కళ, సాహిత్యం, సంస్కృతి, ఆహారం.. ఇవే తాజ్ మహోత్సవ్ ప్రత్యేకతలు. యూపీలోని ఆగ్రాలోగల శిల్పగ్రామ్‌లో ఫిబ్రవరి 17న తాజ్ మహొత్సవ్ ప్రారంభమయ్యింది. ఇది ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది.
ప్రస్తుతం జరుగుతున్న తాజ్ మహోత్సవ్‌లో 300లకు పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వంటకాలకు సంబంధించిన స్టాల్స్ ఆహార ప్రియులను అమితంగా అలరిస్తున్నాయి. వీటిలో హరియాణా జిలేబీ స్టాల్ ప్రత్యేకంగా నిలిచింది. హరియాణాకు చెందిన నరేష్ కుమార్ ఏర్పాటు చేసిన ఈ స్టాల్ ముందు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ జిలేబీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క జిలేబీ కుటుంబం అంతటికీ సరిపోతుంది. ఐదుగురు సభ్యులు కలిగిన కుటుంబం ఈ ఒక్క జిలేబీని హాయిగా ఆరగించి ఆనందించవచ్చు.
1952లో తన తాత హరిశ్చంద్ర హల్వాయి ఈ జిలేబీని తయారు చేయడం ప్రారంభించాడని నరేష్ తెలిపారు. తమ మూడో తరం కుటుంబ సభ్యులు కూడా జిలేబీ వ్యాపారంతోనే ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. గత 15 ఏళ్లుగా తాజ్ మహోత్సవ్‌లో జలేబీ స్టాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాము తయారు చేసే జిలేబీ బరువు దాదాపు 250 గ్రాములు ఉంటుందని తెలిపారు.ఈ జిలేబీ ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదని పేర్కొన్నారు.
తాజ్ మహోత్సవ్‌ను సందర్శించే ప్రతీఒక్కరూ ఈ జిలేబీని రుచి చూడాలని కోరుకుంటారని, ఒక్కో జిలేబీ ధర రూ. 400 అని స్టాల్ నిర్వాహకులు నరేష్ తెలిపారు. తాము రూపొందించే జిలేబీని మాజీ ఉప ప్రధాని చౌదరి దేవి లాల్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రుచి చూశారని నరేష్ కుమార్ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment