
సాక్షి,పశ్చిమగోదావరి : గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్ని బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.
తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజాగా నిర్ధారణైంది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం, వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా విధించారు.
ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన, హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల, వెలుపల కోళ్లు, గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్,ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు, బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. కోళ్లు, బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment