కానరాని పక్షులు కిలకిలలు | Endangered Bird Spices In West Godavari | Sakshi
Sakshi News home page

కానరాని పక్షులు కిలకిలలు

Published Wed, Jul 10 2019 10:04 AM | Last Updated on Wed, Jul 10 2019 10:04 AM

Endangered Bird Spices In West Godavari - Sakshi

వేటగాడి చేతికి చిక్కిన పరజ, ఆటపాక ఆవాస కేంద్రం ప్రాంతంలో చనిపోయిన పెలికాన్‌

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరులో నేడు కిలకిల రావాలు వినిపించటం లేదు.. విహంగాల విలవిలలు తప్ప. నీరు, ఆహారం కొరత.. కాలుష్యం బెడద.. వేటగాళ్ల తూటాల వల్ల ఇక్కడకు వచ్చిన విదేశీ పక్షులు మృత్యువాతపడుతున్నాయి. ఫలితంగా కొల్లేరు రానురాను జీవ కళ కోల్పోతోంది.. మనిషిలో పెరిగిన స్వార్థానికి అవి ‘కిల్‌’ అవుతున్నాయి.. కొల్లేరు అభయారణ్యం పరిరక్షణను గత ప్రభుత్వం  గాలికొదిలేయడంతో.. పక్షుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు.                    
  –ఆకివీడు

సాక్షి, పశ్చిమగోదావరి : ప్రపంచంలోని అతి పెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు ప్రముఖమైంది. దీనిని పరిరక్షించేందుకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామ్‌సార్‌ ఒప్పందం కూడా చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దులో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు 11వ శతాబ్ద ప్రాంతంలో ఒక పట్టణం. 17వ శతాబ్దం వరకూ ఇక్కడ మనుషులు సంచరించారు. అయితే తెలుగు రాజుల కాలంలో కొల్లేరు పట్టణం దగ్ధమైపోయినట్లు చరిత్ర చెబుతోంది. తదనతంరం పెద్దగొయ్యిగా ఏర్పడి, గోదావరి, కృష్ణా నదుల నుంచి  వచ్చే అదనపు నీరు, వరదల నీటితో ఈ ప్రాంతం ముంపునకు గురైంది.

సముద్రమట్టానికి 10 అడుగుల ఎత్తు వరకూ సుమారు 314 చ.మైళ్ల విస్తీర్ణంలో నీరు నిలబడి ఉండటంతో ఈ ప్రాంతాన్ని ఒక సరస్సుగా గుర్తించి, కొల్లేరు సరస్సుగా నామకరణం చేశారు. ఇలా 18వ శతాబ్దం ప్రారంభంలో కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. సరస్సులో వివిధ రకాల చేపలు, కలువ కాయలు(కలేబికాయలు), నాచు కాయలు ఇలా ఎన్నో రకాల మొక్కలు నీటిలోంచి పుట్టుకువచ్చి కాయలు కాస్తుండేవి. ఆ కాయల్ని తినేందుకు విదేశాల నుంచి 200 రకాలకు పైగా పక్షులు వలస వచ్చేవి. వీటితో పాటు స్థానిక పక్షులు లక్షలాదిగా కొల్లేరులో జీవించేవి. అయితే రానురాను పక్షులు ఇక్కడ మనుగడ సాగించే పరిస్థితులు కానరావడం లేదు. ఔ

అమలు కాని చట్టాలు 
కొల్లేరు అభయారణ్య పరిరక్షణకు గత ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఆచరణకు నోచుకోలేదు. కొల్లేరుతో పాటు ఐదో కాంటూర్‌ను పరిరక్షించడానికి నిత్యం పహరా కాయాల్సిన యంత్రాంగమే చోధ్యం చూస్తోంది. ఫలితంగా ఒకనాడు కొల్లేరులో తిరుగుతున్న తిమింగాల్ని సైతం లెక్కచేయకుండా బాంబులతో పేల్చేసిన చెరువుల స్థానంలో నేడు పుట్టగొడుగుల్లా కొత్త చెరువులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అడపాదడపా దాడుల పేరుతో ఎంపిక చేసుకున్న వారిని భయభ్రాంతులకు గురిచేసి, కాసులు దండుకోవడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆటపాకలోని రక్షిత పక్షుల కేంద్రంలో కూడా పక్షుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వందలాది విదేశీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. సాక్షాత్తూ అటవీశాఖ అధికారుల కళ్లముందే ఈ దారుణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పక్షుల కేంద్రంలో యంత్రాలతో అభివృద్ది పనులు చేయకూడదనే నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. పక్షులు సంచరించే ప్రాంతాల్లో విచ్చల విడిగా చేపలు, రొయ్యల చెరువులు పుట్టుకొస్తుండటంతో మేత, యాంటి బయోటిక్స్‌ విని యోగం విచ్చలవిడిగా జరుగుతూ పక్షుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. 

కిక్కిస దగ్ధంతో  మాడిపోతున్న పక్షులు
ఏటా వేసవిలో కొల్లేరులోని వందలాది ఎకరాల్లో కిక్కిస దగ్ధమవుతోంది. కిక్కిస మంటల్లో వేలాది పక్షులు, పక్షి గుడ్లు మాడి మసైపోతున్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొల్లేరు కుచించుకుపోతోంది. సరస్సు మనుగడకు ప్రమాదం ఏర్పడింది. అంతరించే స్థాయికి పక్షులు చేరుకున్నాయి. కొల్లేరు కిలకిల రావాలు వినాలంటే, సరస్సు మనుగడ కాపాడాలంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొల్లేరు సరస్సుపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. 

నెరలు తీసి బీడుగా.. 
కొల్లేరు సరస్సులో జలాలు కనుమరుగవుతున్నాయి. కొల్లేరు ప్రాంతం నెరలు తీసి బీడు బారుతోంది. వివిధ రకాల ఫ్యాక్టరీలకు చెందిన రసాయన వ్యర్థాలతో కూడిన నీరు కొల్లేరులో చేరుతోంది. దీంతో పక్షులు చనిపోతున్నాయి. వాటి కళేబరాలు పచ్చిక పొదల్లో పడి కుళ్లి కృశించిపోతున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వాటిలో ప్రసిద్ధిగాంచిన విదేశీ పెలికాన్‌ పక్షులూ ఉన్నాయి.  

మొక్కుబడిగా చెక్‌పోస్టులు
కొల్లేరు అభయారణ్యాన్ని పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు మొక్కుబడిగా ఉన్నాయి. అభయారణ్య పరిధిలో కృష్ణా జిల్లాలో రెండు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 చెక్‌ పోస్టులున్నాయి. చేపల మేత, మందులు, వాహనాల రాకపోకల నిషేధంతో పాటు, కొల్లేరు పక్షుల్ని రక్షించాల్సిన బాధ్యత చెక్‌పోస్టు అధికారులు, సిబ్బందిపై ఉంది. వీరు సరిగా పట్టించుకోనందున అభయారణ్యంలోకి వెళ్లకూడనివన్నీ వెళ్లిపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఆటపాకలోని పక్షి ఆవాస కేంద్రం వద్ద ఆధునికీకరణ పనులతో చెల్లాచెదురైన పెలికాన్, ఇతర పక్షులు

మూగజీవాలపై ‘వేటు’
కొల్లేరు మూగ జీవాలపై వేటగాళ్ల దాడి అధికమైంది. పక్షి కనిపిస్తే చాలు, దానిని చంపి, తినేసే వరకూ నిద్రపోని వ్యక్తులు ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పక్షుల వేట సాగిపోతోంది. కొల్లేరులో పరజ, కొంగ, గూడు కొంగ, నత్తకొట్టుడు, కొండింగాయ, పెలికాన్‌ పక్షులతో పాటు దొరికిన పక్షిని చంపి తినేస్తున్నారు. వేటాడిని పక్షుల్ని రహస్యంగా ఏలూరు, ఆకివీడు, భీమడోలు, గణపవరం, భీమవరం, కాళ్ల, పాలకొల్లు, నిడమర్రు, ఉంగుటూరు, కృష్ణా జిల్లా కైకలూరు, కలిదిండి, మండలవల్లి, గుడివాడ, ముదినేపల్లి తదితర మండలాలకు రహస్యంగా తీసుకువెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 

రహస్యంగా వేట సాగిస్తున్నారు 
పక్షులను వేటాడకూడదనే నిషేధం ఉన్నప్పటికీ పక్షుల్ని వేటాడి రహస్యంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రూ.100 నుంచి రూ.500 వరకూ అమ్ముతున్నారు.  
–గాతల ఇమానియేలు, జువ్వలపాలెం

తరిగిపోతున్న పక్షి జాతి
కొల్లేరు కాలుష్యానికి గురైంది. మరోపక్క అడపాదడపా వేటాడుతున్నారు. దీంతో చాలా రకాల పక్షులు చనిపోయాయి. ప్రస్తుతం ఉన్న పక్షులకు నీరు, ఆహారం కొరత ఏర్పడింది. దీంతో అవి బలహీనమైపోయాయి. ఆవాస కేంద్రాలు కూడా లేక పక్షులు అంతరించిపోతున్నాయి. పక్షుల ఆవాస కేంద్రాలకు ప్రభుత్వం పది వేల ఎకరాలు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
–బలే గణేష్, శృంగవరప్పాడు, కృష్ణా జిల్లా, కొల్లేరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement