క‌ర‌క‌రల హుషార్‌ గ‌జ‌గ‌జ‌ల ప‌రార్‌ | Funday cover story special 18 nov 2018 | Sakshi
Sakshi News home page

క‌ర‌క‌రల హుషార్‌ గ‌జ‌గ‌జ‌ల ప‌రార్‌

Published Sun, Nov 18 2018 1:34 AM | Last Updated on Sun, Nov 18 2018 1:34 AM

Funday cover story special 18 nov 2018 - Sakshi

చలికాలం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ చలి గజగజలాడిస్తుంది. చలి వాతావరణంలో రొటీన్‌ తిళ్లు తినడానికి పెద్దలకే మొహం మొత్తుతుంది. ఇక చిన్నారుల సంగతి చెప్పాలా? అలాంటప్పుడు వేడివేడిగా వెరైటీ చిరుతిళ్లు వడ్డిస్తే... చిన్నారుల్లో కరకరల హుషార్‌... ఆ దెబ్బకి గజగజలు పరార్‌...


పనీర్‌ జిలేబీ
వేడివేడిగా తింటే రుచిగా ఉండే స్వీట్లలో జిలేబీలదే మొదటి స్థానం అని చెప్పుకోవాలి. వీటిలో పనీర్‌ జిలేబీల రుచే వేరు. చలికాలంలో వేడివేడిగా వడ్డిస్తే వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 
కావలసినవి: పనీర్‌– 400 గ్రాములు, పచ్చికోవా– 400 గ్రాములు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, రెడ్‌ ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌– చిటికెడు, నెయ్యి– వేయించేందుకు సరిపడా, పంచదార– 1 కిలో
తయారీ: తాజా పనీర్‌ను తురిమి ఒక ప్లేటులో వేసి మెత్తని పిండి ముద్దగా చేయాలి. తరువాత అందులోనే పచ్చికోవా, ఏలకులపొడి, రెడ్‌ ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ కలిపి తగినన్ని నీళ్లు చల్లి కాస్త జారుగా జిలేబీ మిశ్రమంలా చేయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నెపెట్టి అందులో పంచదార వేసి ఒకటిన్నర గ్లాసు నీళ్లు కలిపి పలుచని తీగ పాకం వచ్చాక దించేయాలి. ఇప్పుడు మందపాటి పాలిథిన్‌ కవరును తీసుకుని దానికి ఓ మూల చిల్లు పెట్టి అందులో జిలేబీ మిశ్రమాన్ని నింపాలి. లేదా పలుచని చేతిరుమాలుకు చిల్లు పెట్టి అందులో పిండిని నింపి అంచుల్ని బిగించి పట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి అందులో ఈ పిండిని గుండ్రంగా జిలేబీల్లా తిప్పుతూ వత్తాలి. వీటిని ఎర్రగా వేయించి తీసి వెంటనే పక్కనే ఉంచుకున్న పాకంలో ముంచి తీసేయాలి. అంతే పనీర్‌ జిలేబీలు రెడీ. 

ఫిష్‌ అమృత్‌సరీ
కావలసినవి:  ముళ్లు తీసి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు: అరకిలో, కారం: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, అల్లం వెల్లుల్లి తరుగు: రెండు టీస్పూన్స్, పచ్చిమిర్చి: నాలుగు, వాము: అర టీస్పూన్, నిమ్మకాయ: ఒక చెక్క, ఉప్పు: తగినంత, బియ్యప్పిండి: రెండు టీస్పూన్స్, శనగపిండి: మూడు టీస్పూన్స్, కోడిగుడ్డు: ఒకటి, గరమ్‌ మసాలా: ఒక టీస్పూన్, నూనె: వేయించడానికి సరిపడా
తయారీ: ఒక పాత్రలో చేపముక్కలను తీసుకుని కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మకాయ రసం, బియ్యప్పిండి, శనగపిండి, కోడిగుడ్డు, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి. ఇందులో చేప ముక్కలను వేసి మసాలా ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. వీటిని నాలుగు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత ఈ చేప ముక్కలను నూనెలో దోరగా వేయించుకుని కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయలతో అలంకరించుకుంటే కరకరలాడే ఫిష్‌ అమృత్‌సరీ సిద్ధం. 

గ్రీన్‌ పీస్‌ పాన్‌కేక్స్‌
కావలసినవి:  పచ్చి బఠాణీలు–ఉడికించనవి ముప్పావు కప్పు, బియ్యప్పిండి–అర కప్పు, శనగపిండి– అర కప్పు, పసుపు–పావు టీ స్పూను, ఫ్రూట్‌ సాల్ట్‌–అర టీ స్పూను, ఉప్పు–రుచికి తగినంత, నూనె– రెండు టేబుల్‌ స్పూను,్ల టమాటాలు–పావు కప్పు(సన్నగా తరగాలి), క్యారట్లు–అర కప్పు (తురమాలి), పచ్చి మిరపకాయల తరుగు–రెండు టేబుల్‌ స్పూన్లు, తురిమిన పనీర్‌–నాలుగు టేబుల్‌ స్పూన్లు, నీరు–తగినంత 
తయారీ: ఉడికించిన బఠాణీలను మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో బఠాణీల ముద్ద వేసి దానికి బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు చేర్చాలి. తర్వాత కాస్త నీరు పోసి కాస్త చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఫ్రూట్‌సాల్ట్‌ వేయాలి. ఫ్రూట్‌ సాల్ట్‌ వేసాకా ఎక్కువగా కలపకూడదు.ఎక్కువగా కలిపితే పాన్‌ కేక్స్‌ మెత్తగా రావు. ఇప్పుడు ఒక పెనం తీసుకుని వేడి చేసి దానికి నూనె రాయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటెతో పాన్‌కేక్‌ మిశ్రమాన్ని పెనం మీద కాస్త మందంగా పొయ్యాలి. తర్వాత తురిమిన పనీర్, క్యారెట్, టమాటా వేసి పైన కొంచెం నూనె చిలకరించాలి. పాన్‌ కేక్‌ ఒక వైపు కాలాక మరొక వైపు తిప్పాలి. రెండోవైపు కూడా కాలాక పాన్‌కేక్స్‌ రెడీ. వేడివేడిగా వీటిని వడ్డించడమే. టమాటా సాస్‌ లేదా చట్నీతో కలిపి వడ్డిస్తే పిల్లలు వీటిని లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ప్రొటీన్లు, విటమిన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఈ చిరుతిండి పిల్లలకు చాలా ఆరోగ్యకరమైనది.

ఫ్రాన్‌ వడ
కావలసినవి:  పచ్చి శనగపప్పు – ఒకటిన్నర కప్పులు(నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి), రొయ్యలు – 12(శుభ్రం చేసుకుని కుక్కర్‌లో ఉడికించుకోవాలి), పచ్చిమిర్చి – 3 లేదా 4, ఎండుమిర్చి – 3, ఉల్లిపాయ – 2, అల్లం – చిన్న ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, కొత్తిమీర – 1 టేబుల్‌ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, నిమ్మరసం – అర టేబుల్‌ స్పూన్‌
తయారీ: ముందుగా పచ్చి శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు మిక్సీ బౌల్‌లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకుని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో  ఉప్పు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని రొయ్యలకు ఆ మిశ్రమాన్ని దట్టంగా పట్టించి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకోవాలి.

పన్నీర్‌ పకోడా
కావలసినవి:  బంగాళదుంపలు – 2(మెత్తగా ఉండికించుకోవాలి), పనీర్‌ తురుము – అర కప్పుఅల్లం పేస్ట్‌ – పావు టీ స్పూన్‌పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టీ స్పూన్‌కొత్తిమీర తురుము – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లుబేకింగ్‌ సోడా – పావు టీ స్పూన్‌నూనె – 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: ముందుగా పన్నీర్‌ తురుములో బంగాళదుంప గుజ్జును వేసుకుని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌ వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత బేకింగ్‌ సోడా, కొత్తిమీర తురుము వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా చేసుకుని.. వాటికి బాగా నూనె పట్టించి.. స్టీల్‌ గ్రిల్‌ ట్రేపైన పెట్టుకుని ఓవెన్‌లో ఉడికించుకోవాలి.

కడ్కి తాలిపెత్‌
కావలసినవి: కీరదోసకాయలు – 2(శుభ్రం చేసుకుని, గుజ్జులా చేసుకోవాలి), కరాచీ రవ్వ – ఒకటిన్నర కప్పులు, పండుమిర్చి లేదా పచ్చిమిర్చి పేస్ట్‌ – 1 టేబుల్‌ స్పూన్, గడ్డ పెరుగు – 1 టేబుల్‌ స్పూన్‌
ఉప్పు – సరిపడా, నూనె – తగినంత, కొత్తిమీర తురుము – 1 లేదా 2 టేబుల్‌ స్పూన్లు
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో కరాచీ రవ్వ, కీరదోసగుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గడ్డ పెరుగు, పండుమిర్చి లేదా పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసుకుని గరిటెతో బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని పాన్‌ వేడికాగానే నూనె వేసుకుని ఆ మిశ్రమంతో చిన్న చిన్న అట్లు(కేక్స్‌) వేసుకోవాలి. ఉడుకుతున్న సమయంలోనే కొద్దికొద్దిగా ఆ కేక్స్‌పైన కొత్తిమీర తురుము వేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement