టంగ్‌ కంగు తినడానికి కాదు! | The tongue importance and information about health by appearance | Sakshi
Sakshi News home page

టంగ్‌ కంగు తినడానికి కాదు!

Published Tue, Nov 5 2024 2:53 PM | Last Updated on Tue, Nov 5 2024 7:57 PM

The tongue importance and information about health by appearance

ఫేస్‌ ఈజ్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ మైండ్‌ అంటారు కదా. అలాగే టంగ్‌ ఈజ్‌ ద ఇండెక్స్‌ ఆఫ్‌ హెల్త్‌ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.

సాధారణంగా నాలుక పింక్‌ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.

నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.

జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... 
ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా  (పార్టికిల్స్‌గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ  పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.

రుచితోనూ ఆరోగ్యం గురించి... 
అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్‌ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.

నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... 
అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను గ్లాసైటిస్‌ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్‌ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను తేలిగ్గా తగ్గించవచ్చు. 

ఐరన్‌లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్‌ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్‌గా మారుతుంది 

పచ్చకామెర్లు (జాండీస్‌) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.

కొన్ని ఫంగస్‌లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్‌ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు 

జింక్‌ లోపం వల్ల తలెత్తే ‘డిస్‌గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్‌ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్‌ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది 

అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు 

విటమిన్‌ (చాలావరకు విటమిన్‌ బి కాంప్లెక్స్‌) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద  పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్‌’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు  పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే  పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్‌ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement