అనాథ కుక్కలకు అదో శరణాలయం..!
ప్రకృతి సంపదతో పర్యాటకుల్ని పులకరింపజేసే కోస్లారికా ప్రాంతం.. రకరకాల వన్యప్రాణులకు, వృక్షాలకే కాక అనాథ శునకాలకూ ఆశ్రయమిచ్చే శరణాలయం అని మీకు తెలుసా? జంతు ప్రేమికులు, పెంపుడు జంతువుల కోసం ఎదురు చూసే వారికి వందలకొద్దీ శునకాలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న ఆ శునకాలు.. వాటిని చేరదీసి ఆశ్రయం ఇచ్చి... పెంచుకునే వారికోసం ఎదురు చూస్తున్నాయి.
టెర్రటోరియో డి జెగ్వేట్స్ వీధికుక్కలు హాయిగా జీవించగలిగే ఓ ప్రైవేట్ అభయారణ్యం. సుమారు 900 శునకాలు అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హాయిగా జీవిస్తున్నాయి. జంతు ప్రేమికులు.. ఓ కొత్త నేస్తం కోసం ఎదురు చూసేవారికి కోస్టారికాలోని ఆ ఆశ్రమం అందుబాటులో ఉంది. మరోవైపు పర్యటకులు ఒకేచోట రకరకాల శునకాలను వీక్షించి ఆనందించే అవకాశం ఆ సంస్థ కల్పిస్తోంది. 'వాలంటీర్ రన్' కార్యక్రమంతో కోస్టారికాలోని ఆ విశాలమైన అటవీ ప్రాంతంలో వందలకొద్దీ శునకాలకు ఆహారం, స్నానపానాలు, వసతి సౌకర్యాలు కూడ కల్పిస్తున్నారు. తిండీ తిప్పలూ లేక, బక్క చిక్కి, అనేక వ్యాధులు సోకి వీధుల్లో అనాథలుగా తిరుగుతున్న కుక్కలను చూసిన తర్వాత వాటికో శరణాలయం స్థాపించాలన్న ఆలోచన తనకు వచ్చిందని స్థాపకురాలు ల్యా బ్యాటిల్ చెప్తారు.
తాను వెళ్ళే మార్గంలో ప్రతిరోజూ వీధికుక్కలను చూసేదాన్నని, నిస్సహాయంగా ఉన్న వాటిలో కొన్నింటిని చూస్తే వాటికీ ఎంతో జీవితం ఉందని, అది హాయిగా జీవించేందుకు తగ్గ సహాయం అందించడం తప్పనిసరి అనిపించేదని, అదే కర్తవ్యంగా భావించి... అటువంటి అనాథ శునకాలను తెచ్చి ఆరోగ్యసేవలు అందించి, శుభ్రపరచి మంచి కుటుంబాలు తయారయ్యేట్లుగా చేస్తున్నానని ఆమె చెప్తున్నారు. అలాగే వాటికి మంచి లక్షణాలను అలవరచి ఇష్టపడి పెంచుకునే వారికోసం అందుబాటులో ఉంచుతున్నామని ల్యా చెప్తున్నారు.
అయితే అదృష్టంకొద్దీ తాను ఆశ్రయం కల్పించిన శునకాల్లో ఎక్కువ శాతం అభిమానంగా, ఆదరణీయంగా ఉండటంతోపాటు... తాను చెప్పినట్లుగా విని, తన సేవలు అందుకుంటున్నాయని, కొన్ని తనను తిరస్కరించి వెళ్ళిపోతున్నాయని ల్యా అంటున్నారు. పెంచుకునేందుకు వచ్చేవారికి ప్రతి కుక్క వివరాలు షెల్టర్ బిల్ బోర్డులో చూసేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే సుదూర ప్రాంతాలనుంచీ సైతం ఇక్కడకు వచ్చి ఈ శునకాలను పెంచుకునేందుకు అనేక మంది స్వీకరిస్తున్నట్లు ల్యా బ్యాటిల్ తెలిపారు.