పచ్చి బఠాణీతో ఇన్ని వెరైటీలా? | Green Peas Tasty Recipes | Sakshi
Sakshi News home page

పీస్‌ఫుల్‌గా వండుకుందాం..

Published Sun, Feb 14 2021 11:46 AM | Last Updated on Sun, Feb 14 2021 11:46 AM

Green Peas Tasty Recipes - Sakshi

పచ్చి బఠాణీ... పచ్చ బఠాణీ... ఇంగ్లీషులో పీస్, హిందీలో మటర్‌.. భాష ఏదైతేనేం.. వంటకాలకు రుచి, వన్నె తీసుకు వస్తుంది. కంటికీ ఇంపుగా ఉంటుంది. ఎందులోనైనా ఇట్టే కలిసిసోతుంది. పచ్చి బఠాణీలతో బోలెడు వంటకాలు. మచ్చుకి ఈ ఆరు వంటలు. ఇవే కాదు.. మీరూ మరిన్ని ప్రయత్నించండి. పీస్‌ఫుల్‌గా వండండి. ఫుల్‌ మీల్స్‌ తినండి.

పచ్చి బఠాణీ కట్‌లెట్స్‌
కావలసినవి: సగ్గు బియ్యం – ఒక కప్పు; పచ్చి బఠాణీలు – అర కప్పు; బొంబాయి రవ్వ – ఒక కప్పు; జీలకర్ర – పావు టీ స్పూను; సోడా – చిటికెడు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి ముద్ద– తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – తగినంత; నూనె – తగినంత; ఉప్పు – తగినంత; ఉడికించిన బంగాళదుంప ముద్ద – అర కప్పు; కొత్తిమీర – తగినంత

తయారీ: సగ్గు బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి, నీరంతా ఒంపేసి, సగ్గు బియ్యం మునిగేవరకు మంచి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాక, నీళ్లు వడబోయాలి. బఠాణీలను తగినిన్న నీళ్లలో గంటసేపు నానబెట్టాక, నీళ్లు తీసేసి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా చేయాలి. బొంబాయి రవ్వలో సగ్గుబియ్యం + బఠాణీ ముద్ద, బంగాళదుంప ముద్ద వేసి బాగా కలిపి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు) పకోడీల పిండిలా కలపాలి. స్టౌ మీద పెనం వేడయ్యాక, తడి వస్త్రం మీద ఈ మిశ్రమాన్ని చిన్న ఉండగా పెట్టి కట్‌లెట్‌ సైజులో ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి బాగా కాలాక, తీసేసి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే బాగుంటుంది.

పచ్చి బఠాణీ ఖీర్‌
కావలసినవి: పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి కోవా – అర కప్పు; ఆనప కాయ తురుము – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు; నెయ్యి – 3 టీ స్పూన్లు; పాలు – 5 కప్పులు; జీడిపప్పు + బాదం పప్పులు – గుప్పెడు; ఎండు ద్రాక్ష – 15; ఏలకుల పొడి – చిటికెడు; కర్బూజ గింజలు – టీ స్పూను

తయారీ: ∙పచ్చి బఠాణీలను గంటసేపు నానబెట్టి, ఉడికించి మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన ఉంచాలి. ఆనపకాయ తురుముకి కొద్దిగా పాలు జత చేసి, కుకర్‌లో ఉంచి, ఒక విజిల్‌ రాగానే దించేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగిన తర్వాత పచ్చి బఠాణీ ముద్ద వేసి పది నిమిషాల పాటు ఆపకుండా కలుపుతుండాలి. ఆనపకాయ తురుము జత చేసి ఐదు నిమిషాలు కలిపి ఆ తరవాత కోవా, పాలు, పంచదార వేసి బాగా కలపాలి. ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్‌ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. ఎండాకాలం ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తింటే హాయిగా ఉంటుంది.

పచ్చి బఠాణీ పరోఠా
కావలసినవి:  గోధుమ పిండి – 3 కప్పులు; పచ్చి బఠాణీలు – ఒక కప్పు; పచ్చి మిర్చి ముద్ద – తగినంత; నువ్వులు – అర టీ స్పూను; నూనె – తగినంత; కొత్తిమీర, కరివేపాకు – తగినంత; నెయ్యి – టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఉప్పు – తగినంత

తయారీ: పచ్చి బఠాణీలను గంట సేపు నానబెట్టి, కుకర్‌లో ఉంచి ఒక విజిల్‌ వచ్చాక దించేయాలి. చల్లారాక మెత్తగా గ్రైండ్‌ చేయాలి. గోధుమ పిండికి పచ్చి బఠాణీ ముద్ద జత చేసి, నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ వేసి బాగా కలిపి, నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలిపి, అరగంటసేపు నాననివ్వాలి. ఉండలు చేసుకుని, చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేస్తూ, కాల్చాలి. పెరుగుతో తింటే రుచిగా ఉంటాయి.

