30 ఎకరాల పెన్నా పోరంబోకు భూముల్లో ప్లాట్లువేసి విక్రయాలు
ఇప్పటికే రూ.15 కోట్లు సొమ్ముచేసుకున్న వైనం
ఇప్పుడు పేదలకు పంచుతున్నట్లు నాటకం
స్థలాన్ని స్వాదీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో టీడీపీ నేత కబ్జాచేసిన పెన్నా పొరంబోకు భూములను బుధవారం అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. 30 ఎకరాలు ఆక్రమించి దాదాపు 1,400 ప్లాట్లు వేసిన ఆ నేత ఇప్పటికే కొన్ని అమ్మి రూ.15 కోట్లు సొమ్ముచేసుకున్నారు. మిగిలిన ప్లాట్లను పేదలకు పంచుతున్నానంటూ చీటీలు పంపిణీ చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వచ్చిన రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు.. పోలీసుల సహకారంతో ఆ భూమిని స్వా«దీనం చేసుకుని జేసీబీతో హద్దురాళ్లను తొలగించారు.
కోడూరుపాడుకు చెందిన టీడీపీ నేత కోడూరు కమలాకర్‌రెడ్డి గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 550, 411, 435, 538, 39, 40లోని 30 ఎకరాల పెన్నా పొరంబోకు స్థలంపై కన్నేశారు. దీన్లో కొంత భూమిని గతంలో దళితులకు డి–ఫారం పట్టాగా పంపిణీ చేశారు. వారు ఆ భూముల్ని సాగుచేసుకుంటున్నారు. ఇక్కడ ఎకరా ధర రూ.రెండుకోట్ల వరకు ఉంది. ఈ మొత్తం భూమిని ఆక్రమించిన కమలాకర్‌రెడ్డి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తానని గత ఏడాది అందరినీ నమ్మించారు.
రోడ్లు ఏర్పాటుచేసి దాదాపు 1,400 ప్లాట్లతో లే అవుట్ వేశారు. కొన్ని ప్లాట్లను రూ.రెండులక్షల నుంచి రూ.నాలుగు లక్షలకు విక్రయించి దాదాపు రూ.15 కోట్లు సొమ్ము చేసుకున్నారు. తాజాగా మిగిలిన ప్లాట్లను పేదలకు పంపిణీ చేస్తానంటూ చీటీలు అందజేశారు. చీటీలు అందుకున్నవారిలో ఆయన అనుచరులు, వారి సంబందీకులే 300 మంది వరకు ఉన్నట్లు తెలిసింది.
కొనుగోలుదారుల ఆందోళన
పెన్నా పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేశారన్న సమాచారం అందుకున్న రెవెన్యూ, జలవనరులశాఖల అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వస్థలాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఆక్రమణదారులపై చర్యలకు ఉపక్రమించారు.
టీడీపీ నేత వద్ద రూ.నాలుగు లక్షలకు ప్లాట్లను కొనుగోలు చేశామని, తమ పరిస్థితి ఏమిటంటూ అక్కడ పదిమంది ఆందోళన చేశారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కొనుగోలు చేసే హక్కు ఎవరికీలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో వారు వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment