Papikondalu
-
రాజమండ్రి : పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు)
-
మద్దిచెట్టు నుంచి నీటి ధార
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): దట్టమైన అటవీ ప్రాంతంలో మద్ది చెట్టు నుంచి ధారగా నీరు రావడం అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. పాపికొండలు నేషనల్ పార్క్‌లోని ఇందుకూరు రేంజ్ పరిధి కింటుకూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరన్ సిబ్బందితో కలిసి శనివారం కింటుకూరు అటవీ ప్రాంతానికి తనిఖీ నిమిత్తం వెళ్లారు. నల్లమద్ది చెట్టుకు బొడుపులు ఉన్నచోట కత్తితో గాటు పెట్టాలని ఆయన సిబ్బందికి సూచించారు. దీంతో గాటు పెడుతుండగానే నీరు ధారలా బయటకు వచ్చింది. దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ నల్లమద్ది చెట్టులో నీరు నిల్వ చేసుకునే వ్యవస్ధ ఉందని, అందుకు తగ్గట్టుగా అవసరాలకు నీటిని చెట్టు తనలో దాచుకుందన్నారు. చెట్టు నుంచి సుమారు 20 లీటర్లు నీరు వచ్చినట్లు తెలిపారు. నీటిని రుచి చూసిన ఆయన తాగేందుకు ఉపయోగపడదని తెలిపారు. నల్లమద్ది చెట్టు బెరడు మొసలి చర్మంలా ఉండడంతో దీనిని క్రోకోడైల్ బర్క్ ట్రీ అని కూడా పిలుస్తారని పేర్కొన్నారు. శాస్త్రీయ నామం టెర్మినేలియా టొమెంటోసా అని చెప్పారు. ఆయన వెంట రేంజ్ అధికారి దుర్గా కుమార్‌బాబు పాల్గొన్నారు. -
పాపికొండల్లో అరుదైన మిత్రుడు
కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్‌లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని రంపచోడవరం జలపాతం వద్ద 2022 సెపె్టంబర్ 8న చనిపోయిన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ మృతదేహాన్ని కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన శాస్త్రవేత్తలు దీపా జైస్వాల్, బి.భరత్, ఎం.కరుతాపాండి, శ్రీకాంత్ జాదవ్, కల్యాణి, కుంటేలు గుడ్డిపాము కళేబరాన్ని రసాయనాలతో హైదరాబాద్ జూలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి పరిశోధనలు చేసి చివరకు డీఎన్ఏ పరీక్ష ద్వారా దీనిని అరుదైన డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌గా నిర్ధారించారు. 1839లో జావా దీవుల్లో గుర్తింపు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను 1839లో ఇండోనేషియాలోని జావా దీవుల్లో తొలిసారిగా గుర్తించారు. ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త పియరి మోడర్డ్ డియార్డ్ గౌరవార్థం దీనికి డయార్ట్స్ అని నామకరణం చేశారు. ఆర్గిరోఫిస్ డయార్టి శాస్త్రీయ నామం కలిగిన ఇది టైఫ్లోపిడే కుటుంబంలో విషపూరితం కాని పాము జాతికి చెందినది. ఇవి అడుగు వరకు పొడవు పెరుగుతాయి. భారతదేశంలో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, హరియాణా, బిహార్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో వీటి జాతి ఉంది. మొదటిసారి ఏపీలోని పాపికొండలు అభయారణ్య ప్రాంతమైన రంపచోడవరం జలపాతం వద్ద దీనిని కనుగొన్నారు. వానపాములు భూసారాన్ని పెంపొందించడంలో ఏ విధంగా సాయపడతాయో అంతకంటే ఎక్కువగా పర్యావరణాన్ని కాపాడటంలో గుడ్డిపాములు దోహదపడతాయి. ఐయూసీఎన్ ఆందోళన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తగ్గుతున్న జీవుల జాబితా అయిన రెడ్ లిస్ట్‌లో డయార్ట్స్ బ్లైండ్ స్నేక్‌ను చేర్చింది. భారతీయ వన్యప్రాణి (రక్షణ) సవరణ చట్టంలో దీనిని చేర్చారు. చిత్తడిగా ఉండే అటవీ ప్రాంతం, పొదలు, గడ్డి భూముల్లో ఇవి నివసిస్తాయి. వీటితో పర్యావరణం పరిఢవిల్లుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. తూర్పు కనుమల ప్రాంతమైన తమిళనాడు, ఏపీ, ఒడిశా ప్రాంతాల్లో కేవలం పాపికొండలు వద్ద ఈ జాతిని గుర్తించడంతో ఈ ప్రాంతాల్లో మరింతగా వీటి జాడ ఉండే అవకాశం ఉంది. విషపూరితమైనవి కావు డయార్ట్స్ బ్లైండ్ స్నేక్ విషపూరితమైనవి కావు. క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. వానపాములు ఏ విధంగా సంతానోత్పత్తి చేస్తాయో అదేవిధంగా వీటి సంతతిని వృద్ధి చేసుకుంటాయి. పంట పొలాల్లో రసాయనాలు అధిక వినియోగం వల్ల వీటి సంతతి నశిస్తోంది. పర్యావరణ పరిరక్షణలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది. వీటిని పరిరక్షించుకోవాలి. – బి.భరత్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్ -
అడవిలో అమృతధార
బుట్టాయగూడెం: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్య ప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి. ఆ సమయంలో కుక్కల బారిన, వాహనాల కింద పడి మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రెండేళ్లుగా వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చేవిధంగా కృషి చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో అటవీ శాఖ ఈ ఏడాది కూడా వేసవి ప్రణాళిక రూపొందించారు. పాపికొండల్లో 60 నీటికుంటలు పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేవిధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితోపాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చెలమల్ని తవ్వి వన్య ప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. అవికాకుండా 25 చెక్‌డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి తొట్టెల్లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా బేస్‌క్యాంప్ సిబ్బంది, బీట్ అధికారులు నీటిని తీసుకొచ్చి నింపుతున్నారు. వాటి పక్కన ఉప్పు ముద్దలను పెడుతున్నారు. నీటి కోసం వచ్చిన వన్యప్రాణులు దాహార్తి తీర్చుకుని ఉప్పు ముద్ద నాకుతాయని, తద్వారా వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కృషి పాపికొండలు అభయారణ్యంలోని వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కృషి చేస్తున్నాం. సుమారు 60 నీటితొట్టెల్ని వన్యప్రాణులు సంచరించే ప్రదేశాల్లో ఏర్పాటు చేశాం. జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.1.50 లక్షలు వెచ్చిస్తోంది. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం -
పాపికొండల విహార యాత్రకు గ్రీన్ సిగ్నల్
దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): గోదావరిలో పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆగస్టులో పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరికి వరదలు లేకపోవడంతో నిబంధనలను అనుసరించి పర్యాటక బోట్లు విహరించేందుకు అనుమతించారు. బుధవారం ఒక పర్యాటక బోటులో ఉన్నతాధికారి పేరంటపల్లికి వెళ్లనున్నారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే -
పోలవరం అడవిలో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి
సాక్షి, ఏలూరు: అరుదైన జాతికి చెందని బంగారు బల్లి అంతరించిపోతున్న జీవుల్లో ముఖ్యమైనది. ఇప్పుడివి పోలవరం అడవిగా పిలిచే పాపికొండలు అభయారణ్యంలోని కొండ గుహల్లో సందడి చేస్తున్నాయి. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టి లోడస్ అరీస్. సాధారణంగా ఇవి రాత్రిపూట మాత్రమే సంచరిస్తాయి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు.. లేత పసుపు రంగులో 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో మాత్రమే సంచరిస్తాయి. రాతి గుహలు, వాటి సందు మధ్య ఉండే తేమ ప్రాంతాలంటే బంగారు బల్లులకు మహా ఇష్టం. 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయి ఇవి ఒకేసారి సుమారు 40 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయ. ఇవి గుడ్లను విచిత్రంగా కిందకి వేలాడే విధంగా పెడతాయి. ఈ గుడ్లను పాములు, క్రిమికీటకాలు తినేస్తుండటంతో ఇవి అంతరించిపోయే జాతుల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పాపికొండలు అభయారణ్య గోదావరి పరీవాహక రాతి ప్రాంతాల్లో సుమారు 250 వరకు బంగారు బల్లులు ఉన్నట్టు అటవీ శాఖ అంచనా వేశారు. బంగారు బల్లుల్లోనూ రెండు జాతులుగా ఉన్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. వాటిలో ఒకటి కాలొడాక్టి లోడస్ అరీస్. ఇవి సాధారణ బల్లుల కంటే పెద్దగా అరుస్తూ వింత శబ్దం చేస్తాయని చెబుతున్నారు. పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల సంచారం ఉంది పాపికొండలు అభయారణ్యంలో బంగారు బల్లుల జాడ ఉంది. రెండేళ్ల క్రితం నేను, విశాఖపట్నానికి చెందిన శాస్త్రవేత్త కలిసి పోలవరం మండలం సిరివాక గ్రామంలోని గోదావరి సమీపంలో గల రాతి ప్రదేశాల్లో అధిక సంఖ్యలో బంగారు బల్లులు పెట్టిన గుడ్లు గుర్తించాం. 250కి పైగా బంగారు బల్లులు ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. – దావీదురాజు నాయుడు, ఇన్చార్జి ఫారెస్ట్ అధికారి, పోలవరం ఫొటోలు తీశా పాపికొండలు అభయారణ్యంలో అరుదైన పక్షులను, జంతువులను ఫొటోలు తీశాను. బంగారు బల్లి కూడా నా కెమెరాకు చిక్కింది. అభయారణ్యం రాతి ప్రాంతాల్లో ఈ బల్లుల సంచారం ఉంది. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. – కె.బాలాజీ, ఫొటోగ్రాఫర్, రాజమండ్రి చదవండి: పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’ -
మూషిక జింక.. లగెత్తడమే ఇక.. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి
బుట్టాయగూడెం: ఒకప్పుడు మూషిక మొహం.. జింక దేహంతో అలరారిన పురాతన కాలం నాటి అతి చిన్న మూషిక జింకలు (మౌస్ డీర్) పాపికొండలు అభయారణ్యంలో సందడి చేస్తున్నాయి. అంతరించిన జంతువుల జాబితాలో కలిసిపోయిన ఆ బుల్లి ప్రాణులు ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్నవి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే వీటిని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. భారత ఉప ఖండంలో మాత్రమే కనిపించే మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలోనూ ఉన్నట్టు వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. జానెడు పొడవు.. రెండు నుంచి మూడు కిలోల బరువుండే మూషిక జింకల సంరక్షణకు ఫారెస్ట్, వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శబ్దం వినబడితే ప్రాణం హరీ! మూషిక జింకలను స్థానిక గిరిజనులు వెదురు ఎలుకలని పిలుస్తారు. వీటికి భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు విన్నా.. ఏవైనా జంతువులు దాడి చేసేందుకు వచ్చి నా.. ఎవరైనా వీటిని పట్టుకున్నా భయంతో గుండె పగిలి మరణిస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే మూషిక జింకలు రాత్రి వేళల్లో మాత్రమే అడవిలో సంచరిస్తాయని పేర్కొంటున్నారు. ఇవి ఎక్కువగా వెదురు కూపుల్లోనే నివసిస్తుంటాయి. అడవిలో రాలిన పువ్వులు, పండ్లు, ఆకుల్ని తింటాయి. ఉసిరి, మంగ కాయలు, పుట్ట గొడుగులు, పొదల్లోని లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింకల గర్భధారణ కాలం ఆరు నెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. మళ్లీ వెంటనే సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. చిరుతలు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, గద్దలు ఈ మూషిక జింకలను వేటాడుతూ ఉంటాయి. వీటికి తోడు అడవుల నరికివేత, అడవిలో కార్చిచ్చు, వేటగాళ్ల ముప్పు వంటివి మూషిక జింకల ఉనికికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. పాపికొండల్లో వీటి సంఖ్య 500 పైనే అరుదైన మూషిక జింకల సంచారం పాపికొండలు అభయారణ్యంలో ఎక్కువగానే ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దట్టమైన అరణ్యం ఉండటం.. వెదురు కూపులు ఎక్కువగా ఉండటంతో 500కు పైగా మూషిక జింకలు ఇక్కడ నివసిస్తున్నట్టు అంచనా. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు మూషిక జింకల జాడ చిక్కినట్టు చెప్పారు. సంతతి పెరుగుతోంది అరుదైన మూషిక జింకలు పాపికొండలు అభయారణ్యంలో ఉన్నాయి. ఇవి ఇతర ప్రాంతాల్లో అంతరించిపోయే జీవులుగా ఉన్నా.. వీటి సంతతి ఇక్కడ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో కూడా ఈ మూషిక జింకలు చిక్కాయి. ఇవి సంచరించే ప్రాంతాల్లో జన సంచారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దీంతో వీటి ఉనికి బాగా పెరుగు తున్నట్టు గుర్తించాం. – దావీదురాజు నాయుడు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
సీతాకోక చిలుకల హరివిల్లు
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): ఎన్నెన్నో అందాలు.. అన్నింటా అందాలు.., సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అని కవులు సీతాకోక చిలుక అందాలను అభివర్ణించారు. సప్తవర్ణ శోభితమైన వాటి సోయగాలు ప్రకృతి ప్రేమికుల మదిని దోచుకుంటున్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండల అభయారణ్యం జీవవైవిధ్యంతో అలరారుతోంది. అరుదైన రకాల సీతాకోక చిలుకలకు ఆలవాలంగా నిలుస్తోంది. జాతీయస్థాయి విజేత ఓకలీఫ్ పాపికొండల అభయారణ్యంలో జంతువులు, వృక్షాలే కాక అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గతేడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండల నేషనల్ పార్క్‌లో ఉన్న 3 రకాల సీతాకోక చిలుకలు పోటీపడ్డాయి. తుది పోరులో దేశవ్యాప్తంగా 7 రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా వీటిలో పాపికొండల అభయారణ్యంకు చెందిన 3 రకాల ఉన్నాయి. వీటిలో ఆరెంజ్ ఓకలీఫ్ జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఇవి వర్షాకాలం, శీతాకాలం సమయంలో గుంపులుగా తిరుగుతూ చూపరులను ఆకట్టుకుంటాయి. పచ్చని చెట్ల మధ్య సీతాకోక చిలుకలు ఎగురుతుండటం ఆహ్లాదంగా అనిపిస్తుంది. అరుదైన సీతాకోక చిలుకలు పాపికొండల అభయారణ్యంలో కనిపిస్తున్నాయి. 1,045 రకాల జంతువులు పాపికొండల అభయారణ్యం ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా 2008 నవంబర్ 4న ప్రకటించింది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో గోదావరికి ఇరువైపులా 1,01,200 హెక్టార్ల పరిధిలో పాపికొండల అభయారణ్యం విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోని రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్క్‌గా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడి జంతుజాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు అంటున్నారు. పెద్ద పులులు, చిరుతలు, అలుగులు, గిరినాగులతో పాటు పలురకాల జంతువులకు నిలయంగా అభయారణ్యం మారింది. అరుదైన జీవజాలం అరుదైన జీవజాలానికి నిలయంగా పాపికొండల అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అలాగే వృక్ష సంపద ఉంది. వీటితోపాటు పలురకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. 2021లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కామన్ జెజెబెల్, కామన్ నవాబ్, ఆరెంజ్ ఓకలీఫ్ అనే మూడు జాతులు ఎంపికయ్యాయి. ఆరెంజ్ ఓకలీఫ్ అనే సీతాకోక చిలుక జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికయ్యింది. ఈ అభయారణ్యంలో 130 రకాల రంగుల సీతాకోక చిలుకలు ఉన్నాయి. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజర్, పోలవరం -
‘పాపికొండల’ ప్రత్యేక ప్యాకేజీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి సిద్ధం చేసింది. ఆ ప్యాకేజీ వివరాలను ఏపీటీడీసీ కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. రాజమండ్రి, గండి పోచమ్మ నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 98486 29341, 98488 83091 నంబర్లలో, పోచవరం నుంచి పాపికొండలు వెళ్లే వారు సెల్ : 63037 69675 నంబర్లో సంప్రదించాలని కోరారు. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు పెద్దలు ఒక్కొక్కరికి రూ.1,250, చిన్నారులు ఒక్కొక్కరికి రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. రాజమండ్రి నుంచి 2 రోజుల పర్యటన రాజమండ్రి నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి ఒక రోజు పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. పోచవరం నుంచి 2 రోజుల పర్యటన పోచవరం నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి 2 నాన్‌వెజ్ కూరలతో భోజనం, 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. గండి పోచమ్మ నుంచి ఒక రోజు పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్. గండి పోచమ్మ నుంచి 2 రోజుల పర్యటన గండి పోచమ్మ నుంచి పాపికొండలకు ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటల వరకు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ. మొదటి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం. 2వ రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం రెండు నాన్‌వెజ్ కూరలతో భోజనం, సాయంత్రం అల్పాహారం. -
పాపికొండలు పోదాం పద!
గోదారమ్మ పరవళ్లు..ప్రకృతి అందాలు..ఎత్తయిన కొండలు..పున్నమి వెన్నెల్లో ఇసుక తిన్నెలు..నైట్ హాల్ట్‌లు.. ఇలా పాపికొండలు విహారయాత్ర ఇచ్చే మజాయే వేరంటారు పర్యాటకులు. అలాంటి మధురానుభూతి జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకుంటారు సందర్శకులు. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ విహార యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ఆదివారం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, బోట్ల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. గోదావరికి వరదలు రావడంతో గత నాలుగు నెలలుగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. ఈనేపథ్యంలో నీటిమట్టం అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం పాపికొండలు విహారయాత్ర బోట్లకు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకశాఖ అధికారులు పాపికొండలు విహార యాత్రకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలి రోజు ఒక్క బోటు మాత్రమే.. పాపికొండల విహారయాత్రకు తొలి రోజు ఆదివారం ఒక్క బోటుమాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ఏపీ టూరిజం, ప్రైవేట్ టూరిజం శనివారం నుంచి టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. విహారయాత్రకు బోట్లు బయలుదేరేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోశమ్మగండి వద్ద బోట్ పాయింట్, కంట్రోల్ రూమ్‌లో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోట్ పాయింట్ వద్ద ఉన్న అన్ని బోట్లలో భద్రతా చర్యలను వారు పరిశీలించారు. పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి పర్యాటకులతో టూరిజం బోటు బయలుదేరడానికి ముందే పైలెట్ బోట్ వెళ్తుంది. ఇందులో శాటిలైట్ ఫోన్‌తోపాటు పర్యాటక సిబ్బంది ఒకరు, గజ ఈతగాడు ఉంటారు. వీరి వద్ద కూడా వాకీ టాకీ ఉంటుంది. పైలెట్ బోటు.. టూరిజం బోటు కంటే ముందుగా వెళ్తూ గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌తోపాటు వెనుక వస్తున్న బోటుకు వాకీ టాకీలో సమాచారం అందిస్తారు. ఇలా చేరుకోవాలి: ముందుగా ఏపీ పర్యాటక శాఖ వెబ్సైట్.. https:// tourism.ap.gov.in/లో పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకోవాలి. రూ.1,250 టికెట్ బుక్ చేసుకున్నవారు నేరుగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ గోదావరి గట్టున ఉన్న పర్యాటక శాఖ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో పోశమ్మ గండి బోట్ పాయింట్ వరకు పర్యాటక శాఖ సిబ్బంది తీసుకొస్తారు. యాత్ర ముగిశాక మళ్లీ రాజమండ్రికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇక రూ.1000 టికెట్ తీసుకున్నవారు నేరుగా బోట్లు బయలుదేరే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండికి చేరుకోవాల్సి ఉంటుంది. రెండు బోట్ పాయింట్ల వద్ద ఏర్పాట్లు పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా, వీటిలో ఎనిమిది బోట్లకు అనుమతి మంజూరు చేశారు. మరో ఏడు బోట్లకు ఫిట్నెస్ పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి. వీఆర్ పురం మండలం పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లు ఉండగా వీటిలో 13 బోట్లకు ఫిట్నెస్ అనుమతి ఇచ్చారు. మరో నాలుగు బోట్లకు అనుమతి రావాల్సి ఉంది. -
పాపికొండల యాత్రకు పచ్చజెండా.
భద్రాచలం: పాపికొండల విహార యాత్రకు తిరిగి రంగం సిద్ధం అవుతోంది. భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో జూన్ మొదటి వారంలో నిలిచిపోయిన యాత్ర సోమవారం పునఃప్రారంభం కానుంది. పాపికొండలు యాత్రను ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే సమాచారంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జూన్ 4న నిలిచిన యాత్ర.. ఏపీలోని కచ్చలూరు వద్ద 2019లో జరిగిన ప్రమాదంతో నిలిచిపోయిన పాపికొండల యాత్ర గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైంది. సందడిగా మారిన గోదావరి తీరం.. వరదల నేపథ్యంలో జూన్ 4న ఆగిపోయింది. సెప్టెంబర్ వరకూ వరదల భయం వీడలేదు. దీంతో యాత్ర ముందుకు సాగలేదు. దీంతో భద్రాచలంలో కొంతకాలంగా వ్యాపారాలన్నీ నిస్తేజంగా మారాయి. పాపికొండల యాత్ర పునఃప్రారంభం అవుతుండడంతో వ్యాపారులు, లాడ్జీలు, హోటళ్లు, ట్రావెల్ వాహనాల యజమానుల్లో హర్షం వెల్లువెత్తుతోంది. భద్రాచలం పరిసర ప్రాంతాలు మళ్లీ సందడిగా మారనున్నాయి. పర్యాటకులకు కనువిందు.. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. పూర్తిగా గోదావరి నదిపై సాగే లాంచీ ప్రయాణం, ఆ లాంచీలోనే ఆటపాటలు, నృత్యాలు, రుచికరమైన భోజనం, గిరిజనులు తయారు చేసే వెదురు బొమ్మలు, వస్తువులతో పాటుగా అక్కడ మాత్రమే దొరికే ‘బొంగు చికెన్’ వంటివి ప్రత్యేకం. పోచవరం నుంచి పాపికొండలు వెళ్లి, తిరిగి వచ్చేంతవరకు ‘సెల్ ఫోన్ సిగ్నల్స్’ లేని ప్రశాంతమైన యాత్ర ఇదొక్కటే అంటే అతిశయోక్తి కాదు! కార్తీక మాసం సీజన్ కావడంతో భద్రాచలానికి యాత్రికులు, భక్తులు అధికంగా వస్తుంటారు. ముఖ్యంగా వారాంతపు సెలవులు, ప్రత్యేక రోజుల్లో భారీగా పోటెత్తుతారు. ఇలా చేరుకోవచ్చు.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్, దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఫెర్రీ పాయింట్ వద్ద నుంచి బోటింగ్ ఉంటుంది. సోమవారం ఈ రెండు ప్రాంతాల నుంచి ఏపీ టూరిజం లాంచీలు ప్రారంభం కానున్నాయి. రెండు, మూడు రోజుల్లో మరికొన్ని లాంచీలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలనుంచి, హైదరాబాద్ నుంచి పాపికొండలకు వెళ్లాలనుకునేవాళ్లు.. అక్కడ రాత్రి బయలుదేరితే తెల్లవారి ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. రైలు ద్వారానైతే కొత్తగూడెం వరకు వచ్చి, అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో భద్రాచలానికి చేరుకోవచ్చు. ఉదయం 8గంటల లోపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకుని పాపికొండల యాత్రకు వెళ్లవచ్చు. యాత్ర ప్రారంభమయ్యే పోచవరం.. భద్రాచలానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లవచ్చు. పోచవరం పాయింట్ నుంచి ఉదయం 9.30 – 10.30 గంటల మధ్య ‘జలవిహారం’ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 – 5 గంటల వరకు తిరిగి పోచవరానికి చేరుకుంటుంది. పాపికొండల ప్యాకేజీ... పోచవరం నుంచి పాపికొండల యాత్రకు టికెట్ ధర పెద్దలకు రూ.930, పిల్లలకు రూ.730 ఉంటుంది. కళాశాల విద్యార్థులు గ్రూç³#గా టూర్‌కు వస్తే వారికి రూ.830 చొప్పున వసూలు చేస్తారు. ఈ టికెట్లు భద్రాచలంలో లభిస్తాయి. తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. హైదరాబాద్ నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులో సాగే ఈ ప్యాకేజీలో భద్రాచలం, పర్ణశాల రామచంద్రస్వామి దర్శనం, పాపికొండల యాత్ర ఉంటాయి. వసతి, భోజన సదుపాయం ఉంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3999గా నిర్ణయించారు. టికెట్లు టూరిజం శాఖ వెబ్సైట్లో లభిస్తాయి. కాగా.. టూరిజం అధికారులు ఈ సీజన్లో అ«ధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంతోషిస్తున్నాం.. పాపికొండల యాత్రికులపైనే ఆధారపడి జీవిస్తున్నాం. గోదావరి వరదల కారణంగా ఐదు నెలలుగా ఉపాధిని కోల్పోయాం. మళ్లీ బోటింగ్ ప్రారంభానికి అధికారులు ఒప్పుకున్నారని తెలిసి సంతోషిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టికెట్లు విక్రయిస్తాం. – పఠాన్ హుస్సేన్ ఖాన్, టికెట్ విక్రయ కేంద్రం, భద్రాచలం లాంచీలన్నీ సిద్ధంగా ఉంచాం లాంచీలను పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద సిద్ధంగా ఉంచాం. పర్యాటకుల భద్రత మా ప్రధాన బాధ్యత. అందుకు అనుగుణంగా పలు రకాల రక్షణ సామగ్రి ఏర్పాటు చేశాం. – పూనెం కృష్ణ, లాంచీల నిర్వాహకుడు -
అడవి పిలుస్తోంది!
సాక్షి,అమరావతి: ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్ది రోజులపాటు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అడవి ఆహ్వానం పలుకుతోంది. ఇందుకోసం అటవీ ప్రేమికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పాపికొండలు ఇలా పలు అడవులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ అడవుల్లోని కొత్త ప్రదేశాలు, కొండలు, లోయల సందర్శనలు, ట్రెక్కింగ్ పట్ల పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. విభిన్న వృక్ష, జంతుజాలానికి ఆలవాలం.. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం.. 1.64 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 36,914 చదరపు కిలోమీటర్లలో (22.46 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో 8,139 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రిజర్వు అటవీ ప్రాంతం. శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు, రాయల్ ఎలిఫెంట్ రిజర్వు, శేషాచలం బయోస్పియర్.. ఇవి కాకుండా 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. ఇవన్నీ విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు, గొప్ప జీవవైవిధ్యం, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలంతో విలసిల్లుతున్నాయి. 30కి పైగా ప్రదేశాలు.. తలకోన, ఉబ్బలమడుగు, నేలపట్టు, పులికాట్, పెంచలకోన, బైర్లూటి, పెచ్చర్ల, మారేడుమిల్లి, కంబాలకొండ, తెలినీలాపురం, చొల్లంగి, వంటి 30కిపైగా పర్యావరణ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఈ సంవత్సరం తలకోన ప్రాంతాన్ని 2 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉబ్బలమడుగు, మారేడుమిల్లి, చొల్లంగి ప్రాంతాలకూ లక్షల మంది వస్తున్నారు. వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేసేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది. థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు.. ప్రతి జిల్లాలో కొత్తగా నగర వనాలు, వనమిత్ర, జూపార్కులకు అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించనున్నారు. అలాగే ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కడకు వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, అవుట్డోర్ జిమ్ వంటివి నెలకొల్పనున్నారు. తద్వారా అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అటవీ, స్థానిక గిరిజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అక్కడ విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వంటి థీమ్ పార్కులు సృష్టించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కడపలో ఉన్న నగర వనం మోడల్లో అన్ని నగర వనాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించే యత్నాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర అడవుల సందర్శనకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నారు. కర్ణాటక తరహాలో జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో పర్యాటక అద్భుతాలు అటవీ సందర్శనలు, ప్రకృతి పర్యటనలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే తలకోన, బైర్లూటి వంటి ఎన్నో అందమైన పర్యావరణ పర్యాటక ప్రాంతాలున్నాయి. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపొచ్చు. ఇలాంటి పర్యటనల ద్వారా ప్రజలు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగించకుండా, వన్యప్రాణులు, మొక్కలకు నష్టం కలిగించకుండా పర్యాటకులు నడుచుకోవాలి. రాష్ట్రంలో కొత్త తరహా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇందులో భాగమవ్వాలి. – మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
Papikondalu Tour: పాపికొండలు.. షికారుకు సిద్ధం
రంపచోడవరం: గోదావరి వరదలతో గత మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల పర్యాటకానికి కొద్దిరోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుంది. గోదావరికి వరద తగ్గుతుండడంతో పాపికొండలు పర్యాటకాన్ని పట్టలెక్కిచేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం ఆధారంగా పాపికొండలు వెళ్లేందుకు పర్యాటక బోట్లకు అనుమతులు ఇస్తున్నారు. గతంలో చాలాకాలం పాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటకం తిరిగి ప్రారంభమైన తరువాత ఆంధ్రా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది పర్యాటకులు పాపికొండల అందాలు తిలకించేందుకు వస్తుంటారు. గోదావరిలో పర్యాటక బోట్లు తిప్పేందుకు ఏపీ టూరిజం, ఇతర శాఖల తనిఖీలు పూర్తయ్యాయి. కొంతకాలం పాపికొండల పర్యాటకం నిలిచిపోయిన తరువాత గత ఏడాది డిసెంబర్ 18న అధికారికంగా పర్యాటకానికి అనుమతులు ఇచ్చారు. పోలవరం కాపర్ డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగుల దిగువన ఉన్నంత వరకూ మాత్రమే నదిలో పర్యాటక బోట్లు రవాణాకు అనుమతి ఉంటుంది. నీటిమట్టం అంతకన్నా మించితే పర్యాటకాన్ని నిలిపివేస్తుంటారు. ► ప్రస్తుతం కాపర్ డ్యామ్ వద్ద పర్యాటక బోట్లు గోదావరిలో తిరిగేందుకు అనుకూలమైన నీటిమట్టం ఉంది. ►జూన్ నెలలోనే కాపర్‌డ్యామ్ వద్ద గోదావరి నీటి మట్టం 28 అడుగులకు మించి ప్రవహిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా పర్యాటకాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి వరదలు, వర్షాల ప్రభావంతో బోట్లకు అనుమతి లభించలేదు. ఉపాధిపై ప్రభావం పర్యాటకంపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయాయి. పర్యాటక బోట్ల నిర్వహణ కూడా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో బోట్ల యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరిగి పట్టాలెక్కనుండటంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బోట్లకు ఎన్వోసీ జారీ రాష్ట్ర పర్యాటకశాఖ జీఎం నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద 12 బోట్లను, వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లను తనిఖీ చేశారు. వీటికి ఎన్వోసీలను కూడా ఇటీవల జారీ చేశారు. 32 అడుగులకు అనుమతి ఇవ్వాలి గోదావరిలో నీటి మట్టం 32 అడుగుల లోపు వరకు పర్యాటక బోట్లు నదిలోకి తిరిగేందుకు అనుమతి ఇవ్వాలి. ఈమేరకు ఇరిగేషన్ అధికారులను కోరాం. 30 అడుగుల వరకు అనుమతి ఇచ్చేందుకు వారు సానుకూలంగా ఉన్నారు. మరో కొద్దిరోజుల్లో పాపికొండల పర్యాటకానికి అధికారికంగా అనుమతులు వచ్చే అవకాశం ఉంది. –కొత్తా రామ్మోహన్రావు, బోట్ యజమానుల సంఘ ప్రతినిధి అనుకూలంగా నీటిమట్టం గత మూడు నెలలుగా నిలిచిన పాపికొండలు పర్యాటకం మరో వారం రోజుల్లో తిరిగి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనమతులు మాత్రమే రావాల్సి ఉంది. పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటకులు బోట్ ఎక్కేందుకు అనువుగా ఉంటే సరిపోతుంది. కాపర్ డ్యామ్ వద్ద బోట్లు తిరిగేందుకు అనుకూలంగా ఉంది. –పి నాగరాజు, ఇన్చార్జి, టూరిజం కంట్రోల్ రూమ్ -
పాపికొండల్లో పెద్ద పులులు
బుట్టాయగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో విస్తరించిన పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులి జాడలు కనిపించాయి. చిరుతల సందడిని గుర్తించారు. సుమారు 90 రోజులపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో వైల్డ్‌లైఫ్ అధికారులు పులుల గణన నిర్వహించారు. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయనే సమాచారాన్ని రాబట్టారు. ఈ అభయారణ్యం పరిధిలో పెద్దపులి జాడలు కనిపించడం ఈసారి సాధించిన విజయం. ఈ సారి గణనలో అత్యంత విషపూరితమైన 30 అడుగుల గిరినాగు కూడా కంటపడింది. ఈ అభయారణ్యంలో కొండగొర్రెలు, పాంథర్, కొండచిలువలు, దుప్పులు, సాంబాలు, నక్కలు, ముళ్ల పందులు, ముంగిసలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవికుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవిపందులు తిరుగుతున్నట్లు గుర్తించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1012.858 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని 2008లో కేంద్ర ప్రభుత్వం పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. అప్పటి నుంచి అటవీప్రాంతంలోని జంతు సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే రెండుసార్లు పాపికొండల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని వైల్డ్‌లైఫ్ అధికారులు నిర్వహించారు. మొదట్లో నిర్వహించిన సర్వేలో పులులు ఉన్నప్పటికీ కెమెరాకు చిక్కలేదు. ఈ సారి నిర్వహించిన సర్వేలో పులులు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. రెండు దశల్లో సర్వే పాపికొండల అభయారణ్యంలో పులుల గణనకు సంబంధించిన సర్వేను వైల్డ్‌లైఫ్ అధికారులు రెండు దశల్లో నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 232 పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల్ని గుర్తించారు. మొదటి దశలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న అటవీప్రాంతంలోని 71 చోట్ల 142 కెమెరాలను ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 45 ప్రాంతాల్లో 90 కెమెరాలు ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. ట్రాప్ కెమెరాలో పులుల జాడ 2018లో నిర్వహించిన పులుల గణన సర్వేలో ఈ ప్రాంతంలో పులులు ఉన్నా ట్రాప్ కెమెరాకు చిక్కలేదు. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పులుల జాడ స్పష్టంగా కెమెరాకు చిక్కాయి. పూర్తి స్థాయిలో పులుల గణన వివరాలు జులై 29న వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో జరిగిన గణన వివరాల నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగం(ఎన్టీసీఏ) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ వివరాలను ప్రపంచ పులుల దినోత్సవం రోజైన జులై 29న పూర్తి స్థాయిలో ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. 230 పక్షుల రకాల్ని గుర్తించాం పాపికొండల అభయారణ్యంలో పులుల గణన పూర్తయ్యింది. సుమారు 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో పులులు, చిరుతలతో పాటు 230 రకాల పక్షులు, 14 రకాల జాతుల ఉభయచర జీవులు ఉన్నట్లు ట్రాప్ కెమెరాలు గుర్తించాయి. ఇక్కడ నిర్వహించిన సర్వే నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగానికి పంపిస్తాం. – సి.సెల్వమ్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ 116 ప్రాంతాల్లో సర్వే పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సర్వేలో ఏనుగు, సింహం తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించాం. జంతువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి. పాపికొండలు -
పాపికొండల సోయగాలు.. నదీ విహారం
సాక్షి, అమరావతి: గోదావరిలో పాపికొండల సోయగాలు.. గోదావరి ఇసుక తిన్నెల్లో వెన్నెల రాత్రులు.. పోచవరం నుంచి భద్రాచలానికి హాయిహాయిగా ప్రయాణం.. కృష్ణా నదిలో భవానీ ద్వీపంలో ఆట పాటలు.. నాగార్జున సాగర్‌లో చల్ల గాలుల మధ్య విహారం.. ఇలా ఎన్నో ప్రకృతి అందాల మధ్య ప్రపంచాన్ని మరిచి ప్రయాణం చేస్తారా.. అందుకు మీరు సిద్ధమేనా అంటోంది రాష్ట్ర పర్యాటక శాఖ. రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆధునిక బోట్లను అందుబాటులోకి తెస్తోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పర్యాటకం ఊపందుకుంటుండంతో డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక బోట్ల సంఖ్యను పెంచుతోంది. నిలిచిపోయిన బోట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతోంది. ప్రస్తుతం పాపికొండలకు వారాంతంలో 45 మంది ప్రయాణికుల సామర్థ్యంతో పర్యాటక శాఖ బోటు నడుపుతుండగా 95 మంది సామర్థ్యంతో మరో హరిత బోటును అందుబాటులోకి తేనుంది. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటును తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు సాగర్–శ్రీశైలం ప్రయాణానికి సంతశ్రీ బోటును రూ.35 లక్షలతో మరమ్మతులు చేపట్టి సంక్రాంతి నాటికి తీసుకురానుంది. చాలా కాలం తర్వాత విజయవాడలోని భవానీ ద్వీపంలో బోధిశ్రీ బోటు సేవలకు సిద్ధమైంది. రాబడి పెంచుకునేందుకు యత్నాలు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పాపికొండలకు నిత్యం రెండు బోట్లు (ప్రైవేటు) తిరుగుతున్నాయి. వారాంతాల్లో పర్యాటక శాఖ బోట్లతో కలిపి ఐదు సేవలందిస్తున్నాయి. సగటున రోజుకు 300 మంది ప్రయాణిస్తున్నారు. భవానీ ద్వీపంలో బోటింగ్ ద్వారా రోజుకు సగటున రూ.40 వేలు, వారాంతాల్లో రూ.2.50 లక్షల ఆదాయం వస్తుండటం విశేషం. ఇక్కడ వారాంతంలో సుమారు 1,500 మంది బోట్లలో ప్రయాణిస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా 12 ప్రదేశాల్లో పర్యాటక శాఖకు చెందిన 48 బోట్లు, వందకు పైగా ప్రైవేటు బోట్లు సేవలందిస్తున్నాయి. గతంలో కేవలం బోటింగ్ ద్వారా రూ.7 కోట్లకు పైగా ఆదాయం రాగా ప్రస్తుతం అది రూ.కోటికి పడిపోయింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు సమయం ఉండటంతో రాబడి పెంచుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాపికొండల నైట్ ప్యాకేజీలు ఇలా.. పర్యాటక శాఖ పాపికొండలకు రెండు రోజుల (నైట్) ప్యాకేజీలను అందిస్తోంది. గండిపోచమ్మ – పేరంటాళ్లపల్లి ప్రయాణానికి చార్జి సాధారణ రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) పెద్దలకు రూ.3,200, పిల్లలకు 2,300, వారాంతాల్లో (శుక్రవారం నుంచి ఆదివారం) పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు. రాజమండ్రి–గండిపోచమ్మ– పేరంటాళ్లపల్లి ప్యాకేజీలో సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.3,000, వారాంతాల్లో పెద్దలకు రూ.4,300, పిల్లలకు రూ.3,300 టికెట్ ధర ఖరారు చేశారు. ఇందులో రాజమండ్రి నుంచి పర్యాటక శాఖ బస్సులో ప్రయాణికులను బోటింగ్ పాయింట్‌కు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రయాణం మొదలై మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు ముగుస్తుంది. పేరంటాళ్లపల్లి నుంచి తిరుగు ప్రయాణంలో కొల్లూరు, కొరుటూరులోని గిరిజన సంప్రదాయ తరహా బ్యాంబూ హట్స్‌లో (వెదురుతో చేసిన గుడిసెలు) రాత్రి బసను ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు ఆటవిడుపుగా వాలీబాల్, కబడ్డీ, ట్రెక్కింగ్, జంగిల్ వాక్ సౌకర్యాలను మెరుగుపరిచారు. బోట్ల సంఖ్యను పెంచుతున్నాం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక కారణాలతో బోట్లు చాలా కాలంపాటు నిలిచిపోయాయి. పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు మరమ్మతులు చేయిస్తున్నాం. పోచవరం నుంచి భద్రాచలానికి కూడా బోటు తిప్పేందుకు ఆలోచిస్తున్నాం. పోలవరానికి ప్రత్యేక నైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం కార్పొరేషన్ రాబడి పెంపుపై దృష్టి రాష్ట్రంలో జల పర్యాటకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా బోట్ల సంఖ్యను పెంచి రాబడి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బోట్లకు మరమ్మతులు చేపడుతున్నాం. త్వరలోనే పోర్టు అధికారుల నుంచి అనుమతి తీసుకుని వాటిని నీటిలోకి ప్రవేశపెడతాం. – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టూరిజం కార్పొరేషన్ -
Tourism: భద్రాచలం, పాపికొండలు చూసొద్దాం రండి..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నుంచి భద్రాచలం.. అక్కడి నుంచి పాపికొండలకు కొత్త ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ ప్యాకేజీకి ప్రభుత్వం నుంచి శనివారమే అనుమతి లభించిందన్నారు. వచ్చేవారం నుంచి పర్యటన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పర్యటన ప్యాకేజీ పెద్దలకు రూ.4,999, పిల్లలకు రూ.3,999 చొప్పున ఉంటుంది. చదవండి: Medak CSI Church: మెతుకు పంచిన కోవెల.. ప్రత్యేకతలకు నిలయం.. పర్యటన ఇలా... మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు పర్యాటక భవన్ నుంచి రాత్రి 8 గంటలకు బషీర్‌బాగ్ లోని పర్యాటక కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది. రెండో రోజు ఉదయం 5 గంటలకు భద్రాచలంలోని హరిత హోటల్‌కు, 7.30కు పోచారం బోటింగ్ పాయింట్‌కు చేరుకుంటారు. 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాపికొండలు, పేరంటాళ్లపల్లికి బోటింగ్. ఈ సమయంలోనే భోజనం, స్నాక్స్ అందజేస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఆలయ దర్శనం. 11.30 గంటల వరకు పర్ణశాల సందర్శన, అనంతరం తిరిగి హరిత హోటల్‌కు చేరుకుంటారు, మధ్యాహ్నం భోజనం అనంతరం 2.30 గంటలకు భద్రాచలం నుంచి బయలుదేరి రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. -
మంచి సౌకర్యాలతో మెరుగైన ఆదాయం