పచ్చిబఠాణీ రైస్‌
కావలసినవి  బాస్మతి బియ్యం – 2 కప్పులు; 
పచ్చి బఠాణీ – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; పుదీనా ఆకులు – అర కప్పు; కొత్తిమీర – అర కప్పు; గరం మసాలా – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత

తయారీ
స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీసేయాలి. పచ్చి మిర్చి తరుగు, బంగాళ దుంప ముక్కలు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి తీయాలి. పసుపు, మిరప కారం జత చేసి మరోమారు కలపాలి. ఉప్పు, ధనియాల పొడి జత చేసి బాగా కలిపాక, పుదీనా ఆకులు జత చేసి మరోమారు కలపాలి. పచ్చి బఠాణీ జత చేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. మూత ఉంచి సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉడికించి మూత తీసేయాలి. తగినన్ని నీళ్లు జత చేసి మరిగించాక, కడిగిన బియ్యం వేసి కలియబెట్టి, ఉడికించి దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

పచ్చి బఠాణీ టొమాటో కూర
కావలసినవి: ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు – కప్పు; టొమాటో గుజ్జు – ఒక కప్పు; కొత్తిమీర – అర కప్పు; పచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు; మిరప కారం – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; నీళ్ళు – తగినన్ని; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత

తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఇంగువ, జీలకర్ర, పచ్చి మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. టొమాటో గుజ్జు జత చేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.  ∙మిరప కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. మంట కొద్దిగా తగ్గించి, రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. కొద్దిగా నీళ్లు జత చేసి కలపాలి. నీరు పొంగుతుండగా పచ్చి బఠాణీలు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా ఉండటానికి బాణలిలో ఉడుకుతున్న వాటిని కొన్నిటిని మెత్తగా మెదిపితే చాలు. చపాతీ, రోటీ, పూరీ, అన్నం.. దేనిలోకైనా రుచిగా ఉంటుంది.

పచ్చి బఠాణీ  మసాలా కర్రీ
కావలసినవి: బఠాణీ – ఒకటిన్నర కప్పులు, నూనె – తగినంత;  జీలకర్ర – టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – టీ స్పూను;  ధనియాల పొడి – టీ స్పూను

తయారీ: స్టౌ మీద ప్రెజర్‌ పాన్‌లో నూనె వేడయ్యాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. పచ్చి మిర్చి తరుగు జత చేసి మరోమారు వేయించాలి. టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు బాగా కలియబెట్టాలి. పసుపు, ఉప్పు, మిరప కారం, ధనియాల పొడి జత చేసి ఐదు నిమిషాలు బాగా కలుపుతూ ఉడికించాలి. ఒక కప్పు నీళ్లు జత చేయాలి. బఠాణీలు జత చేసి మరోమారు కలిపి మూత ఉంచి నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించి, దింపేయాలి. కొత్తిమీరతో అలంకరించాలి. చపాతీ, పూరీ, అన్నంలోకి రుచిగా ఉంటుంది.

పచ్చి బఠాణీలు ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటం ఎలా..
ఇప్పుడు మార్కెట్‌లోకి పచ్చి బఠాణీ విరివిగా వస్తున్నాయి. వీటి వంటకాలు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగానే చేసుకుంటారు. రాబోయే నెలల్లో ఇవి రావటం తగ్గిపోతుంది. అన్‌ సీజన్‌లో పచ్చి బఠాణీ వాడుకోవాలంటే మార్కెట్లో రంగులు వేసి బఠాణీలు మాత్రమే దొరుకుతాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ఏడాది పొడవునా పచ్చి బఠాణీ వాడుకోవటానికి మార్గం లేకపోలేదు.

పచ్చి బఠాణీ కాయలను తెచ్చి, గింజలు ఒల్చి పక్కన ఉంచుకోవాలి 
స్టౌ మీద పెద్ద గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి 
పచ్చి బఠాణీలను అందులో వేసి అయిదారు నిమిషాలు ఉడికించాలి 
బఠాణీలు పూర్తిగా కాకుండా, సగం సగంగా మాత్రమే ఉడకాలి 
ఉడికించిన బఠాణీలలో నుంచి నీళ్లు ఒంపేసి, ఆ బఠాణీలను చల్లటి
నీళ్లలో వేసి, బాగా చల్లగా అయ్యేవరకు ఉంచాలి 
బఠాణీలలోని నీళ్లు వడగట్టి, బఠాణీలను పొడి వస్త్రం మీద 
నీడలో ఆరబోయాలి 
తడి పూర్తిగా పోయిన తరవాత, జిప్‌లాక్‌ కవర్లలో భద్రపరచాలి
ఈ కవర్లను డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి 
అవసరమనుకున్నప్పుడు తీసి వాడుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement