Green peas
-
పచ్చిబఠానీలతో ప్రయోజనాలు
పచ్చి బఠానీలు ఆహారానికి రుచిని ఇస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. పచ్చి బఠానీల తింటుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బఠానీలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, దీనివల్ల గుండె΄ోటు, రక్త΄ోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి, దీని కారణంగా ఆకలి తగ్గుతుంది. ఇది జింక్, రాగి, మాంగనీస్, ఇనుము కలిగి ఉంటుంది. దానివల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు, వృద్ధాప్య ప్రభావం త్వరగా కనిపించదు. పచ్చి బఠానీలో ప్రోటీన్‌తో పాటు ఉండే విటమిన్ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలను తినడం జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గర్భిణులకు పచ్చి బఠానీలు మేలు చేస్తాయి. ఇది గర్భస్థ శిశువుకు తగిన ΄ోషణను కూడా అందిస్తుంది. ఇంకా ఇవి రుతుక్రమ సమస్యలలో కూడా సాయం చేస్తాయి. -
ఈసారి పచ్చి బఠాణీలతో వెరైటీగా ఊతప్పం ట్రై చేయండిలా!
కావలసినవి: పచ్చిబఠాణి – కప్పు సూజీ రవ్వ – కప్పు బియ్యప్పిండి – మూడు టీస్పూన్లు పచ్చిమిర్చి – మూడు అల్లం – అరంగుళం ముక్క కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు జీలకర్ర – టీస్పూను పెరుగు – అరకప్పు వంటసోడా– 1/2 టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా నూనె – ఊతప్పం కాల్చడానికి తగినంత. తయారీ విధానం: మిక్సీజార్‌లో పచ్చిబఠాణి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీటిని వేస్తూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని సూజీ రవ్వ, బియ్యప్పిండి, గ్రైండ్ చేసిన బఠాణి పేస్టు, పెరుగు కలిపి నానబెట్టాలి. అరగంట తరువాత రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా, కొద్దిగా నీళ్లు పోసుకోని గరిట జారుడుగా కలుపుకోవాలి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసి రెండు గరిటలు పిండి వేసి రొట్టెలా వేసుకోవాలి. దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారట్, క్యాప్సికమ్ ముక్కలు వేసి మూత పెట్టి మంట తగ్గించాలి. ఓ నిమిషం తర్వాత మూత తీసి ఊతప్పాన్ని తిరగేసి మరో అర స్పూన్ నూనె వేసి రెండోవైపు కూడా కాల్చుకుంటే గ్రీన్‌పీస్ ఊతప్పం రెడీ. చట్నీ, సాంబార్‌తో చాలా బావుంటుంది. (చదవండి: టేస్టీగా పొటాటో స్టఫ్ చపాతీలు చేసుకోండిలా..!) -
బరువు తగ్గాలా? బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో ఇలా రొట్టెలు చేసుకుంటే
రోజూ రుచిగా తినాలి. కానీ... అద్దం నిండి పోతోంది. ఏం చేయాలి? మితిమీరిన బరువు వద్దు. వ్యాయామం మరీ ఎక్కువ చేయలేం! మరేం చేయాలి? బరువు తగ్గాలంటే... ఏం తినాలో చాలా మంది చెప్తారు. ఎలా వండాలో మేము చెప్తున్నాం. గ్రీన్ పీస్ అక్కీ రోటీ కావలసినవి: ►బియ్యప్పిండి– కప్పు ►పచ్చి బఠాణీ– కప్పు ►ఉల్లిపాయ – 1(తరగాలి) ►కొత్తి మీర తరుగు– 3 టీ స్పూన్లు ►పచ్చిమిర్చి– 3 (తరగాలి) ►జీలకర్ర– టీ స్పూన్ ►కరివేపాకు – 2 రెమ్మలు ►ఉప్పు – తగినంత ►నూనె– టీ స్పూన్ తయారీ: ►బఠాణీలను కడిగి ఉడికించి, నీటిని మరో పాత్రలోకి వంపి పక్కన ఉంచాలి. ►బఠాణీలను మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. ►అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యప్పిండి, జీలకర్ర, మిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. ►మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే బఠాణీలు ఉడికించిన నీటిని తగినంత తీసుకుంటూ గారెల పిండిలా కలపాలి. ►అరిటాకు లేదా పాలిథిన్ పేపర్‌కు నూనె రాసి పై మిశ్రమాన్ని పెద్ద ఉల్లిపాయంత తీసుకుని సమంగా అరిశెలాగ వత్తాలి. ►మధ్యలో ఐదారు చోట్ల చిల్లు పెట్టాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి ఈ రోటీని పేపర్ మీద నుంచి జాగ్రత్తగా పెనం మీదకు జార్చాలి. ►మీడియం మంట మీద రెండు వైపులా కాల్చాలి. ఇవి కూడా ట్రై చేయండి: Paneer Halwa Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్, చిలగడ దుంప సూప్ తయారీ -
పచ్చి బఠాణీతో ఇన్ని వెరైటీలా?
