
పంచ అందాలు
- అభయారణ్యం.. ఆహ్లాదకరం
- పర్యాటకులకు భలే వినోదం
మెదక్:పచ్చని అభయారణ్యం చూపరులను కట్టిపడేస్తోంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తోంది. మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో గల అభయారణ్యం 150 ఎకరాల్లో విస్తరించి ఉంది. దానిచుట్టూ కంచెను వేసి అందులో జింకలతోపాటు రకరకాల జంతువులను పెంచుతున్నారు. ఇది పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. గడిచిన రెండు సంవత్సరాల్లో కరువు కాటకాలతో అభయారణ్యంలోని చెట్లన్నీ ఎండిపోయి కళతప్పింది.
కానీ ఈ యేడు ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురుస్తుండటంతో చెట్లన్నీ పచ్చగా చిగురించాయి. దీనికి తోడు అభయారణ్యం గెస్ట్ హౌస్ ప్రాంతంలో చెట్లు మరింత అందాన్ని ఇస్తున్నాయి. పర్యాటకుల కోసం అధికారులు బెంచీలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు, అందులో రకరకాల ఆటవస్తువులు అమర్చారు. ప్రతి వారాంతపు సెలవుల్లో రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, తదితర దూరప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు వస్తుంటారు. పచ్చనిచెట్ల మధ్య హాయిగా సేద తీరుతుంటారు.