సాక్షి, అమరావతి: భద్రాచలం నుంచి పాపికొండలకు వచ్చే పర్యాటకులకు వీలుగా పోచవరంలో ఈ నెల 14 నుంచి బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) తెలిపారు. పర్యాటకులకు రాత్రి బస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 20వ తేదీలోగా పోలవరం నుంచి పాపికొండలకు కొత్త బోటింగ్ పాయింట్‌ను ప్రారంభించాలని, వారంలోగా నాగార్జునసాగర్‌లో బోట్ సర్వీసు నడపాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే హరిత రెస్టారెంట్ల్ల ఆదాయం మెరుగుపడుతోందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ. 69.57 కోట్లు వచ్చిందని తెలిపారు. డిసెంబర్ నుంచి మార్చి వరకు పర్యాటకానికి మంచి సీజన్ అని, రెస్టారెంట్లలో పూర్తిస్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ, నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ ఆక్యుపెన్సీని పెంచాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో రూ.4.50 కోట్లతో రోప్ వే, బొర్రా గుహల్లో రూ. 2.70 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, మారేడుమిల్లిలో రూ.1.15 కోట్లతో కాటేజీలు, అడ్వంచర్ స్పోర్ట్స్ పనులు వేగంగా జరుగుతున్నట్టు చెప్పారు. లంబసింగికి వచ్చే పర్యాటకుల కోసం తాత్కాలికంగా చేపట్టిన రెస్టారెంట్, టాయిలెట్స్ పనులు వారంలోగా పూర్తి చేస్తామన్నారు. పాండ్రంగిలో అల్లూరి మ్యూజియం, కృష్ణ్ణదేవిపేటలో ఆయన సమాధి అభివృద్ధి పనులను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు, ఉత్తమ క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పూర్తయిందని, ఈ నెల 11, 12 తేదీల్లో విజయనగరంలో కొనసాగుతుందన్నారు. మార్చిలో రాష్ట్ర స్థాయి టోర్నీ నిర్వహించి సీఎం చేతులమీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు. -
Papikondalu: అడవి తల్లికి గూర్ఖాలుగా బేస్ క్యాంప్ సిబ్బంది
బుట్టాయగూడెం(పశ్చిమ గోదావరి జిల్లా): అరణ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ నిత్యం సవాళ్లతో సావాసం చేసే అడవి తల్లి బిడ్డలు వారు. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ అడవిలో వణ్య ప్రాణుల సంరక్షణ, వేటగాళ్ల నుంచి విలువైన వృక్ష సంపదను రక్షించడమే వారి పని. పాపికొండల అభయారణ్యంలోని అణువణువూ జల్లెడ పట్టే బేస్ క్యాంప్ సిబ్బంది కుటుంబాలకు దూరంగా.. అడవి తల్లికి గూర్ఖాలుగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిసున్న బేస్‌క్యాంప్ సిబ్బందిపై ప్రత్యేక కథనం.. ఐదు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు పాపికొండల అభయారణ్యం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,012.86 చదరపు కిలోమీట్ల మేర విస్తరించింది. మొత్తం 1,01,200 హెక్టార్ల అటవీప్రాంతాన్ని 2008లో కేంద్రప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మగుడి సమీపంలో ఒకటి, పోలవరం మండలం టేకూరు ప్రాంతంలో, గడ్డపల్లి సమీపంలో, పాపికొండల అభయారణ్య శివారు ప్రాంతంలో మరో రెండు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి వాటిలో 25 మంది సిబ్బందిని నియమించారు. వీరంతా అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం పగలూ రాత్రీ తేడాలేకుండా శ్రమిస్తున్నారు. తగ్గిన స్మగ్లింగ్ బేస్ క్యాంప్‌ల ఏర్పాటుతో అటవీప్రాంతంలో స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టింది. గతంలో స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా అటవీసంపదను తరలించేవారు. ప్రస్తుతం బేస్‌క్యాంప్‌లు ఏర్పాటు చేయడం వల్ల అక్రమ రవాణా అరికట్టారు. బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రీ, పగలూ గస్తీ కాయడం వల్ల వన్యప్రాణులకు రక్షణ పెరిగిందని ఆ శాఖ అధికారులు అంటున్నారు. రాత్రి వరకూ అడవిలో గస్తీ బేస్‌క్యాంప్ సిబ్బంది అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన మంచె లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇళ్లల్లో ఉంటారు. వంట వార్పు మొత్తం అక్కడే. అప్పుడప్పుడు ఇళ్లకు వెళ్లడం తప్ప అడవే వారికి ప్రపంచం. అడవితల్లికి అండగా ఉంటూ చెట్లు నరికివేతకు గురికాకుండా, వన్యప్రాణుల్ని సంరక్షిస్తుంటారు. ఉదయం 6 గంటలకే నిద్రలేచి వంటావార్పూ సిద్ధం చేసుకుని అడవిలోకి బయల్దేరతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అటవీప్రాంతంలో తిరుగుతూ జంతువుల కదలికలను గుర్తిస్తారు. ఒక్కోసారి రాత్రి వరకూ అటవీప్రాంతంలోనే ఉంటారు. అడవిని నరుకుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి స్మగ్లర్ల ఆటకట్టిస్తారు. అడవిలో సాయంత్రం కాగానే పూర్తిగా నిర్మానుష్యంగా మారుతుంది. చీకటి పడగానే చిరుతలు, ఎలుగుబంట్లతో పాటు పలు జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి. ఒక్కోసారి అవి పక్కనుంచి వెళ్తుంటాయి. రోజూ ఎన్నో జంతువులు కనిపిస్తాయి. అయినా వాటి మధ్య ధైర్యంగా బేస్‌క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. బేస్‌క్యాంప్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమిస్తారు. 25 కిలోమీట్ల వాకింగ్ టెస్ట్, హెల్త్ఫిట్నెస్ టెస్ట్ ద్వారా నియమిస్తారు. అడవి సింహాల్లా.. అటవీ ప్రాంతంలో బేస్ క్యాంప్ సిబ్బంది వన్యప్రాణుల మధ్య అడవి సింహాల్లా తిరుగుతుంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అడవికి కాపలా కాస్తారు. దీంతో స్మగ్లింగ్ తగ్గింది. పాపికొండల అభయారణ్యంలో ప్రస్తుతం 25 మంది బేస్‌క్యాంప్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండల వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి జంతువులు కనిపిస్తే దాక్కుంటాం మేము దట్టమైన అటవీప్రాంతంలో తిరుగుతున్న సమయంలో మాకు అనేక అడవి జంతువులు కనిపిస్తాయి. ఆ సమయంలో అవి వెళ్ళిపోయే వరకూ చాటున దాక్కుంటాం. గొర్రగేదెలు, లేళ్లు, ఎలుగుబంట్లు వంటివి మాకు కనిపిస్తుంటాయి. వాటి సంరక్షణ మా బాధ్యత కనుక వాటికి కనిపించకుండా పహారా కాస్తాం. – సోయం వెంకటేశ్వరరావు, బేస్ క్యాంప్ సిబ్బంది, కొరుటూరు చేతి కర్ర, కత్తే ఆయుధం దట్టమైన అటవీప్రాంతంలో పహారా కాసే సమయంలో మా చేతిలో కర్ర, కత్తి మాత్రమే ఉంటాయి. అవే ఆయుధాలు. అవి కూడా ముళ్ల చెట్లు తొలగించడానికే తప్ప జంతువులకు హాని చేయడానికి కాదు. రాత్రీ, పగలూ తేడా లేకుండా కర్రతో శబ్దం చేస్తూ తిరుగుతుంటాం. – యండపల్లి బుచ్చన్న దొర బేస్ క్యాంప్ సిబ్బంది, సరుగుడు కష్టానికి తగ్గ జీతం ఇవ్వాలి మాలో డిగ్రీ వరకూ చదివిన వారు కూడా ఉన్నారు. మా గ్రామాలు అటవీప్రాంతంలో ఉండటం వల్ల బేస్ క్యాంప్‌లో చేరాం. ప్రస్తుతం మాకు జీతం, భోజన ఖర్చులు కలిపి నెలకు రూ. 10 వేల వరకూ ఇస్తున్నారు. మా కష్టానికి తగ్గట్లు జీతాలు పెంచాలి. అడవిలో ఉంటున్న రోజుల్లో మా భోజనానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. – కొండ్ల సుధీర్, బేస్ క్యాంప్ సిబ్బంది, పోలవరం -
పాపికొండలకు చలోచలో
రంపచోడవరం: గోదావరి నదీ జలాల్లో పాపికొండల విహార యాత్రను రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 114 మంది పర్యాటకులతో రెండు బోట్లు ఆదివారం పాపికొండల విహారానికి వెళ్లాయి. ఈ యాత్రను తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోవాలని పర్యాటకులకు సూచించారు. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు 9 కమాండ్ కంట్రోల్ రూముల పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పర్యాటక శాఖల అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని విహార యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. శాటిలైట్ సిస్టమ్ ద్వారా బోట్లపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. పర్యాటకుల బోట్లు బయలుదేరడానికి ముందు ఎస్కార్ట్ బోటు వెళ్తుందని చెప్పారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా.. వెనుక వచ్చే పర్యాటక బోట్లకు సమాచారమిస్తారని తెలిపారు. ఏపీ టూరిజం వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలని, దీనివల్ల పర్యాటక బోట్లలో ఎంతమంది వెళ్తున్నారనే లెక్క పక్కాగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం 11 బోట్లకు అనుమతులిచ్చామని, వీటిలో ఏపీ టూరిజం బోట్లు 2, ప్రైవేట్ బోట్లు 9 ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఎంపీపీ కుంజం మురళి, జెడ్పీటీసీ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. గోదావరిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో గోదావరి జలాలపై తేలియాడేలా తీర్చిదిద్దిన ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. రెండు స్టీల్ పంటులపై ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో 95 మంది ప్రయాణించవచ్చు. ఈ రెస్టారెంట్‌కు పద్మావతి ఘాట్ నుంచి వెళ్లవచ్చు. 15 రోజుల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. వివాహ విందులు, పుట్టిన రోజు, కిట్టీ పార్టీల వంటివి నిర్వహించుకునేందుకు వీలుగా దీనిని అధికారులు సిద్ధం చేయనున్నారు. కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ ఎ.వరప్రసాద్‌రెడ్డి, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు పాల్గొన్నారు. -
పాపికొండల యాత్రను ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాస్
-
లాహిరి..లాహిరి..లాహిరిలో..
ఓ వైపు వంపులు తిరుగుతూ సుందరంగా ప్రవహించే గోదావరి.. మరోవైపు అటు కొండ.. ఇటు కొండ.. నట్టనడుమ ఉరకలు పెట్టే గోదావరి.. ఆ వంక గిరిజనుల జీవన సౌందర్యం.. ఈ వంక పచ్చటి ప్రకృతి.. ఇలా భిన్న దృశ్యాలను తిలకిస్తూ సేద తీరాలంటే పాపికొండలను బోటులో చుట్టిరావాల్సిందే. ఈ అద్భుత ప్రయాణానికి నేటి నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పాపికొండలకు బోట్లు నిలిచిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత బోట్లు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో అనుమతులు మంజూరు చేసింది. దీంతో పర్యాటకులు పాపికొండల యాత్రకు ఉవ్విళ్లూరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం ఆన్లైన్ బుకింగ్‌కు అవకాశం.. ఉభయ గోదావరి జిల్లాలకు నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. సెలవులు వస్తే చాలు.. పర్యాటకులు జలవిహారం చేస్తూ పాపికొండలను చుట్టేస్తారు. సకుటుంబ సపరివారసమేతంగా వచ్చి పాపికొండల్లోని సుందర ప్రకృతి దృశ్యాలను.. బోటు ప్రయాణంలో ఆహ్లాదాన్ని.. వంపులు తిరుగుతూ హొయలు ఒలకబోసే గోదావరిని చూసి పరవశిస్తారు. బుకింగ్‌కు ఆన్లైన్ సౌకర్యం ( www. aptdc. gov. in) కూడా ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా బోటు షికారు కోసం రెక్కలు కట్టుకుని మరీ వచ్చేస్తున్నారు. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు రాజమమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుకోవాలి. ముఖ్యమంత్రి ఆదేశాలతో పటిష్ట భద్రత పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది. ప్రమాదం అనంతరం అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే బోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు. బోట్ల ఫిట్నెస్ పరిశీలించాకే అనుమతులు పాపికొండల జలవిహార యాత్రకు ప్రైవేట్ బోట్లతోపాటు ఏపీ టూరిజం బోట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన 16 బోట్లకు ఏపీ మారిటైమ్ బోర్డు అనుమతి ఇచ్చింది. పోచమ్మగండి బోట్ పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 5 బోట్లకు అనుమతులు లభించాయి. వీటిలో తొలి విడతలో పోచమ్మగండి నుంచి ఆదివారం బోట్లు బయలుదేరనున్నాయి. ట్రయల్ రన్ సక్సెస్.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ ఆదేశాలతో శనివారం పోచమ్మగండి వద్ద పర్యాటక బోట్లకు ట్రయిల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. పైలెట్ బోటు ముందు రాగా వెనుక లాంచీలు పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి బయలుదేరాయి. ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే.. ► పర్యాటకుల రక్షణ, భద్రత కోసం రెవెన్యూ, పోలీసు, పర్యాటక, జలవనరుల శాఖలతో ఐదు చోట్ల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ► కంట్రోల్ రూమ్ మేనేజర్‌గా డిప్యూటీ తహసీల్దార్. ► పర్యాటక, జలవనరులు, పోలీసు అధికారులు కంట్రోల్ రూముల వద్ద పర్యాటకుల రక్షణ భద్రత అంశాలపై మూడు రకాల చెకప్‌లు చేపడతారు. మేనేజర్ వీటిని పరిగణనలోనికి తీసుకొని బోటు ప్రయాణానికి అనుమతిస్తారు. ► పైలెట్ స్పీడ్ బోటు గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీమ్‌తో బయలుదేరాలి. దీని వెనుక మరో 3 లేదా 5 బోట్లు ప్రయాణించాలి. ► చివర ఎస్కార్ట్ బోటులో శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉంచారు. ► ప్రతి పాయింట్ దాటాక శాటిలైట్ ఫోన్లో కంట్రోల్ రూమ్‌కు సమాచారాన్ని అందించాలి. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలపాలి. ► పైలెట్ బోటు లేనిదే జలవిహార యాత్ర నిర్వహించరాదు. ► ప్రయాణించే లాంచీని లైసెన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే నడపాలి. ► జలవనరుల శాఖ ధవళేశ్వరం వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలోనే విహార యాత్రకు అనుమతి ► నిర్వాహకుల నుంచి అఫిడవిట్లపై సంతకాలు తీసుకున్నాకే బోట్లకు అనుమతి ► నిర్దేశిత సామర్థ్యాన్ని మించి పర్యాటకులను ఎక్కించరాదు. జాగ్రత్తలు తీసుకునే అనుమతి గోదావరిలో పాపికొండల పర్యాటకానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గత ఘటనలు పునరావృతం కానివ్వకుండా పర్యాటకుల భద్రతే ప్రథమ లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. బోటులో పరిమితిని బట్టి 70 నుంచి 90 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తున్నాం. –జి.రాఘవరావు, కాకినాడ పోర్టు అధికారి నిర్వాహకులకు మంచి రోజులు గోదావరిలో జలవిహారం ప్రారంభమవ్వడంతో బోటు నిర్వాహకులతోపాటు దానిపై ఆధారపడేవారికి మంచి రోజులు వచ్చినట్టే. బోటు షికారు నిలిచిపోవడంతో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. –మాదిరెడ్డి సత్తిబాబు, బోట్ యజమాని పర్యాటకులు ఇలా చేరుకోవాలి.. తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. అవి.. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు ముందుగా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా ఏపీటీడీసీ వెబ్సైట్లోనూ బుక్ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి రూ.1,250 చెల్లించాలి. ఏపీటీడీసీనే పర్యాటకులను రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుస్తుంది. రాజమహేంద్రవరం నుంచి పోచమ్మగండికి దాదాపు 42 కి.మీ. దూరం. పోచమ్మగండిలో ఉదయం 10 గంటలకు బోటు బయలుదేరుతుంది. బోటులో పర్యాటకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం), సాయంత్రం స్నాక్స్, టీ అందిస్తారు. ఇవన్నీ రూ.1,250 లోనే కలిపి ఉంటాయి. పర్యాటకులు నేరుగా పోచమ్మగండికి కూడా చేరుకుని కూడా టికెట్లు కొనుగోలు చేసి బోటు ఎక్కొచ్చు. పోచమ్మగండి నుంచి ఒక్కో వ్యక్తికి రూ.1,000. తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం చేరుకోవాలి. అయితే ఇక్కడ నుంచి బోట్లు బయలుదేరడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టికెట్ రేట్లు కూడా నిర్ణయించలేదు. -
పర్యాటకానికి 'జల'సత్వం
సాక్షి, అమరావతి: మరికొద్ది రోజుల్లో పవిత్ర కార్తీక మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల్లో జలవిహారాన్ని పునఃప్రారంభించేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆగస్టులో ఈ రెండు నదుల్లో వరద ఉధృతి పెరగడంతో ముందస్తు చర్యల్లో భాగంగా బోటింగ్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతోపాటు కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో నవంబర్ 7 నుంచి గోదావరిలో పాపికొండలుకు బోట్లను తిప్పేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పోశమ్మగండి నుంచే బోట్లు బయల్దేరుతాయి. కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలోని సింగనపల్లి బోటు పాయింట్ నీటిలో మునిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ బోటింగ్ పాయింట్‌ను అన్వేషిస్తున్నారు. మరోవైపు.. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన వెంటనే ఇక్కడా బోట్లు తిప్పనున్నారు. క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతులు రాష్ట్రంలో 300లకు పైగా బోట్లు ఉండగా.. ఇందులో పర్యాటక శాఖకు చెందినవి 48 ఉన్నాయి. వీటిలో మూడు మినహా మిగిలినవి అన్ని అనుమతులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు.. ప్రభుత్వ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం.. ప్రైవేటు బోట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అధికారులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీచేస్తున్నారు. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ బెరం పార్కులలో జల విహారానికి 50 సీట్ల సామర్థ్యం ఉన్న బోట్లను తిప్పుతున్నారు. అలాగే, రిషికొండ, రాజమండ్రి, దిండి ప్రాంతాల్లో చిన్నబోట్లు, జెట్ స్కీలను అందుబాటులో ఉంచారు. వాస్తవానికి పాపికొండలు మార్గంలో ఏపీ టూరిజం బోట్లతో పాటు దాదాపు 80 వరకు ప్రైవేటు బోట్లు రాకపోకలు సాగించేవి. ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయడంతో కేవలం 23 బోట్లకు మాత్రమే అనుమతులు లభించాయి. నిరంతరం బోటింగ్ పర్యవేక్షణ రెండేళ్ల కిందట పాపికొండలు మార్గంలో కచ్చులూరు వద్ద సంభవించిన బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వ సూచనలతో బోట్ల రక్షణ, మార్పుల విషయంలో కాకినాడ పోర్టు అధికారులు ప్రత్యేక నివేదికను సమర్పించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఓపీని రూపొందించింది. దీని ప్రకారం.. ► బోట్ల రూట్ పర్మిట్, పర్యాటక, జలవనరుల శాఖ నుంచి లైసెన్సులు పొందితేనే బోటును నడుపుకునేందుకు ఎన్ఓసీ జారీచేస్తున్నారు. ► గండిపోచమ్మ, పేరంటాలపల్లి, పోచవరం, రాజమండ్రి, రుషికొండ, నాగార్జునసాగర్, శ్రీశైలం, విజయవాడ బెరం పార్కులలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేశారు. ► పోలీసు, రెవెన్యూ, జలవనరులు, పర్యాటక శాఖాధికారులు సమన్వయంతో వీటి ద్వారా బోటింగ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారు. ► లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు బోట్లను తనిఖీ చేస్తున్నారు. ► బోటు బయలుదేరే ప్రదేశంతోపాటు గమ్యస్థానం వద్ద కూడా సీసీ కెమెరాలు, అలారంలను ఏర్పాటుచేశారు. ► ప్రైవేటు బోట్లలో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించకుండా చర్యలు చేపడుతున్నారు. భద్రతా ప్రమాణాలతో సేవలు ఇక పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని బోట్లను సముద్ర యానానికి కూడా అనువైనవిగా తీర్చిదిద్దారు. 8 ఎంఎం స్టీల్ బాడీతో, ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్) నిర్దేశిత భద్రతా ప్రమాణాలతో ఇవి సేవలందిస్తున్నాయి. ఈ బోట్లలో సమాచారాన్ని వేగంగా అందించేలా శాటిలైట్ ఫోన్లను ప్రవేశపెట్టారు. పాపికొండల మార్గంలో వీటిని వినియోగిస్తారు. ప్రయాణించే బోటుతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్, పేరంటాలపల్లిలోని రిమోట్ కంట్రోల్ రూమ్‌లో వీటిని అందుబాటులో ఉంచారు. పాపికొండలుకు వెళ్లే బోట్లకు రక్షణగా ప్రత్యేక పైలట్ బోటుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. నావిగేషన్ వ్యవస్థతోపాటు కమ్యూనికేషన్ కోసం వెరీ హై ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) రేడియోలతో బోట్లను నడపనున్నారు. పాపికొండలుకు విహారయాత్ర గోదావరి, కృష్ణాలో బోటు షికారుకు ఏర్పాట్లుచేస్తున్నాం. పర్యాటక శాఖకు చెందిన 45 బోట్లకు పోర్టు అనుమతులున్నాయి. కార్తీక మాసంలో పర్యాటకుల సందడిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 7 నుంచి పాపికొండల విహార యాత్రను అన్ని జాగ్రత్తలతో ప్రారంభిస్తున్నాం. అదే రోజున కృష్ణాలో కూడా బోట్లు తిప్పేందుకు జలవనరుల శాఖ అధికారులతో చర్చిస్తున్నాం. – ఎస్.సత్యనారాయణ, ఎండీ, ఏపీటీడీసీ -