పచ్చి బఠాణీ... పచ్చ బఠాణీ... ఇంగ్లీషులో పీస్, హిందీలో మటర్.. భాష ఏదైతేనేం.. వంటకాలకు రుచి, వన్నె తీసుకు వస్తుంది. కంటికీ ఇంపుగా ఉంటుంది. ఎందులోనైనా ఇట్టే కలిసిసోతుంది. పచ్చి బఠాణీలతో బోలెడు వంటకాలు. మచ్చుకి ఈ ఆరు వంటలు. ఇవే కాదు.. మీరూ మరిన్ని ప్రయత్నించండి. పీస్‌ఫుల్‌గా వండండి. ఫుల్ మీల్స్ తినండి. పచ్చి బఠాణీ కట్లెట్స్ కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పచ్చి బఠాణీలు – అర కప్పు; బొంబాయి రవ్వ – ఒక కప్పు; జీలకర్ర – పావు టీ స్పూను; సోడా – చిటికెడు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి ముద్ద– తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత; నూనె – తగినంత; ఉప్పు – తగినంత; ఉడికించిన బంగాళదుంప ముద్ద – అర కప్పు; కొత్తిమీర – తగినంత తయారీ: సగ్గు బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి, నీరంతా ఒంపేసి, సగ్గు బియ్యం మునిగేవరకు మంచి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు వడబోయాలి. బఠాణీలను తగినిన్న నీళ్లలో గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి. బొంబాయి రవ్వలో సగ్గుబియ్యం + బఠాణీ ముద్ద, బంగాళదుంప ముద్ద వేసి బాగా కలిపి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు) పకోడీల పిండిలా కలపాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, తడి వస్త్రం మీద ఈ మిశ్రమాన్ని చిన్న ఉండగా పెట్టి కట్లెట్ సైజులో ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి బాగా కాలాక, తీసేసి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది. పచ్చి బఠాణీ ఖీర్ కావలసినవి: పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి కోవా – అర కప్పు; ఆనప కాయ తురుము – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; పాలు – 5 కప్పులు; జీడిపప్పు + బాదం పప్పులు – గుప్పెడు; ఎండు ద్రాక్ష – 15; ఏలకుల పొడి – చిటికెడు; కర్బూజ గింజలు – టీ స్పూను తయారీ: ∙పచ్చి బఠాణీలను గంటసేపు నానబెట్టి, ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఆనపకాయ తురుముకి కొద్దిగా పాలు జత చేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్ రాగానే దించేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చి బఠాణీ ముద్ద వేసి పది నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఆనపకాయ తురుము జత చేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి. ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. ఎండాకాలం ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తింటే హాయిగా ఉంటుంది. పచ్చి బఠాణీ పరోఠా కావలసినవి: గోధుమ పిండి – 3 కప్పులు; పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి మిర్చి ముద్ద – తగినంత; నువ్వులు – అర టీ స్పూను; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; నెయ్యి – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: పచ్చి బఠాణీలను గంట సేపు నానబెట్టి, కుకర్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్ చేయాలి. గోధుమ పిండికి పచ్చి బఠాణీ ముద్ద జత చేసి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి. ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ, కాల్చాలి. పెరుగుతో తింటే రుచిగా ఉంటాయి. పచ్చిబఠాణీ రైస్ కావలసినవి బాస్మతి బియ్యం – 2 కప్పులు; పచ్చి బఠాణీ – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; గరం మసాలా – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీసేయాలి. పచ్చి మిర్చి తరుగు, బంగాళ దుంప ముక్కలు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీయాలి. పసుపు, మిరప కారం జత చేసి మరోమారు కలపాలి. ఉప్పు, ధనియాల పొడి జత చేసి బాగా కలిపాక, పుదీనా ఆకులు జత చేసి మరోమారు కలపాలి. పచ్చి బఠాణీ జత చేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. మూత ఉంచి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉడికించి మూత తీసేయాలి. తగినన్ని నీళ్లు జత చేసి మరిగించాక, కడిగిన బియ్యం వేసి కలియబెట్టి, ఉడికించి దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి. పచ్చి బఠాణీ టొమాటో కూర కావలసినవి: ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు – కప్పు; టొమాటో గుజ్జు – ఒక కప్పు; కొత్తిమీర – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్ళు – తగినన్ని; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, జీలకర్ర, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. టొమాటో గుజ్జు జత చేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ∙మిరప కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మంట కొద్దిగా తగ్గించి, రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి. నీరు పొంగుతుండగా పచ్చి బఠాణీలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా ఉండటానికి బాణలిలో ఉడుకుతున్న వాటిని కొన్నిటిని మెత్తగా మెదిపితే చాలు. చపాతీ, రోటీ, పూరీ, అన్నం.. దేనిలోకైనా రుచిగా ఉంటుంది. పచ్చి బఠాణీ మసాలా కర్రీ కావలసినవి: బఠాణీ – ఒకటిన్నర కప్పులు, నూనె – తగినంత; జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – టీ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను తయారీ: స్టౌ మీద ప్రెజర్ పాన్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు బాగా కలియబెట్టాలి. పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాల పొడి జత చేసి ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించాలి. ఒక కప్పు నీళ్లు జత చేయాలి. బఠాణీలు జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించాలి. చపాతీ, పూరీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది. పచ్చి బఠాణీలు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటం ఎలా.. ఇప్పుడు మార్కెట్లోకి పచ్చి బఠాణీ విరివిగా వస్తున్నాయి. వీటి వంటకాలు కూడా ఈ సీజన్లో ఎక్కువగానే చేసుకుంటారు. రాబోయే నెలల్లో ఇవి రావటం తగ్గిపోతుంది. అన్ సీజన్లో పచ్చి బఠాణీ వాడుకోవాలంటే మార్కెట్లో రంగులు వేసి బఠాణీలు మాత్రమే దొరుకుతాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఏడాది పొడవునా పచ్చి బఠాణీ వాడుకోవటానికి మార్గం లేకపోలేదు. ► పచ్చి బఠాణీ కాయలను తెచ్చి, గింజలు ఒల్చి పక్కన ఉంచుకోవాలి ► స్టౌ మీద పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి ► పచ్చి బఠాణీలను అందులో వేసి అయిదారు నిమిషాలు ఉడికించాలి ► బఠాణీలు పూర్తిగా కాకుండా, సగం సగంగా మాత్రమే ఉడకాలి ► ఉడికించిన బఠాణీలలో నుంచి నీళ్లు ఒంపేసి, ఆ బఠాణీలను చల్లటి ► నీళ్లలో వేసి, బాగా చల్లగా అయ్యేవరకు ఉంచాలి ► బఠాణీలలోని నీళ్లు వడగట్టి, బఠాణీలను పొడి వస్త్రం మీద ► నీడలో ఆరబోయాలి ► తడి పూర్తిగా పోయిన తరవాత, జిప్‌లాక్ కవర్లలో భద్రపరచాలి ► ఈ కవర్లను డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి ► అవసరమనుకున్నప్పుడు తీసి వాడుకోవాలి. -
కరకరల హుషార్ గజగజల పరార్
