అధికారం వచ్చింది... ఆక్రమించేద్దాం..!
ఊరబందను కబ్జాచేసిన టీడీపీ నేత
పొలంగా మార్చేసి నీలగిరి మొక్కలు నాటిన వైనం
దాని విలువ రూ.4కోట్లుగా పేర్కొంటున్న స్థానిక రైతులు
అశోక్, అదితి గజపతిరాజుల ఇలాఖాలో పెట్రేగిపోతున్న తెలుగు తమ్ముళ్లు
రెవెన్యూ అధికారులపై అధికార పార్టీ నేతల బెదిరింపు!
చర్యలకు వెనుకాడుతున్న రెవెన్యూ సిబ్బంది
అధికార బలంతో ముందుగా అధికారులపై జులుం ప్రదర్శించడం.. భయకంపితులను చేయడం.. అనంతరం ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం.. అక్రమాలకు పాల్పడడం.. ఇదీ టీడీపీ నేతల దురాక్రమణ సిద్ధాంతం. ప్రజలు ఇచ్చిన అధికార బలంతో చెలరేగిపోతున్నారు. రైతులు, పశువులు, గ్రామ అవసరాలకు ఉపయోగపడే చెరువులను కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రే పొలాలుగా మార్చేస్తున్నారు. దీనికి విజయనగరం మండలం గాజుల రేగవద్ద ఆక్రమణకు గురైన ఊరబంద నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.
విజయనగరం రూరల్: అధికారం వచ్చి నిండా నెల పూర్తికాలేదు.. అప్పుడే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారు లు, జనంపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నామన్న కసితో ఒక పక్క అధికారులను బెదిరిస్తూనే చెరువులు, ప్రభు త్వ భూముల ఆక్రమణకు తెరతీశారు. నీతి, నిజా యితీలకు మారుపేరని చెప్పుకునే టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు, తాజా ఎమ్మెల్యే, అశోక్ కుమార్తె అదితిగజపతిరాజు కనుసన్నల్లోనే తెలుగు తమ్ముళ్లు విజయనగరం మండల పరిధిలోని పలు గ్రామాల చెరువుల్లో అక్రమమట్టి తవ్వకాలకు పాల్పడుతుండగా, జమ్ము గ్రామంలో ప్రభుత్వ భూములను చదును చేసేస్తుండడం ప్రజలను కలవరపెడుతోంది. గాజుల రేగవద్ద ఉన్న రూ.4 కోట్ల విలువైన ఊరబందను ఆక్రమించేయడం సొంత పార్టీవర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.
కబ్జా పర్వం ఇలా...
విజయనగరం నియోజకవర్గం పరిధిలోని గాజులరేగ గ్రామ సర్వే నంబర్ 30/3లో 1.22 ఎకరాల ప్రభుత్వ చెరువు ఉంది. దీని విలువ రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం రూ.4 కోట్లు ఉంటుంది. దీనిపై అధికార పార్టీ నేత కన్నుపడింది. అంతే.. కబ్జాకు ఉపక్రమించాడు. రైతులు, పశువులు, జీవాల దాహార్తిని తీర్చే చెరువును మట్టితో పూర్తిగా కప్పేసి పొలంలా చదును చేసేశాడు. అంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా సాగు భూమిగా మలచి చెరువులో నీలగిరి మొక్కలను సైతం నాటేశాడు. రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా చర్యలకు ఉపక్రమించకుండా ఎమ్మెల్యేకూ వాటా ఉందని చెబుతూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చెరువు ఆక్రమణ అటు రెవెన్యూ, ఇటు గ్రామ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
చెరువు కబ్జా ఎమ్మెల్యే దృష్టికి వెళ్లినా...
సర్వే నంబర్ 30/3లో 1.22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ చెరువును తమ పార్టీకి చెందిన బడా నేతే ఆక్రమించినట్టు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దృష్టిలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ చెరువు కబ్జాకు పాల్పడిన పార్టీ నాయకుడిపై ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాలు, అక్రమ మట్టి తవ్వకాలను ఆదిలోనే అడ్డుకుని అశోక్ పేరు నిలబెట్టాలని, లేదంటే ప్రజల్లో చులకన అయిపోతామని చెబుతున్నారు. ఆక్రమణల్లో రాజు పాత్ర ఉందా..? లేదంటే స్థానిక నాయకుడే ఆక్రమించి రాజుల పేరు చెబుతున్నాడా అన్న అనుమానాలను కొందరు వ్యక్తంచేస్తున్నారు.
చెరువు ఆక్రమణను అడ్డుకుంటాం
గాజులరేగ రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 30/3 లో ఉన్న 1.22 ఎకరాల చెరువు ఆక్రమణ తమ దృష్టికి వచ్చింది. ఆక్రమణకు గురైన ఊరబంద స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశాం. గ్రామ రెవెన్యూ అధికారి నివేదిక అందిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. చదును చేసిన స్థలంలో నాటిన నీలగిరి మొక్కలు తీసి వేయడానికి చర్యలు తీసుకుంటాం.
– పి.వి.రత్నం, తహసీల్దార్, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment