rollapadu
-
రోళ్లపాడులో తోడేళ్లు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల): ‘ఇండియన్ ఊల్ఫ్’గా చెప్పుకునే తోడేళ్ల జనాభా దేశవ్యాప్తంగా మూడు వేల వరకు ఉండొచ్చని అటవీ శాఖ అంచనా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిదిలోని రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోనూ తోడేళ్లు ఒకప్పుడు గణనీయంగానే ఉండేవి. కొన్నేళ్ల క్రితం వీటి ఉనికి ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది. అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో అభయారణ్యంలో ఒక అధికారికి తోడేలు కనిపించగా.. అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ తరువాత వాటి ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించగా.. రెండు తోడేళ్ల కుటుంబాలు ఇక్కడి అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తోడేళ్లు సంఘ జీవనానికి పెట్టింది పేరు. ఇవి ప్రత్యేకమైన గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ‘ప్యాక్’ అంటారు. ఒక ప్యాక్‌లో 8 వరకు తోడేళ్లు ఉంటాయి. దేశంలో 10 తోడేళ్ల అభయారణ్యాలు అంతరించిపోతున్న తోడేళ్లను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 10 అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో కైలాదేవి అభయారణ్యం, కుంబాల్ ఘర్ అభయారణ్యం, తోడ్ ఘర్ రోలి అభయారణ్యం, మౌంట్ ఆబు అభయారణ్యం, గుజరాత్‌లోని బ్లాక్ బక్ అభయారణ్యం, కఛ్ బస్టర్డ్ అభయారణ్యం, నారాయణ్ సరోవర్ అభయారణ్యం, శూల్ పాణేశ్వర్ అభయారణ్యం, కర్ణాటకలోని రాణి బెన్నూర్ బ్లాక్ బక్ అభయారణ్యం, మహారాష్ట్రలోని రెహే కురి బ్లాక్ బక్ అభయారణ్యాలలో తోడేళ్లను సంరక్షిస్తున్నారు. బట్టమేక పక్షుల అభయారణ్యంలో.. ఏపీలో తోడేళ్ల సంరక్షణకు ప్రత్యేకించి అభయారణ్యాలు ఏర్పాటు చేయనప్పటికీ బట్టమేక పక్షుల సంరక్షణకు ఏర్పాటు చేసిన రోళ్లపాడు అభయారణ్యంలో కృష్ణజింకలతో కలసి తోడేళ్లు సహవాసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. తోడేళ్లు తన సహజ జాతి మాంసాహార జంతువులైన హైనాలు, నక్కల తరహాలో వేరే జంతువులు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తినే జీవులు కావు. ఇవి తమ ఆహారాన్ని స్వయంగా వేటాడి సంపాదించుకుంటాయి. తమకు అందుబాటులో ఉండే కృష్ణ జింకలు, సమీప గ్రామాల్లో ఉండే మేకలు, గొర్రెలను ఇవి వేటాడుతుంటాయి. తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం రోళ్లపాడు బట్టమేక పక్షుల అభయారణ్యంలో తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం. ఒకప్పుడు ఈ అభయారణ్యం పరిధిలో విస్తారంగా కనిపించిన ఇండియన్ ఊల్ఫ్ తదనంతరం అదృశ్యమైంది. అనూహ్యంగా ఇటీవల మాకు తోడేళ్లు కనిపించడం సంతోషదాయకం. రెండు ప్యాక్‌ల తోడేళ్లు రోళ్లపాడులో ఉండవచ్చని అంచనా. – అలాన్ చోంగ్ టెరాన్, డీడీ, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు -
జనారణ్యంలోకి దుప్పి
జూపాడుబంగ్లా: రోళ్లపాడు అభయారణ్యంలోంచి నీటికోసం దారితప్పిన దుప్పి జూపాడుబంగ్లాకు చేరుకొంది. తెల్లవారిన తర్వాత జనారణ్యంలో ఎటువెళ్లాలో దిక్కుతోచక గ్రామంలోని నాగేశ్వరమ్మ ఇంట్లోకి చొరబడింది. ఆమె భయంతో కంగారుపడిపోయి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. స్థానిక పోలీసులు Ððవెంటనే దుప్పిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాలికి తీవ్ర రక్తగాయాలు కావటంతో దుప్పి అస్వస్థతకు గురైంది. విషయాన్ని ఎస్ఐ అశోక్.. ఆత్మకూరు అటవిశాఖ డీఆర్వో రంగన్నకు తెలియజేయటంతో ఆయన తన సిబ్బందితో జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. గాయపడిన దుప్పికి చికిత్సలు నిర్వహించి వెంటతెచ్చిన బోనులో ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దుప్పి కోలుకున్న తర్వాత అటవిలో వదిలి పెడతామని డీఆర్వో రంగన్న తెలిపారు. -
యువకుడి బలవన్మరణం
- వివాహం ఇష్టం లేక ఆత్మహత్య - రోళ్లపాడులో ఘటన మిడుతూరు: రోళ్లపాడు ఏకేఆర్ క్యాంపులో అసిస్టెంట్ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు బుధవారం.. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సుబ్రమణ్యం తెలిపిన వివరాల మేరకు.. పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన దూదేకుల బాలస్వామి(22) రోళ్లపాడు ఏకేఆర్‌క్యాంపులో అసిస్టెంట్ మెకానిక్‌గా పద్దెనిమిది నెలల నుంచి పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం అక్క కుమార్తె రమిజాబీతో వివాహమైంది. పెళ్లి ఇష్టం లేదని లేఖ రాసి రాత్రి సమయంలో నాల్గో షెడ్లో తన చొక్కాతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ తెలిపారు. నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టర్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామన్నారు. మృతుడి అన్న పెద్ద మౌలాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రోళ్లపాడు అభయారణ్యం సందర్శన
మిడుతూరు : మండలంలోని రోళ్లపాడు అభయారణ్యాన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రీజినల్ అధికారి రాజేంద్ర గర్వాడ్, డీఎఫ్ఓ సెల్వం బుధవారం సందర్శించారు. రీజియనల్ అధికారి మాట్లాడుతూ భారత ప్రభుత్వ నిధులను ఏపీలో విస్తరించిన అటవీ ప్రాంతాలకు ఎలా ఖర్చు చేయాలి, అటవీ ప్రాంతాల అభివృద్ధికి తీసుకోనున్న చర్యలపై నంద్యాల, మార్కాపురం, గిద్దలూరు, అమరావతి ప్రాంతాల్లో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అభయారణ్యంలో సంచరిస్తున్న కృష్ణ జింకలు, వివిధ రకాల పక్షులను బైనాక్యులర్ సాయంతో వీక్షించారు. సాసర్ ఫిట్స్, బట్టమేకపక్షి నమూనా, పక్షుల బోర్డులను తిలకించారు. డీఆర్ఓ రంగన్న, ప్రొజెక్షనిస్టు వాసు, బర్డ్ వాచర్స్ ఆదిశేషయ్య, గఫూర్, అల్లబకాష్, రంగస్వామి, శీలన్న పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
మిడుతూరు: వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకున్నట్లు టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ శరవణన్ అన్నారు. గురువారం ఆయన రోళ్లపాడు అభయారణ్యాన్ని తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అడవిలో సంచరించే కృష్ణజింకలు, తోడేలు, గుంటనక్కలు, వివిధ రకాల పక్షులు వాటి సంరక్షణకు పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలన్నారు. బట్టమేక పక్షి అభయారణ్య పరిధిలో కాకుండా గ్రామాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందా అనే విషయంపై ఆరా తీయాలని డీఆర్వో రంగన్నను ఆదేశించారు. అభయారణ్యం విశిష్టతపై పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఽఉందన్నారు. ఆయన వెంట ఐఎఫ్ఎస్ ట్రైనీ కల్పన, ఎఫ్‌బీవో జహరున్నీసా బేగం, బర్డ్ వాచర్స్ గపూర్, ఆదిశేషయ్య, వాసు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ýసోమవారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఖమ్మం బయల్దేరి వెళతారు. ముందుగా ఆయన ఖమ్మం నగరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రెండో రోజు మంగళవారం రోడ్డు మార్గంలో కేసీఆర్ ముదిగొండ చేరుకుని అక్కడ నుంచి ముత్తారం గ్రామంలోని రామాలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరుమలాయపాలెంలో రామదాసు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి బహరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం టేకులపల్లి మండలం రోళ్లపాడులో శ్రీరామ నీటి పథకానికి శంకుస్థాపన చేసి అక్కడ ప్రజలతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు రోళ్లపాడు నుంచి కేసీఆర్ హైదరాబాద్ పయనం అవుతారు.