విలువైన ఎర్రచందనం వృక్ష సంపద ఉన్న నల్లమల అభయారణ్యం చుట్టూ భారీ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సి.కె.మిశ్రా తెలిపారు.
విలువైన ఎర్రచందనం వృక్ష సంపద ఉన్న నల్లమల అభయారణ్యం చుట్టూ భారీ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి సి.కె.మిశ్రా తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మిశ్రా... అరుదైన ఎర్రచందనం వృక్ష సంపదనును కాపాడటంలో భాగంగా ఈ కందకం తీస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలను కలుపుతూ మొత్తం 1,200 కిలో మీటర్ల పొడవున ఇది ఉంటుందన్నారు. 3 మీటర్ల లోతున, 3 మీటర్ల వెడల్పులో ఈ కందకం ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనివల్ల అక్రమ రవాణాను అరికట్టవచ్చని, అడవిలో నుంచి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. భూగర్భ జలాలు కూడా పెరగటానికి ఎంతగానో దోహద పడుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 900 ఊట కుంటల నిర్మాణం, 250 చెక్ డ్యాంలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.