పాపికొండల టూర్.. నదీ అందాలు తిలకిస్తూ విహారం
రంపచోడవరం: పాపికొండలు అందాలు చూసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండేళ్ల విరామం తరువాత నవంబరు 7 నుంచి పర్యాటక బోటులు పాపికొండల విహారానికి బయలుదేరానున్నాయి. దీంతో పర్యాటకుల్లో ఆసక్తి.. ఆనందం నెలకొన్నాయి. శీతాకాలం గోదావరిపై మంచు తెమ్మరల మధ్య పాపికొండల పర్యటన మధురానుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్య సుమారు 40 కిలో మీటర్ల పొడవుల గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. టూరిజమ్ బోట్లపై ప్రయాణించే పర్యాటకులు పాపికొండలు, గోవావరి వెంబడి ఎత్తున కొండలు, పచ్చని వృక్షాలు ప్రాంతాన్ని వీక్షించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి సందర్శిస్తున్నారు. వీఆర్‌పురం మండలం పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజు సుమారు 300 మంది ,సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. ఎలా వెళ్తారంటే.. ► భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నాక 75 కిలో మీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం గుండా చేరుకుంటారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్లో ప్రయాణిస్తారు. ► తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు. ► రాజమమహేంద్రవరం నుంచి కూడా వాహనంలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకుంటారు. భద్రతకు పెద్దపీట 2019లో జరిగిన కచ్చులూరు సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంది.. గోదావరి నీటి మట్టం ఆధారంగా బోటులు గోదావరిపై నడిపేందుకు అనుమతి ఇస్తోందిరు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌డ్యామ్ వద్ద నీటి మట్టం 27 మీటర్లు ఉంటే బోట్లు తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. అంతకు మించి నీటి మట్టం పెరిగే బోటులను నిలిపివేస్తారు. 23 పర్యాటక బోట్లుకు అనుమతి పాపికొండలు అందాలను చూపించేందుకు ప్రైవేట్ బోట్లుతో పాటు, ఏపీ టూరిజం బోట్లు కూడా నడుస్తాయి. కొద్ది రోజులు పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన తరువాత టూరిజం బోట్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. తాజా నిర్ణయంతో బోట్ల ఫిట్నేస్ పరిశీలించి టెక్నికల్ అధికారులు తొలివిడతగా నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే 23 బోట్లకు అనుమతి లభించింది. పోచమ్మగండి బోట్పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 12 బోట్లకు అనుమతులు లభించించాయి. (చదవండి: రాజమండ్రి నుంచి టికెట్ ధర రూ.1,250) అనేక మందికి ఉపాధి ► పాపికొండల పర్యాటకంతో అనేక మంది ఉపాధి లభిస్తుంది. టికెట్ కౌంటర్లలో పనిచేసే వర్కర్లు,లాడ్జీల నిర్వహకులు,మార్గం మధ్యలోని కూనవరం ,వీఆర్‌పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలతో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. ► పోచవరం బోట్ పాయింట్ వద్ద వ్యాపారస్తులతో పాటు బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటో గ్రాఫర్లు, నృత్యకళాకారులకూ ఈ టూర్ ఉపాధిగా నిలుస్తోంది. ► పేరంటాలపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు,కొల్లూరు ఇసుక తెన్నెల్లో బొంగు చికెన్ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్‌లు విక్రయించే వారు ఇలా సుమారులు ఐదు వేలమందికి పైగా దీనిపై ఆధారపడుతుంటారు. పోశమ్మ గండి బోట్ పాయింట్ పోశమ్మ గండి బోట్ పాయింట్ నుంచి టూరిజమ్ బోట్లు పాపికొండలు పర్యాటానికి బయలుదేరతాయి. బోట్లుల్లో అన్ని సురక్షిత ఏర్పాట్లు మధ్య పాపికొండకు బోటులను పంపండం జరుగుతుంది. బోట్ పాయింట్ వద్ద పర్యాటక సిబ్బంది ఉంటారు. –వీరనారాయణ, టూరిజం అధికారి, రాజమహేంద్రవరం -
పర్యాటకులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: పాపికొండలు బోటు విహార యాత్రను వచ్చే నెల 7 నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. బోటు ఆపరేటర్లతో బుధవారం సచివాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధితో పాటు పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బోటు ఆపరేటర్లు తమ జీవనోపాధిపై మాత్రమే కాకుండా పర్యాటకుల భద్రతపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధరను రూ.1,250 (రవాణా, భోజన వసతి)గా నిర్ణయించినట్టు పేర్కొన్నారు. భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ టూరిస్ట్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. గత ఏడాది గోదావరిలో బోటు ప్రమాదం తర్వాత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల పర్యాటక బోటింగ్ ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బోటు ఆపరేటర్లు మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి కూడా పాపికొండలుకు బోట్లును నడపాలని కోరారు. -
పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు
బెంగాల్ పులులున్నాయ్.. బంగారు బల్లులూ తిరుగుతున్నాయ్.. గిరి నాగులు చెట్టంత ఎత్తున తోకపై నిలబడి ఈలలేస్తున్నాయ్.. అలుగులు అలరారుతున్నాయ్.. కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలరావాలు ఆలపిస్తున్నాయ్.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరంజ్ ఓకలీఫ్ సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయ్. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో అరుదైన జీవజాలానికి పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన పాపికొండలు అభయారణ్యం నిలయంగా నిలుస్తోంది. జాతీయ పార్కుకు వన్నె తెస్తోంది. బుట్టాయగూడెం: ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండలు అభయారణ్యం జీవ వైవిధ్యంతో అలరారుతోంది. పాపికొండలు అభయారణ్య ప్రాంతాన్ని 2008 నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం మధ్య గలగల పారే గోదావరి నదికి ఇరువైపులా సుమారు 1,01,200 హెక్టార్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే రిజర్వు ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్కుగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడ జంతు జాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులున్నట్టు గుర్తించారు. వీటిలో 4 పెద్ద (బెంగాల్) పులులు, 6 చిరుత పులులు, 30 అలుగులు (పాంగోలిన్), 4 గిరి నాగులు (కింగ్ కోబ్రా) ఉన్నట్టు గణించారు. చదవండి: సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి అభయారణ్యంలో అరుదైన కొమ్ము కత్తిరి పక్షి జింకలు.. చుక్కల దుప్పులు ఇక్కడ ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, అడవి గొర్రెలు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, కుందేళ్లు, ముంగిసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్టు వన్యప్రాణి విభాగం సర్వేల్లో తేలింది. వీటితో పాటు నెమలి, గద్ద, చిలకలు, పావురాలు, కోకిల, వడ్రంగి పిట్ట, గుడ్లగూబ, కొమ్ము కత్తిరి తదితర పక్షులూ ఉన్నాయి. అభయారణ్యంలో విలువైన వృక్ష సంపద ఎంతో ఉంది. ముఖ్యంగా వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. ఇవిగాక విలువైన వెదురు వనాలు విరివిగా ఉన్నాయి. నేషనల్ విన్నర్ ‘ఆరంజ్ ఓకలీఫ్’ ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండలు నేషనల్ పార్క్‌లో ఉన్న మూడు రకాల సీతాకోక చిలుకలు పోటీ పడ్డాయి. ఫైనల్స్‌లో దేశవ్యాప్తంగా ఏడు రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా.. ఈ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఆరంజ్ ఓకలీఫ్ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికైన ఆరెంజ్ ఓకలీఫ్ అభయారణ్యంలో అలుగులు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అరుదైన వన్యప్రాణులైన అలుగులు (పాంగోలిన్లు) ఉన్నాయి. వీటి మూతి మొసలిని పోలి ఉంటుంది. వీటి జీవిత కాలం 20 సంవత్సరాలు. ఈ అరుదైన వన్యప్రాణులు ఇక్కడ 30కి పైగా ఉన్నట్టు గుర్తించారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన ఎలుగుబంటి అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అభయారణ్య పరిధిలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో అనేక సర్ప జాతులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా (గిరి నాగు). దట్టమైన అడవిలో గల జలతారు వాగు ప్రాంతంలో సుమారు 30 అడుగుల గిరినాగు తిరుగుతున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పగటిపూట చెట్లపై మాత్రమే ఉండే గిరి నాగులు రాత్రివేళ తోకపై నిటారుగా చెట్టు మాదిరిగా నిలబడి ఈల వేసినట్టుగా శబ్దాలు చేస్తుంటాయని గిరిజనులు చెబుతుంటారు. చదవండి: Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు