బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం
- పశుశాఖ ‘అనంత’ ఏడీ శ్రీనాథాచార్
అనంతపురం అగ్రికల్చర్ : ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఈ వ్యాధిని సమూలంగా నివారించుకోవచ్చని పశు సంవర్ధకశాఖ అనంతపురం డివిజన్ ఏడీ డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడా ఈ వ్యాధి లక్షణాలు లేవన్నారు. అయినప్పటికీ పక్కనున్న కర్నాటక రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నందున దీనిపై జిల్లావాసులకు అవగాహన కలిగి ఉండటం మేలన్నారు.
బర్డ్‌ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లూయంజా) అనేది కోళ్లలో సంభవించే వైరల్ వ్యాధి. హెచ్5ఎన్1 స్ట్రెయిన్ వైరస్ వల్ల వ్యాపిస్తుంది. కోళ్ల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగే మనుషులలో ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇందులో హెచ్‌పీ అనేది వ్యాధి తీవ్రతను ఎక్కువ చేస్తుంది. ఎల్‌పీ అనేది తక్కువగా ఉంటుంది. కోళ్లు అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో చనిపోవడం, శ్వాసకోశ లక్షణాలతో మరణించడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. వైరస్ ప్రవేశించిన రెండు నుంచి ఎనిమిది రోజుల్లో మనుషులకు సోకుతుంది. అధిక జ్వరం, పొడిదగ్గు, గొంతువాపు, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కీళ్లనొప్పులు, బద్దకంగా ఉండటం, ముక్కు నుంచి ద్రవాలు స్రవించడం, కండ్లకలక, తలతిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చిన్న పిల్లల్లో ఈ వ్యాధి క్రమంగా న్యూమోనియాకు దారితీస్తుంది. వ్యాధి సోకిన కోళ్లు, కోడిమాంసం, గుడ్లు తదితర వాటి ద్వారా ఇది వ్యాపిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వ్యాధి సోకిన కోళ్లు, ఫారాల నుంచి దూరంగా ఉండాలి. వ్యాధి లక్షణాలున్న మాంసం, గుడ్లు తీసుకోకూడదు. బాగా ఉడికిన మాంసం, ఉడికిన గుడ్లు మాత్రమే తినాలి. పైపైన ఉడికించే చికెన్ ఐటెమ్స్, హాఫ్‌బాయిల్ గుడ్లు తినకూడదు. అవసరమైన ప్రాంతాల్లో ఈ మాస్కులు ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధికి దూరంగా ఉండవచ్చు. కోళ్లలో అసాధారణ మరణాలు ఉన్నట్లు గమనిస్తే వెంటనే పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలి. కోళ్లను ముట్టుకున్నపుడు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి. కోళ్ల ఫారాల్లో సమగ్ర వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. ఇతరుల ప్రవేశాన్ని నిరోధించాలి. చనిపోయిన కోళ్లను, వాటి వ్యర్థాలను సమూలంగా నాశనం చేయాలి. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు నివారణ చర్యలు తెలియజేయాలి. ఈ విధమైన చర్యలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. యాంటీవైరల్ మందులు ఒసెల్టామివిÆŠ, జానామివిర్ వంటివి ఈ వ్యాధికి సమర్థవంతంగా పని చేస్తాయి.
నివారణ చర్యలు
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో బర్డ్‌ఫ్లూ వ్యాధి నివారణకు హెచ్ - 5 ఎన్ - 1 రకం టీకాలను ఆమోదించారు. కానీ వీటిని వాడేందుకు కోళ్ల పెంపకందారులకు అనుమతి లేదు. ఏదేని అంటువ్యాధి ప్రబలిన ప్రాంతంలో కేవలం ప్రభుత్వ అనుమతితో మాత్రమే వాడుతున్నారు. వ్యాధి వ్యాపించకుండా పశుసంవర్ధక శాఖ చెక్‌పోస్టుల ద్వారా నివారణ చర్యలు చేపడుతోంది. కోళ్ల ఫారాల్లో సమగ్ర తనిఖీలు నిర్వహించడం, రాపిడ్ యాక్షన్ బృందాలు ఏర్పాటు చేసి నాటుకోళ్లు, వసల పక్షుల నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి తరచూ చేస్తుంటే ఈ వ్యాధిని సమూలంగా అరికట్టవచ్చు.