సాక్షి, ఏలూరు: అరుదైన జాతికి చెందని బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల్లో ముఖ్యమైనది. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలోని కొండ గుహల్లో సందడి చేస్తున్నాయి. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టి లోడస్ అరీస్. సాధారణంగా ఇవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు.. లేత పసుపు రంగులో 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, వాటి సందు మధ్య ఉండే తేమ ప్రాంతాలంటే బంగారు బల్లులకు మహా ఇష్టం.
40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి
ఇవి ఒకేసారి సుమారు 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయ. ఇవి గుడ్లను విచిత్రంగా కిందకి వేలాడే విధంగా పెడతాయి. ఈ గుడ్లను పాములు, క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాతుల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పాపికొండలు అభయారణ్య గోదావరి పరీవాహక రాతి ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీ శాఖ అంచనా వేశారు. బంగారు బల్లుల్లోనూ రెండు జాతులుగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. వాటిలో ఒకటి కాలొడాక్టి లోడస్ అరీస్. ఇవి సాధారణ బల్లుల కంటే పెద్దగా అరుస్తూ వింత శబ్దం చేస్తాయని చెబుతున్నారు.
పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల సంచారం ఉంది
పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల జాడ ఉంది. రెండేళ్ల క్రితం నేను, విశాఖపట్నానికి చెందిన శాస్త్రవేత్త కలిసి పోలవరం మండలం సిరివాక గ్రామంలోని గోదావరి సమీపంలో గల రాతి ప్రదేశాల్లో అధిక సంఖ్యలో బంగారు బల్లులు పెట్టిన గుడ్లు గుర్తించాం. 250కి పైగా బంగారు బల్లులు ఉండవచ్చని అంచనా వేస్తున్నాం.
– దావీదురాజు నాయుడు, ఇన్‌చార్జి ఫారెస్ట్ అధికారి, పోలవరం
ఫొటోలు తీశా
పాపికొండలు అభయారణ్యంలో అరుదైన పక్షులను, జంతువులను ఫొటోలు తీశాను. బంగారు బల్లి కూడా నా కెమెరాకు చిక్కింది. అభయారణ్యం రాతి ప్రాంతాల్లో ఈ బల్లుల సంచారం ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు.
– కె.బాలాజీ, ఫొటోగ్రాఫర్, రాజమండ్రి
చదవండి: పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’
Comments
Please login to add a commentAdd a comment