ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ‘ఇండియన్ ఊల్ఫ్’గా చెప్పుకునే తోడేళ్ల జనాభా దేశవ్యాప్తంగా మూడు వేల వరకు ఉండొచ్చని అటవీ శాఖ అంచనా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిదిలోని రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోనూ తోడేళ్లు ఒకప్పుడు గణనీయంగానే ఉండేవి. కొన్నేళ్ల క్రితం వీటి ఉనికి ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది.
అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో అభయారణ్యంలో ఒక అధికారికి తోడేలు కనిపించగా.. అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తరువాత వాటి ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించగా.. రెండు తోడేళ్ల కుటుంబాలు ఇక్కడి అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తోడేళ్లు సంఘ జీవనానికి పెట్టింది పేరు. ఇవి ప్రత్యేకమైన గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ‘ప్యాక్’ అంటారు. ఒక ప్యాక్‌లో 8 వరకు తోడేళ్లు ఉంటాయి.
దేశంలో 10 తోడేళ్ల అభయారణ్యాలు
అంతరించిపోతున్న తోడేళ్లను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 10 అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో కైలాదేవి అభయారణ్యం, కుంబాల్ ఘర్ అభయారణ్యం, తోడ్ ఘర్ రోలి అభయారణ్యం, మౌంట్ ఆబు అభయారణ్యం, గుజరాత్‌లోని బ్లాక్ బక్ అభయారణ్యం, కఛ్ బస్టర్డ్ అభయారణ్యం, నారాయణ్ సరోవర్ అభయారణ్యం, శూల్ పాణేశ్వర్ అభయారణ్యం, కర్ణాటకలోని రాణి బెన్నూర్ బ్లాక్ బక్ అభయారణ్యం, మహారాష్ట్రలోని రెహే కురి బ్లాక్ బక్ అభయారణ్యాలలో తోడేళ్లను సంరక్షిస్తున్నారు.
బట్టమేక పక్షుల అభయారణ్యంలో..
ఏపీలో తోడేళ్ల సంరక్షణకు ప్రత్యేకించి అభయారణ్యాలు ఏర్పాటు చేయనప్పటికీ బట్టమేక పక్షుల సంరక్షణకు ఏర్పాటు చేసిన రోళ్లపాడు అభయారణ్యంలో కృష్ణజింకలతో కలసి తోడేళ్లు సహవాసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
తోడేళ్లు తన సహజ జాతి మాంసాహార జంతువులైన హైనాలు, నక్కల తరహాలో వేరే జంతువులు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తినే జీవులు కావు. ఇవి తమ ఆహారాన్ని స్వయంగా వేటాడి సంపాదించుకుంటాయి. తమకు అందుబాటులో ఉండే కృష్ణ జింకలు, సమీప గ్రామాల్లో ఉండే మేకలు, గొర్రెలను ఇవి వేటాడుతుంటాయి.
తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం
రోళ్లపాడు బట్టమేక పక్షుల అభయారణ్యంలో తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం. ఒకప్పుడు ఈ అభయారణ్యం పరిధిలో విస్తారంగా కనిపించిన ఇండియన్ ఊల్ఫ్ తదనంతరం అదృశ్యమైంది. అనూహ్యంగా ఇటీవల మాకు తోడేళ్లు కనిపించడం సంతోషదాయకం. రెండు ప్యాక్‌ల తోడేళ్లు రోళ్లపాడులో ఉండవచ్చని అంచనా.
– అలాన్ చోంగ్ టెరాన్, డీడీ, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు
Comments
Please login to add a commentAdd a comment