చలికాలం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ చలి గజగజలాడిస్తుంది. చలి వాతావరణంలో రొటీన్ తిళ్లు తినడానికి పెద్దలకే మొహం మొత్తుతుంది. ఇక చిన్నారుల సంగతి చెప్పాలా? అలాంటప్పుడు వేడివేడిగా వెరైటీ చిరుతిళ్లు వడ్డిస్తే... చిన్నారుల్లో కరకరల హుషార్... ఆ దెబ్బకి గజగజలు పరార్... పనీర్ జిలేబీ వేడివేడిగా తింటే రుచిగా ఉండే స్వీట్లలో జిలేబీలదే మొదటి స్థానం అని చెప్పుకోవాలి. వీటిలో పనీర్ జిలేబీల రుచే వేరు. చలికాలంలో వేడివేడిగా వడ్డిస్తే వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కావలసినవి: పనీర్– 400 గ్రాములు, పచ్చికోవా– 400 గ్రాములు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్– చిటికెడు, నెయ్యి– వేయించేందుకు సరిపడా, పంచదార– 1 కిలో తయారీ: తాజా పనీర్‌ను తురిమి ఒక ప్లేటులో వేసి మెత్తని పిండి ముద్దగా చేయాలి. తరువాత అందులోనే పచ్చికోవా, ఏలకులపొడి, రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ కలిపి తగినన్ని నీళ్లు చల్లి కాస్త జారుగా జిలేబీ మిశ్రమంలా చేయాలి. స్టవ్ మీద మందపాటి గిన్నెపెట్టి అందులో పంచదార వేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు కలిపి పలుచని తీగ పాకం వచ్చాక దించేయాలి. ఇప్పుడు మందపాటి పాలిథిన్ కవరును తీసుకుని దానికి ఓ మూల చిల్లు పెట్టి అందులో జిలేబీ మిశ్రమాన్ని నింపాలి. లేదా పలుచని చేతిరుమాలుకు చిల్లు పెట్టి అందులో పిండిని నింపి అంచుల్ని బిగించి పట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి అందులో ఈ పిండిని గుండ్రంగా జిలేబీల్లా తిప్పుతూ వత్తాలి. వీటిని ఎర్రగా వేయించి తీసి వెంటనే పక్కనే ఉంచుకున్న పాకంలో ముంచి తీసేయాలి. అంతే పనీర్ జిలేబీలు రెడీ. ఫిష్ అమృత్సరీ కావలసినవి: ముళ్లు తీసి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు: అరకిలో, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి తరుగు: రెండు టీస్పూన్స్, పచ్చిమిర్చి: నాలుగు, వాము: అర టీస్పూన్, నిమ్మకాయ: ఒక చెక్క, ఉప్పు: తగినంత, బియ్యప్పిండి: రెండు టీస్పూన్స్, శనగపిండి: మూడు టీస్పూన్స్, కోడిగుడ్డు: ఒకటి, గరమ్ మసాలా: ఒక టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా తయారీ: ఒక పాత్రలో చేపముక్కలను తీసుకుని కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, బియ్యప్పిండి, శనగపిండి, కోడిగుడ్డు, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో చేప ముక్కలను వేసి మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. వీటిని నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఈ చేప ముక్కలను నూనెలో దోరగా వేయించుకుని కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయలతో అలంకరించుకుంటే కరకరలాడే ఫిష్ అమృత్సరీ సిద్ధం. గ్రీన్ పీస్ పాన్‌కేక్స్ కావలసినవి: పచ్చి బఠాణీలు–ఉడికించనవి ముప్పావు కప్పు, బియ్యప్పిండి–అర కప్పు, శనగపిండి– అర కప్పు, పసుపు–పావు టీ స్పూను, ఫ్రూట్ సాల్ట్–అర టీ స్పూను, ఉప్పు–రుచికి తగినంత, నూనె– రెండు టేబుల్ స్పూను,్ల టమాటాలు–పావు కప్పు(సన్నగా తరగాలి), క్యారట్లు–అర కప్పు (తురమాలి), పచ్చి మిరపకాయల తరుగు–రెండు టేబుల్ స్పూన్లు, తురిమిన పనీర్–నాలుగు టేబుల్ స్పూన్లు, నీరు–తగినంత తయారీ: ఉడికించిన బఠాణీలను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో బఠాణీల ముద్ద వేసి దానికి బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు చేర్చాలి. తర్వాత కాస్త నీరు పోసి కాస్త చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఫ్రూట్సాల్ట్ వేయాలి. ఫ్రూట్ సాల్ట్ వేసాకా ఎక్కువగా కలపకూడదు.ఎక్కువగా కలిపితే పాన్ కేక్స్ మెత్తగా రావు. ఇప్పుడు ఒక పెనం తీసుకుని వేడి చేసి దానికి నూనె రాయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెతో పాన్కేక్ మిశ్రమాన్ని పెనం మీద కాస్త మందంగా పొయ్యాలి. తర్వాత తురిమిన పనీర్, క్యారెట్, టమాటా వేసి పైన కొంచెం నూనె చిలకరించాలి. పాన్ కేక్ ఒక వైపు కాలాక మరొక వైపు తిప్పాలి. రెండోవైపు కూడా కాలాక పాన్‌కేక్స్ రెడీ. వేడివేడిగా వీటిని వడ్డించడమే. టమాటా సాస్ లేదా చట్నీతో కలిపి వడ్డిస్తే పిల్లలు వీటిని లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ప్రొటీన్లు, విటమిన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఈ చిరుతిండి పిల్లలకు చాలా ఆరోగ్యకరమైనది. ఫ్రాన్ వడ కావలసినవి: పచ్చి శనగపప్పు – ఒకటిన్నర కప్పులు(నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి), రొయ్యలు – 12(శుభ్రం చేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలి), పచ్చిమిర్చి – 3 లేదా 4, ఎండుమిర్చి – 3, ఉల్లిపాయ – 2, అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర – 1 టేబుల్ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం – అర టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా పచ్చి శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉప్పు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని రొయ్యలకు ఆ మిశ్రమాన్ని దట్టంగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ పకోడా కావలసినవి: బంగాళదుంపలు – 2(మెత్తగా ఉండికించుకోవాలి), పనీర్ తురుము – అర కప్పుఅల్లం పేస్ట్ – పావు టీ స్పూన్పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్కొత్తిమీర తురుము – ఒకటిన్నర టేబుల్ స్పూన్లుబేకింగ్ సోడా – పావు టీ స్పూన్నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా పన్నీర్ తురుములో బంగాళదుంప గుజ్జును వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా, కొత్తిమీర తురుము వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని.. వాటికి బాగా నూనె పట్టించి.. స్టీల్ గ్రిల్ ట్రేపైన పెట్టుకుని ఓవెన్లో ఉడికించుకోవాలి. కడ్కి తాలిపెత్ కావలసినవి: కీరదోసకాయలు – 2(శుభ్రం చేసుకుని, గుజ్జులా చేసుకోవాలి), కరాచీ రవ్వ – ఒకటిన్నర కప్పులు, పండుమిర్చి లేదా పచ్చిమిర్చి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, గడ్డ పెరుగు – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – సరిపడా, నూనె – తగినంత, కొత్తిమీర తురుము – 1 లేదా 2 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కరాచీ రవ్వ, కీరదోసగుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గడ్డ పెరుగు, పండుమిర్చి లేదా పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసుకుని గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ వేడికాగానే నూనె వేసుకుని ఆ మిశ్రమంతో చిన్న చిన్న అట్లు(కేక్స్) వేసుకోవాలి. ఉడుకుతున్న సమయంలోనే కొద్దికొద్దిగా ఆ కేక్స్‌పైన కొత్తిమీర తురుము వేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. -
ఇంటిప్స్
పచ్చి బటానీలు ఉడికిస్తున్నప్పుడు వాటి రంగు మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఆ నీళ్లలో కొద్దిగా పంచదార వేస్తే చాలు.పాతబడిన లెదర్ బ్యాగ్‌లు, షూస్‌ను బేబీ ఆయిల్‌తో పాలిష్ చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి. మెత్తని క్లాత్ మీద కొద్దిగా బేబీ ఆయిల్ వేసి రుద్దాలి. అక్రిలిక్ పెయింట్ చర్మానికి అంటినట్లయితే వెంటనే బేబీ ఆయిల్ కాని అందుబాటులో ఉన్న మరేదయినా ఆయిల్ కాని రాసి బాగా రుద్దాలి. తరువాత సబ్బురాసి వేడి నీటితో కడిగితే పూర్తిగా పోతుంది. వేలి నుంచి ఉంగరాన్ని సులభంగా తీయాలంటే కొద్దిగా బేబీ ఆయిల్ కాని మరేదైనా ఆయిల్ కాని పట్టించాలి. ఉడెన్ ఫర్నిచర్‌ను శుభ్రం చేయాలంటే మెత్తటి క్లాత్ మీద కొద్దిగా బీర్ పోసి తుడవాలి. తర్వాత పొడి క్లాత్‌తో తుడిస్తే బాగా శుభ్రపడతాయి. బంగాళదుంపలు నిలవ ఉంటే మొల కలు వచ్చేస్తుంటాయి. బంగాళ దుంపలు ఉన్న బ్యాగ్‌లో ఒక ఆపిల్ ఉంచితే మొలకలు రావు. వెండి వస్తువులు నల్లబడకుండా ఉండాలంటే వాటిని భద్రపరిచే చోట కర్పూరం బిళ్ళలు ఉంచాలి.