నడకలో రాజసం.. పోటీల్లో పౌరుషం.. రూపంలో భారీ కాయం.. ఇదే ఒంగోలు గిత్త తేజసం. ప్రకాశం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఒంగోలు జాతి పశువుల అభివృద్ధే ధ్యేయంగా ఏర్పాటు చేసిన చదలవాడలోని పశు ఉత్పత్తి క్షేత్రం లక్ష్యం దిశగా అడుగులేస్తోంది. మూడేళ్ల ముందు వరకు నిర్వీర్యమైన ఈ క్షేత్రం క్రమేపీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. మేలైన పశువుల ఉత్పత్తిని పెంచి, సంరక్షించే దిశగా అడుగులేస్తోంది. ఇందు కోసం సెమన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. నేరుగా పిండాలను (యాంబ్రియో) ఉత్పత్తి చేసేలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. పశు ఉత్పత్తి క్షేత్రంలో అన్ని మౌలిక వసతులు సమకూరుతున్నాయి.
నాగులుప్పలపాడు: చదలవాడలో 198 ఎకరాల్లో మూడు దశాబ్దాల క్రితం ఒంగోలు జాతి పశుఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చీమకుర్తికి గ్రానైట్ పరిశ్రమ వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి క్షేత్రం ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చదలవాడలోని రఘునాయక స్వామి ఆలయ భూములను కొనుగోలు చేసి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి పేరుకు క్షేత్రం నడిచినా.., పెద్దగా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం నుంచి సహకారం లభించడం, అధికారులు అంకితభావంతో పనిచేస్తుండడంతో ఆ ఫలాలు కనిపిస్తున్నాయి.
రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు:
క్షేత్రంలో గడచిన రెండు మూడేళ్లలో సుమారు రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. పశువుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రూ.2 కోట్లతో 4 నూతన షెడ్లు ఏర్పాటు చేశారు. పాలన అవసరాల కోసం రూ.70 లక్షలతో నూతన పరిపాలన భవనం నిర్మించారు. వీటితో పాటు మరో రూ.40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల ఏర్పాటుతో పాటు క్షేత్రం మొత్తం రూ.10 లక్షలతో సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. ఇంతే కాకుండా గోచార్ పథకంలో క్షేత్రంలో భూమి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.52 లక్షలు కేటాయించారని, వీటిని త్వరలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
నాణ్యమైన పశువుల ఉత్పత్తి:
క్షేత్రంలో 292 పశువులుండగా, వీటిలో పాలిచ్చే ఆవులు 72, చూడివి 54, ఒట్టి ఆవులు 24, మిగిలినవి మూడేళ్లలోపు లేగదూడలున్నాయి. గతంలో ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో జాతి ఆవులే అయినా..నాణ్యత తక్కువగా ఉండేది. ప్రస్తుతం కొత్తగా వస్తున్న లేగదూడలు ఒకింత ఆరోగ్యంగా పెరుగుతుండడంతో క్రమేపీ ఆవుల్లో నాణ్యత పెరుగుతోంది. నాణ్యత తక్కువ ఉన్న పశువులు వేలం ద్వారా విక్రయిస్తుండడంతో మరింత నాణ్యమైన పశువులను క్షేత్రంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంగోలు జాతి ఆవుల నుంచి వచ్చే కోడెదూడలను ఆరు నెలల వరకు పెంచి రైతుల కోసం వేలం వేసి ఇస్తారు.
గ్రాసం కొరతను అధిగమించి...
మూడేళ్ల క్రితం క్షేత్రానికి గ్రాసం కొరత తీవ్రంగా ఉండేది. దాదాపు 200 ఎకరాల నాణ్యమైన భూమి ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోలేకపోయేవారు. ప్రస్తుతం ఆ కొరతను క్షేత్రం అధిగమించింది. బహువార్షిక గ్రాసాలు ఏడాది పొడవునా క్షేత్రంలో సాగు చేస్తున్నారు. దీనికి తోడు మాగుడు గడ్డి నిల్వకు ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి ముందుగానే నిల్వ ఉంచుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం 1600 టన్నుల సైలేజ్ గడ్డిని అందించింది. దీంతో క్షేత్రం గ్రాసం కొరతను అధిగమించింది.
సమకూరిన వసతులు:
నిన్నమొన్నటి వరకు మౌలిక వసతులు లేక కునారిల్లిన క్షేత్రంలో ఇప్పుడు భవనాల సమస్య తీరింది. పాలన భవనం కొత్త హంగులతో ఆహ్లాదంగా సిద్ధమైంది. అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా గతంలో ఉన్న డ్రైవర్ క్వార్టర్లను అభివృద్ధి చేసి సిబ్బందికి అందుబాటులో ఉంచారు. క్షేత్రంలో అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం పూర్తయ్యింది. ఇక మేలైన ఆవుల నుంచి అండాల సేకరణ కోసం గుజరాత్ నుంచి ప్రత్యేకంగా మిషన్‌ను కూడా తీసుకొచ్చారు.
సేకరించిన అండాలను నిల్వ చేసేందుకు ల్యాబ్‌ను అభివృద్ధి చేశారు. పశువుల బరువును కూడా ప్రతి వారం తీసుకొని రికార్డులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ లాం ఫాం నుంచి తీసుకొచ్చిన సెమన్‌ను రైతుల కోసం అందుబాటులో ఉంచగా, భవిష్యత్‌లో నేరుగా పిండాలను (యాబ్రియో) కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆవుపాలు పాలు, గోమూత్రంను నామమాత్రపు రుసుంతో రైతుల అవసరాల కోసం అందిస్తున్నారు.
ఇంకా మిగిలిన సమస్యలివే...
ఆవుల నాణ్యతను పెంచినప్పటికీ, కనీసం ఒక జత ఒంగోలు గిత్తలను ప్రదర్శన కోసమైన పెంచాలనే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఎద్దు ఒక్కటి కూడా లేదు. భవిష్యత్‌లో దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది. క్షేత్రంలో భూగర్భ జలంలో ఫ్లోరైడ్ అధికంగా ఉంటోంది. దీన్ని అధిగమించేందుకు క్షేత్రంలోనే రెండు చెరువుల ద్వారా పశువులకు తాగునీరు అందిస్తున్నారు. అయితే ఆవులు బయటకు వెళ్లకపోతే ఫ్లోరైడ్ నీటితోనే వాటి దాహం తీర్చాల్సి వస్తోంది. దీంతో పశువుల నాణ్యతపై ప్రభావం పడుతోంది.
త్వరలో ఉన్నతమైన ఫాంను చూస్తాం
ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే పశుక్షేత్రంలో చాలా మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికి తోడు సిబ్బంది పనితీరుతో పశువుల నాణ్యత కూడా పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పశువుల నాణ్యత పరిశీలన కోసం ఇప్పటికే ప్రతి పశువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటికి సంబంధిత రికార్డులు తయారు చేస్తున్నాం. ఇలాగే త్వరలో మన ఖ్యాతిని పెంచే ఒంగోలు జాతి సంపదతో కూడిన అత్యున్నతమైన ఫాంను తయారు చేయడానికి కృషి చేస్తున్నాం.
– బి.రవికుమార్, డిప్యూటీ డైరెక్టర్, పశుక్షేత్రం
Comments
Please login to add a commentAdd a comment