యంత్రాంగం నోరు మెదపడం లేదు. బాధితుల తరఫున ఉద్యమాలు చేసిన ప్రతిపక్ష పారీ్టలు, ప్రజా సంఘాలు మౌనవ్రతం పాటిస్తున్నాయి. చిన్న తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పోలీసు యంత్రాంగం కళ్లేదుటే దోపిడీ జరుగుతున్నా పట్టించుకోకపోవడం చూసి ప్రజలు మండిపడుతున్నారు.
భూముల్లో రూ.50 కోట్ల సంపద
అగ్రిగోల్డ్ సంస్థ డిపాజట్‌దార్లు నుంచి సేకరించిన నగదుతో ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలం భాస్కరపురం, కనియంపాడు, తూర్పుపాళెంతో పాటు దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం, కలిగిరి మండలాల్లో 17 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. అందులో దాదాపు 15 వందల ఎకరాల్లో జామాయిల్ సాగు చేశారు. ఈ భూముల్లో సాగులో ఉన్న కర్ర సంపద సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ప్రస్తుతం వరికుంటపాడు మండలంలో రూ.10 కోట్లు విలువ చేసే జామాయిల్ కర్రను నరికి స్వాహా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment