స్కూలుకెళ్లే పిల్లలున్న ఇంటి కళ వేరు. డ్రాయింగ్ రూమ్‌లో స్కూలు బ్యాగ్‌లు. వంటగదిలో లంచ్ బాక్సులు పలకరిస్తాయి. ఆ వంటింటి మెనూ భిన్నంగా ఉంటుంది. రోజూ కొత్తగా వండాలి... హెల్దీగా ఉండాలి. ఆ తల్లికి వంట రోజూ ఓ మేధోమధనమే. వారంలో ఓ రోజు ఇలా ట్రై చేయండి.
మార్కెట్లో ఇపుడు ఎక్కడ చూసిన పచ్చి బఠానీ విరివిగా కనిపిస్తోంది. బఠానీలతో ఎలాంటి వంటలు చేయాలి అని ఆలోచిస్తున్నారా? పచ్చిబఠానీలను దాదాపు అన్ని కూరల్లోనూ కలిపి వండుకోవచ్చు. బంగాళా దుంప, బఠానీతో పానీ పూరీ స్టఫింగ్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు.
ఉదాహరణకు, వంకాయ, బంగాదుంప, క్యారట్, క్యాబేజీ లాంటి వాటితో కలిపి బచ్చి బఠానీని వండుకుంటే, రుచితోపాటు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బఠానీ పులావ్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
పీస్ పులావ్
కావలసినవి: బాసుమతి బియ్యం- కప్పు; పచ్చి బఠాణీ-పావు కప్పు; నీరు-3 కప్పులు; బిర్యానీ ఆకు-ఒకటి; ఒక యాలక్కాయ, లవంగం-1; దాల్చిన చెక్క – అర అంగుళం ముక్క; ఉప్పు-పావు టీ స్పూన్ లేదా రుచిని బట్టి; నిమ్మరసం- అర టీ స్పూన్.
పోపు కోసం... నెయ్యి– 2 టేబుల్ స్పూన్‌లు; పచ్చిమిర్చి-1 (నిలువుగా చీరాలి); షాజీరా-టీ స్పూన్.
తయారీ: ∙బియ్యాన్ని కడిగి పది నిమిషాల సేపు మంచినీటిలో నానబెట్టాలి. బఠాణీలను కడిగి పక్కన పెట్టాలి. ∙నీటిని ఒక పాత్రలో మరిగించాలి. నీరు మరగడం మొదలైన తర్వాత అందులో బఠాణీలు, బియ్యం వేయాలి. బియ్యం ఉడికేటప్పుడే నిమ్మరసం, యాలక్కాయ, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉప్పు వేయాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే మరో స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి అందులో నెయ్యి వేడి చేసి పచ్చిమిర్చి, షాజీరా వేసి వేగిన తర్వాత ఉడుకుతున్న అన్నంలో వేసి అన్నం మెతుకులు విరగకుండా జాగ్రత్తగా కలిపి మూత పెట్టాలి. మంట తగ్గించి నీరు ఇంకిపోయిన తర్వాత దించేయాలి.
పచ్చి బఠానీతో ఆరోగ్య ప్రయోజనాలు
బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. పిల్లలకు శక్తినిస్తుంది. జీర్ణశక్తికి మంచిది. జింక్, రాగి, మాంగనీస్, ఇనుము లాంటివి లభిస్తాయి. రోగాల బారిన పడకుండా ఉంటారు.ప్రోటీన్‌తో పాటు విటమిన్ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి. పిండానికి తగిన పోషణను కూడా అందిస్తాయి. అలాగే ఇవి రుతుక్రమ సమస్యలలో కూడా ఉపయోగపడతాయి.
బఠానీలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు, వృద్ధాప్య ప్రభావం త్వరగా కనిపించదు.
గమనిక: ఎండు బఠాణీలైతే రాత్రంతా నానబెట్టాలి.
ఇవి చదవండి: బామ్మకు స్వీట్ సర్‌ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment