birdflue
-
H3N8 బర్డ్‌ఫ్లూతో ప్రపంచంలోనే తొలి మరణం..
బీజింగ్: అత్యంత అరుదైన H3N8 బర్డ్‌ఫ్లూ రకం వైరస్‌తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదైంది. చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రానికి చెందిన 56 ఏళ్ల మహిళ ఈ బర్డ్‌ఫ్లూ కారణంగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఉపరకమైన హెచ్3ఎన్8 సోకిన మూడో వ్యక్తి ఈమే అని పేర్కొంది. ఈ మూడు కేసులు చైనాలో నమోదుకావడం గమనార్హం. గతేడాది ఇద్దరు ఈ వ్యాధి బారినపడగా.. ఇప్పుడు ఈ మహిళ దీని బారినపడి చనిపోయింది. హెచ్3ఎన్8 పక్షుల్లో సాధారణంగానే కన్పిస్తుందని, కానీ మనుషులకు ఇది వ్యాపించడం అత్యంత అరుదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ బర్డ్‌ఫ్లూ రకం మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశమే లేదని చెప్పింది. అందుకే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. చదవండి: North Korea: మరింత ‘అణు’ దూకుడు -
4 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ విజృంభణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 12 ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ(అవియన్ ఇన్‌ఫ్లూయెంజా) వ్యాప్తిని గుర్తించినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ వెల్లడించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాజస్తాన్‌లోని బరాన్, కోట, ఝలావర్, మధ్యప్రదేశ్‌లోని మాందసౌర్, ఇండోర్, మాల్వా, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా(వలస పక్షుల కేంద్రం), కేరళలోని కొట్టాయం, అలప్పుజాలో నాలుగు చోట్ల బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తిని కనుగొన్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై తాజా పరిస్థితి అంచనా వేయడానికి ఢిల్లీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. రాష్ట్రాల్లో అధికారులు చేపట్టిన బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యలపై రోజువారీ గణాంకాలు సేకరించేందుకు ఈ కంట్రోల్ రూమ్ నెలకొల్పినట్లు పేర్కొంది. దేశంలో మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని తెలియజేసింది. కర్ణాటకలో హై అలర్ట్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైఅలర్ట్ ప్రకటించినట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చెప్పారు. కేరళ నుంచి పౌల్ట్రీ కోళ్లు, కోడి మాంసం రవాణా చేయకుండా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక పశు సంవర్థక శాఖ వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కేరళతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి కోడిమాంసం దిగుమతిపై 10 రోజులపాటు నిషేధం విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బుధవారం చెప్పారు. ప్రభావిత జిల్లాలకు కేంద్ర బృందాలు బర్డ్‌ఫ్లూ ప్రభావం అధికంగా ఉన్న కేరళలోని అలప్పుజా, కొట్టాయం, హరియాణాలోని పంచకుల జిల్లాలకు బృందాలను పంపించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ బృందాల్లో ఎన్సీడీసీ, ఎన్ఐజీ, ఆర్ఎంఎల్ హాస్పిటల్, లేడీ హర్డింగ్ మెడికల్ కాలేజీకి చెందిన నిపుణులు ఉంటారు. అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో బాతుల్లో, పంచకుల జిల్లాలో పౌల్ట్రీ కోళ్లలో బర్డ్‌ఫ్లూను గుర్తించినట్లు వెల్లడించింది. బృందాలు ఆయా జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ఆరోగ్య శాఖలకు సహరిస్తాయని తెలిపింది. -
బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం
- పశుశాఖ ‘అనంత’ ఏడీ శ్రీనాథాచార్ అనంతపురం అగ్రికల్చర్ : ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఈ వ్యాధిని సమూలంగా నివారించుకోవచ్చని పశు సంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ ఏడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడా ఈ వ్యాధి లక్షణాలు లేవన్నారు. అయినప్పటికీ పక్కనున్న కర్నాటక రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నందున దీనిపై జిల్లావాసులకు అవగాహన కలిగి ఉండటం మేలన్నారు. బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లూయంజా) అనేది కోళ్లలో సంభవించే వైరల్ వ్యాధి. హెచ్5ఎన్1 స్ట్రెయిన్ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. కోళ్ల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగే మనుషులలో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇందులో హెచ్‌పీ అనేది వ్యాధి తీవ్రతను ఎక్కువ చేస్తుంది. ఎల్పీ అనేది తక్కువగా ఉంటుంది. కోళ్లు అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో చనిపోవడం, శ్వాసకోశ లక్షణాలతో మరణించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వైరస్ ప్రవేశించిన రెండు నుంచి ఎనిమిది రోజుల్లో మనుషులకు సోకుతుంది. అధిక జ్వరం, పొడిదగ్గు, గొంతువాపు, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కీళ్లనొప్పులు, బద్దకంగా ఉండటం, ముక్కు నుంచి ద్రవాలు స్రవించడం, కండ్లకలక, తలతిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పిల్లల్లో ఈ వ్యాధి క్రమంగా న్యూమోనియాకు దారితీస్తుంది. వ్యాధి సోకిన కోళ్లు, కోడిమాంసం, గుడ్లు తదితర వాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధి సోకిన కోళ్లు, ఫారాల నుంచి దూరంగా ఉండాలి. వ్యాధి లక్షణాలున్న మాంసం, గుడ్లు తీసుకోకూడదు. బాగా ఉడికిన మాంసం, ఉడికిన గుడ్లు మాత్రమే తినాలి. పైపైన ఉడికించే చికెన్ ఐటెమ్స్, హాఫ్బాయిల్ గుడ్లు తినకూడదు. అవసరమైన ప్రాంతాల్లో ఈ మాస్కులు ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. కోళ్లలో అసాధారణ మరణాలు ఉన్నట్లు గమనిస్తే వెంటనే పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. కోళ్లను ముట్టుకున్నపుడు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. కోళ్ల ఫారాల్లో సమగ్ర వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. ఇతరుల ప్రవేశాన్ని నిరోధించాలి. చనిపోయిన కోళ్లను, వాటి వ్యర్థాలను సమూలంగా నాశనం చేయాలి. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు నివారణ చర్యలు తెలియజేయాలి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. యాంటీవైరల్ మందులు ఒసెల్టామివిÆŠ, జానామివిర్ వంటివి ఈ వ్యాధికి సమర్థవంతంగా పని చేస్తాయి. నివారణ చర్యలు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి నివారణకు హెచ్ - 5 ఎన్ - 1 రకం టీకాలను ఆమోదించారు. కానీ వీటిని వాడేందుకు కోళ్ల పెంపకందారులకు అనుమతి లేదు. ఏదేని అంటువ్యాధి ప్రబలిన ప్రాంతంలో కేవలం ప్రభుత్వ అనుమతితో మాత్రమే వాడుతున్నారు. వ్యాధి వ్యాపించకుండా పశుసంవర్ధక శాఖ చెక్‌పోస్టుల ద్వారా నివారణ చర్యలు చేపడుతోంది. కోళ్ల ఫారాల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించడం, రాపిడ్ యాక్షన్ బృందాలు ఏర్పాటు చేసి నాటుకోళ్లు, వసల పక్షుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి తరచూ చేస్తుంటే ఈ వ్యాధిని సమూలంగా అరికట్టవచ్చు.